పాకిస్తాన్ ఎవరికి భయపడి భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను విడిచిపెట్టింది?

  • రేహాన్ ఫజల్
  • బీబీసీ ప్రతినిధి
అభినందన్

ఫొటో సోర్స్, ANI

అది 2019 ఫిబ్రవరి 28. అభినందన్ వర్ధమాన్ భార్య తన్వీ మర్వా మొబైల్‌కు సౌదీ అరేబియా నంబర్ నుంచి ఒక కాల్ రావడంతో ఆమె కంగారు పడ్డారు, కాస్త ఆశ్చర్యంగా కూడా అనిపించింది.

అవతలి వైపు నుంచి పాకిస్తాన్ జైల్లో బందీగా ఉన్న ఆమె భర్త వింగ్ కమాండర్ అభినందన్ మాట్లాడుతున్నారు. ఐఎస్ఐ చొరవతో ఆ కాల్‌ను సౌదీ అరేబియా నుంచి రూట్ చేశారు. ఒకవైపు ఐఎస్ఐ వారు అభినందన్ ముఖం, శరీరంపై పిడిగుద్దులు కురిపిస్తుంటే, వారిలోని మరో వ్యక్తి అతడిని భార్యతో మాట్లాడనిస్తున్నాడు.

జైల్లో ఉన్న ఒక వ్యక్తిని ఈ శైలిలో మాట్లాడించడాన్ని, గూఢచర్య ప్రపంచంలో "బాడ్ కాప్, గుడ్ కాప్" టెక్నిక్ అంటారు. ఖైదీ నుంచి వీలైనంత ఎక్కువ సమాచారం రాబట్టడం అని దానికి అర్థం.

అయితే అదే రోజు ఇమ్రాన్‌ఖాన్ పాక్ పార్లమెంటులో అభినందన్‌ను పాకిస్తాన్‌లో ఉంచుకోవాలనే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని, అతడిని విడుదల చేస్తున్నామని ప్రకటించారు.

పాకిస్తాన్ ఎంపీలు చప్పట్లు చరిచి ఆ ప్రకటనను స్వాగతించారు. కానీ, చాలా సర్కిళ్లలో అసలు అలా చేయడం తెలివైన చర్యేనా అనే ప్రశ్నలు కూడా వచ్చాయి.

ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్,

ఫిబ్రవరి 28న ట్రంప్ "పాకిస్తాన్ నుంచి ఒక శుభవార్త వినిపించవచ్చు" అన్నారు

అభినందన్ విడుదలపై ట్రంప్ తొలి సంకేతాలు

అటు భారత అధికార పార్టీ నేతలు ఇమ్రాన్ భారత కఠిన వైఖరికి భయపడే ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం చేసుకోడానికి ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదు.

అప్పట్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మార్చి 5న ఝార్ఖండ్‌లోని గోడ్డా ఎన్నికల ప్రచార సభలో "వాళ్లు మన పైలట్‌ను పట్టుకున్నారు. కానీ మోదీజీ వల్ల వాళ్లు అతడిని 48 గంటల్లో విడిచిపెట్టాల్సి వచ్చింది" అన్నారు.

కానీ పాక్ అభినందన్‌ను విడిచిపెట్టవచ్చు అనే సంకేతాలు చాలా రోజుల ముందు నుంచే కనిపించడం మొదలైంది.

ఫిబ్రవరి 28న కిమ్ జాంగ్ ఉన్‌ను కలవడానికి హనోయి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల గురించి మీడియా ప్రశ్నించినపుడు ఆయన "మీరు పాకిస్తాన్ నుంచి త్వరలో ఒక శుభవార్త వినవచ్చని నాకు అనిపిస్తోంది. మేం ఆ విషయం గురించి తెలుసుకుంటున్నాం. త్వరలోనే దానికి తెర పడుతుంది" అని చెప్పారు. అభినందన్‌ను విడిపిస్తున్నట్లు కొన్ని గంటల తర్వాత ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.

