భారత మహిళల క్రికెట్ జట్టులోని ఈ ప్లేయర్స్ ఒక్కొక్కరిదీ ఒక్కో కథ

  • వందన
  • బీబీసీ ప్రతినిధి
మహిళా క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

''నువ్వు అమ్మాయివి. ఏం ఆడతావు? బయటకు వెళ్లి చప్పట్లు కొడుతూ కూర్చో''... క్రికెట్ ఆడేందుకు వెళ్లినప్పుడు తనను అబ్బాయిలు ఇలా దెప్పిపొడిచేవారని చెప్పింది శఫాలీ వర్మ.

ఆట కోసం తాను అబ్బాయిలా మారాల్సి వచ్చిందని అంటోంది ఆమె.

''అప్పుడు నా జట్టు పొడవుగా ఉండేది. కొంచెం విచిత్రంగా అనిపించేది. జుట్టు కత్తిరించుకుని వెళ్తే, వాళ్లు నన్ను గుర్తుపట్టలేకపోయారు'' అని చెప్పింది.

శఫాలీ వయసు 16 ఏళ్లే. కానీ, ఈ విషయాలన్నీ చెప్పడానికి కావల్సినంత అనుభవాన్ని ఇంతలోనే ఆమె కూడగట్టుకుంది.

ఇప్పటికీ దేశంలోని ఏదైనా చిన్న పట్టణంలో మైదానంలోకి వెళ్లి, ఆడాలంటే అమ్మాయిలు ఎంతో సంఘర్షణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి.

శఫాలీ అలాంటి సవాళ్లను దాటుకుని, ఇప్పుడు భారత మహిళల క్రికెట్ జట్టుకు ఆడుతోంది.

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో ఆమె పాల్గొంటోంది.

2019 సెప్టెంబర్‌లో శఫాలీ భారత్ తరఫున టీ-20ల్లో అరంగేట్రం చేసింది. అప్పటికి ఆమె వయసు 15 ఏళ్లే.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

శఫాలీ వర్మ

క్రికెట్ లెజెండ్ సచిన్ తెందుల్కర్‌కు శఫాలీ పెద్ద అభిమాని. 30 ఏళ్ల పాటు సచిన్ పేరిట కొనసాగిన ఓ రికార్డును గత ఏడాది ఆమె బద్దలుకొట్టింది. అత్యంత చిన్న వయసులో హాఫ్ సెంచరీ సాధించిన భారత క్రికెటర్‌గా నిలిచింది.

శఫాలీది హరియాణాలో రోహ్‌తక్ జిల్లా. ఆమె తండ్రికి కూడా క్రికెట్ ఆడటం చాలా ఇష్టం. కానీ, ఆయనకు కుటుంబం నుంచి తగినంత ప్రోత్సాహం లభించలేదు. తన కుమార్తె విషయంలో మాత్రంలో అలా జరగకూడదని ఆయన నిర్ణయించుకున్నారు.

''క్రికెట్ ఎందుకు ఎంచుకున్నావని నా ఫ్రెండ్స్ అడుగుతుండేవారు. అప్పుడు నేను హర్మన్‌ప్రీత్, మిథాలీ రాజ్ ఫొటోలు వాళ్లకు చూపించేదాన్ని. అప్పుడు వాళ్లిక మరో మాట మాట్లాడేవాళ్లు కాదు'' అని గత ఏడాది బీబీసీతో శఫాలీ చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

జెమీమా రోడ్రిగ్స్

2013లో రంజీ మ్యాచ్ ఆడేందుకు సచిన్ హరియాణాకు వచ్చి, ఓ గెస్ట్ హౌస్‌లో బస చేశారు.

అప్పుడు ఆయన్ను చూసేందుకు శఫాలీ వెళ్లేది. అప్పుడే ఆమె టెన్నిస్ మానేసి, క్రికెట్ ఆడాలన్న నిర్ణయానికి వచ్చింది.

శఫాలీ అంతర్జాతీయ కెరీర్ మొదలై ఐదు నెలలే అయ్యింది. కానీ, భారత బ్యాటింగ్ లైనప్‌లో ఆమెది ముఖ్యపాత్ర అని ఇప్పుడే విశ్లేషకులు అంటున్నారు. వరల్డ్ కప్‌లో ఆమె సత్తా చాటుతోంది కూడా. ఇప్పటివరకూ 14 టీ20 మ్యాచ్‌లు ఆడిన శఫాలీ... 324 పరుగులు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images

రాధా యాదవ్

భారత మహిళా క్రికెటర్ రాధా యాదవ్‌ది కూడా శఫాలి లాంటి కథే.

రాధా యాదవ్ వయసు 19 ఏళ్లు. ఆమె ప్రస్తుతం తన రెండో టీ20 వరల్డ్ కప్ ఆడుతోంది.

అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ బౌలర్ల జాబితాలో ఆమె నాలుగో స్థానంలో ఉంది.

