కసబ్ దగ్గర హైదరాబాద్ కాలేజ్ ఐడీ, బెంగళూరు ఇంటి అడ్రస్: రాకేశ్ మారియా

కసబ్ ఇమేజ్

"కిథ్యోం దా ముండా హై తూ? (నువ్వు ఎక్కడి వాడివి?)

ముంబయి పోలీస్ క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ రాకేష్ మారియా పంజాబీలో ఈ ప్రశ్న అడగ్గానే ఆయన ముందు కూచున్న వ్యక్తి షాక్ అయ్యాడు.

అతడి కళ్లలో, 'నేనెవరో ఈయనకు తెలిసిపోయింది' అనే భయం కనిపిస్తోంది. తర్వాత 'ఒకాడా' అని సమాధానం ఇచ్చాడు.

'ఒకాడా' పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతంలో ఉన్న ఒక జిల్లా. రాకేశ్ తన మామగారి నుంచి ఆ ప్రాంతం గురించి విన్నారు. ఒకాడా గురించి మరింత సమాచారం సేకరించిన ఆయన మళ్లీ విచారణ కోసం వచ్చారు.

ఆయన ముందున్న వ్యక్తి కాస్త తటపటాయించాక, "నేనెవరో తెలిసిపోతే, భారత్-అమెరికాలు మా ఊరును బాంబులతో పేల్చేస్తాయి" అన్నాడు.

రాకేశ్ ఆలోచించారు. అంటే, ఆ రోజు రాత్రి అన్నీ ఆ వ్యక్తి అనుకున్నట్టే జరిగుంటే, చేతికి ఎర్ర దారం ఉన్న అతడు ఒక 'హిందూ మిలిటెంట్'లా చనిపోయేవాడు.

అతడి పేరును అందరూ సమీర్ దినేష్ చౌధరిగా చెప్పేవారు. అతడి దగ్గర హైదరాబాద్‌లోని అరుణోదయ డిగ్రీ కాలేజ్ ఐడీ కార్డు లభించేది.

అతడి ఇంటి చిరునామా 254, టీచర్స్ కాలనీ, నగర్‌భావీ, బెంగళూరు అని చెప్పేవారు. అవన్నీ నకిలీవే.

ఎందుకంటే, ఆ రాత్రి రాకేశ్ మారియా ముందు కూర్చుని ఉన్న ఆ వ్యక్తి అజ్మల్ అమీర్ కసబ్. 2008 నవంబర్ 26న ముంబయిపై దాడి చేసిన పది మందిలో అతడు కూడా ఒకడు.

హోంగార్డ్స్ డైరెక్టర్ జనరల్ పదవి నుంచి రిటైరై, ముంబయి పోలీస్ కమిషనర్‌గా కూడా పనిచేసిన రాకేశ్ మారియా ఒక పుస్తకం రాశారు. దాని పేరు 'లెట్ మీ సే ఇట్ నౌ'(Let Me Say It Now). ఈ పుస్తకంలో రాకేశ్ విధుల్లో తన అనుభవాలను రాశారు.

ఈ పుస్తకంలో ముంబయి దాడులు, అజ్మల్ కసబ్ గురించి ఆయన వెల్లడించిన విషయాలు హెడ్‌లైన్స్‌లో నిలిచాయి.

ఫొటో సోర్స్, WESTLAND PUBLICATIONS

ఫొటో క్యాప్షన్,

ముంబయి మాజీ కమిషనర్ రాకేశ్ మారియా 'లెట్ మి సే ఇట్ నౌ' పుస్తకం

లేదంటే నకిలీవే నిజం అయ్యేది

రాకేశ్ తన పుస్తకంలో "కసబ్ ఆ నకిలీ ఐడీతో చనిపోయుంటే, వార్తాపత్రికలు 'హిందూ తీవ్రవాదులు ముంబయిపై దాడి చేశారు' అనే హెడ్‌లైన్స్‌తో గగ్గోలు పెట్టేవి. టీవీ జర్నలిస్టులు అందరూ బెంగళూరు చేరుకునేవారు. అతడి చిరునామాలో ఇరుగుపొరుగు ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉండేవారు. కానీ, అలా జరగలేదు. పాకిస్తాన్‌లోని ఫరీద్‌కోట్‌కు చెందిన అజ్మల్ కసబ్ నా ముందు కూర్చుని ఉన్నాడు. నేను అతడిని 'కీ కరన్ ఆయా హై'(ఏం చేయడానికి వచ్చావ్) అని పంజాబీలో అడుగుతున్నాను" అని చెప్పారు.

