స్కేటర్ సాయి సంహిత: "క్రీడల్లోకి రావడానికి అమ్మాయిలు భయపడకూడదు.. సింధు, మేరీ కోమ్ లాంటి వాళ్లే మనకు ఆదర్శం"

స్కేటర్ సాయి సంహిత: "క్రీడల్లోకి రావడానికి అమ్మాయిలు భయపడకూడదు.. సింధు, మేరీ కోమ్ లాంటి వాళ్లే మనకు ఆదర్శం"

విజయ్ గజం, బీబీసీ కోసం

"చాలా మంది అమ్మాయిలు స్పోర్ట్స్‌లోకి రావడానికి బాగా భయపడతారు. పీవీ సింధు, మేరీ కోమ్ లాంటి క్రీడాకారిణులను మనం ఆదర్శంగా తీసుకోవాలి. బాక్సింగ్ లాంటి క్రీడలో మేరీ కోమ్ సత్తా చాటారు. పీవీ సింధు బ్యాడ్మింటన్లో ఎంతో పోటీని ఎదుర్కొంటున్నారు. వాళ్లు 'మనం అమ్మాయిలం' అని ఆగిపోకుండా ఒక్క అడుగు ముందుకు వేశారు, విజయం సాధించారు" అని స్కేటింగ్ క్రీడాకారిణి ఆకుల సాయి సంహిత అంటోంది.

15 ఏళ్ల సంహిత విశాఖపట్నంలోని సత్యసాయి స్కూల్లో పదోతరగతి చదువుతోంది.

ఆమె భారత స్కేటింగ్ చరిత్రలో అంతర్జాతీయ పతకం పొందిన పిన్న వయస్కురాలు. 2018లో దక్షిణ కొరియాలో నామ్వన్‌ నగరంలో జరిగిన ఆసియా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్‌లో క్యాడేట్ గల్స్ విభాగంలో స్వర్ణం సాధించి ఆమె రికార్డుకు ఎక్కింది.

సంహిత 2011లో తొలిసారిగా విశాఖలోనే జరిగిన జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో రెండు స్వర్ణాలు సాధించి అందరి దృష్టినీ ఆకర్షించింది. 2015 మహారాష్ర్ట లో జరిగిన జాతీయ రోలర్ స్కేటింగ్ ఫ్రీస్టైల్, ఇన్లాండ్ ఫ్రీస్టైల్లో స్వర్ణాలు, క్వాట్ ఫ్రీస్టైల్ విభాగంలో రజతం గెలుచుకుంది.

నిరుడు డిసెంబర్లో విశాఖపట్నంలో 57వ జరిగిన నేషనల్ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్లో సంహిత ఫ్రీస్టైల్, ఇన్లాండ్ ఫ్రీస్టైల్, క్వాట్ లైట్ ఈవెంట్లలో మూడు స్వర్ణాలు గెలుచుకుంది.

ఫొటో సోర్స్, FB/@MinistryWCD

గత నెల్లో గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆమె ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్- 2019 అందుకుంది.

సంహిత తండ్రి పవన్ కుమార్ ఒకప్పుడు స్కేటింగ్‌లో జాతీయస్థాయిలో ఛాంపియన్. 1990 నుంచి 1997 మధ్య వివిధ విభాగాల్లో జాతీయ ఛాంపియన్ గా నిలిచారు.

ఆయనకు అంతర్జాతీయ పోటీల్లో పతకం సాధించాలనే కల ఉండేది. అది నెరవేరలేదు.

ప్రస్తుతం ఆయన జాతీయ స్కేటింగ్ కోచ్‌గా సేవలందిస్తున్నారు.

ఫొటో క్యాప్షన్,

సంహిత

తన తండ్రి స్కేటింగ్ చేసే రోజుల్లో వాళ్లకు సరైన సదుపాయాలు ఉండేవి కాదని, జూనియర్లకైనా మెరుగైన ఫలితాలు రాబట్టాలని ఆయన అనుకున్నారని సంహిత చెప్పింది.

తండ్రి ప్రేరణతో సంహిత నాలుగో ఏటనే రింక్‌లోకి అడుగు పెట్టింది. మొదట్లో స్పీడ్ స్కేటింగ్‌కే పరిమితమైనా స్కేటింగ్‌లో రోరల్ స్కేటింగ్ ఫ్రీస్టైల్, ఇన్లాండ్ ఫ్రీస్టైల్, క్వాట్ ఫ్రీ స్టైల్ తదితర విభాగాలపై పట్టు సాధించింది. రింక్ మీద వేసిన కర్చీఫ్‌ను స్కేటింగ్ చేస్తూ నోటితో తీయగల స్థాయికి ఆమె తన నైపుణ్యాన్ని పెంచుకొంది.

