షెఫాలీ వర్మ: మహిళల టీ20 ప్రపంచకప్‌లో సంచలనాలు సృష్టిస్తున్న 16 ఏళ్ల క్రికెట్ రాక్ స్టార్

షఫాలీ వర్మ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

భారతీయ క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్‌ను తలపిస్తోంది షెఫాలీ వర్మ

డిగ్రీ చదవాలా, ఇంజనీరింగ్ చేయాలా? బయటికెళ్లి సరదాగా గడపాలా, ఇంట్లో కూర్చోవాలా? బైక్ లేదంటే కారు నడుపుతానని అమ్మా, నాన్నని ఎలా ఒప్పించాలి? 16 ఏళ్ల టీనేజర్లు సమాధానాల కోసం వెతుక్కునే ప్రశ్నలు చాలా వరకు ఇలాగే ఉంటాయి.

అయితే, షెఫాలీ వర్మ టీనేజ్ జీవితంలో మాత్రం ఇవి లేవు. ఆమెది వేరే ప్రపంచం.

భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్ఉమెన్ అయిన షెఫాలీ వర్మ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో మెరుపులు మెరిపించింది. దీంతో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్‌కు చేరింది. గ్రూపు దశలో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలిచిన భారత జట్టు సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉండగా వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యింది. దీంతో గ్రూపు దశలో అజేయంగా నిలిచి, అత్యధిక పాయింట్లు సాధించిన భారత్ నిబంధనల ప్రకారం ఫైనల్ చేరింది.

ఈ టోర్నమెంట్‌లో షెఫాలీ వర్మ నాలుగు మ్యాచుల్లో బ్యాటింగ్ చేసి 161 పరుగులు సాధించింది. అందరికంటే అత్యధికంగా 161 స్ట్రైక్ రేట్ నమోదు చేసింది. అందరికంటే అత్యధిక సిక్సర్లు (9) కొట్టింది. 2019 సెప్టెంబర్ 24వ తేదీన తొలి టీ20 మ్యాచ్ ఆడిన షెఫాలీ వర్మ ఇప్పటి వరకూ 18 ఇన్నింగ్సుల్లో 147 స్ట్రైక్ రేట్‌తో 485 పరుగులు చేసింది. ఇందులో 58 ఫోర్లు, 21 సిక్సర్లు ఉన్నాయి. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 120 కంటే ఎక్కువ పరుగులు చేసిన మహిళల్లో షెఫాలీ వర్మదే అత్యధిక స్ట్రైక్ రేట్.

తన బ్యాటింగ్ స్టైల్‌తో ప్రేక్షకుల్ని, విమర్శకుల్ని ఆకట్టుకున్న షెఫాలీ వర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని చేజిక్కించుకుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

స్మృతి మంథానతో షెఫాలీ వర్మ

షెఫాలీ వర్మ తన సహజసిద్ధమైన, శక్తివంతమైన బ్యాటింగ్‌తో ఇప్పటి వరకూ భారత మహిళల క్రికెట్ జట్టు ఆణిముత్యంగా భావించిన మరో ఓపెనర్ స్మృతి మంథానను మించిన ప్రతిభ కనబరుస్తోంది.

''మేం మొదట మంథానను చూసినప్పుడు, ఆమెలాగా బంతిని బాదే వాళ్లు మరెవరినీ చూడలేమనిపించింది. కానీ, షెఫాలీ వర్మ వచ్చింది. షెఫాలీని చూసిన తర్వాత మంథాన బ్యాటింగ్ చూస్తే బోరింగ్‌గా ఉంటోంది. షెఫాలీ బంతిని కొట్టే తీరు నమ్మలేనట్లు ఉంటోంది'' అని ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు స్పిన్నర్ అలెక్స్ హార్ట్‌లీ బీబీసీ స్పోర్ట్స్‌తో చెప్పింది.

''మరో రెండేళ్లలో షెఫాలీ మరింత దృఢంగా, మరింత శక్తివంతంగా మారుతుంది, అప్పుడు ఆమెను చూడాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. ఆమె ఒక అద్భుతమైన క్రికెటర్ అవుతుంది'' అని హార్ట్‌లీ తెలిపింది.

