తాజ్‌మహల్: డోనల్డ్ ట్రంప్‌కు నది శుభ్రంగా కనిపించేలా, యమునలో నీళ్లు వదిలారు
- సమీరాత్మజ్ మిశ్రా
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్‌మహల్‌కు ఆ అందం దాని వాస్తుకళ, తెల్లటి పాలరాయి వల్లే వచ్చింది అనేది అందరికీ తెలిసిందే. కానీ, యమునా నది తీరంలో చంద్రుడి వెన్నెల తాజ్ అందాన్ని రెట్టింపు చేస్తుంది.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24న సాయంత్రం ఆ అందాలను చూడ్డానికే ఆగ్రా చేరుకోనున్నారు.
అయితే, తాజ్‌మహల్ ఉన్న తీరం దగ్గర యమునా నది బాగా చిక్కిపోయింది. నదిలో చాలా తక్కువ నీళ్లున్నాయి.
ఉన్న నీళ్లు కూడా ఎంత మురికిగా ఉన్నాయంటే, ఆ దుర్గంధం భరించలేక నది దగ్గర ఎవరూ నిలబడలేకపోతున్నారు.
కానీ, ఉత్తరప్రదేశ్ యోగీ ప్రభుత్వం, స్థానిక అధికారులు ఆ దృశ్యాన్ని అతి తక్కువ సమయంలో మార్చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
ఫొటో సోర్స్, Pti
సుమారు ఒకటిన్నర అడుగు నీళ్లు
ట్రంప్ వస్తుండడంతో చాలా ప్రాంతాల నుంచి యమునా నది నీళ్లను వదలాలని యూపీ నీటిపారుదల శాఖ నిర్ణయించింది. అలా, యమునా నదిలో నీటిమట్టం పెంచి, ప్రవహించే నీళ్లతో నది శుభ్రంగా కనిపించేలా, దుర్గంధం తగ్గించేలా చేస్తున్నారు.
ఆగ్రా నగరం మేయర్ నవీన్ జైన్ బీబీసీతో యమునలో నీళ్లు వదలాలని తాము ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ను కోరామని చెప్పారు.
"సీఎం యోగీ ఆగ్రా వచ్చినపుడు, యమునా నదిలో కొన్ని నీళ్లు వదిలితే, నది శుభ్రం అవుతుంది, ఎక్కువ నీళ్లు ఉండడం వల్ల అది అందంగా కూడా కనిపిస్తుంది అని మేం చెప్పాం. ఆయన వెంటనే మా మాట విన్నారు. నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. బుధవారం సాయంత్రం సుమారు ఒకటిన్నర అడుగుల నీళ్లు వదిలారు’’ అని ఆయన చెప్పారు.
"ఫిబ్రవరి 22 లేదా 23 నాటికి ఆగ్రా చేరుకుని, తర్వాత రెండ్రోజులు నది శుభ్రంగా కనిపించేలా ఈ నీళ్లను హరిద్వార్ దగ్గర గంగా నది, గ్రేటర్ నోయిడా దగ్గర హిండన్ నది, ఇంకొన్ని నదుల నుంచి యమునలోకి వదులుతారు" అని నవీన్ జైన్ చెప్పారు.
ఫొటో సోర్స్, Pti
నది శుభ్రంగా కనిపించాలనే ఆశ
డోనల్డ్ ట్రంప్ పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను అంచనా వేయడానికి ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మంగళవారం ఆగ్రా వచ్చారు.
"యమునా నది పరిస్థితిని ఆయన కూడా చూశారు. మేం ఆ సలహా ఇవ్వగానే నీళ్లు వదలాలని యోగీ వెంటనే ఆదేశాలు ఇచ్చారు" అని నవీన్ చెప్పారు.
