ఆంధ్రప్రదేశ్ - హీల్ ప్యారడైజ్: ఇక్కడి అనాథ బాలలు... ఆత్మ విశ్వాసంతో ఎదుగుతున్న రేపటి పౌరులు

  • వి.శంకర్
  • బీబీసీ కోసం
హీల్ లో ఆడుకుంటున్న పిల్లలు

"మ‌న పిల్ల‌లు ఎలాంటి స్థానంలో ఉండాల‌ని ఆశిస్తున్నామో, అందుకు తగిన స‌దుపాయాలు కల్పించినప్పుడే మనం వారికి న్యాయం చేసిన‌ట్లవుతుంది. అందుకే మా హీల్ పిల్ల‌ల‌కు ఎటువంటి లోటు రాకుండా చూస్తాం. ఎక్క‌డా రాజీప‌డ‌కుండా ఏర్పాట్లు చేస్తున్నాం. హాస్ట‌ల్ నుంచి డిజిట‌ల్ క్లాసుల వ‌ర‌కూ, మెస్ నుంచి స్పోర్ట్స్ గ్రౌండ్ వ‌ర‌కూ అన్నింటా ఆధునిక స‌దుపాయాలు అందిస్తున్నాం. పోటీ ప్ర‌పంచంలో త‌గిన రీతిలో సిద్ధ‌ప‌డేందుకు స‌న్న‌ద్ధం చేస్తున్నాం." అంటారు హీల్ ( Health And Education for All - HEAL) ప్యారడైజ్ వ్యవస్థాపకుడు డాక్ట‌ర్ కోనేరు స‌త్య‌ప్ర‌సాద్.

అనాథ పిల్లల కోసం ఆయన ఆంధ్రప్రదేశ్‌, కృష్ణా జిల్లాలోని తోటపల్లి దగ్గర హీల్ ప్యారడైజ్‌ ప్రారంభించారు. తల్లితండ్రులు లేని పిల్లలకు ఈ సంస్థ ఆశ్రయం ఇవ్వడమే కాదు, చదువునూ సంస్కారాన్నీ బోధిస్తోంది.

ఈ ప్రాంగణం అనాథలకు ఓ స్వర్గధామం అని స్థానికులు అంటారు. ఇక్కడి విద్యార్ధులకు కార్పొరేట్ తరహా విద్యాబోధన అందిస్తారు.

2013లో ప్రారంభించిన ఈ అనాథాశ్ర‌మంలో ప్ర‌స్తుతం 600 మంది విద్యార్థుల‌ు ఉన్నారు. వారిలో చాలా మంది తల్లితండ్రులు లేని నిరుపేదలు. తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారూ ఉన్నారు.

ఫొటో సోర్స్, HEAL

ఫొటో క్యాప్షన్,

డాక్ట‌ర్ కోనేరు స‌త్య‌ప్ర‌సాద్, హీల్ ప్యారడైజ్ వ్యవస్థాపకులు

పదహారేళ్ళ వయసు నుంచే అనాథల సేవలో...

డాక్ట‌ర్ కోనేరు స‌త్య‌ప్ర‌సాద్ ప్ర‌స్తుతం లండ‌న్‌లో డాక్ట‌ర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. పదహారేళ్ళ వయసులోనే ఆయన తన సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. గుంటూరు మెడిక‌ల్ కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన తన మిత్రుల‌తో క‌లసి ప్ర‌జా సేవా స‌మితి ఏర్పాటు చేశారు. చదువుకుంటూనే పేద‌ వాడల్లో వైద్య శిబిరాలు నిర్వ‌హించేవారు. కాలక్రమంలో తన సేవా కార్యక్రమాలను మ‌రింత విస్త‌రించారు.

వైద్య విద్య పూర్తి చేసి వృత్తిలో అడుగుపెట్టిన త‌ర్వాత తొలుత త‌న ఇంటినే అనాథాశ్ర‌మంగా మార్చారు. అంకిత పేరుతో సేవ‌లందించ‌డం ప్రారంభించారు. విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా పెరగడంతో ఇల్లు సరిపోలేదు. దాంతో, గుంటూరు జిల్లా చోడ‌వ‌రంలో నాలుగు ఎక‌రాల స్థ‌లంలో హీల్ విలేజ్ ప్రారంభించారు.