ఫొటో సోర్స్, Raj K Raj/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్,

పుల్వామా జరిగిన వెంటనే మొదట పాక్‌లో పర్యటించిన క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ తర్వాత భారత్ వచ్చారు

క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ నిర్ణయాత్మక పాత్ర

కానీ ఇందులో అమెరికాతోపాటూ సౌదీ అరేబియా కూడా కీలక పాత్ర పోషించింది. పుల్వామా దాడి తర్వాత వెంటనే సౌదీ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ మొదట పాకిస్తాన్‌లో పర్యటించారు. తర్వాత భారత్ వచ్చారు.

భారత విదేశాంగ అంశాల నిపుణులు దీనిని సల్మాన్.. దౌత్యమనే 'టైట్ రోప్' వాక్ చేశారని చెబుతారు. ఆయన అక్కడ ఉగ్రవాదంపై పోరాటంలో పాకిస్తాన్ చేసిన బలిదానాలను ప్రశంసిస్తే, భారత్‌లో తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్న ప్రధానమంత్రి మోదీ మాటతో ఏకీభవించారు.

అంతే కాదు, సౌదీ అరేబియా ఉప విదేశాంగ మంత్రి ఆదేల్ అల్-జుబేర్ ఇస్లామిక్ దేశాల సదస్సు జరిగినప్పుడు అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో మాట్లాడారు.

ఈ ప్రతిష్టంభనకు తెరదించాలని సౌదీ అరేబియాకు అంత ఆసక్తి ఎందుకు?

సమాధానంగా "ఇరాన్ వ్యతిరేక బంధంలో పాకిస్తాన్‌ను కూడా తమతో ఉంచుకోవాలని అరేబియా అనుకుంటోంది. అంతేకాదు, అది భారత్‌ను కూడా ఇరాన్‌కు దూరంగా తీసుకెళ్లే వ్యూహంపై పనిచేస్తోంది" అని సౌదీ అరేబియాలో భారత రాయబారిగా పనిచేసిన తల్మీజ్ అహ్మద్ సౌదీ చెప్పారు.

ఫొటో సోర్స్, AAMIR QURESHI/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్,

పాక్ విదేశాంగ మంత్రి

భద్రతా మండలిలో ఐదు పెద్ద దేశాలను సంప్రదించిన పాక్

బాలాకోట్‌లో భారత దాడుల తర్వాత పాకిస్తాన్ ప్రపంచంలో ప్రభావవంతమైన, భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశాలను సంప్రదించింది. భారత్ బాలాకోట్‌పై దాడులతో సంతృప్తి చెందలేదని, ఇండియన్ నావీ నౌకలు కరాచీవైపు రావడం మొదలైందని, అవి పాకిస్తాన్ మీద బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడులు చేసే ప్రయత్నంలో ఉన్నాయని, రెండు దేశాల సరిహద్దుల్లో భారత సైన్యం కదలికలు వేగం అందుకున్నాయని వాటికి సమాచారం ఇచ్చింది. ఈ సమాచారంతో కంగారు పడిన చాలా దేశాలు భారత్‌ను సంప్రదించాయి.

"భారత్ ఈ ఆరోపణలను కల్పితంగా చెబుతూ, వాటిని తీవ్రంగా ఖండించింది. నిజానికి తమ నౌకాదళంలోని నౌకలు కరాచీ నుంచి వ్యతిరేక దిశలో వస్తున్నాయని చెప్పింది. మీకు ఉపగ్రహాల ద్వారా ఆ కదలికలు చూసే సామర్థ్యం ఉందని, మీరు కావాలంటే పాకిస్తాన్ వాదనపై స్వతంత్ర దర్యాప్తు చేయవచ్చని ఆ దేశాలకు చెప్పింది" అని భారత్ నిఘా ఏజెన్సీ 'రా'కు చెందిన ఒక మాజీ అధికారి పేరు బయటపెట్టొద్దనే షరతుపై తెలిపారు.

