వీడియో: దేవుళ్లకు దానం చేస్తున్న బిచ్చగాడు

వీడియో: దేవుళ్లకు దానం చేస్తున్న బిచ్చగాడు

ఆల‌యాల ముందు బిచ్చమెత్తుకునే వారు చాలా చోట్ల ఉంటారు. కానీ బిచ్చమెత్తి ఆల‌యాల‌కు ఆదాయం స‌మ‌కూరుస్తున్న యడ్ల యాదిరెడ్డి విజయవాడలో విశేష ఆకర్షణగా నిలుస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విజ‌య‌వాడ అజిత్‌సింగ్ న‌గ‌ర్‌లో యాదిరెడ్డి గురించి ఎవ‌రిని అడిగినా చెబుతారు. ఆ స‌మీపంలోని సాయిబాబా ఆల‌యం ముందు ఆయ‌న క‌నిపిస్తారు. భ‌క్తుల ద‌గ్గ‌ర యాచ‌న చేస్తూ ఉంటారు. గుడిలో పెట్టే అన్న‌దాన కార్య‌క్ర‌మాల్లో తిన‌డం, భ‌క్తులు ఇచ్చిందే స్వీక‌రించ‌డం అతనికి అల‌వాటు.

పెద్ద‌గా ఖ‌ర్చులు లేక‌పోవ‌డంతో భిక్షాట‌న ద్వారా వ‌చ్చిన సొమ్ములో చాలా భాగం మిగులుతోంద‌ని యాదిరెడ్డి చెబుతున్నారు. దానినే ఆల‌యాల అవ‌స‌రాలు తీర్చ‌డానికి అందిస్తూ భ‌క్తుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు.

యాదిరెడ్డి స్వ‌గ్రామం న‌ల్లగొండ జిల్లా చింతాబాయి. చిన్న‌త‌నంలోనే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయారు. హైద‌రాబాద్‌లో బంధువుల ఇంటికి వెళ్లారు. అక్క‌డ రెండో త‌ర‌గ‌తి చ‌దువుతూ బడి మానేశారు. బంధువుల ఇంట్లో సూటిపోటి మాట‌లు స‌హించ‌లేక ఇంటి నుంచి పారిపోయారు.

1952లో విజ‌యవాడ చేరుకున్న యాదిరెడ్డి మొదట్లో రైల్వే స్టేష‌న్‌లోనే ఉండేవాడిన‌ని బీబీసీతో చెప్పారు.

యాదిరెడ్డి పెళ్లి చేసుకోలేదు. ముత్యాలంపాడు సాయి ఆల‌యానికి స‌మీపంలోని ఓ ఇంట్లోని ఒక గదిలో అద్దెకు ఉంటున్నారు. ఒంట‌రిగా నివసిస్తున్నారు. ఉద‌యాన్నే లేచి భిక్షాట‌న‌కు బ‌య‌లుదేరుతారు.

ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ సాయిబాబా గుడి, రామాల‌యం వంటి చోట్ల యాచ‌న సాగిస్తారు. ఆల‌యంలో భ‌క్తుల‌కు అందించే ప్ర‌సాదాలు, అన్న‌దానాల్లో భోజ‌నం చేస్తూ కాలం గ‌డుపుతారు.

''అప్ప‌ట్లో నాకు ఆరోగ్యం బాగోలేదు. దాంతో ఇక నేను చేసేది ఏముంద‌ని భావించి నా ద‌గ్గ‌ర ఉన్న‌దంతా సాయిబాబా ఆల‌యానికి ఇచ్చాను. అయితే ఆ త‌ర్వాత మ‌ళ్లీ నాకు ఆరోగ్యం కుదుట ప‌డింది. దాంతో మ‌ళ్లీ గుడికి వెళ్ల‌డం, భ‌క్తులు ఇచ్చింది స్వీక‌రించ‌డం అల‌వాటుగా మారింది. కొన్నాళ్ల‌కు పోగుప‌డిన డ‌బ్బులు సాయిబాబా గుడికి గానీ, విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యానికి గానీ, అజిత్‌సింగ్ న‌గ‌ర్‌లోనే ఉన్న రామాల‌యానికి గానీ అందిస్తూ జీవ‌నం గ‌డుపుతున్నాను'' అని ఆయన వివరించారు.

యాదిరెడ్డి ఏ ఆల‌యానికి ఎంత ఇచ్చారంటే..

ఆల‌యాల‌కు అందించిన విరాళాల గురించి త‌న ద‌గ్గ‌ర పూర్తి వివ‌రాలు లేవంటారు యాదిరెడ్డి. త‌న‌కు గుర్తున్నంత వ‌ర‌కూ చెప్ప‌మంటే ఆయ‌న అందించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి:

  • తొలుత సాయిబాబా మందిరానికి యాదిరెడ్డి రూ.1.20 ల‌క్ష‌లు అందించారు.
  • మ‌రోసారి అదే గుడిలో నిత్యాన్న‌దానానికి రూ. 1.08 ల‌క్ష‌లు అందించారు.
  • ద‌త్తాత్రేయుడి గుడిలో వెండి క‌వ‌చం కోసం రూ. 50 వేలు ఇచ్చారు.
  • సీతారాముల‌కు రూ. ల‌క్షన్న‌ర‌ రూపాయ‌ల‌తో కిరీటాలు, ఆభ‌ర‌ణాలు కూడా చేయించారు
  • క‌న‌క‌దుర్గ ఆల‌యంలో నిత్యాన్న‌దానం ప‌థ‌కానికి రూ. 1.50 ల‌క్ష‌లు అందించారు.

''పది లక్షల రూపాయల వరకూ దానం చేశారు''

యాదిరెడ్డి పెద్ద మ‌న‌సుతో అందిస్తున్న విరాళాలు స్ఫూర్తిదాయ‌కమని సాయిబాబా ఆల‌య ట్ర‌స్ట్ ప్ర‌తినిధి పి.గౌత‌మ్‌రెడ్డి బీబీసీతో పేర్కొన్నారు.

''యాదిరెడ్డి ఇప్ప‌టి వ‌ర‌కూ ఆల‌యాల‌కు ఇచ్చింది ప‌ది ల‌క్ష‌ల రూపాయల వ‌ర‌కూ ఉంటుంది. ఓ సాధార‌ణ వ్య‌క్తి ఇంత పెద్ద స్థాయిలో విరాళాలు అందిస్తూ అందరిలోనూ స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే ప‌నిచేయాల‌నే ఆలోచ‌న క‌లిగిస్తున్నారు'' అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)