ఈ ప్రయాణానికి ప్రేరణ స‌త్య‌ప్ర‌సాద్‌లోని బలమైన సామాజిక దృక్పథమే. "అంద‌రికీ విద్య‌, వైద్యం హ‌క్కుగా ఉండాల‌నేది నా నిశ్ఛితాభిప్రాయం. అందుకే హీల్ ప్రారంభించాను. దీనికి నా మిత్రులు అనేక మంది స‌హ‌క‌రించారు. కొంద‌రు ప్ర‌త్య‌క్షంగా, మరికొందరు ప‌రోక్షంగా ప్రోత్స‌హించారు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, HEAL

హీల్ విలేజ్ నుంచి హీల్ ప్యార‌డైజ్ వ‌ర‌కూ..

హీల్ విలేజ్‌ని 1993లో ప్రారంభించారు. అక్క‌డ చేరిన తొలి బ్యాచ్ పిల్ల‌లు ఇప్పుడు రకరకాల ఉన్నత స్థానాల్లో స్థిర‌ప‌డ్డార‌ని స‌త్య‌ప్ర‌సాద్ తెలిపారు. అంద‌రికీ మెరుగైన జీవితం అందించ‌డ‌మే ల‌క్ష్యంతో ప్రారంభించిన సంస్థ త‌న ఆశ‌యాల‌కు అనుగుణంగా ప‌నిచేస్తే చాల‌న్నది ఆయ‌న అభిమతం.

ఆ తరువాత 2013లో తోటపల్లి వద్ద 27 ఎక‌రాల్లో హీల్ ప్యార‌డైజ్ ప్రారంభించారు. విశాల‌మైన భ‌వ‌నాలు, ఆధునిక విద్యా బోధ‌న‌, నాణ్య‌మైన ఆహారం, క్రీడా మైదానాలు వంటి వసతులన్నీ అక్కడి ఏర్పాటు చేశారు. విద్యార్థుల బహుముఖ వికాసమే ఈ ప్యారడైజ్ పరమార్థం అంటారు సత్యప్రసాద్.

అయితే, ఇంత భారీ ప్రాజెక్టులా కాకుండా త‌క్కువ‌ ఖ‌ర్చుతో ఎక్కువ మందికి సేవ‌లు అందించవచ్చు కదా అని అభిప్రాయాలకు సత్యప్రసాద్ చెప్పే జవాబు ఒక్కటే, "మన పిల్లలు అయితే ఎలా చూసుకుంటామో అలాగే వారినీ చూసుకోగలగాలి. ఏదో ఆశ్రయం ఇచ్చాం కదా అన్నట్లు ఉండకూడదు."

అనాథ పిల్లల గురించి ఎవరైనా సమాచారం ఇస్తే చాలు, హీల్ ప్ర‌తినిధులు వెంటనే వారిని చేర్చుకునేందుకు సిద్ధ‌మ‌వుతారని ఆయన చెప్పారు. అంతేకాకుండా, హీల్ ప్యారడైజ్‌లో అంధుల కోసం ప్ర‌త్యేక పాఠ‌శాల కూడా న‌డుపుతున్నారు. బ్రెయిలీ లో విద్యాబోధ‌న సాగిస్తున్నారు. అందులో 30 మంది అంధ విద్యార్థుల‌ు చదువుకుంటున్నారు. వారిని క్రీడ‌ల్లో ప్రోత్స‌హిస్తున్నారు. క్రికెట్‌లో రాణిస్తున్న కొంద‌రిని గుర్తించారు. టీం ఇండియా చీఫ్ సెల‌క్ట‌ర్‌గా ప‌నిచేసిన ఎంఎస్ కే ప్ర‌సాద్ వారికి క్రీడల్లో తర్ఫీదు ఇస్తున్నారు.

