దిల్లీ హింస వెనక కుట్ర ఉందన్న సోనియా గాంధీ; 20కి చేరిన మృతులు

దిల్లీ అల్లర్లలో ధ్వంసమైన రెండు మసీదులు

ఫొటో సోర్స్, Getty Images

తూర్పు, ఈశాన్య దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులుగా జరుగుతున్న పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక ఘర్షణల్లో ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సహా మొత్తం 20 మంది చనిపోయారు. 189 మంది పౌరులు గాయపడ్డారు.

దిల్లీ అల్లర్లలో తీవ్రంగా ప్రభావితమైన అశోక్ నగర్‌లో బీబీసీ ప్రతినిధి ఫైసల్ మహమ్మద్ అలీ కొంతమంది స్థానికులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అక్కడి పరిస్థితిని ఆయన వివరించారు.

"ధ్వంసమైన ఓ మసీదు ముందు కొంతమంది నిలబడి ఉన్నారు. ఈ మసీదును బడీ మసీదు అని పిలుస్తారు.

ఇది హిందువులు ఎక్కువగా నివసించే ప్రాంతం. కెమెరా ముందుకు వచ్చి మాట్లాడేందుకు ఎవరూ సంసిద్ధత వ్యక్తం చేయలేదు. కానీ ఈ ఘర్షణలు, హింస బయటివారి పనే అని వారంటున్నారు.

వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తే తమపై కూడా వారు దాడికి పాల్పడతారేమోననే భయం అక్కడున్నవారందరిలో ఉందని వారు తెలిపారు.

ఈ మసీదు ఇక్కడ ఎన్నో ఏళ్లుగా ఉంటోంది. ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉన్న ఈ భవనం ముందుభాగం ధ్వంసమైంది. ఓ జాతీయ జెండా, కాషాయ జెండా ఆ మసీదు మినార్‌పై ఎగురుతున్నాయి.

అక్కడో పోలీస్ కారు ఆగి ఉంది.

ఖురాన్‌లోని చిరిగిన పేజీలు ఆ మసీదు బయట పడి ఉన్నాయి. ఇద్దరు యువకులు వాటిని ఏరుతూ, ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేస్తున్నారు.

ఇలాంటి చర్యలతో వారు ఏం సాధిస్తారు అని రియాజ్ సిద్ధిఖీ అనే మరో స్థానికుడు ప్రశ్నిస్తున్నారు.

మసీదులోకి ప్రవేశించి చూస్తే అక్కడ అన్నీ టోపీలు, సగం కాలిన ప్రేయర్ మ్యాట్లు పడి ఉన్నాయి" అని ఫైసల్ తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters

దిల్లీ హింసను ఖండించిన సోనియా గాంధీ

చాలామంది బీజేపీ నేతలు తమ వ్యాఖ్యలతో భయానక, విద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.

"దిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనల వెనక కుట్ర దాగి ఉంది. ప్రస్తుత పరిస్థితులకు కేంద్రం, హోంమంత్రిదే బాధ్యత. హోంమంత్రి రాజీనామా చేయాలి.

గత 72 గంటలుగా దిల్లీ పోలీసులు అచేతనంగా ఉన్నారు. ఇప్పటివరకూ దాదాపు 18మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఓ హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. వందలమంది హాస్పటల్‌లో ఉన్నారు. వారిలో చాలామందికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈశాన్య దిల్లీ వీధుల్లో హింసకు అదుపులేకుండా పోయింది" అని సోనియా విమర్శించారు.

ఫొటో సోర్స్, Getty Images

మరోవైపు, షహీన్ బాగ్ నిరసనకారుల వేదికను ఖాళీ చేయించాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది.

అయితే, దీనితో పాటు దిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘర్షణలపై విచారణ చేపట్టాలన్న విజ్ఞప్తిని సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. పిటిషన్ పరిధి వరకే విచారణ జరుపుతామని, దిల్లీ హింసకు సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతోందని సుప్రీం వ్యాఖ్యానించింది.

అయితే, జరిగిన ఘటనలు దురదృష్టకరమైనవని న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అభిప్రాయపడ్డారు.

"కొన్ని దురదృష్టకర ఘటనలు జరిగినట్లు మా దృష్టికి వచ్చింది. అయితే, దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. మేం షహీన్ బాగ్ అంశంపై మాత్రమే విచారణ జరుపుతాం" అని ఈ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ కౌల్ అన్నారు.

దిల్లీ అల్లర్లపై కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుచేయాలంటూ చంద్రశేఖర్ అజాద్, నక్వీలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ విషయంలో జోక్యానికి నిరాకరించారు.