"మా నాన్న కల నేను నిజం చేశా"

''అంతర్జాతీయ పతకం సాధించాలనే నాన్న కలను నేను నిజం చేశాను. దేశానికి పతకం సాధించాను. చిన్పప్పుడు సరదాగానే స్కేటింగ్ మొదలుపెట్టాను. పోటీల్లో పతకాలు రావడం బాగా ప్రేరణ ఇచ్చింది. ఎక్కువ పతకాలు తెచ్చుకోవాలన్న ఇంట్రస్ట్ పెరిగింది. నా కన్నా పైస్థాయిలో సీనియర్లతో పోటీపడటం చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. అదే ఉత్సాహంతోనే 2018లో ఏసియన్ రోరల్ స్కేటింగ్ ఈవెంట్లో పాల్గొన్నా. అదే నా తొలి అంతర్జాతీయ ఈవెంట్. బాగా కంగారుపడ్డా. కానీ అందులోనే గోల్డ్ మెడల్ వచ్చింది'' అంటూ సంహిత హుషారుగా చెప్పింది.

సంహిత చదువును, స్కేటింగ్‌ను రెండింటిని సమన్వయం చేసుకొంటుంది.

''స్కూల్ వైపు నుంచి, అమ్మా-నాన్న నుంచి చాలా సహకారం ఉంది. చాలా మంది క్రీడలను, చదువును సమతూకంతో చూడలేక ఏదో ఒకటి వదిలేస్తారు. నేను రెండూ కొనసాగిస్తున్నా. స్కూల్లో టీచర్లు నా కోసం ప్రత్యేక తరగతులు చెబుతున్నారు. ప్రతి పోటీకి నాతోపాటు నాన్న, అమ్మ వస్తారు. పతకాల సాధనకు బాగా దృష్టి పెట్టాను. ప్రారంభంలో నాకు 'స్టేజ్ ఫియర్' చాలా ఉండేది. ఇప్పుడు పోయింది'' అని సంహిత వివరించింది.

ఆడపిల్లలు క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆమె సూచించింది. "ప్రకృతితో మమేకమయ్యే క్రీడల్లో పాల్గొనాలి. అప్పుడే మానసిక, శారీరక ఉల్లాసం ఉంటుంది" అని చెప్పింది. విజయం సాధించాలనే తపన ఉంటే అది సాధ్యమేనని తెలిపింది.

తనకు సీనియర్లు ఒక్కొక్కరు ఒక్కో అంశంలో స్ఫూర్తిగా నిలుస్తున్నారని సంహిత చెప్పింది. ఉపాసన, అర్జునా అవార్డ్ గ్రహీత అనూప్ యామా, అరుణ్, ఫరీణా లాంటి వాళ్లే తనకు స్ఫూర్తి అని పేర్కొంది.

తన స్నేహితులందరూ స్కేటర్లేనని సంహిత తెలిపింది. తన అన్న కూడా స్కేటింగ్ క్రీడాకారుడేనని ప్రస్తావించింది.

ఈ ఏడాది ఏసియన్ చాంపియన్‌షిప్లో పతకం సాధించడమే ప్రస్తుతం ఆమె ముందున్న లక్ష్యం.

ఇదే ఏడాది బెంగుళూరులో స్కేటింగ్ నేషనల్స్ జరగబోతున్నాయి. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి శిక్షణ శిబిరం నిర్వహిస్తారు. అందులో ఎంపికైతేనే నేషనల్స్, ఇంటర్నేషనల్స్ ఆడటానికి అవకాశం వస్తుంది.

ప్రస్తుతం ఈ అవకాశం దక్కించుకోవడంపైనే దృష్టి కేంద్రీకరించి సంహిత సాధన చేస్తోంది.

ఒలింపిక్స్‌లో ఇటీవలే స్కేట్ బోర్డ్ ఈవెంట్ ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో ఇతర స్కేటింగ్ విభాగాలను ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదు.

సంహిత ఇప్పటివరకు వేర్వేరు స్థాయుల్లో జరిగిన వివిధ పోటీల్లో సుమారు 65 పతకాలు సాధించిందని తండ్రి పవన్ చెప్పారు. జాతీయస్థాయిలో 21 పతకాలు రాగా, అందులో 14 బంగారు పతకాలంటూ ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు.

ప్రొడ్యూసర్: విజయ్ గజం, బీబీసీ కోసం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)