పోలియో వల్లనో ప్రమాదాల వల్లనో వైకల్యానికి గురైన వారికి ఈ సంస్థలో ఉచితంగా కృత్రిమ అవ‌య‌వాలు అందిస్తున్నారు. వాటిని త‌యారు చేసే కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కూ 108 మందికి కృత్రిమ కాళ్లు అందించామని నిర్వాహ‌కులు తెలిపారు.

ఈ సేవలకు తోడు హీల్ ప్రాంగణంలో వృత్తి శిక్ష‌ణా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఉచిత వైద్య సేవ‌లు అందిస్తున్నారు. భ‌ద్రాచ‌లం ఏజ‌న్సీ ప్రాంతంలో, ఆగిరప‌ల్లి చుట్టుప‌క్క‌ల ఉన్న 16 స్కూళ్ల‌ విద్యార్థుల‌కు తమ సంస్థ నుంచి కుట్టుపని వంటి వివిధ వృత్తిపరమైన శిక్షణ అందిస్తున్నామని సత్య‌ప్ర‌సాద్ చెప్పారు.

స్వ‌చ్ఛంద సేవ‌కుల సంఖ్య కూడా ఎక్కువే..!

హీల్ ప్యార‌డైజ్‌లో ఒకటి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కూ సీబీఎస్ఈ సిల‌బ‌స్‌తో విద్యాబోధ‌న చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు బ్యాచ్‌ల విద్యార్థులు ఇక్క‌డ చదువు పూర్తి చేసుకుని బ‌య‌ట‌కు వెళ్లారు. వారిలో ఎక్కువ మంది పాలిటెక్నిక్‌ వంటి సంస్థల్లో చేరార‌ని , ఇంజ‌నీరింగ్ వంటి ఉన్నత చదువులకు ఎంపికైన వారికి హీల్ త‌రుపున పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌ని ఈ సంస్థ ప్ర‌తినిధి అజ‌య్ కుమార్ చెప్పారు.

ఏపీ ప్ర‌భుత్వంలో ఉన్న‌త ఉద్యోగిగా రిటైర్ అయిన త‌ర్వాత అజ‌య్ కుమార్ ఇక్క‌డ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆయ‌న‌తో పాటు దేశ‌, విదేశాల్లో ప‌నిచేసిన వారు చాలామంది హీల్ నిర్వ‌హ‌ణ‌లో భాగ‌స్వాముల‌వుతున్నారు.

27 ఏళ్ళుగా అమెరికాలో నివసిస్తున్న కృష్ణ‌కుమారి ప్ర‌స్తుతం హీల్‌లో సేవ‌లందిస్తున్నారు. ఆమె బీబీసీతో మాట్లాడుతూ, "మేం చికాగోలో స్థిర‌ప‌డ్డాం. పిల్ల‌లిద్ద‌రూ త‌మ తమ బాధ్య‌త‌ల్లోకి వెళ్లారు. ప్రతి ఏటా మ‌న దేశానికి వ‌చ్చిన‌ప్పుడు ఏదో ఒక అనాథ ఆశ్ర‌మానికి వెళ్లి, వారితో గ‌డ‌ప‌డం అల‌వాటుగా ఉండేది. హీల్ చూసిన త‌ర్వాత ఇక్క‌డే ఉండాల‌నిపించింది. అందుకే నాలుగు నెల‌లుగా ఇక్క‌డే ప‌నిచేస్తున్నాను. 27 ఏళ్ల త‌ర్వాత మొద‌టి సారి వేస‌వికాలం మ‌న‌దేశంలో గ‌డుపుతున్నాను. నాకు వీలైనంత కాలం ఇక్క‌డే ఉండి అనాథల‌కు సేవలు అందిస్తాను" అని అన్నారు.

ఉన్న‌త విద్య‌కు తోడ్పాటు అందిస్తూనే ఉత్త‌మ పౌరులుగా పిల్ల‌ల‌ను తీర్చిదిద్దేందుకు హీల్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని నిర్వాహ‌కులు చెబుతున్నారు.

