దిల్లీ హింస: రాజకీయ జోక్యానికి దిల్లీ పోలీసులు బలిపశువులయ్యారా? - అభిప్రాయం
- డాక్టర్ విభూతి నారాయణ్
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Getty Images
మూడు రోజుల వరకూ అల్లర్లతో అట్టుడికిన తర్వాత దిల్లీ మెల్ల మెల్లగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. మరికొన్నిరోజుల్లో రాజధాని మామూలుగా మారుతుందని భావిస్తున్నారు.
కానీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిష్కారం వెతికేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే చాలా ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి.
ఈసారీ, ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశ అధ్యక్షుడు ట్రంప్ నగరంలో పర్యటిస్తున్నప్పుడు దిల్లీలోని ఒక పెద్ద భాగం మతపరమైన అల్లర్ల గుప్పిట్లో చిక్కుకోవడం అనేది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం.
ఆయన పర్యటన కోసం నరేంద్ర మోదీ సర్కారు విస్తృత ఏర్పాట్లు చేసింది. అలాంటి సమయంలో దేశ రాజధానిలో అల్లర్లు జరగడాన్ని అసలు కోరుకుని ఉండకపోవచ్చు.
అల్లర్లు హఠాత్తుగా రాజుకున్నట్లు భావిస్తున్నారు. కానీ వాటికి నగరంలో గత కొన్నిరోజులుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు జరిగిన ఈ హింసకు అనుకూల వాతావరణాన్ని సృష్టించడంలో ప్రభుత్వం, అధికార పార్టీ చాలా పెద్ద ప్రముఖ పాత్ర పోషించాయి.
ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ అల్లర్ల తర్వాత పెద్ద ప్రశ్నలు
మతపరమైన అల్లర్లు ఒకదాని వెంట ఒకటి రాజుకున్న స్థితిలో దిల్లీ పోలీసులు విఫలం అవడానికి కారణం ఏమిటి అనే ప్రశ్నను శాంతి నెలకొన్న తర్వాత జాతీయ చర్చలో భాగం కావాల్సిన అవసరం ఉంది.
ఇలా జరిగిన ప్రతిసారీ, అల్లర్లను నియంత్రించే సమయంలో తమ ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా కాపాడేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదనే భావన మైనారిటీల మనసులో నాటుకుపోవడానికి ఏదో కారణం ఉంది. లేదంటే పోలీసులు చాలాసార్లు భారత రాజ్యాంగ ప్రాథమిక భావాలకు విరుద్ధం అయినవి అన్నీ చేసేశారు.
దిల్లీలో ఇటీవల ఘటనల గురించి బాగా అర్థం కావాలంటే, కొన్ని నెలలు, ముఖ్యంగా పౌరసత్వ సవరణ చట్టం ఆమోదించిన తర్వాత ఇక్కడ జరిగిన కొన్ని ఘటనలను గుర్తు చేసుకోవాలి.
ఒక స్థితిలో కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉన్న విశ్వవిద్యాలయంలో పోలీసులు వివిధ చర్యల ద్వారా ప్రభుత్వ పెద్దలను సంతోషపెట్టడానికి ఎంతవరకైనా వెళ్లగలమని స్పష్టం చేశారు.
ఒకసారి, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులపై క్యాంపస్ లోపలికే వెళ్లిమరీ దిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు.
మరోసారి, ఫీజుల పెంపును వ్యతిరేకంగా నిరనసలు చేపట్టిన జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం దగ్గర అదే పోలీసులు 'నిస్సహాయంగా' కనిపించారు. క్యాంపస్ లోపల ముసుగులు వేసుకున్న గుంపుల గూండాగిరీని అడ్డుకోవడానికి వైస్ చాన్సలర్ లేదా రిజిస్ట్రార్ అనుమతి కోసం వేచిచూస్తున్న దిల్లీ పోలీసుల విజువల్స్ డిసెంబర్ 5 సాయంత్రం దేశమంతా చూసింది.
ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ పోలీసుల వాదనలు
దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటైన జేఎన్‌యూలో ముఖాలు కనిపించకుండా గుడ్డలు కట్టుకున్న గూండాలు మహిళా హాస్టల్లో విధ్వంసం సృష్టించారు. తమ ప్రత్యర్థుల కాళ్లూ చేతులూ విరగ్గొడుతూ, విశ్వవిద్యాలయం ఆస్తులు కూడా ధ్వంసం చేస్తుంటే ఆ దృశ్యాలు మొత్తం ప్రపంచం చూసింది. భారత పోలీసులు అత్యంత సిగ్గుతో తలవంచుకోవాల్సిన క్షణాల్లో అది ఒకటి.
అప్పుడు దిల్లీ పోలీసు అధికారులు విశ్వవిద్యాలయం గేటు దగ్గర నిలబడి, లోపలకు వెళ్లి హింస అడ్డుకోడానికి, విశ్వవిద్యాలయం అధికారుల అనుమతి కావాలని వేచిచూస్తున్నారు.
గూండాలు వచ్చిన పని ముగించుకుని, క్యాంపస్ నుంచి వెళ్లిపోయిన తర్వాత వారికి అనుమతి లభించినపుడు మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
2019 డిసెంబర్ 15న దిల్లీ-నోయిడా మధ్య రద్దీగా ఉండే మార్గంలో కొంతమంది మహిళలు, పిల్లలు రాస్తారోకో చేస్తూ నిరసనలు చేస్తున్నప్పుడు కూడా దాదాపు ఇలాగే జరిగింది. మొదట అది కొన్నిరోజులు ఉంటుందిలే, తర్వాత వాళ్లే వెళ్లిపోతారు... లేదంటే పోలీసులు వాళ్లను బలవంతంగా ఖాళీ చేయిస్తారు అని అందరూ అనుకున్నారు.
కానీ, సరిగ్గా అప్పుడే దిల్లీలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో మత పునరేకీకరణ కోసం బీజేపీ ఈ షాహీన్ బాగ్ అంశాన్ని ఉపయోగించుకోనుందని త్వరగానే స్పష్టమైంది. అందుకే దిల్లీ పోలీసులు అక్కడి నుంచి వాళ్లను తరిమేస్తారని ఎలాంటి ఆశలూ పెట్టుకోలేం.
షాహీన్ బాగ్ నిరసనకారులకు కూడా ఎలాంటి ఎగ్జిట్ పాలసీ లేదు. ఒకసారి నిరసనల్లో కూర్చున్న తర్వాత లేవడం ఎలాగో వారికి తెలీదు. ఫలితంగా వారు స్పీడ్ బ్రేకర్లా అయిపోయారు. ఆ రోడ్డు ఉపయోగించుకునే లక్షల మందికి రోజూ అసౌకర్యం కలిగించింది.
ఫొటో సోర్స్, Reuters
ద్వంద్వ వ్యూహం
అది కాకుండా, షాహీన్ బాగ్ మోడల్‌ను జాఫ్రాబాద్లో కూడా చూపించాలని ప్రయత్నించినపుడు అక్కడ మరో రకం రాజకీయాలు కనిపించాయి. దానికి ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో... జాఫ్రాబాద్ మెట్రో, రోడ్డుపై కూర్చున్న వారంతా అక్కడి నుంచి త్వరగా వెళ్లకపోతే తమ మద్దతుదారులతో వారిని బలవంతంగా లేపేస్తామని బీజేపీ నేత కపిల్ మిశ్రా బెదిరించారు.
అసలే ఎన్ఆర్సీ వ్యతిరేక వాతావరణంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న నగరంలో అది మతపరమైన హింసా జ్వాలలు చెలరేగేలా చేసింది.
రాజధానిలో ఇప్పుడు జరిగిన అల్లర్లలో దిల్లీ పోలీసులు పూర్తిగా విఫలం అయ్యారు. ఈ వైఫల్యంతో మొత్తం పోలీసు వ్యవస్థలో మరోసారి సమగ్ర సవరణలు అవసరం అని అనిపిస్తోంది.
పోలీసు వ్యవస్థలో చేరిక, శిక్షణ, వనరులు లాంటి లెక్కలేనన్ని రంగాలు ఉన్నాయి. అవి భారీ సవరణలు కోరుకుంటున్నాయి. కానీ, ఈసారీ అందరి దృష్టినీ ఎక్కువగా ఆకర్షించిన వాస్తవం మాత్రం దిల్లీ పోలీసుల పనితీరులో రాజకీయ జోక్యం.
