సీఏఏ-ఎన్‌ఆర్‌సీ: "ఇన్నేళ్ల నా జీవితం కాగితం ముక్కతో సమానమైపోయింది" - తెలంగాణలో సర్టిఫికెట్ల కోసం తిరుగుతున్న ఓ ముస్లిం మహిళ నిట్టూర్పు

  • దీప్తి బత్తిని
  • బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్ పాతబస్తీలోని పునరావాస శిబిరం నుంచి పనికి వెళుతున్న రోహింజ్యా ముస్లిం కుటుంబం. 2016 జూన్ 29వ తేదీన తీసిన చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఒక ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ టీచర్‌గా పనిచేసే 46 ఏళ్ల సుల్తానా ఓ వివాహ ధ్రువపత్రం కోసం ఉదయాన్నే రైల్లో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు.

ఆమెకు పెళ్లై 37 ఏళ్లయింది.

"మా పెళ్లైనప్పుడు మాకు నిఖానామా పుస్తకం ఇచ్చారు. ఇప్పటివరకు అదే మా పెళ్లికి ఆధారం. ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌరుల రిజిస్టర్(ఎన్‌ఆర్‌సీ) గురించి జరుగుతున్నదంతా చూశాక మాకు కూడా పెళ్లి సర్టిఫికేట్ ఉంటే మంచిదనిపించింది. నిఖానామాను పెళ్లి చేసిన ఖాజీ ఇస్తారు. పెళ్లి ధ్రువపత్రాన్ని ప్రభుత్వం ఇస్తుంది. ఇందులో మా పుట్టినతేదీ, జాతీయత వివరాలు కూడా ఉంటాయి. అందుకే మేం ఇది తీసుకోవాలనుకొంటున్నాం"అని సుల్తానా చెప్పారు.

2019 డిసెంబరు తర్వాత పెళ్లి ధ్రువపత్రాల కోసం దరఖాస్తులు పెరిగాయని హైదరాబాద్‌లోని వక్ఫ్ బోర్డు అధికారులు తెలిపారు. పెళ్లి చేసుకున్న ముస్లింలకు ధ్రువపత్రాలు ఇచ్చే అధికారం వీరికే ఉంది.

"మామూలుగా రోజూ కొత్తగా పెళ్లైన వాళ్ల నుంచి 150 వరకు దరఖాస్తులు వస్తుంటాయి. గత రెండు నెలల్లో మాత్రం రోజుకు 500 వరకు ధ్రువపత్రాలు ఇస్తున్నాం. ఎప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం వివాహమైనవారు కూడా ఇప్పుడు వీటి కోసం వస్తున్నారు" అని వక్ఫ్ బోర్డు అధికారులు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి పెళ్లి ధ్రువపత్రాలకు దరఖాస్తుల సంఖ్య పెరిగిందని తెలంగాణ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మహమ్మద్ సలీం తెలిపారు.

"ఈ పత్రాల్లో వారి పుట్టినతేదీ, జాతీయత, చిరునామా ఉండటమే దీనికి కారణం. గతంలో ఎవరూ పెళ్లి ధ్రువపత్రాలు తీసుకొనేవారు కాదు. ప్రస్తుతం అందులో అన్ని వివరాలూ ఉంటాయన్న ఉద్దేశంతో చాలా మంది దరఖాస్తులు పెడుతున్నారు" అని సలీం చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఒక రోజంతా ఎదురుచూసి తత్కాల్ కింద అదనపు ఫీజు చెల్లించి సుల్తానా ధ్రువపత్రం తీసుకున్నారు. ఈ పత్రం తీసుకోవడంతోనే ఆమె పని పూర్తికాలేదు. ఇంకా తనతోపాటు కుటుంబ సభ్యుల జనన ధ్రువీకరణపత్రాల కోసం ఆమె దరఖాస్తు చేయనున్నారు.

