భారత్‌లో పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు ఉన్నాయా? #BBCISWOTY

  • దివ్య ఆర్య
  • బీబీసీ ప్రతినిధి
సమానత్వం

ఫొటో సోర్స్, Getty Images

'భారత్‌లో పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు ఉన్నాయా?' అని అడిగితే... పురుషులే కాదు, మహిళలు కూడా ఉన్నాయనే సమాధానం ఇస్తున్నారు.

దేశంలోని 14 రాష్ట్రాల్లో 10 వేల మందిని బీబీసీ ఇదే ప్రశ్న అడిగింది. వారిలో సమాన హక్కులు ఉన్నాయని ఏకంగా 91% మంది జవాబిచ్చారు.

సమానత్వం గత రెండు దశాబ్దాల్లో పెరిగిందని సుమారు 66 శాతం మంది చెప్పారు.

పురుషులతో సమానంగా మహిళల జీవితాలు మెరుగ్గానే ఉంటున్నాయని అభిప్రాయపడ్డవారి సంఖ్య ఎక్కువగానే ఉంది.

గ్రామీణ ప్రాంతాలు, కాస్త ఆదాయం తక్కువున్న వర్గాలకు చెందిన వాళ్లు పురుషుల కన్నా మహిళల జీవితాలే మెరుగ్గా ఉంటున్నాయని అభిప్రాయపడ్డారు.

సిద్ధాంతపరంగా చూస్తే సమానత్వం ఉందనే అందరూ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మరి, నిజంగా భారత్‌లో మహిళలకు ఇంత సానుకూల పరిస్థితులు ఉన్నాయా?

ఫొటో సోర్స్, Getty Images

#MeToo లాంటి ఉద్యమాలు... పరపతి దుర్వినియోగం, లైంగిక వేధింపులు ఏ స్థాయిలో విస్తరించాయన్న విషయాలను లేవనెత్తాయి.

కొన్ని దశాబ్దాలుగా మహిళా హక్కుల ఉద్యమకారులు, యువత చేసిన ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేశాయి. వారసత్వం, విడాకులు, దత్తత వంటి అంశాలకు సంబంధించిన కుటుంబ చట్టం మొదలుకుని.. లైంగిక హింసకు మెరుగైన నిర్వచనాలు ఇచ్చిన, న్యాయ ప్రక్రియలను వేగవంతం చేసిన చట్టాలు వీటిలో ఉన్నాయి.

ఇన్ని చర్యలు తీసుకుంటున్నా, మహిళలు జీవితాలు పురుషుల కన్నా మెరుగ్గా గానీ, సరి సమానంగా గానీ ఉన్నాయని చెప్పే పరిస్థితి లేదు.

బీబీసీ సర్వేలో అడిగిన అనుబంధ ప్రశ్నలకు వచ్చిన సమాధానాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

భారత్‌లో తమకు మగ పిల్లలు పుట్టాలని కోరుకుంటున్నవారి సంఖ్య ఇప్పటికీ ఎక్కువగానే ఉంటోంది. శిశువుల లింగ నిష్పత్తిలో వ్యత్యాసం అంతకంతకూ పెరుగుతూ ఉండటమే దీనికి నిదర్శనం.

ఫొటో సోర్స్, Getty Images

అత్యాచార కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి వేగంగా విచారణ ముగించాలని చట్టం చెప్పినా, పెండింగ్ కేసుల భారం వల్ల కోర్టులు ఆ పని చేయలేకపోతున్నాయి.

లైంగిక వేధింపుల కేసుల్లో ఒకరిని దోషిగా నిరూపించడం చాలా కష్టం. ఇలా కేసులు పెట్టే మహిళలు పరువు నష్టం కేసులనూ ఎదుర్కోవాల్సి వస్తోంది.

మెరుగైన ప్రసూతి వైద్యం ఇంకా సుదూరంగానే ఉంది. యూనిసెఫ్ సమాచారం ప్రకారం ప్రసవ సమయంలో రోజూ ప్రపంచవ్యాప్తంగా 800 మంది చనిపోతున్నారు. ఇందులో 20 శాతం భారత మహిళలే.

