దిల్లీలో హింస: ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్వీట్లకు మించి ఏమైనా చేయగలరా?

  • 27 ఫిబ్రవరి 2020
అరవింద్ కేజ్రీవాల్ Image copyright @ARVINDKEJRIWAL

ఈశాన్య దిల్లీలో ఆదివారం సాయంత్రం నుంచి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జాఫ్రాబాద్, మౌజ్‌పూర్‌లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండి ప్రస్తుతం బీజేపీలో ఉన్న కపిల్ మిశ్రా, 'పోలీసులు చెప్పినా వినకండి' అని ఆదివారం సాయంత్రం నుంచే చెబుతున్నారు.

అదే రోజు సాయంత్రం సీఏఏ మద్దతుదారులు, వ్యతిరేకులు రాళ్లు రువ్వుకున్నారని, మౌజ్‌పూర్ చౌరస్తాలో చాలా మందిని మతపరంగా అడ్డుకుని హింసకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి.

కేజ్రీవాల్ మొదటి ట్వీట్

దిల్లీ పరిస్థితిపై అరవింద్ కేజ్రీవాల్ సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు "దిల్లీ తగలబడుతోంది. చాలా ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి" అని ట్వీట్ చేశారు.

భారీ ఆధిక్యంతో దిల్లీ ముఖ్యమంత్రి అయిన అరవింద్ కేజ్రీవాల్ కేవలం ట్వీట్స్ మాత్రమే చేస్తూ వచ్చారు.

తన మొదటి ట్వీట్‌లో కేజ్రీవాల్ "దిల్లీలో కొన్ని ప్రాంతాల్లో శాంతిభద్రతలు అదుపు తప్పడంతో జనం ఇబ్బందులు పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నేను లెఫ్టినెంట్ గవర్నర్, హోంమంత్రిని శాంతిభద్రతలను అదుపు చేయాలని, శాంతిని పునరుద్ధరించాలని అపీల్ చేస్తున్నా" అన్నారు.

ఆ తర్వాత కేజ్రీవాల్ ఎల్జీ అనిల్ బైజల్‌తో మాట్లాడారు. శాంతి నెలకొనేలా చూడాలని కోరుతూ మరో ట్వీట్ చేశారు.

అందులో "దయచేసి హింసను వదలండి. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. శాంతి ద్వారా అన్ని సమస్యలనూ పరిష్కరించుకోవచ్చు" అన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ మిగతా నేతలు కూడా ట్విటర్‌లో శాంతి సందేశాలు ఇస్తుంటే, కేజ్రీవాల్ వాటిని రీట్వీట్ చేస్తూ వచ్చారు.

Image copyright AFP

దిల్లీ పరిస్థితిపై ఆందోళన

ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా కూడా ట్వీట్ చేస్తూ "మూడు దశాబ్దాల్లో దిల్లీలో ఎప్పుడూ లేని పరిస్థితిని మొదటిసారి చూస్తున్నాను" అని భయాందోళనలు వ్యక్తం చేశారు.

ఆ తర్వాత మంగళవారం ఉదయం 9 గంటలకు కేజ్రీవాల్ మరో ట్వీట్ చేశారు. దిల్లీలో పరిస్థితిలపై ఆందోళన వ్యక్తం చేశారు. సరిగ్గా అదే సమయంలో దిల్లీలోని వివిధ ప్రాంతాలకు హింస వ్యాపించినట్లు వార్తలు వస్తున్నాయి.

మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు కేజ్రీవాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దిల్లీ పరిస్థితిపై తనకు ఎంత ఆందోళనగా ఉందో చెప్పారు. దిల్లీ ప్రజలు శాంతియుతంగా ఉండాలని మరోసారి అపీల్ చేశారు.

"ఎవరికి ఎన్ని సమస్యలు ఉన్నా, అందరూ కూర్చుని దానికి పరిష్కారం వెతకాలి. హింస వల్ల ఏ పరిష్కారం లభించదు. శాంతియుతంగా ఉండాలని అందరికీ నా విన్నపం" అన్నారు.

హింసలో చనిపోయిన వారిని ప్రస్తావించిన కేజ్రీవాల్ "మృతిచెందిన వారందరూ మనవారే. హింస పెరిగితే, ఎవరికైనా అలా జరగవచ్చు" అన్నారు.

Image copyright EPA

అమిత్ షాతో సమావేశం

అరవింద్ కేజ్రీవాల్ ఆ తర్వాత కాసేపటికి ఎల్జీ అనిల్ బైజల్‌, హోంమంత్రి అమిత్ షాను కలిశారు. వారితో సమావేశమైన తర్వాత ఆయన దిల్లీలో పోలీస్ సెక్యూరిటీ పెంచుతున్నట్లు చెప్పారు. హోంమంత్రిని కలిశాక పార్టీ నేతలతో కలిసి కేజ్రీవాల్ రాజ్‌ఘాట్ వెళ్లారు. దిల్లీలో శాంతి నెలకొనాలని ప్రార్థించారు.