"మా ఆయన 1953లో పుట్టారు. ఆయనకు జనన ధ్రువీకరణపత్రం లేదు. దీంతో పదోతరగతి సర్టిఫికెట్ బయటకు తీశారు. ఇందులో పుట్టినతేదీ ఉంటుంది. అది చెల్లుతుంది. కానీ ఇందులో ఆయన పేరు స్పెల్లింగ్‌లో తప్పుంది. ఈ తప్పు సవరించడానికి దరఖాస్తు పెట్టుకోవాలి. తర్వాత పుట్టినరోజు ధ్రువపత్రానికి దరఖాస్తు పెట్టాలి. నిజానికి ఆయన జీవితంలో ఎప్పుడూ జనన ధ్రువీకరణపత్రం అవసరం రాలేదు. చదువు, ఉద్యోగం, పాస్‌పోర్టు సహా దేనికీ ఇది అవసరం రాలేదు. ఆయన ఓటర్ కార్డో, రేషన్ కార్డో, పదోతరగతి సర్టిఫికేటో పనికొచ్చేది" సుల్తానా చెప్పారు.

మున్ముందు తమకు ఈ ధ్రువపత్రాల అవసరం రాకపోవచ్చనే ఆలోచనా ఏదో మూలన వారిలో ఉంది. అయినప్పటికీ వీటిని దగ్గర పెట్టుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చని భావిస్తున్నారు.

"ఆ సమయం వచ్చినప్పుడు ఎవరికీ తెలియదు. నాకు ముగ్గురు కొడుకులు. పెద్దకొడుకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. మేం అనవసరంగా భయపడుతున్నామని అతడు అనుకొంటున్నాడు. ఈ పత్రాల కోసం మా ఆయన, నేను సమయం వృథా చేస్తున్నామని, శ్రమ పడుతున్నామని అనుకొంటున్నాడు. ఏయే పత్రాలు అవసరమవుతాయనేది ప్రభుత్వం ఇంకా స్పష్టంగా చెప్పలేదు. అందుకనే మేం వీలైనన్ని ఎక్కువ పత్రాలు సేకరించి మా పౌరసత్వాన్ని నిరూపించుకోవచ్చని అనుకొంటున్నాం" అని సుల్తానా వివరించారు.

సుల్తానా మాత్రమే కాదు, ఆమె దగ్గరి బంధువులు, స్నేహితులు కూడా ఇలాగే పత్రాలు సేకరించే పనిలో ఉన్నారు.

సుల్తానా వాట్సాప్‌లో కుటుంబ గ్రూప్ ఒకటి చూపించారు. అందులో ఆమె చుట్టాలంతా ఏ పత్రాలు తీసుకురావాలనేది చర్చిస్తున్నారు.

"మేం ఒక చెక్ లిస్టు తయారు చేశాం. అందులో ఆస్తి పత్రాలు లాంటి కొన్ని కామన్ డాక్యుమెంట్లు ఉన్నాయి. మేం ఒక ఫోల్డర్ ఏర్పాటు చేసి వీటిని అందులో పెడుతున్నాం. దానివల్ల కుటుంబ సభ్యులందరికీ ఇవి అందుబాటులోకి వస్తాయి. ప్రతి శనివారం కొంత సమయం కేటాయించి ఈ డాక్యుమెంట్ల పరిస్థితి చూస్తాం. ఫలానా డాక్యుమెంట్ వచ్చింది అని నిర్ధరించుకున్న తరువాత దానికి టిక్ పెడతాం. మా స్నేహితుల గ్రూపులో, ప్రార్థన గ్రూపులో కూడా ఎక్కువ చర్చ జరిగేది సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపైనే" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Regati Nagaraju

సుల్తానా సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తున్న చోట ఇలాంటి అవసరంపైనే వచ్చినవారు దాదాపు 20 మంది కనిపించారు.

సీఏఏ వచ్చినప్పటి నుంచి చెప్పలేనంత నిరాశలో కూరుకుపోయామని ఆమె తన ఆవేదన పంచుకున్నారు.

