ఇంటర్ పరీక్షలు: విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? దీనికి పరిష్కారం ఏంటి?

  • దీప్తి బత్తిని
  • బీబీసీ ప్రతినిధి
ఇంటర్ విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాల ఆశలు విద్యార్థులపై భారంగా మారుతున్నాయా ?

సంధ్యారాణి, సంజీవ్ హైదరాబాద్‌లో వేర్వేరు కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. మరి కొద్ది రోజుల్లో వారు పరీక్షలు రాయాల్సి ఉంది. సంధ్య పఠాన్‌చెరువు దగ్గర ఉన్న నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్. సంజీవ్ నార్సింగ్‌లోని చైతన్య కాలేజిలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.

వీరిద్దరూ ఒకరికొకరు తెలిసిన వారు కాదు. కానీ, వారి బలవన్మరణాలకు కారణం ఒకటి కావడమే సమస్య.

ఈ రెండూ ఒకదానితో ఒకటి ఏ మాత్రం సంబంధం లేని ఘటనలు.

సంధ్య ఫిబ్రవరి 25 న కళాశాలలోని తన హాస్టల్ గదిలో ఉరి వేసుకొని చనిపోయింది. సంజీవ్ తన కళాశాలలోని హాస్టల్ గదిలో ఫిబ్రవరి 26న చనిపోయాడు.

సంధ్యారాణి అనారోగ్యం పాలైనప్పటికీ తమకు కబురు చేయలేదని కుటుంబ సభ్యులు కళాశాల యాజమాన్యంపై ఆరోపణలు చేశారు.

ఫొటో క్యాప్షన్,

తన కుమార్తె మరణానికి కారణం చెప్పాలంటూ పోలీసుల్ని అడ్డుకున్న సంధ్య తండ్రి

పోలీసుల తీరుపై విమర్శలు

సంధ్య మృతదేహాన్ని పోస్టు మార్టమ్ కి తరలించేప్పుడు, తన కుమార్తె మరణానికి కారణం చెప్పాలంటూ ఆమె తండ్రి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆయనను బూటు కాలితో తన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో, సంధ్య ఆత్మహత్యపై సర్వత్రా చర్చ జరిగింది. ఉన్నతాధికారులు ఆ కానిస్టేబుల్‌ను వెంటనే సస్పెండ్ చేశారు.

ఆ తర్వాత ఇలాంటి కేసుల్లో ఎలా వ్యవహరించాలో చెబుతూ పోలీసులకు డీజీపీ ఓ వర్క్ షాప్ నిర్వహించారు.

ఒక వేళ ఆ వీడియో అంత వైరల్ కాకపోయి ఉంటే, ఈ 'ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య' ఒక చిన్న వార్తగా కొట్టుకుపోయి ఉండేది. ఆ మరునాడే జరిగిన సంజీవ్ ఆత్మహత్యే అందుకు ఓ ఉదాహరణ.

వీరిద్దరే కాదు, గత ఏడాది తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసిన తరువాత 23 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రతి ఏటా పరీక్షల ముందు, పరీక్షల తరువాత ఇలాంటి విషాద వార్తలు రావడం ఇటీవలి కాలంలో సాధారణమైపోయింది. అందుకు తరచుగా వినిపించే కారణం మానసిక ఒత్తిడి.

ఫొటో సోర్స్, TELANGANA INTERMEDIATE BOARD

ఫొటో క్యాప్షన్,

గత ఏడాది ఫలితాల వెల్లడి విషయంలో ఇంటర్ బోర్డుపై తీవ్ర విమర్శలు

కాలోజీల్లో మానసిక నిపుణులు అందుబాటులో ఉన్నట్టేనా ?

గత ఏడాది తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఫలితాల విడుదలలో పొరపాట్లు జరిగాయంటూ ఇంటర్ బోర్డుపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలో విద్యార్థులపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు, ప్రతీ జూనియర్ కళాశాలలో మానసిక నిపుణులను అందుబాటులో ఉంచాలని ఇంటర్ బోర్డు కాలేజీలను ఆదేశించింది.

తరువాత మానసిక నిపుణుల స్థానంలో, కౌన్సిలర్లుగా లెక్చరర్లనే గుర్తించడం ప్రారంభించినట్టు బీబీసీకి చెప్పారు ఇంటర్ బోర్డు కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్.

తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 2,549 జూనియర్ కాలేజీలు ఇంటర్ బోర్డు పరిధిలో ఉన్నాయి. అక్టోబరులో ప్రతీ కాలేజీ నుంచీ ఒక ''పాపులర్'' లెక్చరర్‌ని ఎంపిక చేసి బోర్డుకు వారి పేర్లు ఇవ్వాలని కాలేజీలను ఆదేశించింది ఇంటర్ బోర్డ్.

ఈ పాపులర్ లెక్చరర్లను స్టూడెంట్ కౌన్సిలర్లుగా నియమించారు. ఇలా దాదాపుగా రెండున్నర వేల మంది లెక్చరర్లను స్టూడెంట్ కౌన్సిలర్లుగా నియమించారు. వాళ్లందరికీ రెండు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు.

పిల్లల్ని ఎలా ప్రోత్సహించాలి? పరీక్షల్లో ఒత్తిడి ఎలా ఎదుర్కోవాలి? స్ఫూర్తిదాయక ప్రసంగాలు, యోగా, ఇలా తదితర అంశాలపై ఈ కౌన్సిలర్లకు ట్రైనింగ్ ఇచ్చారు.

మొదట మానసిక నిపుణులు అన్న ఇంటర్ బోర్డు, ఆ తరువాత పాపులర్ లెక్చరర్‌తో సరిపెట్టింది. ఇప్పుడు ఈ వ్యవస్థనే మరింత ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తామని తెలిపారు అధికారులు.

సంధ్య మరణంపై భిన్న వాదనలు

సంధ్య ఘటన జరిగిన నారాయణ కాలేజీలో విద్యార్థులు మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు దిశ పేరుతో ఒక కాల్ సెంటర్ ఉన్నట్టు ఆ సంస్థ యాజమాన్యం చెబుతోంది.

దాదాపు 50 మంది కౌన్సిలర్లతో కూడిన ఈ కాల్ సెంటర్‌కు తమ విద్యార్థులు ఎవరైనా కాల్ చేసి తమ సమస్యను పంచుకోవచ్చని వారు వివరిస్తున్నారు.

కానీ, సంధ్య ఆ నంబర్ కు కాల్ చేయలేదన్నది కాలేజీ యాజమాన్యం వాదన.

సంధ్య బలవన్మరణానికి పరీక్షల ఒత్తిడే కారణమని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె అనారోగ్యంపాలైనా కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని వారు యాజమాన్యాన్ని విమర్శించారు. అయితే, యాజమాన్యం వాదన మరోలా ఉంది.

''సంధ్య మరణించిన తరువాత ఆమె డైరీలో ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి ఉంది. ఆమెపై కాలేజి నుంచీ, కుటుంబ సభ్యుల నుంచీ ఎటువంటి ఒత్తిడీ లేదు. ఆమె తెలివైన విద్యార్థి. డైరీలో రాసుకున్న అంశాల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని మేము అనుమానిస్తున్నాం.'' అని కాలేజీ యాజమాన్య ప్రతినిధి ఒకరు బీబీసీతో చెప్పారు.

సంజీవ్ ఎందుకు చనిపోయాడు?

ఇక సంజీవ్ ఎలా మరణించాడన్న విషయంపై ఆ కుటుంబ సభ్యులకు స్పష్టత లేదు.

అతడి బావ కృష్ణ బీబీసీతో మాట్లాడుతూ, ''తను బాగా చదివేవాడు. చదువుకు సంబంధించి సమస్య ఉన్నట్టు కానీ, ఒత్తిడికి లోనవుతున్నట్టు ఏమీ లేదు. కుటుంబం నుంచి కూడా అటువంటి ఒత్తిడి ఏమీ లేదు. రెండేళ్లుగా కాలేజీ హాస్టళ్లోనే ఉంటూ, కాలేజీ పర్యవేక్షణలో ఉన్నాడు తను. మరి అతను ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో కాలేజీ వాళ్లే సమాధానం చెప్పాలి'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కలవర పెడుతున్న ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాలు

కౌన్సిలర్లను నియమిస్తే సమస్య పరిష్కారమైనట్టేనా ?

ఈ ఇద్దరి విద్యార్థుల మృతికి మానసకి ఒత్తిడే కారణమా లేక ఇతరత్రా కారణలేమైనా ఉన్నాయన్నది ఇంకా తేలాల్సి ఉంది. అయితే, వారి మృతికి ఒత్తిడి కారణం కాదని కూడా నిరూపణ కాలేదు.

తెలుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులపై ఒత్తిడి ఉండదని ఎవరూ కచ్చితంగా చెప్పలేరు.

