దిల్లీ హింస: హెడ్‌కానిస్టేబుల్ రతన్‌లాల్ చనిపోయాడని తెలీక, ఆయన కోసం ఎదురుచూస్తున్న భార్య
- భూమిక రాయ్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, DHEERAJ BARI
భార్య, పిల్లలతో రతన్‌లాల్
ఫిబ్రవరి 24 సోమవారం. దిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రతన్‌లాల్‌కు అది ఎప్పటిలాగే మామూలు రోజు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్నట్లే, ఆయన ఆరోజు కూడా వ్రతంలో ఉన్నారు. ఉదయం 11 గంటలకు తన ఆఫీస్ అంటే గోకుల్‌పురి స్టేషనుకు బయల్దేరారు.
సరిగ్గా 24 గంటల తర్వాత గడియారంలో ముల్లు మళ్లీ 11 గంటలు చేరేసరికి బీబీసీ రతన్‌లాల్ ఇంటి గుమ్మం దగ్గర ఉంది. కొన్ని గంటల్లోనే అక్కడ పరిస్థితి మొత్తం మారిపోయింది. పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేకులు, సమర్థకుల మధ్య చెలరేగిన హింస రతన్‌లాల్ ప్రాణాలు తీసింది.
ఈశాన్య దిల్లీలోని చాంద్ బాగ్, భజన్‌పురా, బ్రిజ్‌పురి, గోకుల్‌పురి, జాఫ్రాబాద్‌లో జరిగిన ఈ హింసలో ఇప్పటివరకూ రతన్‌లాల్ సహా 18 మంది చనిపోయారు. 90 మందికి పైగా గాయపడ్డారు.
భార్యకు ఇప్పటివరకూ ఆయన మృతి గురించి తెలీదు
రతన్‌లాల్ ఇంటి దగ్గరికి చేరుకోగానే మాకు ఆయన పెదనాన్న కొడుకు దిలీప్, అల్లుడు మనీష్ కనిపించారు. రతన్‌లాల్ భార్య పూనమ్‌కు తన భర్త మరణించాడనే విషయం తాము ఇంకా చెప్పలేదని అన్నారు.
కానీ ఇంట్లో నుంచి వినిపిస్తున్న పూనమ్ అరుపులను బట్టి చూస్తే, తన భర్తకు జరగరానిది ఏదో జరిగిందని ఆమెకు తెలిసిపోయిందనే అనిపిస్తోంది.
ఆ దంపతులు గత శనివారమే తమ 16వ పెళ్లి రోజును జరుపుకున్నారు.
ఫొటో సోర్స్, DHEERAJ BARI
రతన్‌లాల్ 1988లో పోలీస్ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. అప్పుడు ఆయనను దిల్లీ పోలీసుల తరఫున రాబర్ట్ వాద్రా సెక్యూరిటీలో నియమించారు. రెండేళ్ల క్రితం ప్రమోషన్ రావడంతో ఆయన హెడ్ కానిస్టేబుల్ అయ్యారు.
రతన్‌లాల్ పెదనాన్న కొడుకు దిలీప్ దిల్లీలోని సరాయ్ రోహిల్లా దగ్గర ఉంటారు.
"నిన్న పిల్లలు ట్యూషన్‌కు వెళ్లిన తర్వాత, రతన్‌లాల్‌కు బుల్లెట్ తగిలిందనే వార్తలను పూనమ్ టీవీలో చూశారు. అప్పటివరకూ టీవీలో ఆ సమాచారం మాత్రమే చెప్పారు. రతన్‌లాల్ ఫొటో చూపించలేదు. తర్వాత బహుశా పక్కింటివారు వచ్చి ఇంట్లో టీవీ ఆఫ్ చేశారు. అప్పటి నుంచి మేం టీవీ పెట్టలేదు" అని ఆయన బీబీసీతో అన్నారు.
"దిల్లీలో జరుగుతున్న అల్లర్ల గురించి మాకు తెలుసు. మామయ్యకు అక్కడే డ్యూటీ పడిందని కూడా తెలుసు. రతన్‌లాల్‌కు అనే పోలీసుకు బుల్లెట్ తగిలిందని మేం టీవీలో చూడగానే, దిల్లీ పోలీసుల్లో చాలామంది రతన్‌లాల్‌లు ఉంటారులే అనుకున్నాం. కానీ కాసేపటి తర్వాత ఫేస్‌బుక్‌లో చూశాక బుల్లెట్ తగిలింది మా మామకే అని తెలిసింది. మేం వెంటనే ఇక్కడకు వచ్చాం. కానీ అత్తయ్యకు ఇంకా దాని గురించి ఏం చెప్పలేదు" అని జహంగీర్ పురీలో ఉండే రతన్‌లాల్ మేనల్లుడు మనీష్ అన్నారు.