"హైదరాబాద్‌లో చాలా మంది ముస్లింలు ఉన్నారు. కానీ వరంగల్లో నేను పుట్టి పెరిగిన చోట ఎక్కువ మంది హిందువులే. నేను హిందూ స్నేహితులతో కలసి పెరిగాను. మా ఇంటి చుట్టుపక్కల హిందువులం, మేం కలిసి భోజనం చేస్తాం. పుట్టుక నుంచి చావు వరకు అన్నిసార్లూ కలిసి మెలిసి ఉంటాం. కానీ ఇప్పుడు వాళ్లు ఎవరూ పత్రాల కోసం పరిగెడుతున్నట్టు కనిపించలేదు. వారిలో చాలా మందికి కనీసం జనన ధ్రువీకరణ పత్రం కూడా లేదు. చాలా మందికి పెళ్లై ఐదేళ్లైనా వివాహ ధ్రువపత్రాలు లేవు. కుటుంబానికి రుజువుగా చూపించడానికి వారి వద్ద రేషన్ కార్డు మాత్రమే ఉంది. నా దగ్గరా రేషన్ కార్డు ఉంది. కానీ నేను భయపడుతున్నాను. వాళ్లు భయపడటం లేదు" అని సుల్తానా చెప్పారు.

పౌరసత్వం నిరూపించుకోవాలని ఇప్పటివరకు ఆమెను ఎవరూ అడగలేదు. అయినా ఆమెలో ఏదో భయాందోళన నెలకొంది. అందుకే ఈ పత్రాలను సేకరిస్తున్నారు. "ఇన్నేళ్ల తర్వాత నేను, నా జీవితం విలువ ఒక కాగితం ముక్కతో సమానమైపోయాయి" అని సుల్తానా నిట్టూర్చారు.

సుల్తానా ఇదంతా బీబీసీతో పంచుకొంటున్నప్పుడే ఆమె టోకన్ నంబర్ పిలిచారు. ఆమె ధ్రువపత్రం తీసుకుని, విషయాన్ని భర్తకు ఫోన్ చేసి చెప్పారు. తిరిగి రైల్లో వరంగల్ వెళ్లడానికి బయల్దేరారు.

ఫొటో సోర్స్, SHARAD BADHE/BBC

ఫొటో క్యాప్షన్,

మహారాష్ట్రలోని మాలెగావ్, ఇతర ప్రాంతాల్లోనూ సీఏఏ నేపథ్యంలో ధ్రువపత్రాల కోసం ప్రజలు వరుస కడుతున్నారు.

సుల్తానా మాదిరే చాలా మంది ధ్రువపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) కార్యాలయాలు, మీ-సేవ కేంద్రాలు జనన ధ్రువీకరణ పత్రం కోసం ఎలా దరఖాస్తుచేయాలో తెలుసుకొనేందుకు వచ్చిన వారితో నిండిపోతున్నాయి.

మామూలుగా మీ-సేవలో జనన ధ్రువీకరణ పత్రాలు ఇస్తారని, చాలా మంది ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వృద్ధులు ఈ విషయం తెలియక మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లి, వీటి కోసం ఎలా దరఖాస్తు చేయాలని అడుగుతున్నారని జీహెచ్ఎంసీ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

"చదువుకున్నవారు కూడా విచారించుకోవడానికి వస్తున్నారు. భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) ఇచ్చిన సర్టిఫికేట్లు పట్టుకుని మళ్లీ జనన ధ్రువీకరణ పత్రం కోసం వస్తున్న వాళ్లు ఉన్నారు. ఒక డాక్టర్ వచ్చారు. ఆయన భారతీయ దంపతులకు మస్కట్లో పుట్టారు. అలాంటి వారికి రాయబార కార్యాలయం ఇచ్చిన ధ్రువపత్రం సరిపోతుంది. కానీ అది సరిపోతుందో, లేదోననే అనుమానం ఆయనకు ఉంది. ఇలా చాలా మంది విచారణ కోసం వస్తున్నారు. వాళ్లలో ఎక్కువ మంది ఒక మతానికి చెందిన వారు" అని సదరు అధికారి వివరించారు. ఒక 60 ఏళ్ల వ్యక్తి వచ్చి ఆయన తండ్రి జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేయవచ్చా అని అడిగారని చెప్పారు.

హైదరాబాద్‌లో 700 మీ-సేవా కేంద్రాలు ఉన్నాయి. 2019 నవంబరులో 11,210, డిసెంబరులో 13,688 జనన ధ్రువీకరణ పత్రాలు జారీచేయగా, ఈ ఏడాది ఒక్క జనవరిలోనే 21,882 జనన ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారు.

