దిల్లీ హింస: తాహిర్ హుస్సేన్‌‌పై హత్యాయత్నం కేసు... పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఆప్

  • 27 ఫిబ్రవరి 2020
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు తాహిర్ హుస్సేన్
చిత్రం శీర్షిక ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు తాహిర్ హుస్సేన్

దిల్లీలో కొనసాగుతున్న హింసాత్మక ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 38కి చేరుకుంది. ఈశాన్య దిల్లీలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో గాయపడి గురుతేజ్ బహదూర్ (జీటీబీ) ఆస్పత్రిలో చేరిన వారిలో 34 మంది చనిపోయారని, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో ముగ్గురు చనిపోయారని, జగ్ పర్వేశ్ చందర్ ఆస్పత్రిలో ఒకరు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

ఈశాన్య దిల్లీలో హింస, అల్లర్లపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం రాత్రి సమీక్ష జరిపారు.

ఈ హింసకు సంబంధించి ఇప్పటి వరకు 48 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామని, 514 మంది అనుమానాస్పద వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని, అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నామని కేంద్ర హోం శాఖ ప్రకటించింది. గత 36 గంటలుగా ఈశాన్య దిల్లీ ప్రశాంతంగా ఉందని, ఎటువంటి హింసాత్మక సంఘటనలూ నమోదు కాలేదని తెలిపింది.

మరోవైపు పోలీసులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన షారూఖ్‌ను ఇంకా అరెస్ట్ చేయలేదని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు ప్రకటించారు.

కాగా, దిల్లీ హింసపై విచారణ జరిపేందుకు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్) ఏర్పాటయ్యాయి. దిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ పర్యవేక్షణలో ఈ బృందాలు పనిచేస్తాయి. ఇప్పటి వరకూ నమోదైన ఎఫ్ఐఆర్‌లు అన్నింటినీ సిట్‌ బృందాలకు బదిలీ చేయనున్నారని ఏఎన్ఐ తెలిపింది.

కాగా, ఈశాన్య దిల్లీలో చెలరేగిన హింసలో మృతి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, స్థానిక నెహ్రూ విహార్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌‌పై హత్యాయత్నం అభియోగాలు నమోదయ్యాయి.

ఈ మేరకు దిల్లీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 (హత్యాయత్నం) కింద దయాల్‌పూర్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో తాహీర్ హుస్సేన్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ సస్పెండ్ చేసింది. ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది.

అంకిత్ శర్మ మృతికి బాధ్యత వహించాల్సింది తాహిర్ హుస్సేనే అని అంకిత్ శర్మ తండ్రి రవీందర్ శర్మ, బంధువులతో పాటు తాహిర్ హుస్సేన్ ఇరుగుపొరుగు వారు కూడా పలు మీడియా చానెళ్లతో అన్నారు.

ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా సోషల్ మీడియాలో పలు వీడియోలు షేర్ అవుతున్నాయి. వాటిలో.. ఐదంతస్తుల భవనంపై నుంచి కొందరు రాళ్లు రువ్వుతుండగా, అక్కడే తాహిర్ హుస్సేన్ ఉన్నారు. ఈ భవనం తాహిర్ హుస్సేన్ ఇల్లు అని తెలుస్తోంది. కానీ, ఈ వీడియోలు వాస్తవమా? కాదా? అన్నది మాత్రం ఇంకా నిర్థరణ కాలేదు.

ఈ నేపథ్యంలో ఈశాన్య దిల్లీలోని తాహిర్ హుస్సేన్ ఫ్యాక్టరీని పోలీసులు సీజ్ చేశారు.

కాగా, అంకిత్ శర్మ మృతికి తాను కారణమంటూ అనుమానాలు వ్యక్తం కావటంపై తాహిర్ హుస్సేన్ స్పందించారు. కొందరు దుండగులు తన ఇంట్లోకి చొచ్చుకుని వచ్చారని, వారిని ఆపేందుకు తాను ప్రయత్నించానని, తాను అమాయకుడినని అన్నారు. అంకిత్ శర్మ మృతి విచారకరమని, ఈ కేసుపై సమగ్ర విచారణ జరపాలని, తనకూ ఐబీ అధికారి మరణానికీ సంబంధం లేదని చెప్పారు.

తాహిర్ హుస్సేన్ ఇంటికి సమీపంలోనే అంకిత్ శర్మ మృతదేహం లభించింది.

తన కుమారుడిని కొందరు దుండగులు లాక్కెళ్లారని, కత్తులతో పొడిచి, పిస్టళ్లతో కాల్చి చంపారని రవీందర్ శర్మ చెప్పారు.

అంకిత్ శర్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీబీటీ ఆస్పత్రికి తరలించారు.

కాగా, హింసకు పాల్పడింది ఎవరైనా, ఏ మతం వారైనా సరే తగిన శిక్ష పడాలని, తమ పార్టీవారైతే రెండింతలు శిక్ష పడాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు.