"తర్వాత మెల్లమెల్లగా దాడికి తనను రిక్రూట్ చేసుకోవడం నుంచి ముంబయిలో అడుగుపెట్టేవరకూ కసబ్ అన్ని విషయాలూ చెప్పాడు" అని ఆయన రాశారు.

ఆయన ఒక ఆసక్తికరమైన విషయం కూడా గుర్తు చేసుకున్నారు. కసబ్ అతడి సహచరులు 'అల్ హుసేనీ' అనే పడవలో ముంబయికి వచ్చారని చెప్పారు.

"ఇదే పేరు 1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో కూడా వినిపించింది. ఆ దాడుల ప్రధాన నిందితుడు టైగర్ మెమన్ అపార్ట్‌మెంట్ బ్లాక్ పేరు కూడా 'అల్ హుసేనీ'. పోలీసుల వివరాల ప్రకారం ఈ భవనంలోనే ఆ పేలుళ్లకు కుట్రపన్నారు" అని ఆయన రాశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

1993 ముంబయి పేలుళ్లలో ఒక ప్రాంతం

'దేశద్రోహి ఎవరు?'

కసబ్ భద్రత గురించి బహుశా ఇంతకు ముందు ఎవరూ ప్రస్తావించని కొన్ని విషయాలను రాకేశ్ తన పుస్తకంలో ప్రస్తావించారు.

"క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్‌గా కసబ్‌ను సజీవంగా ఉంచడం నాకు అత్యంత కీలకం. జనాలు, అధికారులు అతడితో ప్రవర్తించే తీరు చూసిన నేను, తనకు ఉండే గార్డ్స్‌ను స్వయంగా ఎంపిక చేశాను. ఐఎస్ఐ, లష్కరే అతడిని ఎలాగైనా అంతం చేయాలని చూస్తుండేవి. ఎందుకంటే ఆ దాడులకు మిగిలిన ఏకైక సజీవ సాక్ష్యాన్ని లేకుండా చేయాలి. కసబ్ భద్రతకు సంబంధించి పూర్తి బాధ్యత ముంబయి క్రైం బ్రాంచ్‌దే అని మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ అందింది. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల నుంచి లభించిన సమాచారంతో పాకిస్తాన్ కసబ్‌ను అంతం చేసే పనిని దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు అప్పగించిందని తెలిసింది. అతడికి ఏదైనా జరిగితే, నా ఉద్యోగమే కాదు, ముంబయి పోలీసుల పరువు కూడా పోతుంది".

కసబ్ ఫొటోలను ఇంటర్‌నెట్‌లో చాలా ఉపయోగిస్తున్నారు. వాటిలో కసబ్ చేతిలో ఏకే-47 పట్టుకుని ఉన్న ఫొటో ఛత్రపతి శివాజీ టెర్మినల్‌లో తీసింది. మరో ఫొటో ముంబయిలోని ఒక పోలీస్ స్టేషన్‌లో తీసింది.

రెండో ఫొటో గురించి రాసిన మారియా, "కసబ్‌ను ఫొటో తీయకుండా, అది మీడియా చేతుల్లో పడకుండా మేం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ, కుర్చీలో కూర్చున్న కసబ్ ఫొటో మీడియాలో కనిపించగానే నేను షాకయ్యా. వెంటనే ఆఫీసర్లు అందరినీ పక్కకు పిలిచి 'దేశద్రోహి ఎవరు' అని అడిగాను. అందరూ మేం కాదన్నారు. వారి ముఖం చూస్తుంటే నిజమే చెబుతున్నట్లు అనిపించింది. తర్వాత వారు కేంద్ర ఏజెన్సీలు కసబ్‌ను విచారించడానికి ఒక అధికారిని ముంబయి పంపించినట్లు చెప్పారు".

మారియా వివరాల ప్రకారం ఈ ఫొటోతో ముంబయి దాడికి అత్యంత ముఖ్యమైన ఆధారం కసబ్ భారత్ అదుపులో ఉన్నాడని సరిహద్దు అవతలకు సందేశం పంపించాలని అనుకున్నారు. పాకిస్తాన్ ఈ దాడి వెనుక తమ హస్తం లేదని చెబుతుండడంతో అలా చేయడం కీలకం.

