కర్నాటక బీజేపీ మంత్రి కుమార్తె పెళ్లి... లక్ష మంది ఆహ్వానితులతో అత్యంత ఖరీదైన వేడుక

  • ఇమ్రాన్ ఖురేషి
  • బీబీసీ కోసం
శ్రీరాములు కుమార్తె పెళ్లి

ఫొటో సోర్స్, OFFICE OF B. SREERAMULU

ఆహ్వానపత్రికలు ఎన్ని పంపించారనే అంకెను బట్టే అది ఎంత పెద్ద, ఖరీదైన పెళ్లి వేడుకో తెలిసిపోతుంది. కర్నాటక రాజకీయ నాయకులు తమ రాజకీయ, ధన బలాన్ని ప్రదర్శించటానికి ఎంతగా తహతహలాడుతున్నారనేందుకు ఈ వివాహం ఓ ఉదాహరణ.

కర్నాటక ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి బళ్లారి శ్రీరాములు కుమార్తె రక్షితకు హైదరాబాద్ పారిశ్రామికవేత్త రవికుమార్‌తో మార్చి 5వ తేదీన వివాహం జరగనుంది. ఈ పెళ్లికి ఒక లక్ష ఆహ్వానపత్రికలు పంపించారు.

అంతేకాదు. ఆ కార్డుతో పాటు కుంకుమపువ్వు, ఏలకులు, పసుపు, కుంకుమ, అక్షింతలు కూడా పంపించారు. తొమ్మిది రోజుల పెళ్లి పండుగ ఫిబ్రవరి 27వ తేదీన బళ్లారిలో మొదలై బెంగళూరుకు మారింది. అక్కడ ఒక ఐదు నక్షత్రాల హోటల్‌లో రక్షిత స్నేహితులు మెహిందీ కార్యక్రమం నిర్వహిస్తారు. బుధవారం ముహూర్తానికి ముందు కార్యక్రమాలు చేపడతారు. గురువారం పెళ్లి జరుగుతుంది.

ఫొటో సోర్స్, OFFICE OF B. SREERAMULU

రక్షిత పెళ్లి వేడుకలు ఇప్పటికే స్థానిక మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయి. బీజేపీ మాజీ మంత్రి, అక్రమ ఐరన్ ఓర్ కుంభకోణంలో నిందితుడు గాలి జనార్ధన్‌రెడ్డి కూతురు బ్రాహ్మణి పెళ్లితో పోల్చుతున్నారు కూడా.

గాలి జనార్ధన్‌రెడ్డి కుమార్తె పెళ్లికి రూ. 500 కోట్లు ఖర్చైనట్లు అంచనా వేస్తున్నారు. అయితే.. 40-45 కోట్లు దాటలేదని ఆఫ్‌-ది-రికార్డ్‌ సంభాషణల్లో విలేకరులతో చెప్పారు.

గాలి జనార్ధన్‌రెడ్డి తన సోదరులు కరుణాకర్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డిలతో పాటు.. షెడ్యూల్డ్ ట్రైబ్ సామాజిక వర్గానికి చెందిన శ్రీరాములును కూడా మూడో సోదరుడిగా పరిగణిస్తారు. కర్ణాటక రాజకీయ సంభాషణల్లో శ్రీరాములును రెడ్డి సోదరులుగా వ్యవహరించటం సాధారణంగా మారిపోయింది.

ఫొటో సోర్స్, OFFICE OF B. SREERAMULU

బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో 40 ఎకరాల స్థలాన్ని ఈ పెళ్లి వేదికగా ఎంచుకున్నారు. అందులో 27 ఎకరాలను పెళ్లితో పాటు.. వినోదం తదితర కార్యక్రమాలకు కేటాయించారు. వాహనాల పార్కింగ్ కోసం 15 ఎకరాలు కేటాయించారు. నాలుగు ఎకరాల్లో హంపి విరూపాక్ష ఆలయం సహా వివిధ ఆలయాల నమూనాలతో ప్రత్యేకమైన డిజైన్లతో సెట్టింగ్స్ వేశారు. అందులో దాదాపు 300 మంది కళాకారులకు శిక్షణనిస్తున్నారు.

ఈ కళాకారులు పెళ్లిళ్ల ప్లానర్ ధ్రువ పర్యవేక్షణలో గత మూడు నెలలుగా ప్రాక్టీస్ చేస్తున్నారని శ్రీరాములు కార్యాలయం చెప్తోంది. మాండ్యాలోని మెలుకోట్ ఆలయంలో గల కల్యాణి నమూనాతో ముహూర్తం సెట్‌ను నిర్మించారు.

