నెల్లూరు పల్లెలో అంతరిక్ష పరిశోధన... ఒక సైన్స్ టీచర్ ప్రేరణతో విద్యార్థుల ప్రయోగాలు

  • శంకర్ వడిశెట్టి
  • బీబీసీ కోసం
ఖగోళ ప్రయోగశాల

ఆ బాలుడి పేరు టి. తేజ‌. నెల్లూరు జిల్లా సంగం మండ‌లం త‌రుణ‌వాయి గ్రామం జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్‌లో తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు.

త‌ల్లిదండ్రులిద్ద‌రూ వ్య‌వ‌సాయం మీదే ఆధార‌ప‌డ‌తారు. త‌ల్లి కూలి ప‌నుల‌కు వెళుతుంటే, తండ్రి ఉన్న కొద్దిపాటి పొలంలో సాగు చేసి జీవ‌నం సాగిస్తూ ఉంటారు.

అయితే, తేజ తాను శాస్త్ర‌వేత్త కావాల‌ని అనుకుంటున్నాడు. ఖ‌గోళ‌ శాస్త్రంలో పరిశోధనలు చేయాలని ఆకాంక్షిస్తున్నాడు. ఇప్ప‌టికే ఖ‌గోళ‌ ద‌ర్ప‌ణం మీద అవ‌గాహ‌న పెంచుకుంటున్నాడు.

సూర్యుడు, భూమి, చంద్రుడికి సంబంధించిన విష‌యాల‌పై మ‌రింత అవగాహన కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇప్ప‌టికే రాష్ట్ర‌, జాతీయ స్థాయిలో సైన్స్ శిబిరాల‌కు అర్హ‌త సాధించాడు. విశాఖ‌ప‌ట్నం, బెంగ‌ళూరు న‌గ‌రాల్లో రెండుసార్లు సైన్స్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొని ప్ర‌శంస‌లు కూడా పొందాడు.

ఫొటో క్యాప్షన్,

ఖగోళ దర్పణం గురించి వివరిస్తున్న విద్యార్థి తేజ

ఏడో త‌ర‌గ‌తి నుంచే 'అంతరిక్ష ప్ర‌యోగాలు' చేస్తున్న తేజ లాంటి విద్యార్థులు ఇంకా చాలామందే ఉన్నారు ఈ గ్రామంలో. గ‌త ఆరేళ్లుగా ఖగోళశాస్త్రంతో పాటు విజ్ఞానశాస్త్రాలను నేర్చుకుంటూ జాతీయ స్థాయిలో ప్ర‌ద‌ర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

సీతాకోక‌చిలుక‌ల ప్ర‌త్యుత్ప‌త్తి విధానంపై త‌రుణ‌వాయి హైస్కూల్ విద్యార్థులు చేసిన ప్ర‌యోగం జాతీయ కాంగ్రెస్‌లో ప్ర‌ద‌ర్శించ‌డం విశేషం. వారి స్కూల్‌కి స‌మీపంలో ఉన్న క‌నిగిరి రిజ‌ర్వాయ‌ర్‌లో జీవ వైవిధ్యంపై ప‌లు ప్ర‌యోగాలు చేశారు. మొత్తం 13 ర‌కాల ప‌రిశోధ‌న‌లు చేసి వాటిని కూడా జ‌తీయ స్థాయి చిల్డ్ర‌న్స్ సైన్స్ కాంగ్రెస్‌లోనూ, అనంత‌రం జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లోనూ ప్ర‌ద‌ర్శించారు.

ఈ విద్యార్థులంతా త‌మ ప్ర‌యోగాల‌కు అవ‌స‌ర‌మైన మైక్రోస్కోపులు స్వ‌యంగా తామే త‌యారు చేసుకునే స్థాయికి ఎదిగారు. మార్కెట్‌లో ల‌భించే చిన్న చిన్న వ‌స్తువుల స‌హాయంతోనే త‌క్కువ ఖ‌ర్చుతో నాణ్య‌మైన మైక్రోస్కోపులు త‌యారు చేసుకుని ప్ర‌యోగాలు సాగిస్తున్నారు.

అంతేకాకుండా, రాష్ట్ర‌స్థాయిలో ప‌లువురికి ఈ మైక్రోస్కోపుల త‌యారీలో శిక్ష‌ణ కూడా ఇస్తున్నారు. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన శిక్ష‌ణా శిబిరంలో ఈ గ్రామీణ బాల‌ల ప‌రిశోధ‌నా కేంద్రం విద్యార్థులు మైక్రోస్కోపులు ఎలా త‌యారు చేసుకోవాల‌న్న‌ది ప్ర‌ద‌ర్శించి, శిక్ష‌ణ ఇవ్వ‌డం విశేషం.

ఉపాధ్యాయుడు సుబ్ర‌హ్మ‌ణ్యం కృషితో...

