దిల్లీ హింస: సీఏఏ అనుకూల, వ్యతిరేక నిరసనలతో రాత్రంతా భయం గుప్పిట్లో...

  • వినాయక్ గైక్వాడ్
  • బీబీసీ ప్రతినిధి
సీఏఏ వ్యతిరేక నిరసలు

సీఏఏ ప్రతికూల, అనుకూలవాదుల మధ్య తూర్పు దిల్లీలో తలెత్తిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఈ గొడవల్లో ఒక పోలీస్ సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈశాన్య దిల్లీ ప్రాంతాల్లో రాత్రంతా ఉద్రిక్తంగానే ఉంది. ప్రజలు తీవ్ర భయాందోళనల నడుమ రోడ్లపైనే గడిపారు. దిల్లీ రోడ్లపై సోమవారం రాత్రి మేం చూసిన పరిస్థితి ఇది.

రోజంతా జరిగిన హింసాత్మక ఘర్షణల కారణంగా ఈశాన్య దిల్లీలోని చాంద్‌బాగ్, భజన్‌పుర, బ్రిజ్‌పురి, గోకుల్‌పురి, జాఫ్రాబాద్ ప్రాంతాల్లో రాత్రంతా తీవ్ర అభద్రత, భయం రాజ్యమేలాయి.

ఈ పరిస్థితుల మధ్య నేను ఓల్డ్ బ్రిజ్‌పురికి చెందిన సర్ఫరాజ్ అలీ అనే వ్యక్తిని కలిశాను. తన అంకుల్ అంత్యక్రియలకు వెళ్లి రాత్రి తన తండ్రితో కలిసి వస్తుండగా కొందరు చుట్టు ముట్టి తమను వేధించారని ఆయన ఆరోపించారు.

"వాళ్లు ముందు నా పేరు అడిగారు. మొదట్లో నేను నా పేరు మార్చి చెప్పడానికి ప్రయత్నించాను. కానీ తర్వాత వాళ్లు నా ప్యాంట్ విప్పమన్నారు. దాంతో నేను నా పేరు సర్ఫరాజ్ అని చెప్పాను. వెంటనే నన్ను తీవ్రంగా కొట్టి మంటల్లో పడేశారు."

ఓల్డ్ బ్రిజ్‌పురిలోని ఓ అంబులెన్స్‌లో బెడ్‌పై ఉండగా ఆయన నాతో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇంటి దగ్గర గర్భవతిగా ఉన్న తన భార్యను చూసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. బైక్‌పై వస్తూ గోకుల్‌పురి వద్ద ఓ వంతెనను దాటుతుండగా ఓ గుంపు వారిని అడ్డగించిందని... అక్కడ చాలా మంది జనం ఉన్నారని వాళ్లందరి గుర్తింపు కార్డులను కూడా వాళ్లు చెక్ చేస్తున్నారని సర్ఫరాజ్ నాతో చెప్పారు.

హసన్, సత్య ప్రకాశ్‌లు ఇద్దరూ దిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అంబులెన్స్‌లో పని చేస్తున్నారు. సర్ఫరాజ్ అనే వ్యక్తిని వెంటనే జీటీబీ ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ ఓల్డ్ బ్రి‌జ్‌పురిలోని మెహర్ ఆస్పత్రి నుంచి తనకు ఫోన్ వచ్చిందని హసన్ చెప్పారు.

"నిజానికి నేను ఆ ప్రాంతానికి వెళ్లేందుకు భయపడ్డాను. అందుకే పేషెంట్‌ను మెయిన్ రోడ్‌ను దాటి వచ్చేయాలని కోరాను. అప్పుడు సర్ఫరాజ్ సోదరుడు సహా మరి కొంతమంది ఆయన్ను బయటకు తీసుకొచ్చారు" అని హసన్ బీబీసీతో చెప్పారు.

ఉదయం కూడా సీలంపూర్‌లోని సుభాష్ మొహల్లా నుంచి ఓ వ్యక్తి తాను బుల్లెట్ గాయంతో ఉన్నానంటూ తనకు ఫోన్ చేశారని చెప్పారు.

"ఆయన్ను మేం ఆస్పత్రికి తీసుకెళ్తున్నాం. నేను పేషెంట్‌తో కలిసి వెనక ఉన్నాను. అప్పటికే ఆయనకు రక్తం కారుతోంది. సత్య ప్రకాశ్ కొన్ని మీటర్ల దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లగానే ఒ గుంపు అడ్డుకుంది. ఓ రాడ్‌తో బానెట్‌పై కొట్టారు. ముందు అద్దాన్ని పగులగొట్టారు. అది అంబులెన్స్ అన్న విషయాన్ని కూడా వాళ్లు ఆలోచించలేదు. ఇది దిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అంబులెన్స్. మాకు హిందు.. ముస్లిం అన్న భేదం లేదు. కానీ జనం ఆ విషయాన్ని ఆలోచించడం లేదు" అని హసన్ చెప్పారు.

చాంద్‌బాగ్, భజన్‌పుర, మౌజ్‌పూర్, జాఫ్రాబాద్ ప్రాంతాల్లో హింసాత్మక ఆందోళనలు రోజంతా కొనసాగాయి. ఓల్డ్ ముస్తఫాబాద్‌లోని ఓ బాధితుని ఇంటికి వెళ్లేందుకు మేం బయల్దేరాం. కానీ రాత్రి ఆయన ఇంటికి వెళ్లే దారులన్నీ బారికేడ్లతో మూసేశారు.

