దిల్లీ హింస: వదంతులు ఎంత భయంకరమైనవంటే...

  • దండు కిరణ్ కుమార్
  • బీబీసీ ప్రతినిధి
దిల్లీ హింస

ఫొటో సోర్స్, Getty Images

మార్చి రెండో వారంలో పెళ్లి చేసుకోబోతున్న (నా సొంత) తమ్ముడుగా భావించే ఓ రిపోర్టర్ ఫోన్ చేశాడు.

"అన్నా, ఇంట్లో వాళ్లు రింగ్ కొనుక్కోమని అంటున్నారు. జెవలరీ షాప్‌కి వెళ్దాం" అంటే సరే "ఇంటికి రా" అన్నాను. నా కూతురు నిద్రలేచే దాకా ఆగి నా భార్యతో సహా నలుగురం క్యాబ్‌లో నగల దుకాణానికి వెళ్లాం. షాపింగ్ అయిపోయి బిల్లు కట్టే సమయంలో కౌంటర్లో ఉన్న వ్యక్తి "మీరు ఎక్కడుంటారు" అని అడిగాడు. కరోల్ బాగ్‌లోని ప్రసాద్ నగర్ అని చెప్పాను.

"పటేల్ నగర్‌లో దంగే (అల్లర్లు) అవుతున్నాయి. ఎలా వెళ్తారో చూసుకోండి" అని చెప్తే అప్పుడు నేను సీరియస్‌గా తీసుకోలేదు.

మెట్లు దిగే సమయానికి ఆలోచన మొదలైంది. పది మెట్లు దిగేలోపు క్యాబ్ బుక్ చేయాలన్న ఆలోచన నుంచి ఆటోలో వెళ్లాలని నిర్ణయమైపోయింది. ఆటోలోనే ప్రసాద్ నగర్ ఎల్ఐజీ ఫ్లాట్స్ చేరుకున్నాం. ఇంటికి చేరుకునేలోపు అదే కాలనీలో ఉంటున్న మరో ఫ్రెండ్‌ని కలిసొస్తా అని తమ్ముడు వెళ్లాడు.

అతి కష్టం మీద మూడో అంతస్తు ఎక్కిన తర్వాత నా కూతురు దగ్గడం మొదలు పెట్టింది. అప్పుడు గుర్తొచ్చింది ఇంట్లో కాఫ్ సిరప్ అయిపోవచ్చిందని. ఇక తప్పక మళ్లీ కిందికి దిగి మా కాలనీ గేటువైపు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నా చూపు బయట ఉన్న మార్కెట్ వైపు పడింది.

ఫొటో సోర్స్, Getty Images

ఒక్కసారిగా కలకలం రేగింది. కూరగాయల బండ్లు వేగంగా నెట్టుకుంటూ, నెట్టలేక కొంతమంది అక్కడే వదిలేస్తూ పారిపోయారు. చేతుల్లో కూరగాయల సంచులతో పదుల సంఖ్యలో మహిళలు మా కాలనీలో గేటులోకి ప్రవేశించారు. ఆందోళనతో నేను గేటుకి పది మీటర్ల దూరంలో ఆగి, బయట ఏం జరుగుతోందో అని చూశాను.

"పటేల్ నగర్ మే దంగె, పత్తర్ బాజీ హో రహీ హై, ఇస్ తరఫ్ ఆ రహే హై" అంటూ కూరగాయలబండి వాడు అరచుకుంటూ వెళ్లాడు. ప్రతి ఆదివారం మా కాలనీ ముందు రోడ్డుపై జరిగే సంతలో నేను అతని దగ్గరే కూరగాయలు కొంటాను.

"ఇస్ తరఫ్ ఆ రహే హై" అనగానే నాలో ఆందోళన పెరిగింది.

మొదటిసారి ఒక జర్నలిస్టుగా భయపడ్డాను. ఆందోళనకారులు వస్తే వారికి ఈ గేటు బద్దలు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక్కడి నుంచి ఇంటికి ఎంతసేపట్లో పరుగెత్తగలనా అని ఆలోచిస్తున్నాను. నేను వెనక్కి తిరిగి పరుగుపెట్టేలోపే వారికి గేటు బద్దలు కొట్టుకొని రావడం పెద్ద కష్టం కాదని అనిపించింది.

మళ్లీ గేటు దగ్గరికి పరుగెత్తాను. రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్, బీఎల్ కపూర్ ఆసుపత్రి నుంచి టాంక్ రోడ్డు వైపు ఒక్కసారిగా వాహనాలు, కూరగాయల బండ్లు, వాటిమధ్య పరుగెత్తుతున్న జనాలు నాలో భయాన్ని మరింత పెంచాయి.

