దిల్లీ హింస: అశోక్ నగర్‌లో మసీదుపై జాతీయ జెండా, కాషాయ జెండా ఎగరేసింది ఎవరు? - గ్రౌండ్ రిపోర్ట్

  • ఫైసల్ మొహమ్మద్ అలీ
  • బీబీసీ ప్రతినిధి
అశోక్ నగర్ మసీదు
ఫొటో క్యాప్షన్,

అశోక్ నగర్ మసీదు

ఒక మసీదు ఎదురుగా పదుల సంఖ్యలో జనం గుమిగూడి ఉన్నారు. ఆ మసీదు ఎదురుగా ఉన్న ప్రాంతమంతా తగలబడి కనిపిస్తోంది.

బుధవారం ఉదయం అశోక్ నగర్ ఐదో నంబర్ వీధిలోని పెద్ద మసీదు దగ్గరున్న యువకులతో మాట్లాడాలని బీబీసీ ప్రయత్నించినపుడు, వారి స్పందనలో ఆక్రోశం స్పష్టంగా కనిపించింది.

మేం వారి వెనకే మసీదు లోపలికి వెళ్లాం. అక్కడ లోపల నేలపై సగం కాలిన తివాచీ కనిపించింది.. టోపీలు అక్కడంతా చెల్లాచెదురుగా పడున్నాయి. ఇమామ్ నిలబడే ప్రాంతం పూర్తిగా కాలిపోయింది.

ఫొటో క్యాప్షన్,

మసీదు లోపల పరిస్థితి

దాడులు చేసిన ఒక గుంపులోని కొంతమంది ఒక మీనార్ మీద మువ్వెన్నెల జెండాను, కాషాయ జెండాను ఎగరేశారని మంగళవారం వచ్చిన వార్తల్లో ఈ మసీదు గురించే చెప్పారు.

దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఆ తర్వాత అశోక్ నగర్‌లో అలా ఏ ఘటనలూ జరగలేదని పోలీసులు ప్రకటించినట్లు ఏఎన్ఐ ట్వీట్ చేసింది. కానీ ఇందులో అశోక్ నగర్‌కు బదులు ఆ ప్రాంతాన్ని అశోక్ విహార్ అని రాసింది.

కానీ మేం అక్కడకు చేరుకున్నప్పుడు మసీదు మీనార్ మీద మువ్వన్నెల జెండా, కాషాయ జెండా అలాగే ఉండడం మాకు కనిపించింది.

సోమవారం ఆ ప్రాంతంలోకి వచ్చిన ఒక గుంపు అదంతా చేసిందని మసీదు బయట గుమిగూడిన జనం చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

మసీదు మీనార్‌కు మువ్వన్నెల జెండా

బయట నుంచి వచ్చినవారే చేశారు

మసీదు లోపల ఉన్న ఆబిద్ సిద్దిఖీ అనే యువకుడు రాత్రి పోలీసులు మసీదు ఇమామ్‌ను కూడా తీసుకెళ్లారని చెప్పారు. అయితే దానిని మేం ధ్రువీకరించలేం.

మసీదు ఇమామ్‌తో మాట్లాడాలని బీబీసీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

మేం అక్కడికి చేరుకునేసరికి, ఆ ప్రాంతానికి దగ్గరే ఒక పోలీస్ వాహనం ఉంది. కాసేపటి తర్వాత అది అక్కడి నుంచి వెళ్లిపోయింది.

మసీదుకు జరిగిన నష్టంపై ఆగ్రహించిన రియాజ్ సిద్దిఖీ "అయినా, జనాలు ఇలా చేసి ఏం సాధిస్తారు" ఇలా చేస్తే ఏమొస్తుందని" అన్నారు.

మేం ఆ ప్రాంతంలోనే నివసిస్తున్న హిందువులతో కూడా మాట్లాడాం. అక్కడ ఆ మసీదు ఎన్నో ఏళ్ల నుంచీ ఉందని వారు చెప్పారు. బయటి నుంచి వచ్చిన వారే, మసీదుకు నష్టం కలిగించారని అన్నారు.

బయటి నుంచి వచ్చిన వాళ్లను అడ్డుకోవాలని ప్రయత్నించి ఉంటే, బహుశా తమ ప్రాణాలు కూడా పోయుండేవని వారు చెప్పారు.

ఈ ఘటన తీవ్రత, సున్నితత్వం దృష్ట్యాఘటనాస్థలంలోని కొన్ని దృశ్యాలు, కొందరి ప్రకటనలను తొలగించాం. అవి భావోద్వేగాలను రెచ్చగొట్టేలా చేయవచ్చని భావించాం. బీబీసీ సంపాదకీయ విధానాల ప్రకారమే అలా చేశాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)