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ మీద అంద‌రిలో స్పృహ పెంచాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌కృతి వ్య‌వ‌సాయం చేస్తున్నారు. దీనికి మరో ఎన్నారై కె. భ‌వాని సహకారం అందిస్తున్నారు. "పదహారేళ్ళు విదేశాల్లో విదేశాల్లో ప‌నిచేశాను. మ‌న దేశానికి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత తాడేప‌ల్లిగూడెం స‌మీపంలో మా ఊరిలో కొన్ని సేవా కార్యక్రమాలు చేశాను. మార్పు రావాలంటే పెద్ద‌ల్లో క‌న్నా పిల్ల‌ల్లో చైత‌న్యం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించుకున్నా. చాలా రాష్ట్రాలు తిరిగాను. ఇప్పుడు హీల్‌లో ప్ర‌కృతి వ్య‌వ‌సాయంలో సేవ‌లు అందిస్తున్నాను. ఇది మంచి ఫ‌లితాలు ఇస్తోంది. పిల్ల‌ల్లో మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇక్క‌డి మెస్‌లో వృధా కావాల్సిన వాటిని స‌ద్వినియోగం చేస్తూ అవ‌స‌ర‌మైన కూర‌గాయల‌న్నీ పండించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం" అని వివ‌రించారు.

క్రీడ‌ల్లోనూ త‌ర్ఫీదు

హీల్ విద్యార్థుల‌ను క్రీడారంగంలో ప్రోత్స‌హించేందుకు ప‌లు ఏర్పాట్లు చేస్తున్నారు. టీం ఇండియా మాజీ క్రికెట‌ర్ ఎంఎస్‌కే ప్ర‌సాద్, నాగార్జున యూనివ‌ర్సిటీ‌లో ప‌నిచేసిన సుధాక‌ర్ స‌హా ప‌లువురు క్రీడా నిపుణులు విద్యార్ధులకు శిక్షణ ఇస్తున్నారు.

"హీల్ సేవ‌లు చూసిన త‌ర్వాత నా వంతు సహకారం అందించాలన్న ఆలోచ‌న వ‌చ్చింది. గ‌తంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ లోనూ, బీసీసీఐలోనూ ప‌నిచేసిన అనుభ‌వంతో ఇక్క‌డ మెరుగైన క్రీడా వ‌స‌తులు ఏర్పాటు చేయాల‌ని భావించాను. అందుకు త‌గ్గ‌ట్టుగా హీల్ విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం చాలా ఉంది. వారికి అవ‌కాశాలు క‌ల్పిస్తే బాగా రాణిస్తారు. దేశానికి మంచి పేరు తీసుకొస్తారు. అందుకు త‌గ్గ‌ట్టుగా వారికి శిక్ష‌ణ క‌ల్పించేందుకు త‌గిన ఇండోర్ స్టేడియం, ఇత‌ర నిర్మాణాలు చేపడుతున్నాం" అని ఎంఎస్‌కే ప్ర‌సాద్ చెప్పారు.

ఇంటి కన్నా హీల్ పదిలం

హీల్‌ విద్యార్థుల సంఖ్యను వేయికి పెంచ‌డానికి నిర్వాహ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగా మెస్ వంటి సౌకర్యాలన్నింటినీ సిద్ధం చేశారు. సోలార్ ప‌వ‌ర్‌తో పూర్తిగా ఆధునిక స‌దుపాయాల‌తో మెస్ న‌డుపుతున్నారు. నిరుపేద‌ల పిల్ల‌లం, ఎటువంటి ఆధారం లేని వాళ్లం అనే అభిప్రాయం ఎవ‌రిలోనూ క‌ల‌గ‌కుండా చూసుకోవ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని నిర్వాహ‌కులు తెలిపారు. తాము ఇంట్లో ఉండ‌డం క‌న్నా హీల్‌లో ఉండ‌డ‌మే బాగుంటుంద‌ని విద్యార్థులు కూడా చెబుతున్నారు.

