లిసిప్రియా కంగుజామ్‌: ‘మోదీజీ... మీరిచ్చే గౌరవాన్ని నిరాకరిస్తున్నా’ - ట్విటర్‌లో ఎనిమిదేళ్ల ఉద్యమకారిణి : ప్రెస్ రివ్యూ

లిసిప్రియా కంగుజామ్

ఫొటో సోర్స్, facebook/licypriya.kangujam

‘‘మీరిచ్చే గౌరవాన్ని నిరాకరిస్తున్నా’’నంటూ మణిపూర్‌కు చెందిన ఎనిమిదేండ్ల పర్యావరణ ఉద్యమ బాలిక లిసిప్రియా కంగుజామ్‌ కేంద్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పిందని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. మహిళా దినోత్సవం సందర్భంగా స్ఫూర్తిదాయక మహిళలకు తన సామాజిక మాధ్యమ ఖాతాలను అప్పగిస్తానని మోదీ ఇటీవల పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో 'షీఇన్‌స్పైర్స్‌అజ్‌' హ్యాష్‌ట్యాగ్‌తో ప్రభుత్వం ప్రచారం చేపట్టింది. ఎనిమిదేండ్ల పర్యావరణ ఉద్యమ బాలిక లిసిప్రియా కథనాన్ని ట్విట్టర్‌లో షేర్‌ చేసింది.

దీనిపై లిసిప్రియా స్పందించింది. 'ప్రియమైన నరేంద్ర మోదీజీ, స్ఫూర్తిదాయక మహిళల్లో ఒకరిగా నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. పర్యావరణ పరిరక్షణలో నా గోడును పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఈ గౌరవాన్ని నిరాకరిస్తున్నా. జైహింద్‌' అంటూ ప్రధాని మోదీకి ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images

గౌరీ లంకేశ్ హత్యకు ఉపయోగించిన తుపాకీని గాలించటానికైన ఖర్చు రూ. 7.5 కోట్లు

అభ్యుదయ వాదులు నరేంద్ర దాబోల్కర్, గోవింద పనేసర్, ప్రొఫెసర్ ఎం.ఎం.కలబురగి, సీనియర్ జనర్నలిస్ట్ గౌరీ లంకేశ్‌ హత్యలకు ఉపయోగించింన తుపాకీని గాలించేందుకు ప్రత్యేక దర్యాప్తు దళం రూ. 7.5 కోట్లు ఖర్చు చేసిందని 'ఈనాడు' ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. ఆ తుపాకీ దొరక్కపోవడంతో ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో అభియోగ పత్రాన్ని దాఖలు చేయడం సాధ్యం కాలేదు.

ఇప్పటికే అరెస్టయిన నిందితులు తాము తుపాకీని కాశీ నదిలో పడేశామని, అరేబియా సముద్రంలో పారేశామని చెప్తూ వచ్చారు. చివరకు నిందితులు సముద్రంలో 40 అడుగుల లోతుకు స్కూబా డైవింగ్ పరికరాలతో వెళ్లి దాన్ని పూడ్చిపెట్టారని తెలుసుకున్నారు.

దర్యాప్తు దళం దుబాయ్‌కి చెందిన ఓ సంస్థ, నార్వేలో తయారు చేసిన ఉపకరణాలతో గాలింపు చేపట్టి తుపాకీని గుర్తించింది. దీనికైన ఖర్చును మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు సంయుక్తంగా భరిస్తాయని ప్రత్యేక దర్యాప్తు దళానికి నేతృత్వం వహిస్తున్న డీసీపీ ఎం.ఎస్.అనుచేత్ తెలిపారు.

సీబీఐ అధికారులకు అనుబంధంగా తామూ దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. తుపాకీ దొరకడంతో త్వరలో న్యాయస్థానంలో అభియోగపత్రాన్ని దాఖలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

పుల్వామా ఉగ్రదాడి: ‘‘ఆన్‌లైన్‌లో రసాయనాలు కొన్నారు’’

గతేడాది 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను బలితీసుకున్న పుల్వామా ఉగ్రదాడితో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు అరెస్టు చేశారని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. జవాన్ల కాన్వాయ్‌ను పేల్చివేసేందుకు ఉపయోగించిన ఐఈడీ తయారీలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు అనుమానితులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.

వీరిద్దరు బాంబు తయారీ కోసం అమెజాన్‌లో పలు రసాయనాలు కొనుగోలు చేసినట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు.

జైషే మహ్మద్‌ ఉగ్రవాదుల సూచనల మేరకు.. తన అమెజాన్‌ షాపింగ్‌ అకౌంట్‌ను ఉపయోగించి వివిధ రసాయనాలు, బ్యాటరీలు, ఇతర పదార్థాలు ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసినట్లు ఒక నిందితుడు అంగీకరించాడని ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు.

పుల్వామా ఉగ్రకుట్రలో భాగంగా వీటన్నింటినీ జైషే ఉగ్రవాదులకు వ్యక్తిగతంగా చేరవేశాడని ఆరోపించారు.

ఫొటో సోర్స్, TRSPARTYONLINE/FACEBOOK

''నాకే దిక్కులేదు.. మా నాయనది యాడినుంచి తేవాలె?'': కేసీఆర్

''నేను మా ఊర్లో పుట్టిన. అప్పుడు దవాఖానాల్లేవు. నాకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేదు. మరి ఈ దేశంలో నీవెవరివి అంటే ఏం చెప్పాలె? ఏ విధంగా నిరూపించుకోవాలె? నాకే దిక్కులేదు.. మా నాయనవి తీసుకురావాలంటే యాడికెళ్లి తేవాలె?'' అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. శనివారం అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై జరిగిన ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ''నాకు 585 ఎకరాల జాగా ఉంది. పెద్ద బిల్డింగ్‌ ఉంది. అట్లాంటి కుటుంబంలో పుట్టిన నాకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేకుంటే.. దళితులకు, ఎస్టీలకు, నిరుపేద ప్రజలకు ఎక్కడిది? ఇది పెద్ద టర్మాయిల్‌ (విపత్తు). దీనికి బదులు నేషనల్‌ ఐడెంటిటీ కార్డు పెట్టండి.. ఇంకేదైనా పెట్టండి'' అని కేంద్రానికి సూచించారు.

భారత రాజ్యాంగాన్ని పౌరసత్వ సవరణ చట్టం అగౌరపరుస్తోందన్నారు. రాజ్యాంగ పీఠిక మతాలకు అతీతంగా ఉందని, కానీ.. ప్రత్యేకంగా ఒక మతానికి ముడిపెట్టడాన్ని తాము ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా పౌరసమాజం అంగీకారం తెలుపదని, ఇప్పటికే దేశం పరువు పోతోందని అన్నారు.

''కేబినెట్‌లో కూడా చెప్పాం. శాసనసభలో కచ్చితంగా తీర్మానం చేసి పంపుతాం. దీనిపై అసెంబ్లీలో చర్చ జరగాలి. అందరూ మాట్లాడాలి. రాజాసింగ్‌ కూడా మాట్లాడాలి. వివాదం చేయవద్దు'' అని సీఎం అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)