రాధా బాల్యంలో తీవ్ర పేదరికాన్ని అనుభవించారు. ముంబయిలోని కాందివలీలో 200-250 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆమె ఇంటిని చూస్తే, ఆమె ప్రయాణంలో ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

రాధా తండ్రి ఓం ప్రకాశ్‌ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పుర్. ఉపాధిని వెతుక్కుంటూ ఆయన ముంబయికి వలసవచ్చారు. ఓ చిన్న డబ్బాలో పాలు పెట్టుకుని, ఆయన అమ్ముతుండేవారు.

రాధా చిన్నతనంలోనూ క్రికెట్ బాగా ఆడేది. కానీ, కుటుంబం వద్ద డబ్బులు ఉండేవికావు. అప్పుడు కోచ్ ప్రఫుల్ నాయిక్ వాళ్లకు ఆసరా అందించారు. ఆయన రాధాకు కోచింగ్ ఇచ్చారు. బాగా ప్రోత్సహించారు.

2018లో రాధాకు తొలిసారి భారత్ తరఫున టీ20ల్లో ఆడే అవకాశం వచ్చింది. అప్పుడు ఆమెకు 17 ఏళ్లు.

2019లో ఐసీసీ ప్రకటించిన 'టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్'‌లో రాధాకు స్థానం లభించింది.

ఆర్థిక ఇబ్బందుల ఉన్నా, రాధా ఆత్మస్థైర్యం ఎప్పుడూ కోల్పోలేదు.

2020లో బీసీసీఐ గ్రేడ్-బి కాంట్రాక్ట్‌ (ఏడాదికి రూ.30 లక్షలు)కు రాధా ఎంపికైంది. తన జీవితంలో ఆమెకది చాలా గొప్ప రోజు.

ఇప్పుడు రాధా కుటుంబం మూడు గదులుండే ఒక ఇల్లు కొనుక్కొంది. అయితే, ఇప్పటికీ ఆమెకు నెరవేరని కలలు చాలా ఉన్నాయి.

టీ20 వరల్డ్‌కప్‌లో శిఖా పాండే, దీప్తిలతో కలిసి రాధా బౌలింగ్‌లో బాగా రాణిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images

జెమీమా రోడ్రిగ్స్

జెమీమా రోడ్రిగ్స్ వయసు 19 ఏళ్లు. ఇప్పటి వరకు ఆమె భారత జట్టు తరఫున 39 టీ20లు, 16 వన్డేలు ఆడింది.

టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పుడు భారత్‌కు నమ్ముకోదగ్గ బ్యాట్స్‌వుమెన్‌లో ఆమె కూడా ఒకరు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ బ్యాట్స్‌వుమెన్ ర్యాకింగ్స్‌లో ఆమె ఏడో స్థానంలో ఉంది.

చాలా మంది క్రికెటర్లలాగే జెమీమాకు కూడా సచిన్‌ ఆరాధ్య ప్లేయర్.

ఆమె చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతోంది. ముంబయి తరఫున, భారత అండర్-19 జట్టులో ఆడింది. భారత జట్టులోనూ త్వరగానే స్థానం సంపాదించుకుంది.

జెమీమా ఆల్‌రౌండర్. ఆమె గిటార్ కూడా చక్కగా వాయించగలదు. సోషల్ మీడియాలోనూ ఆమె ఒక స్టారే.

ఫొటో సోర్స్, Getty Images

రిచా ఘోష్

16 ఏళ్ల రిచా ఘోష్ కూడా టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తరఫున ఆడుతోంది.

ఆమె తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది ఈ నెలలోనే. అనుభవం తక్కువగానే ఉన్నా, ఆమెకు టీ20 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం వచ్చింది.

రిచాకు సచిన్ హీరో. ధోనీలా సిక్సర్లు కొట్టడం ఆమెకు చాలా ఇష్టం.

ఆమె స్వస్థలం పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి. స్థానిక క్రికెట్ క్లబ్‌లో మహిళా ప్లేయర్ ఆమె ఒక్కరే ఉండేవారు.

11 ఏళ్ల వయసులోనే భారత అండర్-19 జట్టుకు ఆమె ఎంపికైంది.

బ్యాటింగ్‌, బౌలింగ్ మాత్రమే కాదు... రిచా వికెట్ కీపింగ్ కూడా చేయగలదు.

శఫాలీ, రాధా, జెమీమా, రిచాల కథలు వేరైనా, అవన్నీ ఒకేలాంటివి.

పురుషాధిపత్య, ఛాందసవాద ఆలోచనలకు వ్యతిరేకంగా కొందరు పోరాటం చేయాల్సి వస్తే, ఇంకొందరు పేదరికంపై పోరాడాల్సి వచ్చింది.

సవాళ్లను అధిగమిస్తూ ఈ అమ్మాయిలు నూతన భారత్‌కు ముఖచిత్రంగా మారారు. కొత్త చరిత్రను లిఖిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)