డోనల్డ్ ట్రంప్: మోదీ ప్రభుత్వ విజయాలపై అహ్మదాబాద్‌లో ట్రంప్ చెప్పినవన్నీ నిజాలేనా? - బీబీసీ రియాల్టీ చెక్

  • రియాల్టీ చెక్ బృందం
  • బీబీసీ న్యూస్
నమస్తే ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ట్రంప్ ప్రస్తావించిన మోదీ పరిపాలనా విజయాలపై బీబీసీ రియాల్టీ చెక్

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో లక్షకు పైగా హాజరైన జనాల్ని ఉద్ధేశించి ప్రసంగించారు. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తల్లో ముంచెత్తారు. అంతే కాదు.. దేశాభివృద్ధిలో భాగంగా ఆయన తీసుకొచ్చిన పాలనా పరమైన విధానాలను హైలెట్ చేస్తూ మాట్లాడారు.

అలా ట్రంప్ హైలెట్ చేసిన విధానాలేంటో... అందులో నిజా నిజాలు ఎంతో ఓ సారి చూద్దాం.

Claim 1: భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్:

"ఈ శతాబ్దం ఆరంభం నుంచి ఇప్పటి వరకు భారత ఆర్థిక వ్యవస్థ ఆరు రెట్లు పెరిగింది."

నిజా నిజాలు:

"దేశ స్థూల జాతీయోత్పత్తి ( జీడీపీ) ప్రకారం చూస్తే ట్రంప్ చెప్పింది వాస్తవం. ఇంటర్నేషనల్ మానటరీ ఫండ్ లెక్కల ప్రకారం 2000 సంవత్సరం నాటికి భారత జీడీపీ 47వేల700 కోట్ల డాలర్లు. 2019 ఆర్థిక సంవత్సరం నాటికి చూస్తే జీడీపీ 2లక్షల94వేల కోట్ల డాలర్లకు చేరింది. గడిచిన రెండు దశాబ్దాలలో భారత ఆర్థిక వ్యవస్థ సుమారు 6.2 రెట్లు పెరిగింది.

గతంలో ప్రధాని మోదీ భారత తయారీ రంగాన్ని మరింత విస్తృతం చేస్తానని చేసిన ప్రతిజ్ఞ ఎంత వరకు నెరవేరిందన్న విషయంలోనూ గతంలో రియాల్టీ చెక్ అందించిన కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చెయ్యండి.

అలాగే భారత్ 2019 నాటికి ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందంటూ ప్రకటించిన ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనమిక్ ఔట్ లుక్ అందించిన గణాంకాలను ఈ కింద చూడొచ్చు.

ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు. జీడీపీ (US$ trillions).  .

Claim 2: పేదరికంపై ట్రంప్:

" కేవలం ఒక దశాబ్ద కాలంలోనే భారత్‌లోని సుమారు 2 కోట్ల 70లక్షల మందిని పేదరికం నుంచి విముక్తి కల్గింది."

నిజా నిజాలు:

2018లో ఐక్యరాజ్య సమితి అందించిన నివేదిక మేరకు పదేళ్ల క్రితంతో పోల్చితే దేశంలో సుమారు 2 కోట్ల 71లక్షల మంది యూఎన్ పేదరిక సూచి 2016 నిర్ధేశించిన ప్రమాణాలకన్నా దిగువన ఉన్నారు.

పేదరికాన్ని తగ్గించడం మాట అటుంచి ఇప్పటికీ సుమారు 3 కోట్ల 64 లక్షల మంది భారతీయులు ఆరోగ్యం, పోషక విలువలతో కూడిన ఆహారం, విద్య,పారిశుధ్య లేమితో బాధపడుతున్నారని అదే నివేదిక పేర్కొంది.

అంతే కాదు అలా పేదరికంలో మగ్గిపోతున్న వారిలో నాల్గోవంతు పదేళ్ల లోపు వారేనని కూడా స్పష్టం చేసింది.

ఈ లింక్‌ను క్లిక్ చెయ్యడం ద్వారా యూఎన్ నివేదికను చూడొచ్చు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

భారత్‌లో ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం

Claim 3: విద్యుత్ సౌకర్యంపై ట్రంప్:

"మోదీ నేతృత్వంలో మొదటిసారిగా దేశంలో ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది."

నిజా నిజాలు:

దేశంలో ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలన్న తమ లక్ష్యాన్ని చేరుకున్నామంటూ 2018లో భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వ లెక్కల ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించడం అన్న వాక్యానికి అసలు అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి.

ఏ గ్రామంలోనైనా కనీసం 10% ఇళ్లకు పూర్తి స్థాయిలో విద్యుత్ సౌకర్యం ఉండాలి. అలాగే బహిరంగ ప్రదేశాలైన పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు గ్రిడ్‌తో అనుసంధానమై ఉంటే ఆగ్రామానికి పూర్తిగా విద్యుత్ సౌకర్యం సమకూరినట్టేనన్నది సర్కారీ లెక్క.

అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తే 2014లో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికే దేశంలోని 6 లక్షల గ్రామాల్లో 96 శాతం గ్రామాలకు పూర్తి స్థాయిలో విద్యుత్ సదుపాయ ఉంది. గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలోనే బీబీసీ రియాల్టీ చెక్ ఈ విషయంలో పూర్తి స్థాయిలో పరిశీలించింది. ఆ కథనాన్ని ఈ కింది లింక్‌ను క్లిక్ చెయ్యడం ద్వారా చూడొచ్చు.

Claim 4: జాతీయ రహదారులపై ట్రంప్:

"రెట్టింపు వేగంతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది."

నిజా నిజాలు:

ఇది నిజం. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ రహదారుల నిర్మాణంలో వేగం చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది.