భయంతో చెమటలు కక్కుతున్న వాచ్‌మెన్ గేటుకి తాళాలు వేశాడు. బయటి నుంచి భయపడి వస్తున్న మహిళల కోసం చిన్న గేటు తెరుస్తూ మూస్తూ ఉన్నాడు. క్రమంగా గేటు లోపల యువకుల సంఖ్య పెరుగుతోంది. అందరి ముఖాల్లో భయం. దాదాపు ప్రతి ఒక్కరూ ఫోన్లు చేస్తున్నారు.. నాతో సహా. కానీ ఫోన్లు రెండు మూడు నిమిషాలు కలవకపోవడంతో అందరిలో భయం అంతకంతకూ పెరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images

మా కాలనీ లోపల నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి కర్రలు ఏమైనా ఉన్నాయా అని వాచ్‌మెన్‌ను అడగుతున్నాడు. ఆయన బాగా చదువుకున్న ఓ పెద్ద మనిషి. ఐదు నిమిషాల క్రితం వరకు ఆయన ఆలోచనలు ఈ విధంగా ఉంటాయని నాకనిపించలేదు. దాడులు జరిగితే కాపాడుకోవాలన్న ఆలోచన ఆయన్ను నేరుగా ఆయుధం పట్టేవైపే నెట్టింది.

ఆందోళనలో ఉన్న నేను న్యూస్ ఛానళ్లలో సమాచారం ఏమైనా తెలుస్తుందేమోనని ఫోన్లో చూశా. ఆ తొందరలో నేను చూసిన ఏ చానల్లోనూ దీనికి సంబంధించిన సమాచారం లేదు.

అప్పుడే గేటు దగ్గర మా కాలనీలో ఉంటున్న ఇంకో జర్నలిస్ట్ భార్య కనిపించారు. బయటికి వెళ్లిన తన భర్త ఇంకా రాలేదంటున్నప్పుడు ఆమె కళ్లలో భయం స్పష్టంగా కనిపించింది.

సరిగ్గా పది నిమిషాల తర్వాత దిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు. వదంతులను నమ్మొద్దన్నది దాని సందేశం.

అప్పుడు మెడికల్ షాప్‌కి వెళ్లే ఆలోచన మానుకొని ఇంటికి వెళ్లాను. అప్పుడే ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్లిన తమ్ముడు ఇంటికి వచ్చాడు. లక్ష్మీ నగర్లో ఉంటున్న తన గదికి వెళ్తున్నానని చెప్పడానికి వచ్చాడు. ఊరికి వెళ్లేముందు ఉంగరం తీసుకెళ్తాను వదినా అని చెప్పి నా భార్యకి ఆ బ్యాగ్ ఇచ్చాడు. ఇప్పుడు వెళ్లొద్దని రాత్రి ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్లమని చెప్తే, ఉదయం లేటవుతుందని వెళ్లడానికి సిద్ధపడ్డాడు. నేనే క్యాబ్ బుక్ చేశాను.

పదిహేను నిమిషాల ముందు భయంతో దాదాపు వణికిన నేను సాధారణ స్థితికి చేరుకునేటప్పటికి తమ్ముడు వెళ్తున్నాడన్న విషయం నన్ను మరోసారి ఆలోచనలో పడేసింది.

ఏమీ లేదని పోలీసులు చేసిన ట్వీట్, ఆ తర్వాత వేగంగా వివిధ ప్రాంతాల్లోని పోలీసు అధికారులు.. వాట్సాప్ మెసేజులు పుకార్లను నమ్మొద్దని చెప్పినా నేను ప్రశాంతంగా ఉండలేకపోయాను.

కాసేపటి తర్వాత తమ్ముడికి ఫోన్ చేస్తే ఇప్పుడే రూంకి చేరుకున్నా అన్నా అన్నాడు. అప్పుడు నాకు కాస్త ప్రశాంతంగా అనిపించింది. అప్పుడు నా కూతురు గుడ్ నైట్ మదార్ (తమ్ముడి పేరు) బాబాయ్ అంది.

మదార్ మహ్మద్ రోజూ ఇలాగే సురక్షితంగా వెళ్లాలని మనసులో అనుకుంటున్నప్పుడు గుర్తొచ్చింది నేను ఇంకా భోజనం చేయలేదని.

అంతేకాదు, మొదటిసారి నాకు తెలిసింది... వదంతులు ఎంత భయంకరమైనవో.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)