'ఏపీలో దొరకని మందు.. తెలంగాణకు కాసుల విందు' - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్‌లో తీసుకువచ్చిన కొత్త మద్యం విధానం.. తెలంగాణకు కాసుల పంట పండిస్తోందని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో చెప్పింది.
ఆ కథనం ప్రకారం.. నూతన పాలసీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం రేట్లను భారీగా పెంచేయడంతోపాటు మద్యం ప్రియులకు ఇష్టమైన బ్రాండ్లు కాకుండా కొత్త బ్రాండ్లను విక్రయిస్తోంది. మరోవైపు తెలంగాణలో తమకు నచ్చిన బ్రాండ్ల మద్యం తక్కువ ధరకే లభిస్తోంది. దీంతో మందుబాబులు రెండు రాష్ట్రాల సరిహద్దులోని తెలంగాణ వైపు ఉన్న మద్యం దుకాణాలకు క్యూ కడుతున్నారు.
ఫలితంగా ఏపీలో మద్యం ఆదాయం తగ్గిపోతుండగా.. తెలంగాణకు భారీ ఆదాయం సమకూరుతోంది. కృష్ణా జిల్లా సరిహద్దుల్లో తెలంగాణ వైపు ఉన్న మద్యం దుకాణాల్లో గతంలో రోజుకు లక్షరూపాయల వరకు జరిగే విక్రయాలు.. ఇప్పుడు రూ. 5-10 లక్షలకు పెరిగాయి.
ఏపీలోని వీరులపాడు మండలం జయంతి, జుజ్జూరు దుకాణాల్లో కలిపి రోజుకు రూ. 2 లక్షల మద్యం విక్రయాలు మాత్రమే జరుగుతున్నాయి. కాగా ఇదే మండలాన్ని ఆనుకుని తెలంగాణలో ఉన్న ఎర్రుపాలెంలోని మద్యం దుకాణంలో రోజుకు రూ. 6 లక్షలు, మీనవోలు దుకాణంలో రూ. 5 లక్షలు, దెందుకూరు, మడుపల్లి దుకాణాల్లో రూ. 3 లక్షల చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి.
జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్‌పేట, గండ్రాయి దుకాణాలు రెండూ కలిపి రోజుకు రూ. 2 లక్షల్లోపే వ్యాపారం చేస్తుండగా, ఇక్కడికి కూతవేటు దూరంలో ఉన్న సూర్యాపేట జిల్లా రామాపురం క్రాస్‌రోడ్డులోని దుకాణం ఒక్కటే రోజుకు రూ. 10 లక్షల విక్రయాలు చేస్తోంది.
ఇవికాకుండా తెలంగాణ వైపు అనధికారికంగా పుట్టగొడుగుల్లా వెలిసిన బెల్టుషాపుల ద్వారా లక్షల్లో విక్రయాలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మర్లకుంట గ్రామానికి మందుబాబులు క్యూ కడుతున్నారు. తిరువూరు బార్లో ధర అధికంగా ఉండటంతో 3కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణ గ్రామాలకు మద్యం ప్రియులు తరలిపోతున్నారు.
ఏపీలోని వైన్‌షాపుల్లో విశ్రాంత గదులు తీసివేయడంతో తెలంగాణలోని మద్యం దుకాణాలకు వెళ్లి అక్కడే తాగి వస్తున్నారు. కర్నూలు జిల్లా నుంచి తెలంగాణలోని అలంపూర్ మండలంలో ఉన్న మద్యం దుకాణాలకు క్యూ కడుతున్నారు. కృష్ణానది నుంచి పుట్టీల్లో తెలంగాణ లిక్కర్‌ను ఆంధ్రాకు తరలించి బెల్టుషాపుల ద్వారా విక్రయిస్తుండడంతో నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్, దోమలపెంట, పెంట్లవెల్లిలో గిరాకీ ఏర్పడింది.
ఇక మందుబాబులకు అలవాటైన మద్యంతోపాటు లైట్ బీర్లు సైతం ఏపీలో లభించడంలేదు. వాటి స్థానంలో కొత్త బ్రాండ్లను విక్రయిస్తున్నారు. మరోవైపు వివిధ బ్రాండ్ల ధరలు తెలంగాణతో పోలిస్తే.. క్వార్టర్ బాటిల్‌కు రూ. 30, ఫుల్ బాటిల్‌కు రూ. 120 దాకా అధికంగా ధరలు ఉన్నాయి. ఏపీలో చీప్ లిక్కర్ ధరకే తెలంగాణలో బ్రాండ్ మద్యం లభిస్తోంది. దీంతో సరిహద్దులోని వారంతా తెలంగాణ దుకాణాలకు తరలుతున్నారు.
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలానికి కనుచూపు మేరలో ఉన్న వాడపల్లి, దామరచర్లలోని రెండు దుకాణాలు, అడవిదేవులపల్లి మండల కేంద్రంలో నెలకు రూ. కోటికి మించి మద్యం వ్యాపారం సాగుతోంది. సరిహద్దుల్లో ఏపీవారు తెలంగాణ నుంచి పెద్దమొత్తంలో మందు కొనుగోలు చేస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒక వ్యక్తి 2 ఫుల్ బాటిళ్లు, 6 క్వార్టర్లకు మించి మద్యం తీసుకెళ్లకుండా, నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం ఏపీలోకి వెళ్లకుండా ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణలోని సరిహద్దు గ్రామాలే కాకుండా ఏపీతో సరిహద్దు ఉన్న తమిళనాడు గ్రామాలలోని మద్యం షాపులు కూడా ఏపీ నుంచి వెళ్లిన మద్యం ప్రియులతో కళకళలాడుతున్నాయి.
ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో ఎయిడ్స్‌కు 4,250 మంది బలి.. పెరుగుతున్న మరణాలు
ఎయిడ్స్‌కు తెలంగాణలో అనేకమంది బలవుతున్నారని.. దేశవ్యాప్తంగా ఎయిడ్స్ మరణాల్లో తెలంగాణ రాష్ట్రం ఏకంగా నాలుగో స్థానంలో ఉన్నట్లు ఇటీవల కేంద్రం వెల్లడించిందని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల మేరకు ఎయిడ్స్ వల్ల 2018-19లో దేశవ్యాప్తంగా 51,911 మంది చనిపోగా, 2019-20 ఆర్థిక ఏడాదిలో డిసెంబర్ నాటికి 43,019 మంది మరణించినట్లు కేంద్రం తెలిపింది. జాతీయస్థాయిలో మరణాల సంఖ్య తగ్గగా, తెలంగాణలో మాత్రం ఆ సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణలో 2018- 19 ఆర్థిక సంవత్సరంలో 2,925 మంది ఎయిడ్స్ కారణంగా చనిపోగా, 2019-20 ఆర్థిక ఏడాదిలో గత డిసెంబర్ నాటికే 4,278 మంది చనిపోయినట్లు ఆ నివేదిక వెల్లడించింది. అంటే గత సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరం 9 నెలల కాలంలోనే 32 శాతం ఎక్కువ మంది చనిపోయారు.
మరోవైపు.. 7,778 మరణాలతో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం ప్రకారం గతేడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 17.77 లక్షల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారని కేంద్రం తెలిపింది. అందులో తెలంగాణలో 83,861 మంది రోగులున్నారు.
సెక్స్ వర్కర్లలో లైంగిక సంక్రమణ వ్యాధులు 25% ఎక్కువగా ఉన్నాయని తేలింది. తర్వాత వలస కార్మికులు 17 %, లింగమార్పిడి 15 %, మిశ్రమ సమూహాలు 12 %, మిగిలిన ఇతరుల్లో లైంగిక సంక్రమణ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని తేలింది.
ఎయిడ్స్ సోకినట్లు తెలియగానే కొన్నాళ్లపాటు మందులు వాడుతున్నారని, తర్వాత మధ్యలో నిలిపేయడం వల్ల మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని డాక్టర్ కమల్‌నాథ్ తెలిపారు.
ఫొటో సోర్స్, Getty Images
రూ. 33,869 కోట్లతో సీమ కరవు నివారణ
రాయలసీమ కరవు నివారణకు దాదాపు 15 కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు జలవనరుల శాఖ అడుగులు వేస్తోందని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. రూ. 33,869 కోట్ల అంచనా విలువతో రాబోయే అయిదేళ్లలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి, సీమ జిల్లాలకు నీరు పారించాలని, కరవు నివారణ చర్యలు చేపట్టాలనేది ఈ పథకాల ప్రధాన ఉద్దేశం.
నిధుల లభ్యత, నిర్మాణానికి పట్టే సమయం, క్షేత్రస్థాయి అంచనాల ఆధారంగా తీసుకుంటే ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ ఇంకా పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ ఇంజనీర్లే పేర్కొంటున్నారు.
కృష్ణా నదిలో ఎగువ నుంచి నీరు రాష్ట్ర వాటాకు సరిపడా రావడం లేదు. గడిచిన పదేళ్లలో ఎగువన కర్ణాటక, మహారాష్ట్రల్లో ప్రాజెక్టులు నిర్మించుకోవడం, వచ్చిన నీటిని వచ్చినట్లుగా వాడుకోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి.
కృష్ణాలో ఇకపై 120 రోజుల పాటు వరద ఉండబోదని, కేవలం 40 రోజుల వరదను దృష్టిలో ఉంచుకునే కాలువల సామర్థ్యం జలాశయాల నిల్వ సామర్థ్యం పెంచుకోవాలనే ఆలోచన నేపథ్యంలో ఈ కొత్త పథకాలకు జలవనరులశాఖ అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుల్లో కొన్ని పరిశీలనలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఇతనో దొంగ.. ఒక బీరువాను దొంగిలించాడు.. అది ఇతని జీవితాన్ని మార్చింది
- ఈ కొండల కింద టన్నుల కొద్దీ బంగారం...
- 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలపై అసదుద్దీన్ ఒవైసీ ఏమంటున్నారు?
- హర్మన్‌ప్రీత్ కౌర్: క్రికెట్ ప్రపంచకప్‌లో సిక్స్ కొట్టినందుకు, డోప్ టెస్టు చేయాలన్నారు
- కసబ్ దగ్గర హైదరాబాద్ కాలేజ్ ఐడీ, బెంగళూరు ఇంటి అడ్రస్: రాకేశ్ మారియా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనా వైరస్: అన్ని దేశాలూ వణుకుతున్నా, థాయిలాండ్ మాత్రం చైనీయులకు తమ తలుపులు తెరిచే ఉంచింది.. ఎందుకు?
- తెలుగు భాష: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)