చూస్తుంటే, గత కొన్ని రోజులుగా దిల్లీ పోలీసుల పగ్గాలు మొత్తం నార్త్ బ్లాక్ తన చేతుల్లో ఉంచుకున్నట్టు అనిపిస్తోంది. కీలక నిర్ణయాలన్నీ హోంమంత్రి అమిత్ షా స్వయంగా తీసుకుంటున్నారు. ఈ రాజకీయ జోక్యం వల్లే షాహీన్ బాగ్‌లో రోడ్డుపై బైఠాయించిన నిరసనకారులను పోలీసులు ఖాళీ చేయించలేదు.
ఫొటో సోర్స్, Reuters
హోంమంత్రి అమిత్ షా దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ర్యాలీల్లో మాట్లాడుతూ "కమలం గుర్తుకు మీరు బటన్ నొక్కితే, ఆ కరెంటు షాహీన్ బాగ్ వరకూ తెలియాలి" అని ఓటర్లను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు.
అలాగే నగరంలోని రెండు విశ్వవిద్యాలయాల్లో నిరసనలు చేస్తున్న విద్యార్థులను అణచివేయడానికి పోలీసులతో ద్వంద్వ వ్యూహాలు అమలు చేశారు.
దానితోపాటు, బీజేపీ మంత్రులు, నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూనే వచ్చారు. దిల్లీ పోలీసులు వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇలాంటి రాజకీయ జోక్యంతో, అన్నిటికీ పూర్తిగా నాయకుల ఆదేశాలపై ఆధారపడిన దిల్లీ పోలీసులకు ఇటీవలి హింస మొదలైన సమయంలో కూడా... ఆ పరిస్థితిని ఎదుర్కోడానికి ఏం చేయాలో అర్థం కాలేదు.
దిల్లీ హింస చల్లారిన తర్వాత పోలీసు వ్యవస్థలో విస్తృత సవరణలపై తీవ్రంగా చర్చ జరగాలి. లేదంటే ఇలాంటి వైఫల్య గాధలు పునరావృతం అవుతూనే ఉంటాయి.
(ఇది రచయిత వ్యక్తిగత అభిప్రాయం)
ఇవి కూడా చదవండి:
- దిల్లీ హింస: అల్లర్లు చెలరేగిన వీధుల్లో ఐదు గంటల ప్రత్యక్ష అనుభవం ఇది...
- బాలాకోట్ వైమానిక దాడి జరిగి ఏడాది.. ఈ ప్రశ్నలకు భారత్, పాక్ రెండు దేశాల దగ్గరా సమాధానాలు లేవు
- హోస్నీ ముబారక్: కటిక పేదరికంలో పుట్టారు, 30 ఏళ్లు దేశాన్ని ఏలారు.. ఆ తర్వాత కటకటాల పాలయ్యారు
- కరోనావైరస్: వన్య ప్రాణులను తినడాన్ని నిషేధించిన చైనా ప్రభుత్వం
- దిల్లీ పోలీసులు విఫలమయ్యారా? రాష్ట్ర పరిధిలో ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవా?
- దిల్లీ హింస: తుపాకీ పట్టుకుని పోలీసులపై కాల్పులు జరుపుతున్న ఈ వ్యక్తి ఎవరు?
- పాకిస్తాన్ ఎవరికి భయపడి భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను విడిచిపెట్టింది?
- బంగారం ధరలు ఏ రోజుకి ఆరోజు కాదు.. ఏ పూటకి ఆ పూటే మారిపోతున్నాయా?
- ఒక్క మిడత ‘మహమ్మారి'లా ఎలా మారుతుంది
- హార్ట్ బ్రేక్ గైడ్: లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్ బాధ నుంచి బయటపడండి ఇలా..
- కరోనా వైరస్: పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్న వైరస్.. కారణాలు చెప్పలేకపోతున్న వైద్య నిపుణులు
- యువతను శాకాహారం వైపు నడిపిస్తున్న 7 అంశాలు
- ఇవాంకా ట్రంప్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషాప్ ఎడిట్ ఫొటోలు..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)