అయితే, షెఫాలీ వర్మ ఉన్నట్టుండి ఇంత సక్సెస్ కావడం వెనుక సీక్రెట్ ఏంటి? స్వేచ్ఛ తప్ప మరేమీ లేదని ఆమె టీమ్ మేట్ షిఖా పాండే చెప్పింది.

''తనదైన శైలిలో ఆడుకునేందుకు ఆమెకు ఫ్రీ లైసెన్స్ లభించింది. దేశవాళీ క్రికెట్‌లో ఈ పాప భయంలేకుండా క్రికెట్ ఆడుతోంది. దానివల్లే తనకు జాతీయ జట్టులో చోటు లభించింది. అప్పుడు తన వయసు 15 ఏళ్లు'' అని షిఖా తెలిపింది.

''తనశైలి విషయంలో ఎలాంటి మార్పులూ, చేర్పుల్ని మేం కోరుకోలేదు. తనకు పేరుతెచ్చిన శైలిలోనే వెళ్లి ఆడమని మేం లైసెన్స్ ఇచ్చాం.''

''16 ఏళ్ల వయసులో నేను క్రికెటర్ కావడానికి ట్రైనింగ్ కూడా మొదలు పెట్టలేదు. అప్పటికి నేను గల్లీల్లో క్రికెట్ ఆడేదాన్ని. అలాంటిది ఒక 16 ఏళ్ల అమ్మాయి భారతదేశం తరపున క్రికెట్ ఆడుతుండటం అద్భుతంగా ఉంది'' అని షిఖా వివరించింది.

షెఫాలీ వర్మ రాక్ స్టార్ అన్నారు భారతదేశ లెజెండరీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్‌.

ఆమె భయంలేనిదని, ఆమె ఎదుగుతున్నట్టే భారతదేశంలో మహిళల క్రికెట్‌కు ప్రజాదరణ, అభిమానులు, స్పాన్సర్లు కూడా పెరుగుతున్నారని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌బౌలర్ బ్రెట్ లీ అన్నాడు.

భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 2002వ సంవత్సరంలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళగా రికార్డు సాధించింది. అయితే, అప్పట్లో ఆ విషయం పేపర్లో చదివిన వారికి తప్ప ఇంకెవరికీ తెలియదు.

''అప్పట్లో ప్రయాణ ఖర్చులు కానీ, రోజువారీ ఖర్చులు కానీ ఇచ్చేవాళ్లు కాదు. ఫిజియోథెరపిస్టు, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ వంటివాళ్లు లేరు'' అని ఐసీసీ కోసం రాసిన ఒక బ్లాగ్‌లో మిథాలీ పేర్కొంది.

''మగ క్రికెటర్లు మాత్రమే మాకు స్ఫూర్తి. మేం వారిని మాత్రమే చూడగలిగేవాళ్లం. ఇప్పుడు ఒక టీనేజీ అమ్మాయి కూడా మహిళా క్రికెటర్‌గా ఇతరులకు రోల్ మోడల్ కాగలదు'' అని మిథాలీ తెలిపింది.

టీ20 ప్రపంచకప్ మ్యాచుల్ని చూసేందుకు వస్తున్న మెజార్టీ ప్రేక్షకుల్లో ఫ్యామిలీలే ఎక్కువ. చిన్నారులు చిన్నచిన్న బ్యాట్లు పట్టుకుని బౌండరీల దగ్గర పరుగులు పెడుతూ, వాటిపై ఆటోగ్రాఫ్‌లు చేయాలని క్రికెటర్లను అడుగుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

‘తనదైన శైలిలో ఆడుకునేందుకు షెఫాలీ వర్మకు ఫ్రీ లైసెన్స్ లభించింది’

షెఫాలీ వర్మ ఇప్పుడు చాలా పాపులర్ అయిన పేర్లలో ఒకటి. పెర్త్‌లో తమ రెండో గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టును భారత జట్టు ఓడించినప్పుడు షెఫాలీ వర్మను, ఆమె జట్టు సభ్యుల్ని అభిమానులు చుట్టుముట్టారు.

