BBC ISWOTY: భారత్‌లో మహిళలు క్రీడల్లో ఎక్కడున్నారు... బీబీసీ అధ్యయనంలో ఏం తేలిందంటే...

  • దివ్య ఆర్య
  • బీబీసీ ప్రతినిధి
క్రీడలు, మహిళలు

క్రీడలు, మహిళా క్రీడాకారులు పట్ల భారత్‌లో జనాల వైఖరి ఎలా ఉందో తెలుసుకునేందుకు బీబీసీ విస్తృత సర్వే నిర్వహించింది.

14 రాష్ట్రాల్లో దాదాపు పది వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది.

ఆ సర్వేలో తెలిసిన ఎనిమిది ప్రధాన విషయాలు ఇవే..

1. భారతీయుల్లో ఎంత మంది క్రీడలు ఆడుతున్నారు?

క్రీడలు, వ్యాయామం జనాల జీవనశైలిలో భాగంగా లేని దేశాల్లో భారత్ కూడా ఒకటి. మా సర్వేలో పాల్గొన్నవారిలో తాము ఏదో ఒక క్రీడను ఆడుతున్నామని కేవలం 33 శాతం మందే చెప్పారు.

ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్ లాంటి దేశాల్లో ఏదో ఒక క్రీడను ఆడుతున్నవారు జనాభాలో 66 శాతం దాకా ఉంటున్నారు. యూరప్‌లో క్రీడలు ఆడుతున్నవారు దాదాపు జనాభాలో సగం ఉంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

2. ఎందుకు ఇంత తక్కువ?

పాఠశాలల్లో క్రీడా వసతుల లేమి, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటివి ఇందుకు కారణాలని సర్వేలో పాల్గొన్న జనాలు చెప్పారు.

క్రీడలతో సమయం వృథా అన్న భావన ఉండటం, చదువుల్లో బాగా రాణించాలని తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టడం కూడా కారణాలని అన్నారు.

ఒలింపిక్స్‌ లాంటి అంతర్జాతీయ క్రీడా ఈవెంట్స్‌లో భారత్ రికార్డు నెమ్మదిగా మెరుగవుతున్నా, క్రీడాకారులను హీరోలుగా చూసే సంస్కృతి పెరుగుతున్నా, క్రీడల పట్ల జనాల వైఖరి మారడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images

3. ఒలింపిక్స్ లాంటి వేదికల్లో భారత క్రీడాకారిణుల ప్రదర్శన ఎలా ఉంది?

ఇప్పటివరకూ ఒలింపిక్స్‌లో మొత్తంగా భారత్ 28 పతకాలు గెలిచింది. అందులో 14 పతకాలు గత 25 ఏళ్లలో వచ్చినవే. వీటన్నింటిలో వ్యక్తిగత స్వర్ణం ఒక్కటే ఉంది. 2008లో అభినవ్ బింద్రా షూటింగ్‌లో దాన్ని సాధించారు.

మహిళలు ఒలింపిక్స్‌లో ఐదు వ్యక్తిగత పతకాలు గెలిచారు. ఇవన్నీ గత 20 ఏళ్లలో గెలిచినవే.

క్రితం సారి ఒలింపిక్స్‌లో భారత్ గెలిచిన రెండు పతకాలూ మహిళలు సాధించినవే. బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మలిక్ వీటిని సాధించారు.

క్రీడల్లో దేశ ప్రగతికి ఒలింపిక్ పతకాలు కొలమానం కాదని అనేవారు చాలా మంది ఉన్నారు. ఎందుకుంటే భారతీయులు అత్యంత అభిమానించే క్రీడే ఒలింపిక్స్‌లో లేదు.

ఫొటో సోర్స్, FACEBOOK/HARMANPREET KAUR

4. భారతీయులకు ఇష్టమైన క్రీడలేవీ?

బీబీసీ సర్వేలో పాల్గొన్నవారిలో క్రికెట్‌ను ఆడతామని చెప్పేవారే అధికంగా ఉన్నారు. 15 శాతం మంది క్రికెట్ ఆడతామని చెప్పారు.

ఆశ్చర్యకరంగా కబడ్డీ రెండో స్థానంలో ఉంది. 13 శాతం మంది తాము కబడ్డీ ఆడతామని చెప్పారు.

ఆరు శాతం మంది యోగా చేస్తామని అన్నారు.

