పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ విడుదల - ప్రెస్ రివ్యూ

వకీల్ సాబ్ ఫస్ట్ లుక్

ఫొటో సోర్స్, facebook/DilRaju

కొన్నేళ్లుగా రాజకీయాల్లో బిజీ అయిపోయిన సినీ హీరో పవన్ కల్యాణ్ మళ్లీ తెరపై ఇలా కనిపించబోతున్నారంటూ ఆయన నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌పై 'ఈనాడు' వార్తాకథనం ప్రచురించింది.

''పవన్‌ కల్యాణ్‌ తెరపై కనిపించక రెండేళ్లు పైనే అయ్యింది. 'అజ్ఞాతవాసి' తర్వాత ఆయన రాజకీయాలతో బిజీ అయిపోయారు. మళ్లీ పవన్‌ని తెరపై ఎప్పుడు చూస్తామా అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్న క్రమంలోనే అనూహ్యంగా కొత్త సినిమాల్ని ప్రకటించేశారు.

ఆయన చేస్తున్న రెండు చిత్రాల్లో ఒకటి 'వకీల్‌ సాబ్‌'. హిందీలో అమితాబ్‌ బచ్చన్‌ నటించిన 'పింక్‌'కి రీమేక్‌గా రూపొందుతోంది. శ్రీరామ్‌ వేణు దర్శకుడు. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. బోనీకపూర్‌ సమర్పిస్తున్నారు.

సినిమా పేరుతో కూడిన ఫస్ట్‌లుక్‌ని సోమవారం విడుదల చేశారు. కళ్లజోడు ధరించి, పుస్తకం చేతపట్టుకుని మాస్‌ లుక్‌లో దర్శనమిచ్చారు పవన్‌.

ఆయన ఇందులో న్యాయవాదిగా కనిపించబోతున్నారు. పవన్‌ శైలి మాస్‌ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మేలో విడుదల చేస్తారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నార''ని అందులో వివరించారు.

ఫొటో సోర్స్, facebook/ktr

త్వరలో రైతులకు రుణమాఫీ: కేటీఆర్

ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియను త్వరలోనే ప్రారంభించాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తెలిపారంటూ 'ఆంధ్రజ్యోతి' వార్తాకథనం ప్రచురించింది.

''కేంద్రం అసంబద్ధ నిర్ణయాల వల్ల ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ దృఢ సంకల్పంతో కేసీఆర్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. రైతుల సమస్యలపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత సహకార సంఘాల నేతలు తీసుకోవాలని సూచించారు. డీసీసీబీ, డీసీఎం్‌సల చైర్మన్లు, వైస్‌ చైర్మన్లతో సోమవారం ఇక్కడ టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని, వారి సంక్షేమానికి ఎంత ఖర్చైనా వెనుకాడబోమన్నారు.

సీఎం కేసీఆర్‌ స్వయంగా రైతు అని, అందుకే రైతుల కోసం భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రైతులపై ప్రత్యేక ప్రేమ చూపుతూ వ్యవసాయ రంగాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారని పేర్కొన్నారు. రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నార''ని అందులో తెలిపారు.

ఫొటో సోర్స్, HighCourtOfAndhrPradesh

ఫొటో క్యాప్షన్,

ఏపీ హైకోర్టు

రిజర్వేషన్లు 50% మించొద్దు

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించిందని 'సాక్షి' కథనం తెలిపింది.

''బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టంలోని పలు సెక్షన్లను హైకోర్టు చట్ట విరుద్ధంగా ప్రకటించింది. రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని, అలా జరగడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం, బీసీలకు 34 శాతం.. మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 డిసెంబర్‌ 28న ప్రభుత్వం జారీ చేసిన జీవో 176ను రద్దు చేసింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఎన్నికలు నిర్వహించ వచ్చని చెప్పింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. స్థానిక ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 176, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న పంచాయతీరాజ్‌ చట్టంలోని పలు సెక్షన్లను సవాలు చేస్తూ కర్నూలుకు చెందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం గత నెల 6న తీర్పును వాయిదా వేసింద''ని ఆ కథనంలో తెలిపారు.

ఫొటో సోర్స్, facebook/hyderabadcitypolice

ఫొటో క్యాప్షన్,

5కే రన్ టీషర్టులు ఆవిష్కరిస్తున్న హైదరాబాద్ పోలీసులు

షీ టీమ్స్ ఆధ్వర్యంలో 6న చార్మినార్ వద్ద 5కే రన్

మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన షీ టీమ్స్‌ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్నారని నమస్తే తెలంగాణ పత్రిక కథనం తెలిపింది. ‘‘మహిళా దినోత్సవంతో పాటు షీ టీమ్స్‌ ఐదేండ్లు పూర్తిచేసున్న సందర్భంగా షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో మహిళా భద్రతకు సంబంధించిన పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సీపీ వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ నెల 6న చార్మినార్‌ వద్ద ఉదయం 5.30 గంటలకు షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 5కే, 2కే రన్‌కు సంబంధించిన పోస్టర్‌, టీ షీర్ట్స్‌, మెడల్స్‌ను సీపీ అంజనీకుమార్‌, అదనపు కమిషనర్లు అనిల్‌కుమార్‌, చౌవాన్‌, జాయింట్‌ సీపీ తరుణ్‌ జోషి, రమేష్‌రెడ్డిలతో కలిసి సోమవారం కమిషనరేట్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ చార్మినర్‌ వద్ద జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి, మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి ముఖ్య అతిధులు హాజరవుతున్నారని, మహిళలు, యువతులు అధిక సంఖ్యలో రన్‌లో పాల్గొవాలని సూచించారు. అదే రోజు సాయంత్రం కోఠి ఉమెన్స్‌ కాలేజీలో ఈస్ట్‌జోన్‌ జాయింట్‌ సీపీ రమేష్‌రెడ్డి నేతృత్వంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. షీ టీమ్స్‌కు ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో 90 మందిని రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకొని కేసులు నమోదు చేసిందని, 270 మందికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారని సీపీ వివరించారు. మహిళల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ముందుకెళ్తుందని ఆపదలో ఉన్న మహిళలు డయల్‌ 100, హాక్‌ ఐ, అందులో ఉన్న ఎస్‌వోఎస్‌ బటన్‌లు ఉపయోగించుకోవాలన్నారు. రన్‌లో పాల్గొనే వారు తమ పేర్లను హాక్‌భవన్‌లోని భరోసా కేంద్రంలో 5వ తేదీన నమోదు చేసుకొవాలని, ఇదంతా ఉచితమేనని సీపీ సూచించారు’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)