వికెట్ కీపర్ తానియా భాటియాను సెల్ఫీల కోసం అభిమానులు పిలిచారు. వాళ్లంతా భారతజట్టు నీలం రంగు టీషర్టులు వేసుకున్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్ విజయానందంతో గట్టిగా అరుస్తూ వారిని ప్రోత్సహించింది. బారులుతీరిన అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ, వారికి కృతజ్ఞతలు చెబుతూ కనిపించారు షెఫాలీ వర్మ, ఇతర భారతీయ క్రికెటర్లు.

అయితే, అమ్మాయి అన్న కారణంగా షెఫాలీ వర్మ భారతదేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంది.

దిల్లీకి సమీపంలోని రోహ్‌తక్‌లో 2013లో సచిన్ తెందూల్కర్ తన చివరి రంజీట్రోఫీ మ్యాచ్ ఆడుతున్నప్పుడు షెఫాలీ వర్మ తండ్రి సంజీవ్ వర్మ ఆమెను స్టేడియానికి తీసుకెళ్లాడు. తండ్రి భుజాలపై ఎక్కి మ్యాచ్ చూసిన తొమ్మిదేళ్ల షెఫాలీ అప్పుడే క్రికెటర్ అవ్వాలని నిర్ణయించుకుంది.

కానీ, అప్పటికే షెఫాలీ అన్నయ్య సాహిల్ స్థానిక క్రికెట్ క్లబ్స్‌లో ఆడుతున్నాడు. దీంతో షెఫాలీకి అవకాశం రాదు. ఎందుకంటే అమ్మాయిల్ని ఆడించుకోవడం క్లబ్స్‌కు ఇష్టం లేదు.

ఫొటో సోర్స్, facebook/gurgaoncricketground

దీంతో సంజీవ్ వర్మకు ఒక ఉపాయం తట్టింది. కూతురి హెయిర్ స్టైల్ మార్చేశాడు. షెఫాలీ అబ్బాయే అని జనాల్ని నమ్మించేందుకు ఆమెకు అబ్బాయిల్లాగా కటింగ్ చేయించాడు. ఒకరోజు సాహిల్ అనారోగ్యానికి గురైతే, అతడి స్థానంలో షెఫాలీ ఆడుతుందని క్రికెట్ క్లబ్‌కు పంపించాడు.

ఆ ఏడాది షెఫాలీ చేసిన ప్రదర్శనకు ఆమెకు 'మ్యాన్ ఆఫ్ ది సీజన్' అవార్డు లభించింది. ఆరేళ్ల తర్వాత ఆమె సచిన్ తెందూల్కర్ పేరిట ఉన్న 30 ఏళ్ల రికార్డును తిరగరాసింది.

వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో షెఫాలీ వర్మ 49 బంతుల్లో 73 పరుగులు చేసింది. అప్పటికి ఆమె వయసు సరిగ్గా 15 ఏళ్ల 285 రోజులు. దీంతో అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ అర్థ సెంచరీ చేసిన క్రికెటర్‌గా 1989లో పాకిస్తాన్‌పై 59 పరుగులు చేసి సచిన్ తెందూల్కర్ నెలకొల్పిన రికార్డును షెఫాలీ వర్మ బద్దలుకొట్టింది.

''అమ్మాయిల్ని క్రికెట్ ఆడకుండా అడ్డుపడొద్దు, ఇదే నేను కోరుకునేది. తను నిజంగా కష్టపడితే, తన ఆటమీదే శ్రద్ధ పెడితే.. ఏదైనా జరగొచ్చు'' అని షెఫాలీ వర్మ చెప్పింది.

మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో షెఫాలీ వర్మ సాధించిన అతితక్కువ స్కోరు 15 బంతుల్లో 29 పరుగులు. ఆస్ట్రేలియాతో జరిగిన టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లో సాధించిన పరుగులు అవి. ఫైనల్ మ్యాచ్‌లో కూడా భారత జట్టు ఆస్ట్రేలియాతోనే తలపడుతోంది. అప్పుడు కూడా షెఫాలీ వర్మ ఇదే తరహాలో తన జట్టుకు ప్రారంభాన్ని ఇస్తే.. తొలిసారి భారతీయ మహిళలు ప్రపంచకప్‌ను ముద్దాడొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)