కానీ వీటన్నిటి వల్ల హింస ఆగలేదు, ప్రజలకు ఉపశమనం కూడా లభించలేదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో కేజ్రీవాల్ ఇంకా ఎన్నో చేసుండవచ్చని ప్రశ్నలు వస్తున్నాయి.

దిల్లీ ముఖ్యమంత్రిగా రాజధానిలో అలాంటి పరిస్థితులు ఉన్న చోటుకు చేరుకోవడం ఆయన మొదటి బాధ్యత. ఆయన ప్రభావవంతమైన వ్యక్తులతో ఒక టీమ్ ఏర్పాటు చేసి ప్రజలను కలవాలి. హింసను ఆపగలగాలి" అని సీనియిర్ జర్నలిస్ట్ ప్రమోద్ జోషీ చెప్పారు.

"దిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ స్వయంగా ఒక ప్రభావవంతమైన వ్యక్తి. ఆయన మంత్రిమండలి సభ్యులు ఉన్నారు. అందరూ కలిసి ప్రజలను సంప్రదించవచ్చు. వారికి నచ్చజెప్పవచ్చు. ఇది శాంతిభద్రతల అంశం మాత్రమే కాదు. ప్రజల్లో ఇలా భ్రమ లాంటి స్థితి కూడా ఉండవచ్చు. అందుకే ఆయన వారితో సంప్రదింపులు జరుపుతూ వాటిని దూరం చేసే ప్రయత్నం చేయవచ్చు" అన్నారు.

Image copyright Twitter/@ArvindKejriwal

ఆమ్ ఆద్మీ పార్టీ వాదన

అటు ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తమ పార్టీ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రజలను వరుసగా కలుస్తున్నారని, శాంతియుతంగా ఉండాలని కోరుతున్నారని చెప్పారు.

"రాజధానిలో అదుపుతప్పుతున్న పరిస్థితులకు నేరుగా హోంమంత్రి అమిత్ షాదే బాధ్యత. పరిస్థితి చేయిదాటిపోతున్నప్పుడు హోంమంత్రి సైన్యాన్ని పిలిపించడం, కర్ఫ్యూ విధించడం లాంటివి చేయాలి. కానీ, సమయానికి ఆ చర్యలు చేపట్టలేదు. దాంతో పరిస్థితి దారుణంగా మారింది" అన్నారు.

"హింసను వ్యాప్తి చేస్తున్నవారు ఎవరి సంరక్షణ పొందుతున్నారు. వారిని ఎందుకు అడ్డుకోవడం లేదు అనేది ఆశ్చర్యంగా ఉంది. అమిత్ షా దేశానికి హోంమంత్రి అయినప్పటి నుంచి దిల్లీలో శాంతి భద్రతలు అంతకంతకూ దిగజారుతున్నాయి" అన్నారు.

దిల్లీ చట్టవ్యవస్థ బాధ్యతలు, దిల్లీ పోలీస్ నియంత్రణ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చేతుల్లో ఉన్నాయి.

దిల్లీలో శాంతిభద్రతలకు ఎప్పుడు విఘాతం కలిగినా, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హోంమంత్రిత్వ శాఖపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దిల్లీ పోలీసులను దిల్లీ సర్కారుకు అప్పగించాలని డిమాండ్ చేస్తుంటారు.

Image copyright EPA

కానీ, ఆయన అలా చెబుతూ తన బాధ్యతల నుంచి తప్పించుకోగలరా?

ఈ ప్రశ్నకు సమాధానంగా ప్రమోద్ జోషి.. "దిల్లీ ప్రభుత్వం అధీనంలోని పోలీసులు లేరు. అలాంటప్పుడు దిల్లీ ప్రభుత్వం చేయలేని చాలా పనులు ఉంటాయి. కానీ, కేజ్రీవాల్ దగ్గర పాలనా యంత్రాంగం ఉంది. పార్టీ కార్యకర్తలు ఉన్నారు. కేజ్రీవాల్ చాలా పాపులర్, ప్రభావవంతమైన నేత కూడా. ట్వీట్ చేయడమే కాకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన చేయగలిగినవి ఎన్నో ఉన్నాయి" అన్నారు.

"కేజ్రీవాల్ ప్రజల మధ్యకు వెళ్లాలి. మనం నేరుగా మైదానంలోక దిగాల్సిన అవకాశాలు ఇలాగే వస్తాయి. ప్రజల మధ్యకు వెళ్లాలి. మన గుడ్‌విల్ వ్యక్తం చేయాలి. ప్రజలను అర్థం చేసుకోవాలి. ఇదంతా రాత్రీ పగలును ఏకం చేయడం లాంటిది".

"పోలీసులు మా దగ్గర లేరని చెప్పడం కేవలం ఒక సాకులాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా చేయగలిగిన ఏ పనులనూ చేయలేదు" అని ప్రమోద్ అన్నారు.