ఇక కొన్ని రోజులుగా సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న జాఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్ సమీపంలో పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంది. వందలాది మంది పురుషులు, మహిళలు అక్కడే ఉంటూ తమ ఆందోళనల్ని కొనసాగిస్తున్నారు. చాంద్‌బాగ్ ప్రాంతంలో కొందరు వ్యక్తులు సీఏఏకు అనుకూలంగా నినాదాలు చేస్తూ జై శ్రీరామ్ స్లోగన్లు చెబుతుండటాన్ని మేం చూశాం. బారికేడ్లకు అవతల సీఏఏకు వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతుండగా ఇవతల పోలీసులతో కలిసి వాళ్లు ఉన్నారు.

ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో పోలీసులున్నారు. ఓల్డ్ బ్రిజ్‌పురిలో ప్రజలు బృందాలుగా ఏర్పడి బ్యాటన్లు, మెటల్ రాడ్లతో గస్తీ కాయడం కనిపించింది. యువకులు, మహిళలు కూడా కర్రలు పట్టుకుని తిరగడం కనిపించింది.

ఈ ప్రాంతంలో నివసించే మనోజ్ (పేరు మార్చాం) అనే వ్యక్తిని మేం కలిశాం. ఘర్షణలు జరిగినప్పుడు తాను అక్కడే ఉన్నానని ఆయన చెప్పారు. "నిరసనలు మొదట శాంతియుతంగానే మొదలయ్యాయి, కానీ ఉన్నట్లుండి రాళ్లు రువ్వడం మొదలైంది. పోలీసుల సంఖ్యతో పోలిస్తే సీఏఏ వ్యతిరేక నిరసనకారులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. తమకు సాయం చేయాలని స్థానికులను పోలీసులు కోరారు. దీంతో అక్కడున్న కొందరు పోలీసులకు సాయం చేయడానికి సిద్ధమయ్యారు" అని మనోజ్ తెలిపారు. ఇలా ఆయన వివరిస్తుండగానే మాకు కొద్ది దూరంలో ఉన్న ఓ వాహనానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మేం మాకు సమీపంలో ఉన్న కొందరితో మాట్లాడేందుకు ప్రయత్నించినా వారు నిరాకరించారు.

ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశారు. ముఖ్యమైన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బృందాలను మోహరించారు. రాత్రి ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదని, పరిస్థితి అదుపులోనే ఉందని వారు తెలిపారు.

షహీన్ బాగ్ నిరసనల మాదిరిగానే జాఫ్రాబాద్‌లో మహిళలు కూడా వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఆదివారం, సోమవారం జరిగిన ఘర్షణల కారణంగా జాఫ్రాబాద్‌లో పోలీసుల సంఖ్యను పెంచారు. వీధుల్లో పెద్ద సంఖ్యలో నిరసనకారులు చేరుతున్నారు. పురుషులు, మహిళలు రాత్రి కూడా నిరసన వేదిక వద్దే ఉన్నారు.

"మేం శాంతియుతంగా నిరసన చేస్తున్నాం. మేం శాంతినే కోరుకుంటున్నాం. హింసను ఎవరూ కోరుకోరు. సోమవారం జరిగిన ఘర్షణలతో ప్రజలంతా భయంతో బతుకుతున్నారు. కానీ మేం వెనక్కి వెళ్లాలని అనుకోవట్లేదు. మేమంతా ఐక్యంగా ఉన్నాం. మేం ప్రజాస్వామ్యయుతంగా మా నిరసన కొనసాగిస్తాం. ఎందుకంటే మాకు భారతీయత అనే భావనపై నమ్మకం ఉంది. భారత్ మా దేశం, మేమంతా భారతీయులం. ప్రభుత్వం మా ఆవేదనను వినాలి. వారాలు, నెలలపాటు రోడ్లపై కూర్చోవాలని ఎవరు కోరుకుంటారు?" అని ఓ నిరసనకారుడు బీబీసీతే అన్నారు.

రాత్రి గడిచేసరికి, కొందరు అక్కడి నుంచి వెళ్లిపోగా, మిగిలినవారు అక్కడే కూర్చుని తమ నిరసన కొనసాగిస్తున్నారు. రాళ్లు, కర్రలు, దగ్ధమైన వాహనాలు రోడ్లపై అలానే ఉన్నాయి. పోలీసులు, స్థానిక అధికారులు స్థానికుల సాయంతో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తూ ఎలా ఉంటుందో తెలియని మరో రోజుకు సిద్ధమవుతున్నారు.

జాఫ్రాబాద్ సమీపంలోని మౌజ్‌పూర్‌లో శనివారం రాత్రి నుంచి సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. అయితే, దిల్లీ బీజేపీ నేత కపిల్ మిశ్రా మౌజ్‌పూర్‌లో సీఏఏ అనుకూల ర్యాలీ నిర్వహించడంతో మౌజ్‌పూర్, ఈశాన్య దిల్లీలోని కొన్ని ప్రాంతాలు హింసాత్మకంగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ ప్రాంతంలోని రోడ్లను ఖాళీ చేయించాలని, లేదంటే తామంతా రోడ్లపైకి వస్తామని ఆ ర్యాలీలో ఆయన పోలీసులకు ఓ అల్టిమేటం జారీ చేశారు.

శాంతియుతంగా ఉండాలని పోలీసులు, అనేక మంది రాజకీయ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని నెలలుగా భారత దేశవ్యాప్తంగా సీఏఏ వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయి. కానీ, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారత పర్యటనలో ఉండగా దేశ రాజధాని దిల్లీలో మరోసారి హింస చోటుచేసుకుంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)