ఇక చదరంగం (చెస్) ఆడేవారు మూడు శాతం, హాకీ ఆడేవారు రెండు శాతం ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

5. మహిళల్లో క్రికెట్ ఆడేవారు ఎంతమంది?

మహిళలకు, పురుషులకూ క్రికెట్ ఆడేవారి నిష్పత్తిలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది.

పురుషుల్లో 25 శాతం మంది క్రికెట్ ఆడేవారు ఉంటే, మహిళల్లో కేవలం 5 శాతం మందే ఈ ఆటను ఆడేవాళ్లు ఉన్నారు.

ఈ పరిస్థితుల్లో కూడా భారత మహిళల జట్టు అగ్ర శ్రేణికి చేరుకుంది.

భారత పురుషుల క్రికెట్ జట్టు రెండు సార్లు వరల్డ్ కప్‌లు గెలిచింది. ఒక సారి టీ20 వరల్డ్ కప్ సాధించింది.

మహిళల జట్టు ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా జరిగే ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఢీకొడుతుంది. వన్డే వరల్డ్ కప్‌లో ఇదివరకు రెండు సార్లు ఫైనల్‌ చేరుకుంది.

ఫొటో సోర్స్, prokabaddi.com

6. మహిళల్లో కబడ్డీలో ఆడేవారు ఎంతమంది?

మహిళలకు, పురుషులకు కబడ్డీ ఆడేవారి నిష్పత్తిలో వ్యత్యాసం తక్కువ ఉంది.

కబడ్డీ ఆడేవాళ్లు పురుషుల్లో 15 శాతం ఉంటే, మహిళల్లో 11 శాతం మంది ఉన్నారు.

భారత ఉపఖండంలో పుట్టిన ఈ కబడ్డీలో ఇటు పురుషుల విభాగంలో, అటు మహిళ విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ ముందుంది.

ఆసియా క్రీడల్లో కబడ్డీ క్రీడాంశంగా ఉంది. కబడ్డీ వరల్డ్ కప్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రొ కబడ్డీ లీగ్ కూడా జరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images

7. మహిళల క్రీడలను ఎవరు చూస్తున్నారు?

మహిళల క్రీడలను చూసేందుకు స్టేడియాలకు వెళ్తున్నవారి కన్నా, పురుషుల క్రీడలను చూసేందుకు వెళ్తున్నవారి సంఖ్య రెండింతలు ఉంది.

గత రెండేళ్లుగా వార్తల్లో, స్పోర్ట్స్ ఛానెల్స్‌లో మహిళల టీ20 మ్యాచ్‌లకు కవరేజీ పెరగడంతో తమకు కూడా మహిళల క్రీడలపై ఆసక్తి పెరిగిందని చాలా మంది చెప్పారు.

మహిళల క్రీడలపై జనాల్లో ఆసక్తిని పెంచేందుకు వాటిని ప్రసారం కూడా చేయాల్సిన అవసరం ఉందని ఈ విషయం స్పష్టం చేస్తోంది.

అయితే, కేవలం దీని వల్లే మార్పులు రావు. మహిళల క్రీడల నుంచి కూడా జనాలు 'వినోదం' కోరుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images

8. మహిళా క్రీడాకారుల పట్ల వైఖరి ఎలా ఉంది?

సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు సగం మంది పురుషుల క్రీడలంత ఆసక్తికరంగా మహిళల క్రీడలు ఉండట్లేదని అభిప్రాయపడ్డారు.

'క్రీడాకారిణుల శరీరాలు అంత ఆకర్షణీయంగా ఉండవు' అనే లాంటి భావనలతో పాటు లింగ వివక్ష ధోరణుల ప్రభావం మహిళల క్రీడలపై ఉంటోంది.

అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలను కూడా క్రీడల్లో ప్రోత్సహిస్తామని చెబుతూనే, క్రీడల వల్ల గర్భధారణ సామర్థ్యం దెబ్బతినే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నవారు చాలా మంది ఉన్నారు.

క్రీడల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు లింగ సమానత్వం అత్యంత ప్రధానం.

విద్య, కెరీర్, తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలపై సమాన హక్కుల కోసం మహిళలు చేస్తున్న పోరాటాన్ని అందరూ అర్థం చేసుకుని, అంగీకరించిననప్పుడు క్రీడా ప్రపంచంలోనూ వారి పరిస్థితి మారుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)