దిల్లీ‌లో అలర్లు చేయించేందుకు ముస్లింలకు డబ్బులు పంచారా? : Fact Check

  • కీర్తి దూబె
  • ఫ్యాక్ట్ చెక్ టీమ్, బీబీసీ
వైరల్ ఫొటో

ఫొటో సోర్స్, Socail Media

ఈశాన్య దిల్లీలో అల్లర్లు చేయించేందుకు ముస్లింలకు కొందరు డబ్బులు పంచుతున్న దృశ్యాలంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ఏదో భవనంపై నుంచి తీసినట్లుగా ఉంది.

కొందరు మహిళలు లైన్‌లో నిలబడి, డబ్బులు తీసుకుంటున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా డబ్బులు తీసుకుంటుండటం కనిపించింది.

మన్‌దీప్ టోకాస్ అనే పేరుతో ఉన్న అకౌంట్ నుంచి ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో దీన్ని షేర్ చేశారు. దిల్లీలో హింస రేగడానికి ముందు, డబ్బులు పంచుతున్నప్పుడు తీసిన వీడియోగా దీన్ని పేర్కొన్నారు.

32 వేలకుపైగా మంది ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. ఐదు లక్షలకుపైగా మంది ఈ వీడియోను చూశారు.

ఇలాంటి వ్యాఖ్యలతోనే మరికొందరు కూడా ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో, ఇతర సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేశారు.

బీబీసీ ఈ వీడియో విశ్వసనీయత గురించి పరిశోధించింది. అందులో కనిపించిన డబ్బులు పంపకం అల్లర్లను రెచ్చగొట్టేందుకు చేసిందా, కాదా అన్నది తెలుసుకునేందుకు ప్రయత్నించింది.

ఆ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే... 'ఇతరులకు సాయం చేస్తున్న వీళ్లకు అల్లా ఇంకా చాలా ఇస్తారు' అని హిందీలో ఓ మహిళ అంటుండటం మనం వినొచ్చు.

ఈ వీడియో ఈశాన్య దిల్లీలో తీసినట్లుగానే అనిపించి, బీబీసీ బృందం అక్కడికి వెళ్లి, చాలా ప్రాంతాలు తిరిగింది.

చివరికి న్యూ ముస్తఫాబాద్‌లోని బాబూనగర్‌లో ఉన్న నాలుగో నెంబర్ వీధిలోని జనాలు, ఇది తమ వీధిలో తీసిన వీడియోనే అని మాకు చెప్పారు.

శివ్ విహార్ నుంచి వచ్చిన చాలా చాలా ముస్లిం కుటుంబాలు బాబూనగర్‌లో పునరావాసం పొందుతున్నాయి. ఇక్కడి ఈద్గాను, కొన్ని ఇళ్లను పునరావాస కేంద్రాలుగా మార్చారు.

ఫొటో క్యాప్షన్,

హాషిమ్

ఇక్కడికి చాలా మంది వస్తూ డబ్బులు, ఆహార పదార్థాలు పంచుతున్నారని స్థానికుడు హాషిమ్ బీబీసీతో చెప్పారు.

''సాయంగా రూ.50-100 పంచినట్లు మాకు తెలుసు. ఈ వీధిలోనే కాదు, మిగతా వీధుల్లోనూ అవసరం ఉన్నవారికి డబ్బులు, ఆహారపదార్థాలను అందిస్తున్నారు. బయటి నుంచి కొందరు వచ్చి, ఇలా సాయపడుతున్నారు. అలాంటి దాతల్లో సర్దార్లు కూడా ఉన్నారు. మహిళలు, పిల్లలు లైన్లు కట్టి వాళ్లు పంచినవి తీసుకుంటున్నారు. దాతలు కూడా ఎక్కువగా వాళ్లకే పంచుతున్నారు'' అని ఆయన అన్నారు.

ఆ వీధిలో మరింత ముందుకు వెళ్లినప్పుడు, పెద్ద పెద్ద పాత్రల్లో వంటలు చేస్తుండటం మాకు కనిపించింది.

మహమ్మద్ రఫీక్ మంసూరీ అనే ఆయన ఈ వంటలు చేయిస్తున్నారు.

''మాకు వంటకు అవసరమైన పదార్థాలు చాలా మంది తెచ్చి ఇస్తున్నారు. ఇలా ఇస్తున్నవారిలో తుగ్లకాబాద్ మొదలుకొని, దిల్లీలోని వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్లు ఉన్నారు. నిరాశ్రయులై ఇక్కడుంటున్నవాళ్లకు వారు అలా సాయం చేస్తున్నారు. ఇక్కడ ఉంటున్నవారిలో చాలా మంది చిన్నారులు కూడా ఉన్నారు'' అని ఆయన చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

మహమ్మద్ రఫీక్

ఆ వీడియాను పోస్ట్ చేసినవారు చెబుతున్నట్లుగా, ఆ డబ్బులు దిల్లీలో అలర్లు రెచ్చగొట్టేందుకు పంచినవి కాదని ఈ పరిశోధనలో బీబీసీ గుర్తించింది.

అవి అల్లర్ల కారణంగా శివపురి నుంచి పారిపోయి బాబూనగర్‌లో ఆశ్రయం పొందుతున్న బాధితులకు సాయం చేసేందుకు పంచిన డబ్బులని కూడా ఇందులో తేలింది.

ఇక్కడుంటున్న వాళ్లకు కొందరు పాలు, దుస్తుల వంటివి కూడా పంచుతున్నట్లు కూడా మేం గుర్తించాం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)