చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

కోళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ భారత్‌‌పైనా ప్రభావం చూపుతోంది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో అనేక సందేహాలు, అపోహలు ఉన్నాయి.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజన్ శర్మ‌ నుంచి ఇలాంటి అనేక సందేహాలకు సమాధానాలను రాబట్టే ప్రయత్నం చేశారు బీబీసీ ప్రతినిధి సల్మాన్ రావి.

ఫొటో సోర్స్, AFP

రాజన్‌ శర్మ చెప్పిన విషయాలివే...

  • చాలావరకూ.. వ్యక్తులు ఒకరిని ఒకరు తాకడం వల్లే కరోనావైరస్ వ్యాపిస్తుంది.
  • కరోనావైరస్ సోకడం చిన్నపిల్లల్లో చాలా తక్కువ.
  • 58 ఏళ్లకు పైబడినవాళ్లపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
  • గ్రామాల్లో కరోనావైరస్ వ్యాపించడం తక్కువ. ఇది నగరాల్లో వ్యాపించే వైరస్. ప్రతి ఒక్కరి దగ్గూ వైరస్ మోసుకువచ్చేదేం కాదు.
  • కరోనావైరస్‌ సోకితే తక్షణం నయం చేసే చికిత్సేమీ లేదు. ఒకవేళ లక్షణాలు కనిపిస్తే, వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
  • కరోనావైరస్ సోకినవారిని ఆసుపత్రుల్లో విడిగా, చిన్న చిన్న బృందాల్లో ఉంచుతారు.
  • చికెన్ తింటే, కరోనావైరస్ వస్తుందన్నది నిజం కాదు. భారత్‌లోని వంట పద్ధతుల వల్ల ఆహారంలో వైరస్ బతికుండే అవకాశాలు చాలా తక్కువ. చికెన్, గుడ్లు తింటే వచ్చే ఇబ్బందేమీ లేదు.
  • వేసవి వస్తే కరోనావైరస్ నియంత్రణలోకి వస్తుంది. ఉష్ణోగ్రతలు పెరిగితే, దాని ప్రభావం తగ్గుతుంది.
  • ప్రభుత్వం చాలా చోట్ల కరోనావైరస్ చికిత్స కేంద్రాలు తెరిచింది. లక్షణాలు కనిపిస్తే అక్కడికి వెళ్లండి.
  • కరోనావైరస్‌ నుంచి రక్షణ కోసం థ్రీ-లేయర్డ్ మాస్క్‌లు దొరుకుతాయి. ఎన్-51 మాస్క్‌లు వాడొచ్చు. సాధారణ సర్జికల్ మాస్క్‌లు వేసుకున్నా ఫర్వాలేదు.

ఫొటో సోర్స్, Reuters

లక్షణాలు ఇవే...

కరోనావైరస్ సోకినవారిలో లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి.

శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలతో దానిని గుర్తించవచ్చు.

జ్వరంతో మొదలై, తీవ్రమైన పొడి దగ్గు వస్తుంది.

వారం వరకూ అదే పరిస్థితి కొనసాగితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి.

కానీ సీరియస్ కేసుల్లో ఇన్ఫెక్షన్ న్యుమోనియా లేదా సార్స్‌గా మారుతుంది.

కిడ్నీలు ఫెయిలై రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులే ఉన్నారు. ముఖ్యంగా పార్కిన్సన్, డయాబెటిస్ లాంటి వ్యాధులు ఉన్నవారు దీనికి గురవుతున్నారు.

ఈ ఇన్ఫెక్షన్ వదిలించుకోడానికి ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక చికిత్సలూ లేవు.

ఇన్ఫెక్షన్ వచ్చిన రోగులకు డాక్టర్లు ప్రస్తుతం వారి లక్షణాల ఆధారంగా చికిత్సలు అందిస్తున్నారు.