డయానా నుంచి ట్రంప్ వరకు: తాజ్‌‌మహల్‌ను సందర్శించిన విదేశీ ప్రముఖుల ఫొటోలు ఇవీ

1992 ఫిబ్రవరిలో తాజ్‌మహల్‌ను సందర్శించిన ప్రిన్సెస్ డయానా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

1992 ఫిబ్రవరిలో తాజ్‌మహల్‌ను సందర్శించిన ప్రిన్సెస్ డయానా

భారత్‌ వచ్చే విదేశీ ప్రముఖుల పర్యటన ప్రణాళికలో తరచూ ప్రధానంగా కనిపించేది- తాజ్‌మహల్ సందర్శన.

భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా సోమవారం దీనిని సందర్శించారు. తాజ్‌మహల్ సంభ్రమాశ్చర్యాన్ని కలిగిస్తుందని, సుసంపన్నమైన, వైవిధ్యభరితమైన భారత సాంస్కృతిక సౌందర్యానికి ఇది ప్రతీక అని ఆయన సందర్శకుల పుస్తకంలో రాశారు.

ప్రిన్సెస్ డయానా 1992 ఫిబ్రవరిలో తాజ్‌మహల్‌ను సందర్శించారు. దౌత్యపరమైన కార్యకలాపాల విషయమై ప్రిన్సెస్ చార్లెస్ ఆగ్రాలోనే మరో చోట ఉండిపోగా, తాజ్‌మహల్ ముందున్న పాలరాతి బల్లపై డయానా ఒంటరిగానే ఫొటో దిగారు.

తాజ్‌మహల్ సందర్శన మనోహరమైన అనుభూతిని కలిగిస్తోందని, సాంత్వన ఇస్తోందని అక్కడి నుంచి వెళ్లిపోయే సందర్భంలో మీడియా ప్రతినిధులతో డయానా వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సోమవారం తాజ్‌మహల్‌ను సందర్శించిన ట్రంప్, ఆయన భార్య మెలానియా

అప్పట్లో డయానా తన వైవాహిక జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారని, ఈ చిత్రం దానికి అద్దం పడుతోందని చెబుతారు.

తాజ్‌మహల్ వద్ద గైడ్లు ఈ బల్లను చూపించి 'డయానా బెంచ్' అని సందర్శకులకు చెబుతుంటారు.

ఈ ప్రసిద్ధ పాలరాతి కట్టడం వద్ద విదేశీ ప్రముఖులు దిగిన ఫొటోలు ఇవీ...

2016లో విలియం-కేట్ మిడిల్టన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

2016 ఏప్రిల్ 16న తాజ్‌మహల్‌ను సందర్శించిన డయానా కుమారుడు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్

డయానా సందర్శించిన తర్వాత దాదాపు పాతికేళ్లకు 2016లో ఏప్రిల్ 16న ఆమె కుమారుడు 'డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జ్' ప్రిన్స్ విలియం, తన భార్య కేట్ మిడిల్టన్‌తో కలిసి ఈ నిర్మాణాన్ని సందర్శించారు.

విలియం దంపతులు 'డయానా బల్ల'పై కూర్చుని ఫొటో దిగారు.

2015లో 'ఫేస్‌బుక్' జుకర్‌బర్గ్

ఫొటో సోర్స్, Facebook/Mark Zuckerberg

ఫొటో క్యాప్షన్,

2015 అక్టోబర్లో తాజ్‌మహల్‌ను సందర్శించిన జుకర్‌బర్గ్

సోషల్ మీడియా దిగ్గజం 'ఫేస్‌బుక్' వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ 2015‌లో తాజ్‌మహల్‌ను సందర్శించారు.

ఈ నిర్మాణాన్ని చూడాలని తాను ఎప్పుడూ అనుకొనేవాడినని అప్పట్లో ఆగ్రా నుంచి ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టులో జుకర్‌బర్గ్ తెలిపారు.