పాకిస్తాన్ భారత యుద్ధ విమానాన్ని కూల్చడం, ఒక భారత పైలెట్‌ను బందీగా చేసుకోవడంపై భారత్‌తో మాట్లాడిన ఆ దేశాలు, "దీనిపై మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారా?" అని అడిగినప్పుడు భారత్ "బంతి ఇప్పుడు పాకిస్తాన్ కోర్టులో ఉంది" అని సమాధానం ఇచ్చింది.

ఉద్రిక్తతలను తగ్గించాలని అనుకుంటూ ఉంటే పాకిస్తాన్ ఈ దిశగా చొరవ చూపాలి అని చెప్పింది. అభినందన్‌కు చిన్న కష్టం కలిగించినా, అతడిని వెంటనే విడుదల చేయకపోయినా, దానికి పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఫొటో సోర్స్, ARUN SANKAR/AFP via Getty Images

భారత్ హెచ్చరిక

అంతే కాదు, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ డైరెక్టర్ అనిల్ ధస్మానా ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అసీమ్ మునీర్‌తో దీని గురించి నేరుగా మాట్లాడారు.

అభినందన్‌తో ఏమాత్రం దురుసుగా ప్రవర్తించినా, దాని పరిణామాలను రుచిచూసేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.

అదే సమయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికాలో అదే హోదాలో ఉన్న జాన్ బోల్డన్‌తో, ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపేయోతో హాట్‌లైన్‌లో మాట్లాడారు.

వింగ్ కమాండర్ అభినందన్‌తో పాక్ ఏమాత్రం దురుసుగా ప్రవర్తించినా, భారత్ ఎక్కడివరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.

అంతే కాదు, డోభాల్, ధస్మానా ఇద్దరూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాలో తమ స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులతో మట్లాడారు. భారత్ ఉద్దేశం ఏంటో వారికి అర్థమయ్యేలా చెప్పారు.

ఫొటో సోర్స్, Mohd Zakir/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్,

అభినందన్ విడుదలపై అమెరికాతో మాట్లాడిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్

పాకిస్తాన్ ప్రధాన నగరాల్లో 'బ్లాక్ అవుట్'

అదే సమయంలో, భారత్ ఫిబ్రవరి 27న రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య పాకిస్తాన్ మీద 9 క్షిపణులతో దాడి చేయబోతోందని పాకిస్తాన్ నిఘా సంస్థల నుంచి సమాచారం లభించింది.

పాకిస్తాన్ దానికి సమాధానంగా భారత స్థావరాలపై 13 క్షిపణులతో దాడి చేయాలని ప్లాన్ చేసింది. అదే సమయంలో ఇస్లామాబాద్, లాహోర్, కరాచీలోని సైనిక స్థావరాల చుట్టూ 'బ్లాక్ అవుట్' చేయాలని, గగనతలం మూసేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.

భారత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలోని ఒక సభ్యుడు, కొంతమంది రక్షణ నిపుణుల వివరాల ప్రకారం భారత ఆర్మీ మెషినరీ 'రెడ్ అలర్ట్‌'లోకి వెళ్లడంతో పాకిస్తాన్ సైనికాధికారులు దిల్లీకి ఫోన్ చేసి భారత పైలట్‌ను విడిపించే ఏర్పాట్లు జరుగుతున్నాయని, రేపు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ దానిపై ఒక ప్రకటన చేస్తారని చెప్పారు.

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్,

ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాతో వింగ్ కమాండర్ అభినందన్

సౌదీ అరేబియా దౌత్య ప్రయత్నాలు

ఈలోపు సౌదీ అరేబియా మంత్రి అదేల్ అల్-జుబైర్ ప్రిన్స్ సల్మాన్‌ సందేశంతో ఇస్లామాబాద్ వచ్చారు. అదే సమయంలో భారత్‌లో సౌదీ అరేబియా రాయబారిగా ఉన్న డాక్టర్ సవూద్ మొహమ్మద్ అల్-సతీ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు.

పుల్వామా దాడికి ముందు నుంచే మోదీ ప్రభుత్వం సౌదీ ప్రభుత్వంపై చాలా శ్రద్ధ కనపరచడం ప్రారంభించింది. అదే సమయంలో ప్రిన్స్ సుల్తాన్, ప్రధానమంత్రి మోదీ వ్యక్తిగత ఈక్వేషన్లు కూడా బలంగా మారాయి.