అనేక శాస్త్రీయ అంశాల‌లో ప‌రిశోధ‌న‌ల‌కు ఈ విద్యార్థుల్లో చిన్న‌నాటి నుంచే జిజ్ఞాస క‌ల‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం వారి ఉపాధ్యాయుడు నెల్లూరు సుబ్ర‌హ్మ‌ణ్యం అని వీరంతా చెబుతున్నారు. ప్ర‌స్తుతం త‌రుణ‌వాయి హైస్కూల్‌లో సుబ్ర‌హ్మ‌ణ్యం జీవ‌శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఉన్నారు.

సామాజిక‌, శాస్త్రీయ అంశాల‌పై మక్కువ‌తో ప‌లు ప్ర‌యోగాల‌కు శ్రీకారం చుట్టారు. నేటి బాల‌లే రేప‌టి శాస్త్ర‌వేత్త‌లుగా భావించే ఆయ‌న కృషి ఫలితంగా సంగం మండ‌లం నుంచి ఇప్ప‌టికే 10 మంది విద్యార్థులు జాతీయ స్థాయి సైన్స్ పోటీల‌కు హాజ‌రై త‌మ ప్ర‌యోగాల‌ను ప్ర‌ద‌ర్శించారు.

ఆయ‌న‌ త‌న స్వ‌గ్రామం గాంధీజ‌న సంఘంలో డాక్ట‌ర్ ఎ.పి.జె.అబ్దుల్ క‌లామ్ గ్రామీణ బాల‌ల ప‌రిశోధ‌నా కేంద్రం ఏర్పాటు చేసి ఈ ప్ర‌యోగాల‌కు శ్రీకారం చుట్టారు. ఓ పాఠ‌శాల ఉపాధ్యాయుడిగా ఉండి, త‌న విధులు నిర్వ‌హిస్తూనే చిన్నారుల్లో శాస్త్రీయ దృక్ప‌థం పెంపొందించే ప‌నిలో సాగుతున్నారు.

ఓ వైపు పాఠ్య‌పుస్త‌కాల ర‌చ‌యిత‌గా ఉన్న‌త పాఠ‌శాల‌ల జీవ‌శాస్త్రం పాఠ్యాంశాల రూప‌క‌ల్ప‌న‌లో ఆయ‌న కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. మ‌రోవైపు ఖ‌గోళ‌శాస్త్రం మీద ఉన్న ఆస‌క్తితో త‌న ఇంటినే ఓ ప్ర‌యోగశాల‌గా మార్చేశారు. అంత‌రిక్ష ప్ర‌యోగాల‌కు పిల్ల‌ల‌కు త‌ర్ఫీదునిస్తున్నారు.

‘‘త్వ‌ర‌లో ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌ల‌ను త‌యారు చేస్తాం...’’

చిన్న‌నాటి నుంచే ప్ర‌యోగాల‌కు పురిగొల్ప‌డం మూలంగా పిల్ల‌ల్లో ఆస‌క్తి పెరుగుతుందని, మ‌రిన్ని ప్ర‌యోగాల‌కు ప్రేరణనిస్తుందని సుబ్ర‌హ్మ‌ణ్యం అంటున్నారు.

''ఆయ‌న త‌న పరిశోధనా కేంద్రం గురించి బీబీసీతో మాట్లాడుతూ, "నేను సామాన్య విద్యార్థిగా చదువుకుని ఉపాధ్యాయ వృత్తిలోకి వ‌చ్చాను. ఇప్పుడు పిల్ల‌ల్లో అవ‌గాహ‌న స్థాయి బాగా పెరిగింది. వారిని ప్రోత్స‌హిస్తే గ్రామీణ స్థాయిలో కూడా నాణ్య‌మైన శాస్త్ర‌వేత్త‌లు త‌యార‌వుతారు. అందుకే మేమ గ్రామీణ బాల‌లతో ఈ పరిశోధ‌నా కేంద్రం ఏర్పాటు చేశాం'' అని ఆయన పేర్కొన్నారు.

ఇందుకోసం ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు అయినా వెన‌కాడ‌కుండా కృషి చేస్తున్నామని, తమ కృషి ఫలిస్తోందని చెప్పారు.

''ఇప్ప‌టికే మేం చేసిన ప్ర‌యోగాలు జాతీయ‌స్థాయిలో గుర్తింపు పొందాయి. పిల్ల‌ల్లో మ‌రింత ముందుకు వెళ్లాల‌నే ఆలోచ‌న పెరుగుతోంది. త్వ‌ర‌లోనే మా ప‌రిశోధ‌నా కేంద్రం నుంచి మంచి శాస్త్ర‌వేత్త‌ల‌ను త‌యారు చేయ‌గ‌ల‌మ‌ని న‌మ్ముతున్నాం. ఖ‌గోళ ద‌ర్ప‌ణం వంటి ప‌రిక‌రాల‌ను స‌మ‌కూర్చుకున్నాం. రాష్ట్రంలోని అనేక పాఠ‌శాల‌లు, యూనివ‌ర్సిటీల నుంచి కూడా మా కేంద్రానికి వ‌చ్చి ప‌రిశీలిస్తున్నారు. అంద‌రికీ స్ఫూర్తిదాయ‌కంగా నిలిచేలా మా కేంద్రం రూపుదిద్దుకుంటోంది" అంటూ ఆయన వివ‌రించారు.