బెంగళూరులో పెళ్లి ముగిసిన తర్వాత.. కొత్తగా పెళ్లైన జంట, వారి కుటుంబ సభ్యులు వాయుమార్గంలో బళ్లారి వెళతారు. అక్కడ రిసెప్షన్ కార్యక్రమం ఉంటుంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అతిథులు బస్సుల్లో అక్కడికి వస్తారని భావిస్తున్నారు. బళ్లారిలో సెట్లను కూడా బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్లు, వారి బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీరాములు కార్యాలయం వివరించింది.

ఫొటో సోర్స్, OFFICE OF B. SREERAMULU

బాలీవుడ్ నటి దీపికా పడుకోన్ నియోగించుకున్న మేకప్ ఆర్టిస్టులు, ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా పెళ్లిని చిత్రీకరించిన వీడియో సిబ్బంది.. శ్రీరాములు కుమార్తె పెళ్లి కోసం పనిచేస్తున్నారు.

ఒకేసారి 7,000 మందికి వడ్డించేందుకు సరిపోయేలా భోజన మందిరాన్ని ఏర్పాటుచేస్తున్నారు. దాదాపు 1,000 మంది వంటవాళ్లు ఉత్తర కర్ణాటక భోజనం, ఇతర సంప్రదాయ వంటకాలను వండుతారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అతిథులకు వివిధ ఫైవ్ స్టార్ హోటళ్లలో బస ఏర్పాటు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, OFFICE OF B. SREERAMULU

అయితే, శ్రీరాములు మాత్రం.. ''నా కూతురు పెళ్లిని సాదా పద్ధతిలోనే జరుపుతున్నాం. ఎంతో ఖర్చు చేయటం అదంతా ఆచరణీయం కాదు. మా కుటుంబ సంప్రదాయం, సంస్కృతి ప్రకారం ఈ వేడుక జరుపుతున్నాం. మీడియాలో వస్తున్న కథనాలన్నీ తప్పు. నిజాన్ని ఎవరూ దాచలేరు. అంతా ప్రజలకు కనిపిస్తూనే ఉంది'' అని బీబీసీతో పేర్కొన్నారు.

తన స్నేహితుడు జనార్ధన్‌రెడ్డి తన కుమార్తె పెళ్లికి ఖర్చు పెట్టిన దానికన్నా శ్రీరాములు ఎక్కువ ఖర్చు చేస్తున్నారన్న కథనాలను కొట్టివేస్తూ.. ''ఈ సెట్లు ఏర్పాటు చేయటానికి నా సాయం పొందిన కొందరు స్నేహితులు ముందుకువచ్చారు. అందులో దేనికీ నేను డబ్బులు చెల్లించటం లేదు. వాళ్లు నా మీద అభిమానంతో ఇదంతా చేస్తున్నారు'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, OFFICE OF B. SREERAMULU

కానీ.. ఇటువంటి విలాసవంతమైన పెళ్లిళ్లు కర్ణాటకలోని ప్రస్తుత రాజకీయ వర్గానికి సాధారణ లక్షణంగా మారిపోయినట్లు కనిపిస్తోంది.

ఇటీవలే మంత్రిగా నియమితులైన బి.సి.పటేల్ కేవలం కొన్ని నెలల కిందటే తన రెండో కుమార్తె పెళ్లిని చాలా ఘనంగా జరిపారు.

కాంగ్రెస్ నుంచి తిరిగి బీజేపీలోకి వెనక్కి వచ్చిన మరో మంత్రి ఆనంద్‌సింగ్.. శాసనసభ ఎన్నికలకు ముందు తన కుమారుడి పెళ్లిని ఎంత ఘనంగా చేశారనేది బళ్లారిలో చర్చనీయాంశంగా మారింది.

ఫొటో సోర్స్, OFFICE OF B. SREERAMULU

ఆ రెండు పెళ్లిళ్లలోనూ పెద్ద సంఖ్యలో వివాహ ఆహ్వానపత్రికలు పంపించారు. కానీ ''హాజరైన వారి సంఖ్య 5,000 నుంచి 10,000 మందికి మించలేదు. రేపు బళ్లారిలో జరగబోయే కార్యక్రమానికి కూడా ఇదే తరహా స్పందన లభిస్తుందని భావించవచ్చు. అయితే.. ఇదంతా జనంతో అనుసంధానం కావటానికి చేస్తున్న ప్రయత్నమనేది స్పష్టం'' అని పేరు వెల్లడించవద్దని కోరిన బళ్లారి రాజకీయ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.

ఈ అభిప్రాయంతో రాజకీయ శాస్త్రవేత్తలు, సామాజికశాస్త్రవేత్తలు ఏకీభవిస్తున్నారు. పెళ్లిళ్లలో ఈ విలాస సంస్కృతిని వారు కూడా భిన్న కోణంలో చూస్తున్నారు.