2018-19 మధ్య కాలంలో మోదీ ప్రభుత్వం సుమారు 10వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను కొత్తగా నిర్మించింది. ఇదే 2013-14 మధ్య కాలంలో నాటి యూపీఏ ప్రభుత్వ హయాంతో పోల్చితే రెట్టింపు కన్నా ఎక్కువ.

భారత్‌లో జాతీయ రహదారులు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో  పూర్తయిన రోడ్లు(కిలోమీటర్లలో). Bar chart of total length of national highway built annually .

ప్రభుత్వం ఈ ఏడాది కూడా అంతే లక్ష్యాన్ని నిర్ధేశించుకోగా 2019 నవంబర్ నాటికి 5,958 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. రోడ్ల నిర్మాణంలో బీజేపీ రికార్డులకు సంబంధించిన రియాల్టీ చెక్ కథనాన్ని ఈ లింక్‌ను క్లిక్ చెయ్యడం ద్వారా చూడొచ్చు.

Claim 5: ఇంటెర్నెట్ సౌకర్యంపై ట్రంప్

"3 కోట్ల 20 లక్షల మందికి పైగా భారతీయులకు ప్రస్తుతం ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. "

నిజా నిజాలు:

ఇంటర్నెట్ అందుబాటులో ఉండటం అంటే ఏంటన్న విషయంలో ఇక్కడ పూర్తి స్థాయిలో స్పష్టత లేదు. టెలీకాం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం దేశంలో ప్రస్తుతం 6 కోట్ల మందికి పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. అలాంటిది ట్రంప్ కేవలం 3 కోట్ల 20 లక్షల మంది అని ప్రస్తావించడం కాస్త ఆశ్చర్యాన్ని కల్గించే విషయం.

ఇండియాలో బ్రాడ్‌ బ్యాండ్ వినియోగదారులు. .  .

నిజానికి గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే నగరవాసులకు ఇంటర్నెట్ మరింత అందుబాటులో ఉంటోంది. అలాగే ఇంటర్నెట్ వినియోగం విషయానికొస్తే స్త్రీ-పురుషుల మధ్య తారతమ్యం కూడా కనిపిస్తుంది. 2019లో జరిగిన అధ్యయనం ప్రకారం ఇంటర్నెట్ వినియోగదారుల్లో పురుషులతో పోల్చితే స్త్రీల సంఖ్య 50 శాతం తక్కువ.

గ్రామీణ ప్రాంతాలను ఇంటర్నెట్‌తో అనుసంధానించాలన్న ప్రతిష్టాత్మ ప్రాజెక్టు ఆరంభంలో పరుగులు పెట్టిన లక్ష్యాన్ని మాత్రం ఎలాంటి ఆపసోపాలు పడిందో గత ఎన్నికల సమయంలోనే బీబీసీ రియాల్టీ చెక్ అందించిన సమగ్ర కథనాన్ని ఈ లింక్‌ను క్లిక్ చెయ్యడం ద్వారా చూడొచ్చు.

Claim 6: పారిశుధ్య సౌకర్యంపై ట్రంప్

"60 కోట్ల మందికి కనీస పారిశుధ్య సౌకర్యం అందుబాటులోకి వచ్చింది."

నిజా నిజాలు:

2014లో మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద కనీస పారిశుధ్య సౌకర్యం లేని వారికి ప్రభుత్వం మరుగుదొడ్లు నిర్మించింది. తాగునీరు, పారిశుధ్య విభాగం తాజా గణాంకాల ప్రకారం సుమారు పది కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది.

అయితే ఈ 60 కోట్ల మందికి కనీస పారిశుధ్య సౌకర్యం అందుబాటులోకి వచ్చిందా లేదా అన్న విషయాన్ని మేం చెప్పలేకపోయినప్పటికీ దాదాపు ప్రతి మరగుదొడ్డిని ఒకరు కంటే ఎక్కువ మంది వినియోగిస్తూ ఉండవచ్చు.

2018 ఏప్రిల్‌లో బహిరంగ మల విసర్జన రహితంగా దేశం మారిందని ప్రధాని ప్రకటించారు.

బహిరంగ మల విసర్జన ఎలా తగ్గుతూ వచ్చిందన్న రియాల్టీ చెక్ కథనాన్ని... ఈ లింక్‌లో మీరు చూడొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

భారత్‌లో పెరిగిన వంట గ్యాస్ వినియోగం

Claim 7: వంట గ్యాస్‌పై ట్రంప్ వ్యాఖ్యలు

" 7 కోట్ల గృహాలకు వంట గ్యాస్ అందుబాటులోకి వచ్చింది."

నిజా నిజాలు:

2016లో మోదీ ప్రారంభించిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద పేదలకు వంట గ్యాస్‌ను అందించారు.

ఈ పథకం కింద అల్పాదాయవర్గాలకు 5 కోట్ల ఏల్పీజీ కనెక్షన్లు అందించడంతో పాటు అదనంగా మూడేళ్ల పాటు సబ్సిడీ సిలెండర్లను కూడా ఇచ్చారు.

కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువుల శాఖ వెబ్‌సైట్ ప్రకారం ప్రభుత్వం తన లక్ష్యాన్ని చేరుకుంది. అంతే కాదు గత ఏడాది సెప్టెంబర్ నాటికి ఆ కనెక్షన్లు 8 కోట్లకు చేరుకున్నాయని వెబ్ సైట్ చెబుతోంది.

గత ఎన్నికల నాటికి ఈ పథకం ఎంత వరకు విజయం సాధించిందన్న రియాల్టీ చెక్ కథనాన్ని ఈ లింక్ ‌లో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)