పొత్తూరి వెంకటేశ్వర్రావు (1934-2020): 'వృత్తి ధర్మాన్ని నిష్ఠగా పాటించిన సంపాదకుడు'

  • రాజేశ్ పెదగాడి
  • బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్

ఫొటో సోర్స్, twitter.com/VPSecretariat

ఫొటో క్యాప్షన్,

ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వేంకటేశ్వరరావు కన్నుమూత

తెలుగు పత్రికా రంగంలో విశేష సేవలందించిన పొత్తూరి వెంకటేశ్వరరావు గురువారం మరణించారు. పత్రికా సంపాదకుడిగా, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షుడిగా ఆయన సేవలు అందించారు. రచయిత, వక్త, సమీక్షకుడిగా ఆయనకు మంచి పేరుంది. అయిదు దశాబ్దాల పాత్రికేయ ప్రస్థానంలో ఆయన ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు.

లోకాయుక్త కమిటీలో జ్యుడీషల్ సభ్యుడిగా, సలహాదారుగానూ పొత్తూరి పనిచేశారు. రాజ్యాంగం, చట్టాలు, మానవ హక్కులపై ఆయనకు మంచి పట్టుంది.

''నాటి పత్రికలు విలువలు పాటించేవి. సంపాదకులు నడిపించేవారు. నేడు, పరిస్థితి వేరు. యజమానులే నడిపిస్తున్నారు. పత్రికలను ఎక్కువ సంఖ్యలో అమ్ముకోవడానికి తాపత్రయ పడుతున్నారు. రేటింగులకి ప్రాధాన్యం ఇస్తున్నారు, విలువలు పడిపోయాయి'' అని ఆయన బహిరంగంగా తన అభిప్రాయాన్ని చాలాసార్లు వ్యక్తంచేశారు.

అందరితో కలిసే పని

ఈనాడు, వార్త, ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి, ఉదయం తదితర పత్రికల్లో పొత్తూరి పనిచేశారు. 1934, ఫిబ్రవరి 8న లో గుంటూరు జిల్లాలోని పొత్తూరులో ఆయన జన్మించారు. 1957లో ఆంధ్ర జనత పత్రికతో ఆయన ప్రస్థానం మొదలైంది.

ఆంధ్రప్రభ, వార్త పత్రికలకు సుదీర్ఘకాలం ఎడిటర్‌గా ఆయన కొనసాగారు. ఆంధ్రప్రభలో ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలను సీనియర్ జర్నలిస్ట్, ఈనాడు జర్నలిజం స్కూల్ ఫ్యాకల్టీ ఆర్‌వీ రామారావు బీబీసీతో పంచుకున్నారు.

''పొత్తూరి అప్పుడు ఆంధ్రప్రభ ఎడిటర్‌గా ఉండేవారు. ఆనాడు ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండేది. ముఖ్యంగా నైట్ డ్యూటీలో ఒక్కణ్నే ఉండాల్సి వచ్చేది. సాయం కోసం ఎవరైనా ఉన్నారా అని అడిగితే.. స్వయంగా పొత్తూరి వచ్చి పనిచేసేవారు. చాలా ఫాస్ట్‌గా వార్తలు రాసేవారు. ఎడిటర్‌ననే గర్వం ఆయనలో ఉండేది కాదు''అని రామారావు వివరించారు.

''అక్కడి సబ్‌ఎడిటర్లలో అందరికంటే నేను చిన్నవాణ్ని. అయినా నన్ను షిఫ్ట్ ఇన్‌ఛార్జిని చేసి, ఇష్టం వచ్చిన వాళ్లు పనిచేయండి.. లేనివాళ్లు మానేయండని. ముక్కుసూటిగా మిగతావారికి చెప్పారు. వ్యక్తుల్లో ప్రతిభను వెలికి తీయడంలో ఆయన ముందుండేవారు''అని రామారావు చెప్పారు.

ఫొటో సోర్స్, twitter.com/BJPKrishnasagar

తప్పు వచ్చిందని రాజీనామా

పాత్రికేయ విలువలకు పొత్తూరి ప్రాధాన్యం ఇచ్చేవారని రామారావ్ చెప్పారు. ''ఆంధ్రభూమిలో ఎడిటర్‌గా ఉన్నప్పుడు పొత్తూరి పెట్టిన ఒక శీర్షికలో తప్పుదొర్లింది. దీంతో నైతిక బాధ్యతను తీసుకొని పొత్తూరి రాజీనామా సమర్పించారు. అయితే యాజమాన్యం దానికి అంగీకరించలేదు. ఉదయం పత్రికకు ఎడిటర్‌గా పనిచేసినప్పుడూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. వృత్తి ధర్మాలను ఆయన నిష్ఠగా పాటించేవారు''అని వివరించారు.