తాజ్‌మహల్ తాను అనుకొన్నదాని కన్నా ఎక్కువ అద్భుతంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మనుషులు ఎంత గొప్ప నిర్మాణాలు చేయగలరో, ప్రేమ ఎంతటి ప్రేరణ ఇస్తుందో ఈ కట్టడం సూచిస్తుందని చెప్పారు. 17వ శతాబ్దం నాటి ఈ కట్టడాన్నిమొగల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ స్మృత్యర్థం నిర్మించారు.

2015లో తాజ్‌మహల్‌ను 46 లక్షల మంది సందర్శించారు.

2001లో పర్వేజ్ ముషారఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

2001 జులైలో ముషారఫ్, సెభా

2001 జులైలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో ద్వైపాక్షిక చర్చల నిమిత్తం భారత్‌కు వచ్చిన నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్, భార్య సెభాతో కలిసి తాజ్‌మహల్‌ను సందర్శించారు.

భారత్-పాకిస్తాన్ శిఖరాగ్ర సదస్సు సానుకూలంగానే మొదలైనప్పటికీ విజయవంతం కాలేదు.

కోల్‌కతా టెస్టులో ఓడినా..

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఆస్ట్రేలియా క్రికెటర్లు గ్లెన్ మెక్‌గ్రాత్, జస్టిన్ లాంగర్, మాథ్యూ హేడెన్, కోలిన్ మిల్లర్, మైకేల్ స్లేటర్ (.. (ఎడమ నుంచి కుడికి)

2001లో భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ అసాధారణ పోరాటపటిమతో భారత్ ఘన విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతి గొప్ప విజయాల్లో ఇది ఒకటి.

తొలుత ఆస్ట్రేలియా విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. అలాంటి స్థితిలో భారత్ పోరాడి 171 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. వరుసగా 16 మ్యాచులు గెలిచిన ఆస్ట్రేలియా జైత్రయాత్రకు అడ్డుకట్ట వేసింది.

తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లు తాజ్‌మహల్‌ను సందర్శించారు.

1966లో 'ద బీటిల్స్' జార్జ్ హ్యారిసన్

ఫొటో సోర్స్, Harrison Family/PA

ఫొటో క్యాప్షన్,

1966లో తాజ్‌మహల్ వద్ద ఫొటో తీసుకున్న జార్జ్ హ్యారిసన్

ప్రఖ్యాత రాక్ బ్యాండ్ 'ద బీటిల్స్'‌ లీడ్ గిటారిస్ట్ జార్జ్ హ్యారిసన్ 1966లో తాజ్‌మహల్‌ను సందర్శించారు.

అప్పుడు ఆయనకు 23 ఏళ్లు. హ్యారిసన్ అక్కడ ఇలా తన ఫొటో తానే తీసుకున్నారు.

2000లో పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

2000 అక్టోబర్లో పుతిన్, ల్యూడ్మిలా

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2000 అక్టోబర్లో భార్య ల్యూడ్మిలాతో కలిసి తాజ్‌మహల్‌ను సందర్శించారు.

30 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2013లో వీరు విడిపోయారు.

నాటి పుతిన్ పర్యటనను భారత్-రష్యా సంబంధాల్లో చరిత్రాత్మకమైనదిగా చెబుతారు.

భారత పర్యటనలో ఆయన భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్య ప్రకటనపై సంతకాలు చేశారు.

1959లో ఐసెన్‌హోవర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఐసెన్ హోవర్, ఆయన కోడలు బార్బరా, నెహ్రూ

భారత్‌ వచ్చిన అమెరికా అధ్యక్షుల్లో మొదటివారైన ఐసెన్ హోవర్ 1959 డిసెంబరులో తాజ్‌మహల్‌ను సందర్శించారు. అప్పుడు ఆయన వెంట భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఉన్నారు.

ఐసెన్‌హోవర్ భారత మదిని దోచుకొన్నారని నెహ్రూ అప్పట్లో వ్యాఖ్యానించారు.

హోవర్ తాజ్‌మహల్‌ వద్దకు వెళ్తుండగా, ఆగ్రా వీధుల్లో ప్రజలు నీరాజనాలు పట్టారు. సోమవారం ట్రంప్ వెళ్తుంటే ఆగ్రాలో పెద్దయెత్తున ఆంక్షలు విధించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)