పాకిస్తాన్ మొదట కసబ్‌ తమ పౌరుడని అంగీకరించేందుకు నిరాకరించింది.

దాడి జరిగిన కొన్ని నెలల తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం కసబ్‌ పాక్ పౌరుడని ధ్రువీకరించింది. తర్వాత ఒక స్థానిక న్యూస్ చానల్ కసబ్‌ది సెంట్రల్ పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ గ్రామం అని చెప్పింది.

ముంబయి దాడుల్లో 166 మంది మృతిచెందారు. అజ్మల్ కసబ్‌ను 312 కేసుల్లో నిందితుడిగా చేర్చారు. స్పెషల్ కోర్టులో అతడిపై 86 ఆరోపణలు రుజువయ్యాయి. 2010 మే 6న అతడికి మరణశిక్ష విధించారు.

చట్టపరమైన అన్ని హక్కులనూ ప్రయత్నించాక 2012 నవంబర్ 5న కసబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి కొట్టివేశారు. తర్వాత 2012 నవంబర్ 21న ఉదయం 7.30కు పుణెలోని యరవాడ జైలులో అతడిని ఉరితీశారు.

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌ గురించి కసబ్‌కు ఎంత తెలుసు?

"కసబ్‌కు చిన్నతనం నుంచే భారత్ పాకిస్తాన్‌కు శత్రువు అని చెప్పారు. భారత్, మిగతా ప్రపంచం గురించి అతడికి ఎలాంటి వివరాలూ తెలీదు. భారత్, అమెరికా, ఇజ్రాయెల్ మూడూ పాకిస్తాన్, ఇస్లాం శత్రువులు అని కసబ్‌కు చెప్పారు. భారత్‌లో ముస్లింలను నమాజు చేయనివ్వరని, అధికారులు మసీదులకు తాళాలు వేసి ఉంచుతారని అతడు అనుకునేవాడు. క్రైమ్ బ్రాంచ్ లాకప్‌లో ఉన్నప్పుడు అతడికి నమాజు చేసే శబ్దం వినిపించినా, అది తన భ్రమ అనుకునేవాడు. ఇదంతా నాకు తెలీడంతో నేను కసబ్‌ను ఒక కార్లో మెట్రో సినిమా సమీపంలోని మసీదు దగ్గరికి తీసుకెళ్లమని అన్నా. అక్కడ జనం నమాజు చేయడం చూసిన అతడికి నోట మాటరాలేదు" అని మారియా పుస్తకంలో చెప్పారు.

కసబ్‌పై కేసు నడుస్తున్నప్పుడు 2008లో బీబీసీ ప్రతినిధి అలీ సల్మాన్ కసబ్ గ్రామం చేరుకున్నారు. అక్కడ ఉన్న అతడి ఇంటిని మొట్టమొదట ప్రపంచానికి చూపించింది బీబీసీనే.

కసబ్ ఉరిశిక్ష తర్వాత బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ, పాకిస్తాన్‌లో కసబ్ గ్రామంలో పరిస్థితి తెలుసుకోడానికి వెళ్లారు. అక్కడివారు షుమైలాతో సరిగా మాట్లాడలేదు.

కసబ్ ఇల్లెక్కడ అని అడగడంతో కొంతమంది పిల్లలు షుమైలాను ఒక ఇంటివైపు పంపించారు. ఆ ఇంట్లో నిశ్శబ్దం అలముకుని ఉంది. ఫోటోగ్రాఫర్ ఆ ఇంట్లో ఫొటోలు తీస్తున్నప్పుడు, కొందరు అక్కడికి చేరుకుని బీబీసీ టీమ్‌ను వెళ్లిపొమ్మని చెప్పారు. వీధిలో ఉన్న కొందరు కసబ్‌ గురించి తమకు ఏ సమాచారం తెలీదని చెప్పారు.