ఈ ఆరోపణలపై సమాధానంగా "మా ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రే ఎల్జీ ఇంటికి వెళ్లారు. కానీ ఆయన కలవలేదు. మా ప్రతినిధి పోలీస్ కమిషనర్‌ను కూడా కలవడానికి వెళ్లారు. తర్వాత ఉదయం పార్టీ నేతలందరూ ప్రజలతో టచ్‌లో ఉండాలని, పీస్ మార్చ్ చేయాలని అరవింద్ కేజ్రీవాల్ సూచించారు.

Image copyright Twitter/@ArvindKejriwal

అన్ని ప్రయత్నాలూ చేశారు

మేం దిల్లీని ప్రశాంతంగా ఉంచడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తాం. పోలీసు బలగాలు లేని ఒక ముఖ్యమంత్రిగా ఆయన తను చేయగలిగిన అన్ని ప్రయత్నాలూ చేశారు" అని సంజయ్ సింగ్ చెప్పారు.

"దిల్లీలో అశాంతి సృష్టించేందుకు చాలా పెద్ద కుట్ర చేశారు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉండడానికి కేంద్ర ప్రభుత్వమే కారణం. దిల్లీ ప్రశాంతంగా ఉండడం అమిత్ షాకు ఇష్ట లేదు" అన్నారు సంజయ్ సింగ్.

ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే నెలలో భారీ ఆధిక్యంతో మళ్లీ దిల్లీలో అధికారం చేజిక్కించుకుంది.

రాజధాని దిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రెండు నెలలకు పైగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. కానీ, ఆ సమయంలో అరవింద్ కేజ్రీవాల్, ఆయన పార్టీ ఈ ఆందోళనలకు దూరంగా ఉంటూ వచ్చారు.

ప్రమోద్ జోషి దీనిపై "ఈ నిరసనలు మొదలైనప్పటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్‌ ఆయా ప్రాంతాల్లో టచ్‌లో ఉండాల్సింది. ఏదో రాజకీయ కారణంతో వారు ఆ ప్రాంతాలకు కావాలనే దూరంగా ఉండాలని అనుకున్నట్టు అనిపిస్తోంది" అన్నారు.

Image copyright EPA

కేజ్రీ పాత్రపై ప్రశ్నలు

మరోవైపు చాలా మంది జర్నలిస్టులు కూడా కేజ్రీవాల్ పాత్రపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

జర్నలిస్ట్ స్వాతి చతుర్వేది తన ట్వీట్‌లో "కేజ్రీవాల్ ఏదైనా మాట్లాడండి.. మీరు దిల్లీకి ముఖ్యమంత్రి. ఇది చాతుర్యం కాదు పిరికితనం. బాధితులకు అండగా నిలబడండి" అన్నారు.

నటి స్వరా భాస్కర్ కేజ్రీవాల్‌తో "ట్వీట్ చేయడం కంటే ఎక్కువగా ఏదైనా చేయండి" అన్నారు. ఆ ట్వీట్ తర్వాత కేజ్రీవాల్ ఆమెను అన్ ఫాలో చేశారు.

రాజదాని దిల్లీలో వరుసగా మూడోరోజూ హింస జరిగింది. ఈశాన్య దిల్లీలో చాలా ప్రాంతాల్లో ఇళ్లు, షాపులకు నిప్పు పెట్టారు. మతపరంగా కొన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారు.

ఈ హింసాత్మక ఘటనల్లో 20 మంది మృతిచెందారని అధికారులు ధ్రువీకరించారు. మరో 150 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: వైరల్ లోడ్ అంటే? ఎక్కువ మంది వైద్య సిబ్బంది అనారోగ్యానికి గురవ్వడానికి కారణం ఏంటి?

కేసీఆర్ చెప్పినా ఆగని వలసలు

లాక్‌డౌన్ ఏప్రిల్ 15తో ముగుస్తోందా?

కరోనావైరస్: 10 లక్షలకు చేరువలో మొత్తం కేసులు, 50 వేలు దాటిన మృతులు; ఆంధ్ర ప్రదేశ్‌లో 149, తెలంగాణలో 154కు చేరిన కేసులు

డేనియల్ పెర్ల్ హత్యకేసులో దోషికి మరణశిక్షను రద్దుచేసిన పాకిస్తాన్

మద్యం దొరక్క మందుబాబుల వింత ప్రవర్తన, ఎర్రగడ్డ ఆస్పత్రికి పెరిగిన రద్దీ

కరోనావైరస్‌: రెండు వ్యాక్సీన్లపై పరీక్షలు మొదలుపెట్టిన శాస్త్రవేత్తలు

కరోనావైరస్: భారత మీడియా చైనాను ఎందుకు లక్ష్యంగా చేసుకుంది.. చైనా కుట్ర సిద్ధాంతంపై ఏమంటోంది

కరోనా లాక్‌డౌన్: ఉత్తరప్రదేశ్‌లో వలస కార్మికులపై రసాయనాలు చల్లిన వీడియోలో ఏముంది