దిల్లీ హింస: అల్లర్లలో మరణించినవారి వ్యధలివీ..

దిల్లీ హింస

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీలో చెలరేగిన అల్లర్లలో ఇప్పటికి 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 150 మందికిపైగా గాయపడ్డారు.

పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య మొదలైన చిన్న చిన్న ఘర్షణలు చూస్తుండగానే హిందూ-ముస్లిం అల్లర్లుగా మారిపోయాయి.

ఈ అల్లర్లలో మరణించినవారి కథలను తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. బాధితుల కుటుంబ సభ్యులు, ఘటనలు జరిగినప్పుడు అక్కడున్న ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి, కొందరి వివరాలను రాబట్టింది.

గమనిక: ఇది పూర్తి జాబితా కాదు.

ఫొటో సోర్స్, DHEERAJ BARI

1.రతన్ లాల్, వయసు: 42 ఏళ్లు

మరణానికి కారణం: తూటా తగలడం

వృత్తి: దిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్

ఈ అల్లర్లలో మరణించిన మొదటి వ్యక్తి రతన్ లాలే అని భావిస్తున్నారు. రాళ్ల దాడిలో గాయపడి రతన్ లాల్ మరణించినట్లు ప్రాథమిక నివేదికలు పేర్కొన్నాయి.

అయితే, రతన్‌కు తూటా కూడా తగిలినట్లు దిల్లీ పోలీసు పీఆర్ఓ అనిల్ మిత్తల్ బీబీసీతో చెప్పారు.

రతన్‌కు తల్లి, భార్య, ముగ్గురు పిల్లలు, ఇద్దరు సోదరులు ఉన్నారు.

1998లో రతన్ లాల్ దిల్లీ పోలీసు శాఖలో ఉద్యోగంలో చేరారు. రెండేళ్ల క్రితం హెడ్‌కానిస్టేబుల్‌గా ప్రమోషన్ వచ్చింది. ఆయన స్వస్థలం రాజస్థాన్‌లోని సీకర్.

ఫొటో సోర్స్, Gajendra Singh

2.వీర్‌భాన్, వయసు: 45 ఏళ్లు

మరణానికి కారణం: తూటా తగలడం

వృత్తి: చిరు వ్యాపారి

ఫిబ్రవరి 25న వీర్‌భాన్ తన ఇంటికి, శివ విహార్ చౌక్ మీదుగా వెళ్తున్నారు. ఆ రోజు ఆ ప్రాంతంలో అల్లర్లు జరిగాయి.

వీర్‌భాన్ దేహం అక్కడ పడి ఉన్నట్లు తమకు సమాచారం అందిందని ఆయన కుటుంబ సభ్యులు బీబీసీతో చెప్పారు.

‘‘జీటీబీ ఆసుపత్రికి వీర్‌భాన్‌ను తీసుకువెళ్లాం. ప్రాణాలు మిగల్లేదని వైద్యులు చెప్పారు’’ అని వీర్‌భాన్ సోదరుడు గజేంద్ర సింగ్ అన్నారు.

వీర్‌భాన్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి కుటుంబానికి ఆయన సంపాదనే ఆధారం.

ఫొటో సోర్స్, AFP

3.మెహతాబ్, వయసు: 23 ఏళ్లు

మరణానికి కారణం: సజీవ దహనం

వృత్తి: భవననిర్మాణ కూలీ

బృజ్‌పురి‌లో ఉండే మెహతాబ్ ఫిబ్రవరి 25న సాయంత్రం పాలు కొందామని బయటకు వచ్చారు. తిరిగి ఆయన ఇల్లు చేరలేదు.

మెహతాబ్‌ను ఎవరో సజీవ దహనం చేసినట్లు ఆయన సోదరికి సమాచారం అందింది. ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపే ఆయన మరణించారు.

మెహతాబ్ తన తల్లి, సోదరుడు, సోదరి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఉండేవారు.