తీవ్రవాదంపై పాకిస్తాన్ వైఖరికి వ్యతిరేకంగా సౌదీ అరేబియా కఠినంగా వ్యవహరించడం మొదలైంది. పుల్వామా దాడి జరిగినప్పుడు పాకిస్తాన్‌కు అండగా నిలవకుండా సౌదీ అరేబియా తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఒక ప్రకటన విడుదల చేసింది.

దీనిపై వ్యూహాత్మక అంశాల నిపుణులు హర్ష్ పంత్ మాట్లాడారు.

"పాకిస్తాన్, భారత్‌లలో ఏదో ఒకదానికి బహిరంగ మద్దతు తెలిపేలా, ఈ విషయాన్ని పెద్దది చేయకూడదని సౌదీ అరేబియా భావించింది. ఎందుకంటే వ్యూహాత్మక వ్యవహారాల్లో పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య చాలా ముందు నుంచే పరస్పర అవగాహన ఉంది. సౌదీ అరేబియా 'బ్యాక్ చానల్' నుంచి తాము అన్న దాని గురించి పెద్దగా పట్టించుకోవద్దని పాకిస్తాన్‌కు చెప్పే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత అది భారత్‌తో కూడా మాట్లాడింది. ఏదైనా మధ్యేమార్గం చూపిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని భారత్ కూడా సంకేతాలు ఇచ్చినపుడు అది పాకిస్తాన్‌ను సంప్రదించింది. మీరు ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నం చేయకపోతే తాము పాకిస్తాన్‌కు అండగా నిలిచే పరిస్థితి ఉండదని స్పష్టం చేసింది" అని చెప్పారు.

ఫొటో సోర్స్, ISPR HANDOUT

ఫొటో క్యాప్షన్,

పాకిస్తాన్ స్వాధీనం చేసుకున్న అభినందన్ వస్తువులు

ఏకాకి అవుతామనే భయం

హర్ష్ పంత్ మరో విషయం కూడా చెప్పారు.

"సౌదీ అరేబియాపై పశ్చిమం నుంచి ఒత్తిడి ఎలాగూ ఉంది. కానీ సౌదీ అరేబియా అలా చెప్పడంతో తాము ఇస్లామిక్ ప్రపంచం నుంచి కూడా ఏకాకి అవుతామని పాకిస్తాన్‌ భావించింది. పశ్చిమ దేశాల ఒత్తిడిని పాకిస్తాన్ ఎంతవరకైనా భరించేందుకు సిద్ధం కావచ్చు. కానీ సౌదీ ఆ దేశానికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంటే, ఇస్లాం దేశాలు కూడా పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయని అర్థం చేసుకోవాలి".

దీనిపై మాట్లాడిన జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడు తిలక్ దేవేశ్వర్... "ప్రతిష్టంభన పెరిగితే పాకిస్తాన్‌ వెంట ఏయే దేశాలు నిలబడతాయి అనేది పాక్ పాలకులు కచ్చితంగా ఆలోచించే ఉంటారు. ఈ విషయంలో పశ్చిమ, ఇస్లాం దేశాలు తమకు అండగా నిలబడతాయని దానికి అనిపించుంటే, అది ఉద్రిక్తతలను బహుశా మరో స్థాయికి పెంచడం గురించి ఆలోచించేది. కానీ ఈ విషయంలో ఏకాకి అయిపోతామని దానికి అనిపించగానే.. అభినందన్‌ను విడిపించి ఉద్రిక్తతలను తగ్గించడం తప్ప వారి ముందు వేరే దారి లేకుండాపోయింది. దానిపై అమెరికా, సౌదీ ఒత్తిడి ఉండనే ఉంది, దానితోపాటు ఈ పరిస్థితి నుంచి బయటపడ్డానికి పాకిస్తాన్‌కు ప్రత్యామ్నాయాలు కూడా చాలా తక్కువ" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)