నక్సలైట్లతో చర్చల్లో ప్రధాన పాత్ర

2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నక్సలైట్లతో జరిపిన చర్చల్లో పొత్తూరి క్రియాశీల పాత్ర పోషించారు.

ఈ అంశంపై పొత్తూరి సన్నిహితుడు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ పాలసీ అడ్వైజర్, సాక్షి మీడియా గ్రూప్ మాజీ ఎడిటోరియల్ డైరెక్టర్ కుండుభట్ల రామచంద్రమూర్తి బీబీసీతో మాట్లాడారు. అప్పట్లో నక్సలైట్లతో చర్చల కోసం కన్సర్న్డ్ సిటిజన్స్ కమిటీని ఏర్పాటుచేశారని, ఈ కమిటీకి ఐఏఎస్ అధికారి శంకరన్ నేతృత్వం వహించగా అందులో పొత్తూరి కూడా సభ్యులని చెప్పారు. నక్సలైట్లను చర్చలకు తీసుకురావడంలో ఈ కమిటీ కీలకపాత్ర పోషించిందని రామచంద్రమూర్తి అన్నారు.

''నక్సలైట్లతో చర్చలు జరిపేందుకు పొత్తూరి, మరికొందరు నల్లమల అడవుల్లోకి వెళ్లారు. రామకృష్ణ సహా పలువురు మావోయిస్టు నాయకులతో వీరు మాట్లాడారు. పలువురు నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసేలా చేశారు''అని రామచంద్రమూర్తి తెలిపారు.

''ఉదయంలో ఎడిటర్‌గా ఉన్నప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బంధువు సింగాపురం రాజేశ్వర్రావుపై వచ్చిన స్మగ్లింగ్ ఆరోపణల మీద పరిశోధనాత్మక కథనాలు చేయించారు. అయితే, వీటిని ప్రచురించొద్దని పత్రిక యజమాని మాగుంట సుబ్బిరామి రెడ్డి ఫోన్ చేశారు. వెంటనే ఈ వార్తలు ప్రచురించకపోతే నేను ఉద్యోగంలో ఉండలేనని పొత్తూరి ఆయనకు తెగేసి చెప్పారు''అని రామచంద్రమూర్తి వివరించారు. 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమం క్రియాశీలంగా నడుస్తున్న రోజుల్లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పొత్తూరికి ఫోన్ చేసి ఇక్కడి పరిస్థితులను ఆమె అడిగి తెలుసుకునేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.

దైవభక్తి ఎక్కువే

పొత్తూరికి దైవ భక్తి ఎక్కువగా ఉండేది. ఆంధ్రప్రభకు వారానికి ఒకసారి ఆధ్యాత్మిక సంపాదకీయాలు రాసేవారు. ఇవి చింతన పేరుతో పుస్తకంగా ప్రచురితం అయ్యాయి.

దీనితోపాటు తెలుగు పత్రికలు, నాటి పత్రికల మేటి విలువలు, చిరస్మరణీయులు, కాశీనాథుని నాగేశ్వరరావు, పారమార్థిక పదకోశం లాంటి పుస్తకాలు రాశారు.

టీటీడీ సంపాదక మండలిలోనూ సభ్యుడిగా ఉన్నారు. పారమార్థిక పదకోశం ఓ తెలుగు నిఘంటువు. దీన్ని తయారుచేసేందుకు సంస్కృత పండితుడు పుల్లెల రామచంద్రం దగ్గర ఆయన సంస్కృతం నేర్చుకున్నారు.

''విధి నా సారథి'' పేరుతో పొత్తూరి ఆత్మకథ రాశారు. ఆయన ఎన్నో పుస్తకాలకు ముందు మాటలు రాశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.

హైదరాబాద్‌లోని విజయనగర్ కాలనీలోని ఉంటున్న పొత్తూరి గత ఆరేళ్ళుగా రక్త క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. కేర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటూ మార్చి 5 గురువారం తుది శ్వాస విడిచారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)