యస్ బ్యాంక్: ఖాతాదారులకు పైసా నష్టం లేకుండా చూస్తామన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

యస్ బ్యాంక్ డిపాజిటర్ల డబ్బు పూర్తిగా సురక్షితమమని, వారికి ఎలాంటి నష్టమూ జరుగకుండా ప్రభుత్వం చూసుకుంటుందని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు.

యస్ బ్యాంక్ మీద ఆర్‌బీఐ మారటోరియం విధించిన తరువాత డిపాజిటర్లు ఆ బ్యాంకు శాఖల వద్ద డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి బారులు తీరారు. యస్ బ్యాంక్ సంక్షోభంలో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. "ప్రతి ఒక్కరి డిపాజిట్ సొమ్ము సురక్షితంగా ఉంటుంది. యస్ బ్యాంకులో ఏ ఒక్క వినియోగదారుకూ ఎలాంటి నష్టం జరగదని రిజర్వు బ్యాంకు నాకు భరోసా ఇచ్చింది" అని సీతారామన్ అన్నారు.

ఈ విషయాన్ని రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం రెండూ నిశితంగా పరిశీలిస్తున్నాయని, సామాన్య ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఏ నిర్ణయమైనా తీసుకోవడం జరుగుతుందని సీతారామన్ హామీ ఇచ్చారు.

అలాగే, బ్యాంకులో పని చేసే ఉద్యోగులకు కూడా ఏడాది పాటు ఉద్యోగం, జీతాల సమస్య లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా ఆర్థిక మంత్రి చెప్పారు. ఖాతాదారులు డ్రా చేసుకోగల మొత్తంపై విధించిన 50 వేల రూపాయల పరిమితి అమలు జరిగేలా చూస్తామని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

అంతకుముందు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ కూడా యస్ బ్యాంక్ ఖాతాదారుల సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

యస్ బ్యాంక్‌ వ్యవహారాలను 2017 నుంచి గమనిస్తున్నామని, అందులో అనేక అవకవతకలు జరిగాయని చాలా ఏజెన్సీల ద్వారా తమకు తెలిసిందని శక్తికాంత్ దాస్ చెప్పారు.

యస్ బ్యాంక్‌లో అసలేం రిజర్వ్ బ్యాంక్ కనుగొంటుందని, దానికి వ్యక్తిగతంగా బాధ్యులు ఎవరైనా ఉంటే వారిని కూడా గుర్తిస్తుందని ఆర్థిక మంత్రి అన్నారు.

అనిల్ అంబానీ గ్రూప్, ఎస్సెల్, డిహెచ్‌ఎఫ్ఎల్, ఐఎల్‌ఎఫ్ఎస్, వొడాఫోన్ వంటి సంస్థలకు యెస్ బ్యాంక్ రుణాలు ఇచ్చిందని, వాటిలో కొన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని శక్తికాంత్ దాస్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్

బ్యాంకింగ్ రంగం సురక్షితం

యస్ బ్యాంక్ విషయంలో ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు కానీ, ఇకపై చేపట్టబోయే చర్యలు కానీ బ్యాంకింగ్ రంగం భద్రత, స్థిరత్వాలను దృష్టిలో పెట్టుకునే తీసుకోవడం జరుగుతుందని గవర్నర్ విలేకరులతో అన్నారు.

"మన దేశ బ్యాంకింగ్ రంగం పూర్తిగా సురక్షితంగా మరియు భద్రంగా ఉందని నేను భరోసా ఇస్తున్నాను" అని ఆయన చెప్పారు.

"యస్ బ్యాంక్ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతోందనే అంశపై మాట్లాడుతూ, "ఈ బ్యాంక్ పునరుద్ధరణ కోసం ఆర్‌బీఐ త్వరలో ఒక ప్రణాళికను సిద్ధం చేస్తుంది. సమస్యల నుంచి బయటపడడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకునేందుక యస్ బ్యాంకుకు తగిన వ్యవధి ఇచ్చాం. కానీ, పరిస్థితి చేయిదాటిపోయే సూచనలు కనిపించడంతో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది" అని ఆయన వివరించారు.

ప్రభుత్వంతో సంప్రదించిన తరువాత, రిజర్వ్ బ్యాంక్ గురువారం యెస్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డును రద్దు చేసింది. ఖాతాదారులు నెలకు రూ .50 వేలకు మించి విత్ డ్రా చేసుకోకూడదని పరిమితి విధించింది.

స్టేట్ బ్యాంక్ మాజీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ (సిఎఫ్ఓ) ప్రశాంత్ కుమార్ ను యస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ గా రిజర్వు బ్యాంక్ నియమించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)