''రాజకీయ నాయకుల పిల్లల వివాహాలను అమిత అట్టహాసంగా నిర్వహించటమనేది వారి ధన బలాన్ని బాహాటంగా ప్రకటించటంతో పాటు.. పెళ్లి భోజనాలకు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరినీ ఆహ్వానించటంతో అవి ప్రచ్ఛన్న ఎన్నికల ప్రచారాలుగా కూడా మారాయి. నియోజకవర్గాన్ని నిర్వహించటం కోసం.. తప్పుకాని వ్యయాలుగా మారాయి'' అని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ చందన్ గౌడ్ బీబీసీతో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, OFFICE OF B. SREERAMULU

''అది తమ రాజకీయ బలాన్ని విస్తరించుకోవటానికి వాళ్లు చేసే ప్రయత్నం. శ్రీరాములు షెడ్యూల్డ్ ట్రైబ్ నాయకుడిగా తన రాజకీయ గుర్తింపును మరింత బలోపేతం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. 2018లో బీజేపీ ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి, గత జూలైలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోయిన సంగతిని మనం విస్మరించకూడదు'' అని మైసూర్ యూనివర్సిటీలో రాజకీయ శాస్త్ర బోధకుడు ప్రొఫెసర్ ముజఫర్ అస్సాదీ విశ్లేషించారు.

''ఈ తరహా సంస్కృతిని అనుసరిస్తున్న వారు ఎక్కువగా తొలి తరం రాజకీయ నాయకులన్న విషయాన్ని గుర్తించాలి. సమాజంలో మరే విషయం పట్లా వారికి పెద్ద పట్టింపు లేదు. పెద్ద నోట్ల రద్దు ప్రభావాల నుంచి బయటపడటానికి ప్రజలు తిప్పలు పడుతున్న సమయంలో గాలి జనార్ధన్‌రెడ్డి తన కూతురుకు అత్యంత విలాసవంతంగా పెళ్లి చేసిన విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కూడా సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ పరిస్థితిలో ఏ మార్పూ లేదు'' అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, OFFICE OF B. SREERAMULU

''ఈ పెళ్లిళ్లను టెలివిజన్ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయటం, పదే పదే చూపించటం అనేది.. తమకు తెలియని ప్రజల ఎదుట తమ వ్యక్తిగత వ్యవహారాలను ఉద్దేశపూర్వకంగా తగ్గించుకోవటమే. రాజకీయ నాయకులు సాధారణ ప్రజలతో తమను తాము గుర్తిస్తూ పొదుపైన పద్ధతిలో జీవించాలనే నైతిక ఆకాంక్షలు బలహీనపడ్డాయి. ఏడు రోజులు, తొమ్మిది రోజుల పెళ్లిళ్లు అనేవి కూడా.. ఒకటి, రెండు రోజులకు మించని కర్ణాటక వివాహ సంస్కృతికి భిన్నమైనవి'' అని ప్రొఫెసర్ గౌడ చెప్పారు.

''ఈ రోజుల్లో యువత సాదాసీదా పెళ్లిళ్లకు ప్రాధాన్యమిస్తున్న ఉదంతాలు తరచుగా కనిపిస్తున్నాయి. ఇది ఒక ఉద్యమంగా మారుతుందని.. భారీ ఖర్చుతో అట్టహాసంగా చేసుకునే పెళ్లిళ్ల పట్ల వ్యతిరేకత పెరుగుతుందని, అనైతికంగా మారతాయని ఆశిద్దాం'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, OFFICE OF B. SREERAMULU

పెళ్లి ఖర్చుల మీద కూడా ఒక పరిమితి ఉండాలని ప్రొఫెసర్ అస్సాదీ అంటారు.

నిజానికి, ఐదు లక్షల రూపాయలు మించిన ఖర్చు, అతిథుల సంఖ్య 1,000 మందికి మించితే.. ఆ పెళ్లిని విలాసవంతమైన పెళ్లిగా పరిగణించి ఆ ఖర్చు మీద పన్ను విధించాలన్న ప్రతిపాదన 2014లో సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకువచ్చింది. కానీ వివిధ శాసనసభ్యుల ఒత్తిడి కారణంగా ఆ అంశాన్ని శాసనసభలో ప్రవేశపెట్టలేక పోయింది.

ఇక.. మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి కుమారుడు, సాండల్‌వుడ్ నటుడు నిఖిల్ పెళ్లిని వచ్చే నెలలో బెంగళూరు-మైసూరు హైవే దగ్గర గల ఒక 54 ఎకరాల తోటలో ఎలా చేయబోతున్నారనేది చూడటానికి అందరూ వేచివున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)