ఫొటో సోర్స్, Rashid Alvi

4.షాహిద్ అల్వీ, వయసు: 23 ఏళ్లు

మరణానికి కారణం: తూటా తగలడం

వృత్తి: ఆటో డ్రైవర్

షాహిద్‌ను ఆటో నుంచి బయటకు లాగి రెండు సార్లు కాల్పులు జరిపారని ఆయన సోదరుడు ఇమ్రాన్ బీబీసీతో చెప్పారు.

షాహిద్‌ను ఎవరో అపరిచితులు ఆసుప్రతికి తీసుకువెళ్లారు.

షాహిద్ చనిపోయిన సమాచారం ఆయన కుటుంబ సభ్యులకు వాట్సాప్ ద్వారా తెలిసింది.

‘‘చనిపోయిన వ్యక్తులంటూ వాట్సాప్‌లో వచ్చిన ఫొటొల్లో షాహిద్ కూడా ఉన్నాడు. మేం వెంటనే ఆసుపత్రికి పరుగుతీశాం’’ అని ఇమ్రాన్ చెప్పారు.

షాహిద్‌కు నాలుగు నెలల క్రితమే వివాహమైంది. ఇప్పుడు ఆయన భార్య గర్భవతి.

ఫొటో సోర్స్, AFP

5. ముబారక్ హుస్సేన్, వయసు: 32 ఏళ్లు

మరణానికి కారణం: తూటా తగలడం

వృత్తి: కార్మికుడు

ముబారక్‌కు ముగ్గురు తమ్ముళ్లు. ఆయన తండ్రి బిహార్‌లో ఉంటారు.

వారి కుటుంబం అంతా ముబారక్‌ సంపాదనపైనే ఆధారపడి జీవిస్తోంది.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో ఆయన పాల్గొనేవారు.

అల్లర్ల సమయంలో ఛాతీలో తూటా తగిలి ముబారక్‌ చనిపోయారు. దాదాపు మూడు గంటపాటు ఆయన శవం రోడ్డుపైనే పడి ఉంది.

అంబులెన్స్ కోసం మూడు గంటలు వేచిచూశామని, ఎవరూ రాలేదని ముబారక్ ఇంటి యజమాని అన్నారు.

6.అశ్ఫాక్ హుస్సేన్, వయసు: 24 ఏళ్లు

మరణానికి కారణం: తూటాలు తగలడం

వృత్తి: ఎలక్ట్రీషియన్

ప్రేమికుల రోజున అశ్ఫాక్ హుస్సేన్ వివాహం జరిగింది. రెండు వారాలు కూడా తిరక్కుండానే ఆయన ఆల్లర్లలో మరణించారు.

ఈశాన్య దిల్లీలో పని ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో అశ్ఫాక్‌పై కాల్పులు జరిగాయి. ఆయనకు ఐదు తూటాలు తగిలాయి.

అశ్ఫా‌క్ మెడపైనా కత్తితో దాడి చేసినట్లు గాయం ఉందని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

పర్వేజ్ ఆలమ్ కొడుకు సాహిల్

7.పర్వేజ్ ఆలమ్, వయసు: 50 ఏళ్లు

మరణానికి కారణం: తూటా తగలడం

వృత్తి: స్థిరాస్తి వ్యాపారి

‘‘నా కళ్ల ముందు మా నాన్నను చంపారు. మా ఇంటి ముందు ఆయనపై కాల్పులు జరిగాయి’’ అని పర్వేజ్ ఆలమ్‌ కొడుకు మహమ్మద్ సాహిల్ బీబీసీతో చెప్పారు.

‘‘బయటకు వెళ్లొద్దని ఆయనకు చెప్తూ ఉన్నా. లోపలికి వద్దామని ఆయన వెనక్కి తిరిగారు. ఇంతలో ఆయన వీపులోకి తూటా దిగింది’’ అని ఆయన అన్నారు.

అంబులెన్స్ కోసం చాలా సేపు ఎదురుచూశామని, ఎంతకీ రాకపోవడంతో మోటార్ సైకిల్‌పై తన తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లామని సాహిల్ చెప్పారు.