''కార్పొరేట్ కాలేజీలు సైకాలజిస్టులు, కౌన్సిలర్ల పేరుతో నిజంగా నిపుణులనే నియమిస్తున్నారా లేక సర్టిఫికేట్ కోర్సులు చేసిన వాళ్లను తీసుకువచ్చి, వీరే సైకాలజిస్టులని ప్రకటిస్తున్నారా అనేది తెలియదు. ఈ విషయంలో ప్రభుత్వం అన్ని విధాల పరిశీలించి అసలు కౌన్సిలింగ్ చేయడానికి ఎవరు అర్హులు, ఎవర్ని నియమించాలన్న విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి. ‌తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ చదువు పిల్లలపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కొన్ని సందర్భాల్లో వేరే కారణాలు ఉన్నట్టు కనిపించినా, వాటితో పాటూ కచ్చితంగా చదువుకు సంబంధించిన ఒత్తిడి కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఇదే ఎక్కువగా ఉంటుంది, ఆ ఒత్తిడి వేరే అంశాలపై కూడా ప్రభావం చూపి, విద్యార్థులు ప్రాణాల మీదకు తీసుకొస్తున్నారు. ఫీజుల కడుతున్నాం అనే తల్లితండ్రుల మాట, ర్యాంకులు రావాలన్న యాజమాన్యం మాటల మధ్య వాళ్లు బలైపోతున్నారు'' అని బాలల హక్కుల సంఘం అధ్యక్షులు అచ్యుత రావు బీబీసీతో చెప్పారు.

అయితే, కేవలం కౌన్సిలర్ల నియామకంతో సమస్య పరిష్కారం కాదంటున్నారు నిపుణులు. పరీక్షలు, ర్యాంకులే జీవితం అన్నట్లుగా మారిన సమాజంలో మార్పు రావాలని వారంటున్నారు.

''పరీక్షల ముందే కాకుండా, చిన్నప్పటి నుంచీ మంచి వాతావరణం పిల్లలకు అలవాటు చేయాలి. జీవితంలో ఓటములను కూడా ఎదుర్కోవడం తల్లితండ్రులు నేర్పించాలి. డబ్బులు పెట్టాం కదా అని, వాస్తవానికి దూరంగా ఉండే ఆశలూ, లక్ష్యాలను పెట్టకూడదు. పిల్లలకు కావల్సిన మానసిక స్థయిర్యాన్ని ఇవ్వాలి'' అని క్లినికల్ సైకాలజిస్ట్, స్టూడెంట్ కౌన్సిలర్ రాధిక ఆచార్య బీబీసీతో అన్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఇంటర్ విద్యార్థులపై తట్టుకోలేనంత ఒత్తిడి

20 ఏళ్లుగా పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు

విద్యార్థులు పరీక్షల్లో తప్పితే ఆత్మహత్యలు చేసుకోవడం అనేది గత రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో బాగా పెరిగింది.

ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీలూ, వారిచ్చే సూచనలూ విద్యార్థుల ఆత్మహత్యలను ఏ మాత్రం ఆపలేకపోయాయి.

ఇందుకు కారణం కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకుల కోసం పెడుతోన్న ఒత్తిడేనని నిపుణులూ, ప్రజా సంఘాలూ ఎన్నో ఏళ్లుగా ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి.

కానీ, ఇరవై ఏళ్లుగా ఈ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య సమస్యకు సమాధానం మాత్రం రావడం లేదు.

గత ఏడాది ఇంటర్ ఫలితాల్లో తప్పులకు కారణం అని ఆరోపణలు ఎదుర్కొన్న గ్లోబరీనా టెక్నాలజీని పక్కన పెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థ సీజీజీ ద్వారా పరీక్షలు, ఇతర పనులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సాంకేతికంగా ఎలాంటి తప్పులు జరగకుండా ముందుగానే సాఫ్ట్‌వేర్‌ను అన్ని విధాల పరీక్షించినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో సీనియర్, జూనియర్ ఇంటర్ విద్యార్థులు మొత్తం 9,65,839 మంది పరీక్షలు రాస్తున్నారు.

మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే వెంటనే మీ దగ్గర్లోని మానసిక వైద్యుడిని సంప్రదించండి. One Life +91 7893078930, Roshni Trust: +91 40 6620 2000, +91 40 6620 2001, Makro Foundation - Suicide Prevention Helpdesk +91 040 46004600లను సంప్రదించండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)