మాంట్ కెనాల్ నుంచి 500 క్యూసెక్కుల గంగాజలాలను మధురలో వదిలామని ఉత్తరప్రదేశ్ నీటి పారుదల శాఖ సూపరింటెండెంట్ ధర్మేంద్ర సింగ్ ఫొగట్ చెప్పారు.
"అక్కడ నుంచి విడుదలైన గంగాజలాలు ఫిబ్రవరి 24 నాటికి యమునలోకి చేరుకునేలా నీటిపారుదల శాఖ ప్రయత్నిస్తోంది. యమునలో ఇప్పుడు ఇంకొన్ని నీళ్లు కూడా వదులుతాం" అని ఆయన చెప్పారు.
"ఈ నీటి మట్టం మధురతోపాటు ఆగ్రాలో కూడా యమునా నది నీటిలో కరిగే ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. దానివల్ల యమునా నది నీళ్లు తాగడానికి పనికిరాకపోయినా, వాటి నుంచి వచ్చే దుర్గంధం మాత్రం ఆగుతుంది" అని నిపుణులు చెబుతున్నారు.
ఫొటో సోర్స్, Pti
అంటే ఫిబ్రవరి 24 నాటికి ఆగ్రాలో యమునా నది శుభ్రంగా ఉంటుందని ఆశించవచ్చు.
ఆగ్రా, దాని చుట్టుపక్కల నుంచి వచ్చే మురుగు నీరు యమునా నదిలో కలుస్తోంది. దాంతో నదిలో ఆ మురికి నీళ్లు ప్రవహిస్తున్నాయి. నది చుట్టుపక్కల తీరమంతటా చెత్తాచెదారం పేరుకుపోయింది.
ట్రంప్ పర్యటనతో ఇప్పుడు వాటిని కూడా శుభ్రం చేస్తున్నారు.
ఆగ్రాలో ఉంటున్న ఒక సామాజిక కార్యకర్త విపిన్ శర్మ వ్యంగ్యంగా "అహ్మదాబాద్‌లో మురికివాడలకు కట్టినట్లే, యమునా తీరంలో కూడా ఇప్పటికిప్పుడు గోడ కట్టడం కుదరదు కదా. ఒకవేళ గోడ కట్టినా, ట్రంప్ యమునా నదిని చూడాలని కోరితే, ఈ బండారం మొత్తం బయటపడుతుంది" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ 2020: భారత జట్టు చరిత్ర సృష్టిస్తుందా?
- మాంసం తింటే కరోనావైరస్ వస్తుందంటూ వదంతులు.. పడిపోయిన చికెన్, మటన్ అమ్మకాలు, ధరలు
- హైదరాబాద్‌లో శాకాహారులు ఎంత మంది? మాంసాహారులు ఎంత మంది?
- 'గ్రహాంతర వాసుల అన్వేషణను మరింత సీరియస్‌గా తీసుకోవాలి.. ప్రభుత్వాలు భారీగా నిధులివ్వాలి'
- పురుషులు మూత్రం ఎలా పోస్తే మంచిది? నిలబడి పోయాలా? కూర్చుని పోయాలా?
- ఒక్క మిడత ‘మహమ్మారి'లా ఎలా మారుతుంది
- వుహాన్ డైరీ: మరణించడానికి మూడు గంటల ముందు ఆయనకు హాస్పిటల్ బెడ్ దొరికింది
- కరోనా వైరస్: వూహాన్లో ఏం జరుగుతోందో ప్రపంచానికి చూపించిన రిపోర్టర్స్ మిస్సింగ్
- పాకిస్తాన్లో చక్కెర కొరత... ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- హార్ట్ బ్రేక్ గైడ్: లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్ బాధ నుంచి బయటపడండి ఇలా..
- కరోనా వైరస్: పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్న వైరస్.. కారణాలు చెప్పలేకపోతున్న వైద్య నిపుణులు
- బిర్యానీ హైదరాబాద్‌ది కాదా?
- యువతను శాకాహారం వైపు నడిపిస్తున్న 7 అంశాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)