ఛత్తీస్‌గఢ్ గిరిజనులపై బంగ్లాదేశ్ శరణార్థులు నిజంగానే ఆధిపత్యం చలాయిస్తున్నారా?

  • ఆలోక్ ప్రకాశ్ పుతుల్
  • బీబీసీ కోసం
ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులు

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC

"ఈ శరణార్థులు ఆదివాసీల ఇళ్లు, భూములు స్వాధీనం చేసుకుంటున్నారు. అడవులను నరికేస్తున్నారు. వాటిని ఆక్రమించుకుంటున్నారు. గిరిజన బాలికలను పెళ్లి చేసుకుని వీరు ఎన్నికల రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టారు. నిజం చెప్పాలంటే వాళ్ల వల్ల గిరిజన సమాజం సంక్షోభం ఎదుర్కొంటోంది".

ఈ ఆరోపణలు చేసింది జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ అధ్యక్షుడు సీనియర్ బీజేపీ నేత నంద కుమార్ సాయ్.

నిజానికి, దేశంలో పౌరసత్వ సవరణ చట్టం గురించి జరుగుతున్న వివాదాల మధ్య భారత జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాతంలో 60 ఏళ్ల క్రితమే స్థిరపడిన హిందూ శరణార్థుల గురించి ప్రశ్నలు లేవనెత్తింది.

జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ "ఈ శరణార్థుల వల్ల బస్తర్ గిరిజనులు కష్టాల్లో ఉన్నారని, శరణార్థులు వారి హక్కులను అంతం చేస్తున్నారని, గిరిజనుల జనాభా కూడా తగ్గిపోయిందని" రాష్ట్ర ప్రభుత్వంతో చెప్పింది.

అయితే, గత 60 ఏళ్లలో వివిధ సమయాల్లో ఇక్కడ స్థిరపడ్డ బంగ్లాదేశీ శరణార్థుల నేత ఆ ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో బంగ్ శరణార్థీ సమాజ్ అధ్యక్షుడు, బీజేపీ నేత అసీమ్ రాయ్ బంగ్లాదేశీ శరణార్థుల వల్ల ఎక్కడా, ఎలాంటి సమస్యా రాలేదు. కొంతమంది రాజకీయాల కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

"మా రెండు తరాలు ఇక్కడే పుట్టింది. మాకు, స్థానిక గిరిజనుల మధ్య ఎలాంటి బేధాలూ లేవు. మేం మంచిచెడుల్లో పరస్పరం కలుస్తుంటాం. కష్టాలు మా మధ్య చీలికలు తెచ్చి రాజకీయాలు చేయాలని చూస్తున్న వారికి మాత్రమే" అని అసీమ్ రాయ్ చెప్పారు.

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC

ఇది మినీ బెంగాల్

బస్తర్ దట్టమైన అడవుల మధ్య ఉన్న మావోయిస్టు ప్రభావిత పఖాంజూర్ వికాస్‌ఖండ్‌ను ఈ ప్రాంతంలో అందరూ 'మినీ బంగాల్' పేరుతో పిలుస్తారు.

పఖాంజూర్ మొత్తం 295 గ్రామాలు ఉన్నాయి. వీటిలో 133 గ్రామాల్లో బంగ్లాదేశీ శరణార్థులు స్థిరపడ్డారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ మొత్తం 1.71 లక్షల మందిలో లక్ష మంది బంగ్లా మాట్లాడుతారు. అటు పఖాంజూర్ నగరంలో ఉన్న పది వేలకు పైగా జనాభాలో దాదాపు 95 శాతం మంది తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చిన వీరే ఉన్నారు.

బయట నుంచి ఎవరైనా ఇక్కడకు వస్తే, ఈ గిరిజన ప్రాంతాల్లో ఆహారపు అలవాట్లు, వారి జీవనశైలి, వారి మాండలికం చూసి, బెంగాల్‌లోని ఏ ప్రాంతానికో వెళ్లామని అనుకుంటారు.

1958 సెప్టంబర్ 12న ఒక తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చే శరణార్థులు అప్పటి మధ్యప్రదేశ్‌లోని బస్తర్, ఒడిశాలోని మల్కాన్‌గిరిలో నివసించడానికి 'దండకారణ్య ప్రాజెక్టు'కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

గణాంకాల ప్రకారం 1979 అక్టోబర్ 31 వరకూ బస్తర్ ప్రాంతంలో మొత్తం 18,458 మంది శరణార్థులు స్థిరపడ్డారు. వీరి కోసం నీటిపారుదల, తాగునీటి సౌకర్యాలు, భూ సంస్కరణలు, విద్య, ఆరోగ్యం, రహదారుల నిర్మాణం లాంటి అభివృద్ధి పనులు చేశారు.