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో 15 ఏళ్లు దాటిన ఆడవారిలో ఉద్యోగాలు చేసేవారి సంఖ్య 33 శాతం మాత్రమేనని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కార్మికశక్తిలో మహిళల భాగస్వామ్యం అత్యల్పంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి.

బీబీసీ సర్వేలో లోతుగా ప్రశ్నలు అడిగినకొద్దీ సమాన హక్కులు రావాలన్న కోరికను జనం వ్యక్తం చేశారు. కానీ, సమాన హక్కులు అంటే చాలా మందికి పరిమిత అవగాహనే ఉంది.

అవసరమైతే లేదా ఇష్టం ఉంటే మహిళలు ఉద్యోగాలు చేయాలని 75 శాతం మంది అంగీకరించారు.

వివాహం తర్వాత మహిళలు ఉద్యోగం చేయడం సరికాదని అభిప్రాయపడ్డవాళ్లు 33 శాతం దాకా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

మహిళలకు అనుకూలమైన ప్రాంతాలుగా గుర్తింపు పొందిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న మహిళల నిష్పత్తి ఎక్కువగా ఉంది. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ ఈ జాబితాలో అట్టడుగున ఉన్నాయి.

కుటుంబానికి డబ్బు అవసరం కాబట్టి మహిళలు పని చేస్తారన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఆర్థిక కారణాల కన్నా, పనిచేయాలన్న కోరికతో మహిళలు ఉద్యోగాలకు వెళ్తారని అన్నవారు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు.

మహిళలు ఇంట్లోనే ఉండాలని సర్వేలో సగం మంది అభిప్రాయపడ్డారు. వాళ్లు బయటకు వెళ్తే ఇంటి పనులకు సమస్య అని, భద్రతపరంగానూ ఇబ్బందులు ఉంటాయని అన్నారు.

ఉద్యోగాలకు కొరత ఉంటే, ఉద్యోగంపై పురుషులకే మొదట హక్కు ఉండాలన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. మహిళలు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించడం సమాజంలో మహిళలు ఇంటికే పరిమితమన్న భావన ఎంతగా నాటుకుపోయిందో తెలియజేస్తోంది.

మగ బిడ్డను కోరుకునే అంశం గురించి ప్రశ్నించినప్పుడు, చాలా మంది తమకు ఎవరైనా ఫర్వాలేదని బదులిచ్చారు. కానీ, ఉన్నత విద్య మాత్రం అమ్మాయి కన్నా అబ్బాయికే చాలా ముఖ్యమని అన్నారు.

మాతృస్వామ్యం బలంగా ఉన్న మణిపూర్‌లో మాత్రం అమ్మాయిల కన్నా అబ్బాయిలకు ఉన్నత విద్య ముఖ్యమన్న వాదనతో ఎక్కువ మంది విభేదించారు.

ఫొటో సోర్స్, Getty Images

హింస విషయంలో మాత్రం జనాల వైఖరి ఆందోళనకరంగా ఉంది. లైంగిక హింస పెరిగిందని మెజార్టీ జనం అభిప్రాయపడ్డారు (ఇది వాస్తవం కూడా), కానీ కుటుంబాలు విచ్ఛిన్నమవ్వకుండా ఉండేందుకు హింసను మహిళలు సహించాలని కూడా అన్నారు.

మొత్తంగా ఈ సర్వే... మహిళల హక్కులను జనాలు అర్థం చేసుకునే తీరులో ముఖ్యమైన మార్పులు వస్తున్నట్లు సూచిస్తోంది.

కుటుంబంలో, బయట సమాజంలో తమ స్థానాన్ని మార్చుకునేందుకు మహిళలు పోరాడుతున్నారు. సొంత జీవితాలపై వాళ్లు నియంత్రణను పొందాలంటే, వాళ్లపై ప్రదర్శిస్తున్న అధికారాన్ని ఇంకొందరు వదులుకోవాలి.

ఆ పరిణామాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే ఆ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతోంది.

అనాదిగా ఉన్న నమ్మకాలు, ఆచారాలను మార్చుకునేందుకు, అవగాహన పెంచుకునేందుకు సంసిద్ధతైతే కనిపిస్తోంది. మార్పులు కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)