Image copyright facebook/SwaraBhaskar

స్వర భాస్కర్‌పై కేసు పెట్టాలంటూ దిల్లీ హైకోర్టులో పిటిషన్

బాలీవుడ్ నటి స్వర భాస్కర్, సామాజిక కార్యకర్త హర్ష్ మందెర్, రేడియో జాకీ సయీమ, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌లపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసేలా పోలీసుల్ని ఆదేశించాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో సంజీవ్ కుమార్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.

అలాగే, దిల్లీ హింసపై ఎన్ఐఏ చేత దర్యాప్తు చేయించాలని ఈ పిటిషన్‌లో కోరారు.

దిల్లీకి చెందిన స్వర భాస్కర్ ట్విటర్‌లో దిల్లీ హింసపై వరుస ట్వీట్లు చేస్తున్నారు. హింసకు పాల్పడుతున్న, రెచ్చగొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పలు ట్వీట్లలో కోరారు. జస్టిస్ మురళీధర్ బదిలీపైన కూడా ఆమె ట్వీట్లు చేశారు. అధికార బీజేపీ వైఖరిని ఆమె తప్పుపట్టారు.

ఇదిలా ఉంటే.. అసలు ఎవరిపైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేయకూడదని తాము నిర్ణయించుకున్నామని దిల్లీ పోలీసులు హైకోర్టుకు తెలిపారు.

విద్వేష ప్రసంగాలు చేసిన బీజేపీ నాయకులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పోలీసు కమిషనర్ స్వయంగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించాలని హైకోర్టు ఆదేశించింది.

ప్రస్తుత పరిస్థితుల్లో విద్వేష ప్రసంగాలు చేశారంటూ ఎవరిపైన అయినా ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం వల్ల శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనబోవని దిల్లీ పోలీసులు తెలిపారు.

అయితే, హింసకు, అల్లర్లకు పాల్పడిన వారిపై ఇప్పటి వరకు 48 ఎఫ్ఐఆర్‌లు దాఖలు చేశామని పోలీసులు కోర్టుకు తెలిపారు.

ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చిన హైకోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్ 13వ తేదీకి వాయిదా వేసింది. ఈలోపు కేంద్ర ప్రభుత్వం తన స్పందనను తెలియజేయాలని ఆదేశించింది.

Image copyright Inc @Twitter
చిత్రం శీర్షిక రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ నేతలతో కలిసి రాష్ట్రపతిని కలిసిన సోనియా గాంధీ

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంలో ఆ పార్టీ నేతలు గురువారం రాష్ట్రపతిని కలిసి దిల్లీలో జరుగుతున్న హింసపై ఒక వినతి పత్రాన్ని సమర్పించారు.

Image copyright Reuters

దిల్లీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘర్షణల్లో ఎంతో మంది చనిపోయారని, మరెందరో గాయపడ్డారని, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. దిల్లీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఈ హింసను నిరోధించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు.

భారత రాజ్యాంగం ప్రకారం పౌరుల రక్షణ బాధ్యత రాష్ట్రపతిపై ఉంటుందని, ఆయన ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటారనే నమ్మకం ఉందని సోనియా గాంధీ అన్నారు.

కేంద్ర హోం మంతి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని సోనియా ఇవాళ మరోసారి డిమాండ్ చేశారు. బుధవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా ఆమె, దిల్లీ హింసను నిరోధించడంలో హోం మంత్రి పూర్తిగా విఫలమయ్యారని, ఆయన వెంటనే తన పదవి నుంచి తప్పుకోవాలని అన్నారు.

రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ ప్రతినిధుల బృందంలో ఉన్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, దేశంలో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వానికి తగిన సూచనలు చేసేందుకు రాష్ట్రపతి తన అధికారాలు ఉపయోగించుకోవాలని కోరినట్లు తెలిపారు.

ఈ విషయంలో తగిన విధంగా స్పందిస్తానని రాష్ట్రపతి హమీ ఇచ్చారని సోనియా గాంధీ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రోజు 43 కొత్త కోవిడ్ కేసులు, 87కు పెరిగిన వైరస్ బాధితులు

కరోనావైరస్: దిల్లీ నిజాముద్దీన్‌ తబ్లీగీ జమాత్ సదస్సుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంత మంది వెళ్ళారు?

కరోనావైరస్: రుణాల చెల్లింపులపై ఆర్‌బీఐ మారటోరియం - ఈఎంఐ కట్ అవుతుందా? వాయిదా వేయటం ఎలా?

కరోనావైరస్: నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్ కేంద్రం ‘హాట్ స్పాట్’ ఎలా అయ్యింది?

కరోనావైరస్: వృద్ధులు చేయాల్సిన, చేయకూడని పనులు

కరోనావైరస్‌తో పోరాటం కోసం ఏర్పాటైన PM CARES ఫండ్‌పై ప్రశ్నలు

కరోనావైరస్: భారత సైన్యం రాత్రికి రాత్రే 1,000 పడకల ఆస్పత్రి నిర్మించిందా? ఏది నిజం? - BBC FactCheck

కరోనావైరస్: ప్రభుత్వం, సమాజం స్పందించే తీరులో వర్ణ వ్యవస్థ ఛాయలు - అభిప్రాయం

కరోనావైరస్‌లో ఏముంది... అది ఎందుకంత ప్రమాదకరం?