పోలీసులు స్పందించిన తీరుపై మరో న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ అసహనం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్ పోలీసులు ఎలా పనిచేస్తున్నారో ఓసారి చూడండి అని ఆయన వ్యాఖ్యానించారు. పరిస్థితిని అదుపుచేయడానికి మీరు వెంటనే స్పందించి ఉండాల్సిందని జోసెఫ్ అన్నారు.

అయితే పోలీసులు ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారో మనకు తెలియదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కూడా మరణించారని ఆయన కోర్టుకు తెలిపారు.

"ఇది చాలా తీవ్రమైన అంశం, ఎంతమంది చనిపోయారు?" అని కోర్టు ప్రశ్నించింది.

"ప్రజల ప్రాణాలు చాలా విలువైనవి. వ్యవస్థను దాని పని దాన్ని చెయ్యనివ్వండి" అని కోర్టు సూచించింది.

"మేం దేన్నీ తప్పనిసరి అని చెప్పడం లేదు. మేం సమస్యకు మెరుగైన పరిష్కారం ఆలోచిస్తున్నాం. మధ్యవర్తులు వారు చేయగలిగినంతా చేశారు" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అయితే, మధ్యంతర ఉత్తర్వులు లేదా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా పిటిషనర్ డాక్టర్ నందకిషోర్ గార్గ్ తరపు న్యాయవాది శశాంక్ దేవ్ సూధీ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరిస్తూ తదుపరి విచారణను మార్చి 23కు వాయిదా వేసింది.

ఫొటో సోర్స్, AFP

20కి చేరిన మృతుల సంఖ్య

యమునా నదికి అవతల తూర్పు, ఈశాన్య దిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, అనుకూలంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. మంగళవారం కూడా పలు ప్రాంతాల్లో రాళ్లదాడులు జరిగాయి.

నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఒక పోలీస్ కానిస్టేబుల్‌తో పాటు మొత్తం 20 మంది మృతి చెందారు. ఒక డీసీపీ సహా చాలామంది పోలీసులు గాయపడ్డారు. ఈ నిరసనల్లో మొత్తం 189 మందికి గాయాలయ్యాయి. వీరిలో దాదాపు 50 మంది పోలీసులు.

ఇప్పటివరకూ 20 మంది చనిపోయారని గురు తేగ్ బహదూర్ (జీటీబీ) హాస్పటల్ ఎండీ సునీల్ కుమార్ గౌతమ్ తెలిపారు.

హాస్పటల్‌కు వచ్చినవారిలో కొందరికి తలకు గాయాలయ్యాయని, కొందరికి బుల్లెట్లు తగిలాయని, మరికొందరికి కత్తిపోట్లున్నాయని గౌతమ్ వెల్లడించారు. తప్పించుకునే ప్రయత్నంలో కిందపడటం వల్ల చాలామంది గాయపడ్డారని, వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

అయితే, చనిపోయిన వారి మరణానికి కారణాలు వెల్లడించడానికి మాత్రం ఆయన నిరాకరించారు. పోస్ట్ మార్టమ్ తర్వాతే ఏదైనా ధృవీకరించగలమని ఆయనన్నారు.

నిరసనలు జరుగుతున్న ప్రాంతాల్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పర్యటించారు. స్థానిక నేతలతో చర్చించారు. ఆయన తన పరిశీలనలను కేబినెట్‌కు, ప్రధానికి నివేదించే అవకాశముందని ఏఎన్ఐ తెలిపింది.

"చట్టాన్ని అతిక్రమిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదు. పరిస్థితిని అదుపు చేయడానికి తగినంత మంది భద్రతా సిబ్బందిని మోహరించాం. శాంతిభద్రతలను నియంత్రించాలని పోలీసులను కూడా ఆదేశించాం" అని అజిత్ డోభాల్ తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

దిల్లీలో హింస ప్రభావిత ప్రాంతాల మ్యాప్

మంగళవారం ఏం జరిగింది?

ముఖ్యమంత్రి కేజ్రీవాల్, విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా జీటీబీ హాస్పటల్, మ్యాక్స్ హాస్పటల్‌కు వెళ్లి ఘర్షణల్లో గాయపడిని వారిని పరామర్శించారు.

అనంతరం, హింస త్వరలోనే అంతం కావాలని కోరుకుంటున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. దిల్లీలో పరిస్థితిని సమీక్షించారు.

ఫొటో సోర్స్, AFP

దిల్లీ పోలీసులు ఈశాన్య దిల్లీలోని 10 ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)