రాజస్థాన్ సీకర్ వాసి అయిన 44 ఏళ్ల రతన్‌లాల్ ముగ్గురు సోదరుల్లో పెద్దవాడు. ఆయన రెండో తమ్ముడు దినేష్ గ్రామంలో కారు నడుపుతారు. చిన్న తమ్ముడు మనోజ్ బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. రతన్‌లాల్ తల్లి దేవి సీకర్‌లోనే దినేష్‌తోపాటు ఉంటున్నారు.
రతన్‌లాల్ తల్లి ఇప్పటికీ సీకర్‌లోనే ఉన్నారని, ఆమెకు కూడా ఆయన చనిపోయిన విషయం గురించి చెప్పలేదని దిలీప్ మాకు చెప్పారు.
ఫొటో సోర్స్, DHEERAJ BARI
ఆయన వచ్చాకే, భోజనం చేస్తా
రతన్‌లాల్‌కు ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురు పరీకి 11, చిన్న కూతురు కనక్‌కు 8 ఏళ్లు. కొడుకు రామ్ వయసు ఐదేళ్లు. ముగ్గురూ కేంద్రీయ విద్యాలయ్‌లో చదువుతున్నారు. ఇంటి చుట్టుపక్కల జనం భారీగా చేరుతుండడంతో ముగ్గురు పిల్లలను పక్కింటికి పంపించేశారు. నాన్న ఇక ఎప్పటికీ తిరిగిరాడనే విషయం తెలిసింది వారిలో పరీకి మాత్రమే.
రతన్‌లాల్ ఐదేళ్ల క్రితం లోన్ తీసుకుని బురాడీ అమృత్ విహార్‌లో ఈ ఇల్లు కట్టారని ఆయన బంధువులతో మాట్లాడిన తర్వాత మాకు తెలిసింది. ఇరుకైన సందుల్లో కట్టిన ఈ ఇంటి గోడలపై ఇప్పటివరకూ పెయింట్ కూడా చేయలేదు.
ఈరోజు అదే ఇంటి బయట ఎన్నో చెప్పుల జతలు కనిపిస్తున్నాయి. జనమంతా నిలబడి ఉన్న గుమ్మం దగ్గర ఒక బ్లాక్ బోర్డ్ కనిపిస్తోంది. దానిపై పిల్లలు చాక్‌తో గీసిన గీతలు ఉన్నాయి. ఇంట్లో ఒక పాత మోడల్ కంప్యూటర్ కూడా ఉంది. పూనమ్ కూర్చున్న బెడ్ మీదే ఆమెను ఓదారుస్తున్న కొంతమంది మహిళలు కూడా ఉన్నారు.
పూనమ్ గట్టిగట్టిగా ఏడుస్తున్నారు.. అప్పుడప్పుడూ గట్టిగా అరిచి స్పృహ తప్పుతున్నారు. టీవీ చూసిన తర్వాత నుంచి ఆమె ఏం తినలేదు. కొందరు ఏదైనా తినమని చెబుతుంటే, "ఆయన వచ్చాక, ఆయనతో కలిసి తింటాలే" అంటున్నారు.
ఇరుకైన సందుల్లో ఉన్న ఈ ఇంటి వరకూ చేరుకోడానికి మేం చాలా మందిని అడుగుతూ వచ్చాం. జనం మాకు దారి చూపిస్తూనే రతన్‌లాల్ గురించి తమకు తెలిసిన విషయాలన్నీ చెబుతున్నారు.
రతన్‌లాల్ చాలా మంచివారని, అందరితో బాగా కలిసిపోతారని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. తనెవరో తెలీనివారికి కూడా, తన మీసాలతో రతన్‌లాల్ బాగా గుర్తుండిపోయారని అన్నారు.
ఫొటో సోర్స్, Bhumika rai/bbc
మీడియా వాళ్లు అలా చేస్తారేంటి?
"ఇంతకు ముందు షహీన్‌బాగ్‌లో, సీలంపూర్‌లో నిరసనలు మొదలైనప్పుడు, మామయ్యకు అక్కడ కూడా డ్యూటీ వేశారు. అప్పుడు ఆయన చేతికి గాయమైంది. కానీ ఆయన డ్యూటీలో పోలీసులా ఉన్నా, ఇంటికి రాగానే మామూలుగా ఉంటారు. మీరు దోచుకునే పోలీసులను, చూడగానే భయమేసే పోలీసులను చూసుంటారు. మా మామయ్య అలాంటివారు కారు. స్టేషన్ దగ్గర విషయాలను ఆయన ఇంటి దగ్గరకు తీసుకురారు" అని మనీష్ చెప్పారు.