"అప్పుడ‌ప్పుడూ సెల‌వుల‌కు ఇంటికి వెళ‌తాను. అక్క‌డ మాకు ఎటువంటి స‌దుపాయాలు ఉండ‌వు. ఇక్క‌డ అన్ని సౌకర్యాలు క‌ల్పించారు. దాంతో, ఇంటికి వెళ్లాల‌నే ఆలోచ‌నే రాదు. అమ్మా, నాన్న లేర‌నే బెంగ లేకుండా ఇక్క‌డ చూసుకుంటారు. హీల్ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా బాగా చ‌దివి మంచి డాక్ట‌ర్ కావాల‌న్న‌దే నా ల‌క్ష్యం" అంటోంి ప్ర‌స్తుతం ఎస్సెస్సీ బోర్డ్ ప‌రీక్ష‌లు రాస్తున్న జి. జాహ్న‌వి.

విద్యార్ధులకు పోషకాహారం

ఎలాంటి రసాయనాలు లేని ఆహార పదార్థాల ఉత్పత్తి దిశగా హీల్ అడుగులు వేస్తోంది. ఇక్కడ బియ్యం, పాలు మినహా మిగతా కాయగూరలు వంటివన్నీ స్వయంగా విద్యార్థుల తోడ్పాటుతో పండించే ప్రయత్నాలు చేస్తున్నారు.రోజూ ఉదయాన్నే పాలు, అల్పాహారం ఇస్తారు. మధ్యాహ్నం భోజనం‌, సాయంత్రం చిరు ధాన్యాలతో స్నాక్స్ అందించే మెనూ అమలు చేస్తున్నారు. రాత్రికి భోజనంలో ఆకుకూరలు ఎక్కువగా ఇస్తున్నారు.

విదేశాల్లోనూ హీల్ శాఖ‌లు..

ఈ సేవలను మరింత మరింత మెరుగుపరిచేందుకు, విస్తరించేందుకు అమెరికా, ఆస్ల్రేలియా, యూర‌ప్ లో కూడా హీల్ శాఖ‌లు ఏర్పాటు చేశారు. ఈ కృషిలోనూ సత్యప్రసాద్ మిత్రులు, ఆయన కృషి గురించి తెలిసిన వారు పాలు పంచుకుంటున్నారు. ఎంతో మంది స్వచ్ఛందంగా ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకు వస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి ఈ సంస్థకు నిధులు వస్తున్నాయి. దాంతో పాటు 12 ఏళ్లుగా ప్రతీ ఏటా సైక్లింగ్ మారథాన్ నిర్వహిస్తూ నిధుల సేకరణ చేస్తున్నారు.

అనాథలకు ఆశ్రయం కల్పించి, విద్యాబోధ‌న అందిస్తూ, ఉత్త‌మ పౌరులుగా తీర్చిదిద్దేందుకు హీల్‌లో జరుగుతున్న కృషి స్ఫూర్తి కలిగిస్తోందని ఆస్ట్రేలియాలోని ఓ టెలికాం సంస్థ‌లో ప‌నిచేస్తున్న యువ ఇంజ‌నీర్ కె. ర‌మ్య అన్నారు.

ఇటీవల సెల‌వు మీద ఇండియాకు వ‌చ్చిన రమ్య, "ఏటా సెల‌వుల్లో ఇక్క‌డికి వ‌చ్చిన స‌మ‌యంలో సంస్థ‌ను స‌మ‌ర్థ‌వంతంగా తీర్చిదిద్ది, మ‌ళ్లీ త‌న విధుల కోసం లండ‌న్ వెళ్లినప్పుడు కూడా హీల్ నిర్వ‌హ‌ణ ఏర్పాట్ల‌ను చూస్తున్న స‌త్య‌ప్ర‌సాద్ వంటి వారు మా అందరికీ స్ఫూర్తి ప్రదాత. నేను కూడా 40 ఏళ్ల‌కే రిటైర్ కావాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఇలాంటి ఆశ్ర‌మం ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాను" అని తెలిపారు.

ఇప్పుడు హీల్ సేవ‌లు అందుకుంటున్న విద్యార్థులు మెరుగైన భవిష్యత్తును సొంతం చేసుకుని మళ్ళీ తమ వంతు సేవలు అందించేందుకు ముందుకు వస్తే వ్య‌వ‌స్థాప‌కుడు స‌త్య‌ప్ర‌సాద్ అంటున్నారు. హీల్ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను వారంతా స్వీకరిస్తే అంత‌కుమించిన ఆనందం ఏముంటుందని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)