Kanakavva: 60 ఏళ్ల వయసులో సోషల్ మీడియా స్టార్‌ అయిన తెలంగాణ జానపద గాయని

Kanakavva: 60 ఏళ్ల వయసులో సోషల్ మీడియా స్టార్‌ అయిన తెలంగాణ జానపద గాయని

సంగీతం ప్రభాకర్, బీబీసీ ప్రతినిధి

కంట్రీ ఫుడ్స్ మస్తానమ్మ, మై విలేజ్ షో గంగవ్వ ఇప్పుడు ఈ ఫోక్ సింగర్ కనకవ్వ. టాలెంట్ ఉండాలే కాని వయసుతో సంబంధం లేకుండా అందరి అభిమానం సాధించవచ్చు అని నిరూపించారు వీళ్లంతా. తన తల్లి వద్ద నేర్చుకున్న పాటలతో ఇప్పుడు తన పాటలతో యూట్యూబ్ స్టార్‌గా మారింది తెలంగాణ జానపద గాయని కనకవ్వ.

సిద్దిపేట దగ్గర బోడిగపల్లి గ్రామానికి చెందిన కనకవ్వ వయసు ఆమెకు కూడా స్పష్టంగా తెలియదు. అయితే, 60 ఏళ్లపైనే ఉంటాయని ఆమె చెబుతున్నారు.

గోదావరిఖనిలో చిన్న కొడుకు వద్ద నివసించే ఆమె తరచూ హైదరాబాద్‌లోని పెద్ద కూతురు వద్దకు వస్తుండేవారు.

‘‘ఇప్పుడు...సింగర్ అంటాండ్రు. సింగర్ కనకవ్వ అంటాండ్రు. సింగర్ అంటే ఏంటిది అని నేనూ అడుగుతున్నా.. ఓ అవ్వ నీవు సింగెర్వు నీకే తెల్వదా అవ్వా. నువ్వు పెద్ద సింగర్వైనావు, ప్రపంచమంతా మారుమోగుతోంది’’ అని అంతా అంటున్నారని ఆమె నవ్వుతూ అన్నారు.

ఒక నెల.. నాలుగు పాటలు.. అంతే, కనకవ్వ జీవితం మారిపోయింది.

తన జానపద పాటలతో కనకవ్వ లక్షలాది అభిమానులను సంపాదించుకున్నారు.

‘‘మా అమ్మ చెప్పిన పాటలు గుర్తుండిపోయినాయి, మాకు చదువు రాదు. పల్లెటూర్లల్ల పడుకునేది, పండ్లగంప ఎత్తుకొని పాడుకుంటానే వచ్చేది. వంటవండుకుంటా పాటె, ఊడ్చుకుంటూ అలుకుతున్నప్పుడు పాటే, ఏమయినా నా మదిలోనే పాట. నాకు చదువు రాదు, వేలు ముద్ర.. ఏం మాట్లాడాలనో తెలువదు. మా అమ్మ చెప్పిన పాటనే నా జీవితం..నా జీవితమే ఒక పాట’’ అని అంటారామె.

పండ్లు అమ్మి జీవనం సాగించే ఆమె పాటల్ని చెల్లెలి కుమార్తె ఫోన్లో రికార్డు చేసింది.

‘‘టిక్ టాక్ లో పాటలు చూసి ఈ పాటలు మనం పాడేవే.. మనం గూడ పాడాలంటే ఎట్లా అనుకునేవాళ్లం. మా చెల్లి బిడ్డ రెండు నిముషాలు పాట ఫోన్లో రికార్డు చేసి పంపింది’’ అని తెలిపారు.

మైక్ టీవీ, 10 టీవీ ఆధ్వర్యంలో జరిగిన ఫోక్ స్టూడియో జానపద పాటల పోటీలో ఆమె పాల్గొన్నారు.

కనకవ్వ ఫోక్ స్టూడియో పాటను యూట్యూబ్‌లో లక్షలాది మంది వీక్షించారు. కొద్ది రోజుల్లోనే ఆ వీడియో వైరల్‌గా మారింది.

మైక్ టీవీకి చెందిన సంక్రాంతి, మేడారం జాతర పాటలతో ఆమె యూట్యూబ్ ఫోక్‌ స్టార్‌గా మారారు.

‘‘మస్తు సంతోషం నాకు పండ్ల గంప మూలకు పారేసిన. యిప్పుడు అదే బిజీలో ఉన్న. నా బాధలన్నీ పటాపంచలు అయిపోయాయి. సచ్చెదాక సంతోషంలనే మునిగి తేలాలనే సంతోషంలో ఉన్న’’ అని ఆమె ఆనందంగా చెప్పారు.

రోజు కూలీగా, పండ్లు అమ్ముతూ జీవనం సాగించిన కనకవ్వ.. జీవితంలో కష్టాలకు అధైర్య పడొద్దని అంటున్నారు.

‘‘బాధలొస్తాయి.. ఆ బాధల్లా తట్టుకొని బతికిన వాళ్ళకే ఆకు రాలిన కాడ కొత్త ఆకు చిగురిస్తది. మీరు దిగులు పడొద్దు, మీ కష్టాలను తట్టుకొని నడుస్తనే ఉండుర్రి. మీకూ ఒక అవకాశం వస్తది’’ అని ఆమె ధైర్యం చెబుతున్నారు.

తన పల్లె పాటలతో ఎంతో మందిని అలరిస్తున్న ఈ సరికొత్త స్టార్, మరిన్ని పాటలతో ప్రేక్షకుల మందుకు రానున్నట్లు చెప్పారు.

‘‘ఏడికైనా బయటికి పొతే చూసి ‘అమ్మా నువ్వు కనకవ్వవు కదా.. హ్యాపీ ...హ్యాపీ ...’’ అని ఏమో అంటారు నాకు చెప్పనీకి రాదు’’ అంటూ నవ్వుతూ ముగించారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)