సరదాగా ఉండే ఆయన స్వభావం గురించి రతన్‌లాల్ పొరుగింటి వారంతా చెబుతున్నారు. వారందరూ మీడియా మీద చాలా కోపంగా ఉన్నారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో కొంతమంది మీడియా వారు రతన్‌లాల్ ఇంటికి వచ్చారని, నిద్రపోతున్న పిల్లలను లేపి ఫొటోలు తీయడం మొదలెట్టారని చెప్పారు. "మీడియా వాళ్లు అలా ఎలా చేస్తారు?" అని మండిపడ్డారు.
దిల్లీ లాంటి నగరంలో స్వయంగా పోలీసులకే భద్రత లేకపోతే, ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫొటో సోర్స్, dheeraj bari
కుటుంబం డిమాండ్లు ఏమిటి?
కుటుంబం డిమాండ్లకు అంగీకరించే వరకూ రతన్‌లాల్‌కు అంత్యక్రియలు పూర్తి చేసేది లేదని ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు అంటున్నారు.
మేం రతన్‌లాల్ కుటుంబం డిమాండ్ల గురించి దిలీప్‌ను అడిగాం.
"మా డిమాండ్లు మామూలువే. మా సోదరుడికి అమరవీరుడి హోదా ఇవ్వాలి. ఎందుకంటే ఆయన తన కోసం కాదు, ప్రజలను కాపాడే సమయంలో ప్రాణాలు కోల్పోయారు. మా వదినకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ముగ్గురు పిల్లల చదువుల కోసం అన్ని ఏర్పాట్లూ చేయాలి" అని ఆయన అన్నారు.
కానీ అదంతా తర్వాత విషయం. అసలు, తమకు సంబంధించి ఏం జరుగుతోందనేది రతన్‌లాల్ కుటుంబానికి ఇప్పటివరకూ తెలీదు. వారి దగ్గర పోస్టుమార్టం రిపోర్టు కూడా లేదు. గత రాత్రి ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఆ కుటుంబాన్ని కలవడానికి వచ్చారు. కానీ, దిల్లీ పోలీసుల తరఫున వారికి ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అందలేదు.
స్థానికులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. దాదాపు అందరికీ హింసకు సంబంధించి ఎన్నో ఫొటోలు, వీడియోలు, వదంతులు.. ఇంకా ఎన్నెన్నో తెలుస్తున్నాయి. వారు ఇప్పుడు వాటినే నమ్ముతారు. ఎందుకంటే వారు చాలా బలంగా నమ్మిన వ్యక్తి ఇప్పుడు వారి మధ్య లేరు.
ఇవి కూడా చదవండి:
- డోనల్డ్ ట్రంప్ భారత పర్యటనపై పాకిస్తాన్ మీడియా ఎలా స్పందించింది?
- బంగారం నిక్షేపాల వల్లే 'సోన్‌భద్ర'కు ఆ పేరొచ్చిందా?
- హైదరాబాద్‌లో శాకాహారులు ఎంత మంది? మాంసాహారులు ఎంత మంది?
- 'గ్రహాంతర వాసుల అన్వేషణను మరింత సీరియస్‌గా తీసుకోవాలి.. ప్రభుత్వాలు భారీగా నిధులివ్వాలి'
- పురుషులు మూత్రం ఎలా పోస్తే మంచిది? నిలబడి పోయాలా? కూర్చుని పోయాలా?
- ఒక్క మిడత ‘మహమ్మారి'లా ఎలా మారుతుంది
- వుహాన్ డైరీ: మరణించడానికి మూడు గంటల ముందు ఆయనకు హాస్పిటల్ బెడ్ దొరికింది
- కరోనా వైరస్: వూహాన్లో ఏం జరుగుతోందో ప్రపంచానికి చూపించిన రిపోర్టర్స్ మిస్సింగ్
- పాకిస్తాన్లో చక్కెర కొరత... ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- హార్ట్ బ్రేక్ గైడ్: లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్ బాధ నుంచి బయటపడండి ఇలా..
- కరోనా వైరస్: పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్న వైరస్.. కారణాలు చెప్పలేకపోతున్న వైద్య నిపుణులు
- బిర్యానీ హైదరాబాద్‌ది కాదా?
- యువతను శాకాహారం వైపు నడిపిస్తున్న 7 అంశాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)