''అమ్మా, నాన్న పొలాల్లో ఉంటారు... నేను ప్ర‌యోగాలు చేసి ఢిల్లీ వెళ్ళా''

శాస్త్రీయ ప‌రిశోధ‌నా రంగంలో రాణించ‌డ‌మే త‌న ల‌క్ష్యం అంటున్నాడు ఈ కేంద్రంలో శిక్ష‌ణ పొందిన జి. భార్గ‌వ్. ప్ర‌స్తుతం ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దువుతున్న భార్గ‌వ్ హైస్కూల్ స్థాయిలోనే రెండు సార్లు జాతీయ స్థాయి సైన్స్ కాంగ్రెస్‌కి హాజ‌ర‌య్యాడు.

అందుకు సుబ్ర‌హ్మ‌ణ్యం మాస్టారు అందిస్తున్న ప్రోత్స‌హమే కారణమని చెప్పాడు. అతడు బీబీసీతో మాట్లాడుతూ.. "జాతీయ స్థాయి పోటీల‌కు వెళ్లిన‌ప్పుడు మొదట భ‌యం వేసింది. ఓ చిన్న గ్రామం నుంచి అంత‌స్థాయికి హైస్కూల్ విద్యార్థిగా అడుగుపెట్టిన‌ప్పుడు కంగారుపడ్డాను. మా ప్ర‌యోగాల‌కు అక్క‌డ మంచి పేరు వ‌చ్చింది. అనేక‌మంది ప్రోత్స‌హించారు. ఆ స్ఫూర్తితోనే భ‌విష్య‌త్ లో సైంటిస్ట్ కావాల‌ని అనుకుంటున్నాను'' అని వివ‌రించాడు.

ప్ర‌కృతి నుంచి నేర్చుకుంటూ... ప్ర‌కృతి గురించి నేర్పుతూ!

ఉపాధ్యాయుడంటే కేవ‌లం పాఠాల‌కే ప‌రిమితం కాకుండా పిల్ల‌ల‌కు ప్ర‌పంచం గురించి అర్థ‌మ‌య్యేలా వివ‌రించ‌డం అవ‌స‌ర‌మ‌ని స్థానికుడు ఎం.వి.చ‌ల‌ప‌తి అభిప్రాయ‌ప‌డ్డారు. గ్రామీణ బాల‌ల ప‌రిశోధ‌నా కేంద్రం ప్ర‌య‌త్నాన్ని ఆయ‌న అభినందించారు.

ఆయన హైస్కూల్ విద్యార్థులు చేస్తున్న ప్ర‌యోగాల‌పై త‌న అభిప్రాయాన్ని బీబీసీతో పంచుకున్నారు. ''మారుమూల గ్రామాల నుంచి జాతీయ స్థాయికి ప్ర‌తి ఏటా ప‌లువురు విద్యార్థులు వెళుతుండ‌డం చిన్న విష‌యం కాదు. దానికి చాలా కృషి చేస్తున్న ఉపాధ్యాయుడిని అంద‌రూ అభినందించాలి. ప్ర‌కృతికి సంబంధించిన అనేక అంశాల‌ను కేవ‌లం పాఠ్య‌పుస్త‌కాల్లో బోధ‌న‌తో స‌రిపెట్ట‌కుండా పిల్ల‌ల‌ను ప్ర‌కృతిలో భాగ‌స్వాముల‌ను చేస్తే అనేక ప్ర‌యోజ‌నాలుంటాయి. అందుకు ఈ కేంద్రం చేస్తున్న ప్ర‌యోగాలే నిదర్శనం. ప్ర‌కృతి గురించి నేర్ప‌డం, ప్రకృతిలో నేర్ప‌డం ద్వారానే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌న‌డానికి ఇదో ఉదాహ‌ర‌ణ‌. ఇలాంటి ప్ర‌య‌త్నాలు అన్ని చోట్లా జ‌ర‌గాలి'' అని చెప్పారు.

గాంధీ జ‌న‌సంఘం గ్రామం ఇప్ప‌టికే ఓసారి జాతీయ‌స్థాయిలో కీర్తి గ‌డించింది. ప‌ర్వాత‌రోహ‌కుడు మ‌ల్లి మ‌స్తాన్ బాబు స్వ‌గ్రామం కావ‌డంతో ప‌లువ‌రి దృష్టిలో ప‌డింది. ఇప్పుడు మ‌రోసారి సైన్స్ ప్ర‌యోగాల‌తో జాతీయ గుర్తింపు అర్జిస్తోంది. దానికి అనుగుణంగా కొంద‌రు అధికారులు కూడా ఈ ప్ర‌య‌త్నాల‌కు స‌హ‌క‌రిస్తున్న‌ట్టు సుబ్ర‌హ్మ‌ణ్యం తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)