స్థానికులు అసలు అక్కడ కసబ్ అనే వ్యక్తి ఎవరూ ఉండేవారే కాదని చెప్పారు. పాకిస్తాన్ పరువు తీయడానికి ఇదంతా అంతర్జాతీయ కుట్రగా వర్ణించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

పాకిస్తాన్‌లోని కసబ్ గ్రామం ఫరీద్‌కోట్

పుస్తకంపై రాజకీయ ప్రకటనలు

మారియా రాసిన ఈ పుస్తకంపై రాజకీయ ప్రకటనలు కూడా మొదలయ్యాయి.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దీనిపై మాట్లాడుతూ, "మారియా ఈ విషయాలన్నీ ఇప్పుడెందుకు చెప్పారు. ఆయన పోలీస్ కమిషనర్‌గా ఉన్నప్పుడే ఇవన్నీ చెప్పుండాలి. నిజానికి సర్వీస్ రూల్స్‌లో సీనియర్ అధికారుల దగ్గర ఏదైనా సమాచారం ఉంటే, వారు దానిపై యాక్షన్ తీసుకోవాలి అని ఉంది. కాంగ్రెస్, యూపీఏ ద్వారా చాలా లోతైన కుట్ర జరిగినట్లు నాకు అనిపిస్తోంది. అబద్ధం, మోసానికి మరో ఉదాహరణను మనం అప్పుడు చూశాం. అప్పుడు వారు చిదంబరం గారు చెప్పినట్టే పూర్తిగా 'నకిలీ హిందూ టెర్రర్‌' సృష్టించేందుకు ప్రయత్నించారు. 'హిందూ టెర్రర్' అనే అబద్ధపు ఆరోపణలతో దేశాన్ని తప్పుదోవ పట్టించాలనుకున్న కాంగ్రెస్, మిగతా వారి ప్రయత్నాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. తీవ్రవాదానికి ఎలాంటి మతం ఉండదు" అన్నారు.

బీజేపీ నేత రాం మాధవ్, "ఈ పుస్తకంలో చాలా బయటపెట్టారు. దీనిద్వారా ఐఎస్ఐ కుట్ర విఫలమైందని తెలుస్తోంది. కానీ, కాంగ్రెస్‌కు చెందిన కొంతమంది ఆ సమయంలో దీనిని విజయవంతం చేసేందుకు ప్రయత్నించారు. కొంతమంది మేధావులు ముంబయి దాడులను ఆర్ఎస్ఎస్‌కు అంటగట్టే ప్రయత్నం చేశారు. వారికి కాంగ్రెస్ మద్దతు ఉంది" అన్నారు.

కాంగ్రెస్ నుంచి అధీర్ రంజన్ చౌధరి పీయూష్ గోయల్ ప్రకటనకు జవాబు ఇచ్చారు.

"హిందూ టెర్రర్ అనే మాట ఉపయోగించడం ఒక భిన్న దృక్పథంలో జరిగింది. మక్కా మసీదు పేలుడు జరిగినపుడు ప్రజ్ఞా ఠాకూర్, మిగతా వారిని అరెస్ట్ చేశారు. మిలిటెంట్లు అసలు గుర్తింపుతో దాడులు చేయరు. యూపీఏ ప్రభుత్వం ఈ దాడి గురించి అన్నీ బయటపెట్టింది. కసబ్‌ను ఉరితీసింది కూడా యూపీఏ పాలనలోనే" అన్నారు.

"అటు మహారాష్ట్ర హోంమంత్రి ఎన్సీపీ నేత అనిల్ దేశముఖ్ మారియా పుస్తకం గురించి మాట్లాడుతూ, "రాకేశ్ మారియా తన పుస్తకంలో ఏం రాశారో మేం దానికి సంబంధించిన వివరాలు సేకరిస్తాం. ఆయనతో మాట్లాడి ఫడణవీస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన ఘటనల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే దర్యాప్తునకు ఆదేశాలు ఇస్తాం" అన్నారు.

బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు కూడా "కాంగ్రెస్ హిందూ టెర్రర్ ఐడియాకు, లష్కర్-ఐఎస్ఐ 26/11 దాడి కుట్రకు మధ్య లింకులు కలిసి ఉండడం మనం చూడచ్చు. భారత్‌లోని ఎవరైనా హ్యాండ్లర్‌లా ఐఎస్ఐకు సాయం చేస్తూ మిలిటెంట్లకు హిందూ గుర్తింపు అందిస్తున్నారా. దిగ్విజయ్ సింగ్ హ్యాండ్లర్‌గా పనిచేస్తున్నారా. కాంగ్రెస్‌ దీనికి సమాధానం చెప్పాలి" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)