అల్లర్ల భయంతో తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కూడా బంధువులు వెనుకాడారని అన్నారు.

ఫొటో క్యాప్షన్,

వినోద్ కుమార్ కొడుకు మోనూ

8.వినోద్ కుమార్, వయసు: 51 ఏళ్లు

మరణానికి కారణం: కొట్టడం

వృత్తి: వివాహాలు, వేడుకల నిర్వహణ వ్యాపారం

వినోద్ కుమార్ తన కొడుకు మోనూతో కలిసి మోటార్ సైకిల్‌పై మెడికల్ షాపుకు వెళ్తూ ఉండగా, ఓ మూక రాళ్లు, కత్తులతో వాళ్ల‌పై దాడి చేసింది.

వాళ్లంతా అల్లాహు అక్బర్ అని నినాదాలు చేస్తూ, తమపై దాడి చేశారని మోనూ చెప్పారు.

వినోద్ కుమార్ ఘటనాస్థలంలోనే చనిపోయారు. మోనూకు తీవ్ర గాయాలయ్యాయి.

తమ మోటార్ సైకిల్‌ను కూడా ఆ మూక తగులబెట్టిందని మోనూ చెప్పారు.

9.ఇస్తియాక్ ఖాన్, వయసు: 29 ఏళ్లు

మరణానికి కారణం: తూటా తగలడం

వృత్తి: వెల్డింగ్ కార్మికుడు

ఇస్తియాక్‌‌కు ఫిబ్రవరి 25న తూటా తగిలింది. ఆ మరుసటి రోజు ఆయన పుట్టిన రోజు.

25న ఇస్తియాక్ తమతోనే ఉన్నారని, ఆరోజు రాళ్ల దాడి జరిగిందని ఆయన పొరుగింట్లో ఉండే ఆరిఫ్ చెప్పారు.

‘‘పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఫైరింగ్ కూడా చేశారు. ఇస్తియాక్‌కు కాలిలో ఏదో తాకినట్లు అనిపించింది. కానీ, అది తూటా అని తనకు తెలియదు’’ అని ఆరిఫ్ అన్నారు.

కొద్ది సేపటికే ఇస్తియాక్‌ స్పృహ కోల్పోయారని, అక్కడున్న జనం సీపీఆర్ చేసి చూశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

ఆసుపత్రికి తీసుకువెళ్లాక వైద్యులు ఇస్తియాక్‌ ప్రాణాలకు ప్రమాదం ఏమీ లేదని చెప్పారని, కానీ, 3-4 గంటల తర్వాత ఆయన మరణించారని అన్నారు.

‘‘బయటకు వెళ్లొద్దని చెప్పా. కానీ నా మాట ఆయన వినిపించుకోలేదు’’ అని ఇస్తియాక్ భార్య జెబా బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

10. మహమ్మద్ ఫుర్కాన్, వయసు: 30 ఏళ్లు

మరణానికి కారణం: తూటా తగలడం

వృత్తి: కార్మికుడు

ఫిబ్రవరి 24న సాయంత్రం ఫుర్కాన్‌కు తూటా తగిలినట్లు ఆయన అన్న ఇమ్రాన్‌కు ఫోన్ వచ్చింది.

తనకు ఆ విషయం నమ్మశక్యంగా అనిపించలేదని, అంతకు గంట ముందే ఫుర్కాన్‌ను తాను కలిశానని ఇమ్రాన్ బీబీసీతో చెప్పారు.

ఫుర్కాన్ ఆ రోజు పనికి వెళ్లాడని, సామాను కోసం బయటకు వచ్చినప్పుడు ఇలా జరిగిందని అన్నారు.

‘‘ఫుర్కాన్‌ను ఎవరో ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు మాకు సమాచారం అందింది. అక్కడికి వెళ్లేసరికి చనిపోయి ఉన్నాడు’’ అని ఫుర్కాన్ కుటుంబ సభ్యులు చెప్పారు.

