పదినిమిషాల్లో పాన్ కార్డ్.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? - ప్రెస్ రివ్యూ

పాన్ కార్డ్

ఫొటో సోర్స్, NSDL,GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

పది నిముషాల్లో పాన్ కార్డ్

పాన్ కార్డ్ కోసం ఇక రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదని ఆధార్ కార్డ్ ఉంటే పది నిమిషాల్లోనే పాన్ కార్డ్ పొందవచ్చంటూ ఆదాయపు పన్ను శాఖ ప్రారంభించిన సరికొత్త సేవలపై ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురిచింది. అది కూడా ఉచితంగానే జారీ చేస్తుందని పేర్కొంది.

నిమిషాల్లోనే ముగిసే ఈ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుందని చెప్పింది. మైనర్లు గతంలో ఇప్పటి వరకు పాన్ కార్డ్ తీసుకోని వారు దరఖాస్తు చెయ్యవచ్చని తెలిపింది. అలాగే ఆధార్‌తో మొబైల్ నెంబర్ అనుసంధానమై ఉండాలని, ఆధార్ కార్డ్‌లో పుట్టన తేదీ వివరాలు తేదీ-నెల-సంవత్సరం ఫార్మెట్‌లో ఉండాలని కూడా ఈ వార్తలో స్పష్టం చేసింది. అలాగే ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా వివరించింది.

ఇన్‌స్టంట్ పాన్ నంబర్ ఇలా పొందండి..

ఐటీ డిపార్ట్‌మెంట్‌ ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ www.incometaxindiaefiling.gov.inలోకి లాగిన్‌కండి. పోర్టల్‌ మెయిన్‌ పేజీలోని ఎడమ భాగంలో కన్పించే క్విక్‌ లింక్స్‌ విభాగంలోని 'ఇన్‌స్టంట్‌ పాన్‌ త్రూ ఆధార్‌' ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.

తద్వారా స్క్రీన్ పైన ప్రత్యక్షమయ్యే కొత్త పేజీలోని కింది భాగంలో కన్పించే 'గెట్‌ న్యూ పాన్‌' బటన్‌ను క్లిక్‌ చేయండి.

కొత్త పాన్‌ కార్డు జారీ కోసం మీ ఆధార్‌ నంబరుతోపాటు స్క్రీన్ పై కన్పించే కాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేశాక 'జనరేట్‌ ఆధార్‌ ఓటీపీ' అనే బటన్‌ను క్లిక్‌ చేయండి.

దాంతో మీ ఆధార్‌ కార్డుతో అనుసంధానితమైన మొబైల్‌ నంబరుకు ఓటీపీ వస్తుంది. మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయాలి.

ఆ తర్వాత మీ ఆధార్‌ వివరాలనూ ధ్రువీకరించాలి.

ఈ మెయిల్‌కు పాన్‌కార్డు

ఈ-మెయిల్‌కు పాన్‌ కార్డు పొందగోరేవారు ఆ వివరాలను సైతం అందించాలి.

ఈ-కేవైసీ ప్రక్రియలో భాగంగా మీరు అందించిన డేటాను యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) వద్దనున్న సమాచారంతో సరిపోల్చి చూస్తారు. ఆ వెంటనే ఈ-పాన్‌ను జారీ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తానికి మహా అయితే 10 నిమిషాల సమయం పట్టవచ్చు.

ఆ తర్వాత మీరు మీ పాన్‌ను పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం 'చెక్‌ స్టేటస్‌ లేదా డౌన్‌లోడ్‌ పాన్‌' అప్షన్‌ను క్లిక్‌ చేసి ఆధార్‌ నంబరును ఎంటర్‌ చేస్తే సరిపోతుంది.

ఒకవేళ మీ ఆధార్‌తో ఈ-మెయిల్‌ కూడా అనుసంధానమై ఉంటే, పాన్‌ పీడీఎఫ్‌ ఫైల్‌ మెయిల్‌ రూపంలో మీ ఇన్‌బాక్స్‌కు చేరుతుంది.

ఫొటో సోర్స్, KCR, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

అమెరికా అధ్యక్షుడికి రాష్ట్రపతి భవన్ ఇచ్చే విందుకు కేసీఆర్‌కు ఆహ్వానం

ట్రంప్‌తో విందుకు కేసీఆర్‌కు ఆహ్వానం

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా ఆయన గౌరవార్ధం రాష్ట్రపతి ఇచ్చే విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందిందంటూ ఈనాడు ఓ వార్త కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు శనివారం రాష్ట్రపతి భవన్ కార్యాలయం నుంచి లేఖ వచ్చినట్టు పేర్కొంది.

ఈ నెల 25న రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విందు ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక విందుకు పరిమితమైన సంఖ్యలో మాత్రమే ఆహ్వానితులు ఉంటారు. కేంద్ర మంత్రులు, 8 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు మాత్రమే ఆహ్వానం లభించిందని ఈనాడు చెప్పింది.

వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు, బీహార్, అసోం, హరియాణా, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా ముఖ్యమంత్రులు ఉన్నారని ఈ కథనంలో తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రచారానికే పరిమితమైన బేటీ పడావో

బడికి దూరంగా .. ఆడపిల్లలు

బేటి బచావో- బేటీ పడావో ప్రచారమే తప్ప ప్రభావం శూన్యమంటూ నవ తెలంగాణ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహించిన వారం రోజుల్లో కూడా కనీసం వారిని బడికి పంపండం లేదని ఈకథనంలో పేర్కొంది. ఒక్క హైదరాబాద్‌లోనే పదివేల మందికిపైగా ఉన్నారని తెలిపింది.

మొత్తంగా పథకానికి కేటాయిస్తున్న నిధుల్లో సింహభాగం ప్రచారానికే సరిపోయాయని, మిగిలిన నిధుల్లో పావు వంతు భాగం రాష్ట్రాలకు కేటాయిస్తే.. అవి క్షేత్ర స్థాయికి చేరడం లేదని తెలిపింది. దేశ వ్యాప్తంగా 14 ఏళ్లలోపు బాలికలు 37 శాతం మంది బడి బయటే ఉండగా తెలంగాణలో 32 శాతం బాలికలు బడిలో పేరు నమోదు చేసుకోలేదని చెప్పుకొచ్చింది.

కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే కాదని పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని తెలిపింది. జీహెచ్ఎంసీ గణాంకాల ప్రకారం 1476 మురికావాడలుంటే వాటిల్లో ఉపాధి కోసం వలస వచ్చిన కుటుంబాలే నివసిస్తున్నాయని, అందులో దాదాపు 20 వేల మంది బాలికలు బడిబయటే ఉన్నారని తెలిపింది. పైగా ఇవన్నీ ప్రభుత్వ లెక్కలేనంటూ వివరణ కూడా ఇచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

పెరిగిన భూగర్భ జలాల నీటి మట్టం

అందినంత దూరంలో భూగర్భజలాలు

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో అందినంత దూరంలోనే భూగర్భజలాలు ఉన్నాయంటూ సాక్షి ఓ కథనాన్ని ప్రచురిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సుమారు 5.58 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయనిపేర్కొంది.

2019 మే నాటికి భూగర్భ జాలల మట్టం 16.19 మీటర్లుగా ఉండగా 2019 డిసెంబర్ నాటికి 10.61మీటర్ల స్థాయికి చేరుకుందని తెలిపింది. భూగర్భ జల శాఖ అంచనాల ప్రకారం కోస్తా జిల్లాల్లో భారీగా నీటి మట్టం పెరిగాయి.తీర ప్రాంతాల్లో సగటున 9.72 మీటర్ల లోతున నీటి లభ్యత ఉండగా, రాయలసీమ ప్రాతంంలో 16.44 మీటర్ల లోతులో నీరు లభిస్తోందని ఈ కథనంలో చెప్పుకొచ్చింది.

రాష్ట్రంలో 20.2 శాతం ప్రాంతాల్లో సగటున 3 మీటర్ల మేరలోనే నీరు లభ్యమవుతోంది. 46 శాతం ప్రాంతాల్లో 8 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో నీరు లభిస్తోందని కూడా చెప్పింది. ఫలితంగా బోరు బావుల కింద సాగు శాతం కూడా పెరిగిందని ఈ వార్తలో తెలిపింది.

ఫొటో సోర్స్, FB/@KTRTRS

ఫొటో క్యాప్షన్,

జీహెచ్ఎంసీకి కొత్త చట్టం

జీహెఎంసీకి కొత్త చట్టం

హైదరాబాద్ నగర పౌరులకు మరింత సౌకర్యవంతమైన పాలనను అందించడంలో భాగంగా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ చట్టాన్ని మార్చనున్నట్టు రాష్ట్ర పురపాలక మంత్రి కె. తారకరామారావు చెప్పారంటూ నమస్తే తెలంగాణ పత్రిక ఓకథనాన్ని ప్రచురిచింది.

సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో అమల్లోకి తీసుకొచ్చిన కొత్త మున్సిపల్ చట్టంలోని అన్ని కీలకమైన అంశాలని జీహెచ్ఎంసీ చట్టంలో పొందుపరుస్తామని మంత్రి పేర్కొన్నట్టు ఈ కథనంలో తెలిపింది. తెలంగాణ భవన అనుమతుల ప్రక్రియకు అనుగుణంగా అవసరమైన మార్పులను నూతన జీహెచ్ఎంసీ చట్టంలో తీసుకురావడంతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో కూడా నిర్మాణ అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తామని కూడా మంత్రి పేర్కొన్నట్టు చెప్పింది.

వివిధ సేవల కోసం ప్రత్యేకంగా ఐటీ డ్యాష్‌ బోర్డ్ ఏర్పాటు చేయాలని దాని ద్వారా తాను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటానని కూడా మంత్రి కేటీఆర్ చెప్పినట్టు ఈ కథనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)