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC

ఫొటో క్యాప్షన్,

గౌరాంగ్ సాహా

గ్రామం పేరు అంకెల్లో చెబుతారు

బస్తర్‌లోని శరణార్థులు పరల్‌కోట్ ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. అక్కడ ఉన్న అన్ని గ్రామాలకూ పరల్‌కోట్ విలేజ్ అనే పేరే పెట్టుకున్నారు. దానితో అంకెలు జోడించారు. అంటే ఒక గ్రామం పీవీ-1 అయితే ఇంకో గ్రామం పీవీ-80 అని ఉంటుంది.

ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇలాంటి 133 గ్రామాలు ఉన్నాయి. అయితే తర్వాత రోజుల్లో ఈ గ్రామాలకు పేర్లు పెట్టే ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ ఈ ప్రాంతంలో నివసించేవారిని మీ ఊరి పేరేంటని అడిగితే, వారు ఇప్పటికీ తమ గ్రామం పేరు అంకెల్లోనే చెబుతున్నారు.

పీవీ-130లో నివసించే 70 ఏళ్ల గౌరాంగ్ సాహా గ్రామంలోని ప్రధాన రహదారిపై ఒక చిన్న దుకాణం నడుపుతున్నారు. ఆయన కుటుంబంలో భార్య, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ముగ్గురికీ పెళ్లిళ్లు అయిపోయాయి. షాపు కాకుండా గౌరాంగ్ ఎక్కువ సమయం తన మనవళ్లు-మనవరాళ్లతో గడుపుతుంటారు.

తన పాత రోజులను గుర్తు చేసుకున్న ఆయన "ప్రభుత్వం తరఫున అన్ని కుటుంబాలకు 7 ఎకరాల భూమి ఇచ్చారు. ఆరున్నర ఎకరాలు వ్యవసాయం కోసం, అర ఎకరం ఇల్లు, దొడ్డి కోసం. అప్పుడప్పుడు ఇంటికి, వ్యవసాయానికి ఆర్థిక సాయం కూడా చేశారు. మేం ఇక్కడకు వచ్చినపుడు మొత్తం అడవే ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాల్లో గిరిజనులు ఉండేవారు. ఇక్కడకు వచ్చామేంటి అనుకున్నా" అన్నారు.

గౌరాంగ్ సాహా దాదాపు భారతదేశమంతా తిరిగొచ్చారు. కానీ ఇప్పుడు బస్తర్‌లోని ఈ ప్రాంతం ఆయనకు ప్రపంచంలోనే అత్యంత సుఖంగా ఉన్న స్థలం అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC

ఫొటో క్యాప్షన్,

చందన్ సర్కార్

అందరూ బెంగాలీలే...

గౌరాంగ్ సాహా దుకాణం దగ్గర మేము 21 ఏళ్ల చందన్ సర్కార్‌ను కలిశాం. బీకాం పూర్తి చేసిన చందన్ పీవీ-55లో ఉంటాడు. అతడికి ఇద్దరు అక్కలు, ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి.

చందన్ కూడా పఖాంజూర్ మార్కెట్లో సొంతంగా కాస్మటిక్స్ షాపు తెరవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఈ గిరిజన ప్రాంతంలో ఉండడం వల్ల నీకు ఇబ్బందిగా అనిపించదా?, బయటికి వెళ్లి ఏదైనా పని చేసుకోవాలనే ఆలోచన రాదా?

అతడు చాలా మామూలుగా "ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్లినా, మీకు బెంగాలీ వారే కనిపిస్తారు. 90 శాతం మంది బంగ్లాలోనే మాట్లాడుతారు. వారి జీవనశైలి కూడా దేశంలో మిగతా ప్రాంతాల్లో ఉన్న బెంగాలీల్లాగే ఉంటుంది. నేనిక్కడ కంఫర్టబుల్‌గా ఉన్నాను. నాకు ఎలాంటి సమస్యా లేదు. ఆ..ఇక్కడ గిరిజనులకు మాత్రం కచ్చితంగా ఈ పరిసరాలు కాస్త వింతగా అనిపించవచ్చు" అన్నాడు.

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC

ఫొటో క్యాప్షన్,

పఖాంజూర్‌లో స్కూలు

గిరిజనులు ఏం చెబుతున్నారు

బయటి శరణార్థుల వల్ల ఈ ప్రాంతంలో గిరిజనులు అట్టడుగుకు చేరుకున్నారని సర్వ ఆదివాసీ సమాజ్ నేత బీపీఎస్ నేతామ్ ఆరోపించారు.

1960 తర్వాత నుంచి వరుసగా బంగ్లాదేశీలు ఇక్కడకు వచ్చి స్థిరపడుతున్నారు. వీరిలో అక్రమంగా ఉంటున్నవారే పెద్ద సంఖ్యలో ఉన్నారు.