డిసెంబరు, జనవరిలలో అత్యధిక పత్రాలు ఇచ్చింది ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే చార్మినార్, ఖైరతాబాద్, గోషామహల్ సర్కిళ్లలోనే.

బషీర్ అనే 27 ఏళ్ల మార్కెటింగ్ ఉద్యోగి తన కుటుంబ సభ్యుల జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకొనేందుకు రెండు రోజులు సెలవు పెట్టారు.

ఆయన తాత 1940లో పాకిస్తాన్ నుంచి హైదరాబాద్ వచ్చారు. ఆయనకు సొంత వ్యాపారం ఉంది.

"మా నాన్న 1943లో హైదరాబాద్లో పుట్టారు. ఇక్కడే చదివి, ఇక్కడే పెళ్లిచేసుకున్నారు. ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి. కానీ ఆయనకు జనన ధ్రువీకరణ పత్రం లేదు. దీంతో ఏమవుతుందో మాకర్థం కావడం లేదు" అని బషీర్ ఆందోళన వ్యక్తంచేశారు.

ఇంతకీ పౌరసత్వం నిరూపించుకునేందుకు ఏ సర్టిఫికెట్ కావాలి?

పుట్టిన తేదీ మరియు పుట్టిన ప్రదేశానికి సంబంధించిన పత్రాలతో పౌరసత్వాన్ని నిరూపించవచ్చు.

"అయితే, అటువంటి ఆమోదయోగ్యమైన పత్రాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇందులో ఓటరు కార్డులు, పాస్‌పోర్ట్‌లు, ఆధార్, లైసెన్స్‌లు, బీమా పత్రాలు, జనన ధృవీకరణ పత్రాలు, పాఠశాల వదిలివేసే ధృవీకరణ పత్రాలు, భూమి లేదా ఇంటికి సంబంధించిన పత్రాలు లేదా ప్రభుత్వ అధికారులు జారీ చేసిన ఇతర పత్రాలు ఉండవచ్చు. ఈ జాబితాలో ఇంకా వేరే పత్రాలు ఉండే అవకాశం ఉంది "అని ప్రభుత్వ నోట్ పేర్కొంది.

ఈ స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న కార్యకర్తలు అంటున్నారు.

"ముస్లిం సముదాయంలో నిరక్షరాస్యత ఎక్కువ. ఏ పత్రాలు అవసరం, అవి ఎక్కడ పొందవచ్చనే సమాచారం అందరికీ తెలియదు. అంతకుముందు ఇదంతా లేదు కదా.. కాబట్టి ప్రతి ఒక్కరికీ బర్త్ సర్టిఫికెట్లు ఉండవు. వివాహ ధృవీకరణ పత్రం కోసం, వివాహాన్ని నిర్వహిస్తున్న ఖాజీ జారీ చేసిన నికనామా బుక్‌లెట్ వారి వివాహం రుజువు. ఖాజీలను వక్ఫ్ బోర్డుచే గుర్తించినందున అది సరిపోయేది. కేవలం పాస్‌పోర్టు కోసమే ప్రభుత్వం ఇచ్చే మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం పడేది" అని సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొంటున్న ఒక ముస్లిం వ్యక్తి చెప్పారు.

"మా నిరసన ర్యాలీలలో ప్రధాన నినాదం మేము మా పత్రాలను చూపించమని. కానీ సమయం వచ్చినప్పుడు పత్రాలు అవసరమని తెలుసు. అందుకే సాధారణంగా తీసుకోవాలిసిన డాక్యుమెంటేషన్ తీసుకొని ఉండాలని ప్రజలకు సలహా ఇస్తున్నాము. చివరి నిమిషంలో ప్రజలు ఇబంది పడతారు. ముస్లిం సముదాయంలో అభద్రత, భయం నెలకొన్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రజలు ఏజెంట్ల ద్వారా జనన ధృవీకరణ పత్రం పొందడానికి సుమారు 10 వేల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ విధానాలు అందరికీ తెలియదు. కాబట్టి మేము వారికి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము"అని హైదరాబాద్‌లో సీఏఏ వ్యతిరేక నిరసనల నిర్వాహకుల్లో ఒకరు చెప్పారు. నగరంలో దాదాపు ప్రతిరోజూ నిరసనలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)