దిల్లీ హింస: పోలీసులు విఫలమయ్యారా? రాష్ట్ర పరిధిలో ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవా?...

  • సందీప్ సోని
  • బీబీసీ ప్రతినిధి
దిల్లీ పోలీసులు

ఫొటో సోర్స్, Reuters

ఈశాన్య దిల్లీ ప్రాంతంలో చెలరేగిన హింస విషయంలో దిల్లీ పోలీసుల తీరుపై అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ దిల్లీలో మంగళవారం వివిధ కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపారు. దీనికి ఒక రోజు ముందు, అంటే సోమవారం ఈ హింస మొదలైంది.

విధ్వంసానికి సంబంధించి చాలా చిత్రాలు బయటకువచ్చాయి. పోలీస్ పికెట్‌తో పాటు ఓ సమాధిని నిరసనకారులు తగులబెట్టారు. పెట్రోల్ పంపు, కొన్ని వాహనాలు, దుకాణాలు, కొన్ని ఇళ్లు కూడా కాలిపోయి ఉన్న చిత్రాలు కనిపించాయి.

జాఫరాబాద్ ప్రాంతంలో ముందు నుంచి సాగుతున్న నిరసనలు ఈ స్థాయికి చేరుకోగవలని పోలీసులు అంచనా వేయలేదా?

ట్రంప్ పర్యటనకు ముందు ఇంతలా హింస, విధ్వంసం పెరగొచ్చన్న విషయాన్ని దిల్లీ పోలీస్ నిఘా వర్గాలు విస్మరించాయా?

ఫొటో సోర్స్, PTI

చర్యలు తీసుకోమని పోలీసులకు ఆదేశాలు అందలేదని, లేకపోతే అల్లరి మూకలో ఉన్న ఓ వ్యక్తి పోలీసులపైకి తుపాకీ ఎక్కుపెడుతూ తిరిగే ధైర్యం ఎలా చేస్తాడని ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నిస్తున్నాయి.

ఈ హింసను కట్టడి చేసేందుకు జామియా తరహాలో పోలీసులు బలప్రయోగానికి దిగలేదు. దీనిపై ప్రశ్నలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ విషయాలన్నింటి గురించి మేం కొంతమంది మాజీ పోలీసు అధికారులతో మాట్లాడాం.

అజయ్ రాయ్ శర్మ, దిల్లీ పోలీస్ మాజీ కమిషనర్ అభిప్రాయం:

‘‘పోలీసు వ్యవహారాలు రాష్ట్ర పరిధిలోని అంశం. కేంద్రం ఇందులో జోక్యం చేసుకోదు. కానీ, దిల్లీ విషయంలో మాత్రం ఇది వర్తించదు. ఇక్కడ పోలీసు శాఖ కేంద్ర పరిధిలోనే ఉంటుంది. దిల్లీ ముఖ్యమంత్రి చేసేదేమీ లేదు.

ఏ ప్రభుత్వానికైనా పోలీస్ విభాగం ‘స్ట్రాంగ్ ఆర్మ్’. అది సరైన సమయంలో స్పందించి, అల్లర్లను కట్టడి చేస్తుందని ఆశిస్తారు.

ఓ రకంగా పోలీసులను ఓ పరికరం అని అనొచ్చు. సాధారణంగా రాష్ట్రాల చేతుల్లో ఇది ఉంటుంది. కానీ, దిల్లీలో మాత్రం కేంద్రం చేతుల్లో ఉంది. ఆ పరికరం తనకు తానుగా ఏమీ చేయదు. దాన్ని మనమే వినియోగించుకోవాలి.

అయితే, ఏదైనా గుర్తించదగిన నేరం జరుగుతుంటే పోలీసులు స్పందించాలని చట్టం చెబుతోంది. కానీ, ఈ పద్ధతి తగ్గుతూ పోతోంది.