11.దీపక్, వయసు: 34 ఏళ్లు

మరణానికి కారణం: కత్తితో దాడి

వృత్తి: కార్మికుడు

దీపక్ శవం కోసం ఆసుపత్రి బయట వేచి చూస్తూ ఆయన బంధువులు బీబీసీతో మాట్లాడారు. అప్పటికి ఆయనకు ఏం జరిగిందో పూర్తిగా వారికి తెలియదు.

‘‘అతడి ముఖం మీద గాయాలు కనిపించాయి. అది ఏ గాయమో తెలియదు’’ అని వారిలో ఒకరు అన్నారు.

దీపక్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన స్వస్థలం బిహార్‌లోని అరా జిల్లా. పదేళ్లుగా దిల్లీలోనే ఉంటున్నారు.

విక్కీ అనే ఓ వ్యక్తి దీపక్‌ను ఆసుపత్రిలో చేర్చి, వాళ్ల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్,

అంకిత్ శర్మ, ఆయన తల్లి

12. అంకిత్ శర్మ, వయసు: 26 ఏళ్లు

మరణానికి కారణం: కొట్టడం, హింసించడం

వృత్తి: ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి

చాంద్‌బాగ్ ప్రాంతంలో అంకిత్ శర్మ మృతదేహం దొరికింది.

ఫిబ్రవరి 25న పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా అంకిత్‌పై దాడి జరిగిందని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.

అంకిత్ శరీరంపై చాలా లోతైన గాయాలున్నాయని, ముఖం మొత్తం గుర్తుపట్టలేకుండా ఉందని ఆయన సోదరుడు అంకుర్ బీబీసీతో చెప్పారు.

ఆ మరుసటి రోజు అంకిత్ దేహం దొరికింది.

అంకిత్‌పై దాడి చేసినవాళ్లు ఆయన మృతదేహాన్ని మురికి కాలువలో పడేశారని అంకుర్ చెప్పారు.

అంకిత్ తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగి.

13. రాహుల్ ఠాకుర్, వయసు: 23 ఏళ్లు

మరణానికి కారణం: తూటా తగలడం

వృత్తి: విద్యార్థి

ఇంట్లో రాహుల్ భోజనం చేస్తుండగా, బయట రాళ్లదాడి, ఫైరింగ్ జరుగుతున్న చప్పుళ్లు వినిపించాయని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.

చప్పుళ్లు ఏంటో చూసేందుకు రాహుల్ బయటకు వెళ్లాడని, అంతలోనే ఆయనకు ఛాతీలో తూటా తగిలిందని వాళ్లు వివరించారు.

జీటీబీ ఆసుపత్రికి తీసుకువెళ్లినా, ఆయన ప్రాణాలు నిలవలేదని అన్నారు.

ఫొటో సోర్స్, Saeed Salmani

14.అక్బరీ, వయసు: 85 ఏళ్లు

మరణానికి కారణం: సజీవ దహనం

అల్లరిమూక తమ ఇంటి భవనానికి నిప్పు పెట్టిందని అక్బరీ మనువడు సల్మానీ పీటీఐ వార్తాసంస్థతో చెప్పారు.

‘‘నేను అప్పుడే ఇంటికి వెళ్తున్నా. మా ఇంటిని ఓ గంపు చుట్టుముట్టి ఉండడటం గమనించా. వాళ్ల చేతుల్లో పెట్రోల్ బాంబు, కర్రలు ఉన్నాయి. ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి, భవనంపైకి వెళ్లమని చెప్పా. వాళ్లంతా అక్కడికి వెళ్లారు. కానీ, బామ్మ కిందే ఉండిపోయింది. ఆ మూక ఇంటికి నిప్పు పెట్టింది. కిందకు వచ్చిచూసేసరికి బామ్మ చనిపోయింది’’ అని ఆయన అన్నారు.

అక్బరీ భర్త 40 ఏళ్ల క్రితమే చనిపోయారు. ఆమె కూలీ పని చేస్తూ, ఏడుగురి పిల్లల్ని పోషిస్తూ వచ్చారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)