"ఇక్కడ గిరిజనులు మైనారిటీలు అయిపోయారు. గిరిజనుల సంఖ్య తగ్గిపోతోంది. బంగ్లాదేశీ శరణార్థుల సంఖ్య పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే, పఖాంజూర్‌లో చాలా గ్రామాల్లో ఒక్క గిరిజనుడు కూడా మిగలడు. గిరిజనులు ఇప్పుడు తమ భాషనే మర్చిపోతున్నారు. అంతకంటే ఘోరం ఇంకేముంటుంది" అని నేతామ్ ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, "బంగ్లాదేశీ శరణార్థులు స్థిరపడిన 133 గ్రామాల్లో వారి జనాభా ఎక్కువగా ఉంది అనేది సహజమే. అలాంటప్పుడు ఈ ప్రాంతం మీద బెంగాలీల సామాజిక, సాంస్కృతిక ప్రభావం ఎక్కువగా ఉంటుంది" అని పీవీ-130లో ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ లక్ష్మీరాణీ దాస్ అన్నారు.

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC

ఫొటో క్యాప్షన్,

లక్ష్మీరాణి దాస్

స్కూల్లో గిరిజన విద్యార్థులు ఇద్దరే

ఐదో తరగతి వరకూ ఉన్న ఈ గిరిజన స్కూల్లో 20 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో ఇద్దరే గిరిజనులు. వీరిద్దరూ గిరిజన స్కూల్లో బంగ్లాలోనే మాట్లాడుతారు. ఈ ఇద్దరు పిల్లల్లో ఎప్పుడూ స్కూలుకు వచ్చేది బాదల్ నరేటీ మాత్రమే.

ఐదో తరగతి చదువుతున్న నరేటీ బంగ్లా మాట్లాడడంలో, అర్థం చేసుకోవడంలో తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని బంగ్లాలోనే చెప్పాడు. మేం అడిగామని బంగ్లాలో ఒక పాట కూడా పాడాడు..

"పఖాంజూర్ లాంటి చోట ఇప్పుడు గిరిజనుల ప్రాంతాలు ఏవీ లేవు. చదువుకున్న శరణార్థులు నిరక్షరాస్యులైన గిరిజనుల ఉపాధిని ఆక్రమించారు" అని ఛత్తీస్‌గఢ్ సీనియర్ గిరిజన నేత మాజీ కేంద్ర మంత్రి అరవింద్ నేతామ్ చెబుతున్నారు.

ప్రభుత్వం ద్వారా అందే అభివృద్ధి పథకాల ప్రయోజనాలు కూడా గిరిజనులకు బదులు బయటి వారికే వెళ్తున్నాయని నేతామ్ ఆరోపిస్తున్నారు.

దేశంలో కొత్త పౌరసత్వ సవరణ చట్టం అమలైతే దాని దుష్ప్రభాలు ఎక్కువగా బస్తర్ లాంటి ప్రాంతాలపైనే పడుతుంది అన్నారు.

"50-60 ఏళ్ల క్రితం శరణార్థుల పేరుతో మా ప్రాంతంలో ఉండేవారిని పక్కకు నెట్టేశారు. దాని ఫలితాలను మేం ఎన్నో తరాల నుంచీ అనుభవిస్తున్నాం. ఇప్పటికీ వారు అలాగే ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి ఏ ప్రయత్నాన్నీ గిరిజనులు భరించలేరు. గిరిజనులు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తుది శ్వాస వరకూ పోరాడుతారు" అని నేతామ్ చెప్పారు.

ఫొటో సోర్స్, FB @DR. PREMSAI SINGH

ఫొటో క్యాప్షన్,

ఛత్తీస్‌గఢ్ మంత్రి డా.ప్రేమ్‌నాథ్ సింగ్

ప్రభుత్వం ఏం చెబుతోంది?

ఛత్తీస్‌గఢ్‌లో బంగ్లాదేశీ శరణార్థుల వల్ల గిరిజనులకు ఎలాంటి నష్టం జరగడం లేదని ఛత్తీస్‌గఢ్ షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ప్రేమ్‌నాథ్ సింగ్ అన్నారు.

"గిరిజనులకు రిజర్వేషన్ల వల్ల కలిగే లాభాలను లేదా గిరిజనులకు ప్రత్యేకంగా అందించే పథకాలు లాంటి వాటిని గిరిజనేతరులు ఎలా ఉపయోగించుకుంటారు" అని ప్రేమ్‌నాథ్ అన్నారు.

అయితే, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయిన ప్రేమ్‌నాథ్ సింగ్ కేంద్ర ప్రభుత్వ కొత్త పౌరసత్వ సవరణ చట్టానికి కూడా వ్యతిరేకంగా ఉన్నారు.

ఆయన బీబీసీతో "ప్రస్తుతం సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్సీఆర్ లాంటి చట్టాలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు కచ్చితంగా కష్టాలు తెచ్చిపెట్టింది. దానివల్ల ఎవరైనా ఎక్కువగా ప్రభావితం అవుతారు అంటే, అది గిరిజనులే. చదువుకోని గిరిజనులు ఈరోజు ఇక్కడ, రేపు అక్కడా ఉంటారు. వారు తమ తండ్రులు, తాతల కాలం నాటి పత్రాలు ఎలా చూపించగలరు" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)