మేం సర్వీస్‌లో ఉన్నప్పుడు, మొదట చర్యలు తీసుకునేవాళ్లం. ఆ తర్వాత, ఎలాంటి పరిస్థితుల్లో ఆ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పేవాళ్లం. కానీ, ఇప్పుడు చర్యలు తీసుకోవాలా, వద్దా అని ముందుగానే ప్రభుత్వాన్ని అడుగుతున్నారు.

పోలీసులు ఎందుకు చర్యలకు ఉపక్రమించలేదో నాకు అర్థం కావట్లేదు. వాళ్లను అడ్డుకున్నారా? వాళ్ల చేతులను ఎవరైనా కట్టేశారా?

ఏ ఆంక్షలు లేకున్నా, పోలీసులు చర్యలు తీసుకోకపోతే అది తీవ్రమైన విషయం.

పోలీసింగ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి రియాక్టివ్ పోలీసింగ్, రెండోది ప్రీవెంటివ్ పోలీసింగ్.

రియాక్టివ్ పోలీసింగ్ అంటే ఘటన జరిగిన తర్వాత అక్కడికి చేరుకుని, కేసు రాసుకుని ప్రక్రియ మొదలుపెట్టడం.

ప్రీవెంటివ్ పోలీసింగ్ అంటే నిఘా సమాచారం ఆధారంగా ఘటన జరగకముందే స్పందించి, చర్యలు తీసుకోవడం.

ఈ వ్యవహారంలో ప్రీవెంటివ్ పోలీసింగ్ లోపం ఉందని నేను భావిస్తున్నా. రియాక్టివ్ పోలీసింగ్ కూడా పూర్తిగా లేదు.’’

నీరజ్ కుమార్, దిల్లీ పోలీస్ మాజీ కమిషనర్ అభిప్రాయం:

‘‘హింస-అల్లర్లపై పోలీసులకు నిఘా సమాచారం కచ్చితంగా ఉండే ఉంటుంది. కానీ, ఇప్పటికే పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి.

నగరమంతా ఓ చట్టానికి వ్యతిరేకమైన వాతావరణం ఉంది. ఈ పరిస్థితులను ఉపయోగించుకోవాలనుకునేవాళ్లు చాలా మంది ఉంటారు. వారిలో రాజకీయంగా వ్యతిరేకించే పక్షాలు, దేశ వ్యతిరేక శక్తులు కూడా ఉండొచ్చు.

ఫొటో సోర్స్, AFP GETTY

ఇలాంటి పరిస్థితుల్లో హింస చెలరేగితే, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాపించకుండా దాన్ని నియంత్రించడం కొంచెం కష్టం. అందుకే, నేను పోలీసులే బాధ్యులు అని అనుకోను.

పోలీసుల చర్యల విషయానికి వస్తే... వాళ్లు ఎంత వరకూ స్పందించారో, ఎలా స్పందించారో సీసీ ఫుటేజీ ఆధారంగా మనం చెప్పలేం.

పోలీస్ వ్యవస్థను మెరుగుపరచాలన్న వాదన ఎప్పుడూ ఉండేదే. అయితే, హింసను నియంత్రించలేకపోతే, పోలీసులు ఎక్కడో విఫలమయ్యారని అంగీకరించాల్సిందే.

పోలీసు శాఖను కేంద్ర పరిధిలో నుంచి రాష్ట్ర పరిధిలోకి తెచ్చినా మారేదేమీ ఉండదు. ఇంకా పనితీరు అధ్వానంగా మారుతుంది.

ఉదాహరణకు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులను, ఇంకో రాష్ట్రం పోలీసులనో చూడండి. వారి దుర్వినియోగం జరుగుతోంది. రాష్ట్ర పరిధిలో కాకుండా, కేంద్ర పరిధిలో తమ పోలీసులు ఉండటం దిల్లీ ప్రజల అదృష్టం.

మొత్తం దేశాన్ని విడిచిపెట్టి, ఒక్క రాజధాని పోలీసులపైనే తమ దృష్టిపెట్టడానికి కేంద్రానికి తగినంత సమయం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం దుర్వినియోగానికి చాలా సమయం ఉంటుంది.’’

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.