BBC Indian Sportswoman Of The Year అవార్డ్ విజేత పీవీ సింధు

పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ 2019 పురస్కారానికి ఎంపికైంది.

2019లో స్విట్జర్లాండ్‌లోని బేసెల్‌లో జరిగిన బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్ గెలుచుకున్న పీవీ సింధు ఆ ఘనత సాధించిన మొదటి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

"బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ బృందానికి నా కృతజ్ఞతలు. ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత గొప్ప పురస్కారాన్ని ప్రారంభించినందుకు 'బీబీసీ ఇండియా'కు, నా అభిమానులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా" అని పురస్కారానికి ఎంపికైన అనంతరం సింధు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

పీవీ సింధు ఖాతాలో ఇప్పటివరకూ ఐదు వరల్డ్ చాంపియన్‌షిప్ పతకాలున్నాయి. ఆమె ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన మొదటి భారత సింగిల్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కూడా.

"నాకు ఓటు వేసి మద్దతు తెలిపిన వారికి, నా అభిమానులకు ఈ అవార్డును అంకితం చేస్తున్నా. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ లాంటి అవార్డులు మాకు మరింత సాధించడానికి కావలసిన స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని అందిస్తాయి. యువ మహిళాక్రీడాకారులకు నేను చెప్పేదేంటంటే... మహిళలుగా మనపై మనకు నమ్మకం ఉండాలి. విజయానికి మార్గం కష్టపడటమే. త్వరలోనే మరెందరో క్రీడాకారిణులు దేశానికి మరిన్ని పతకాలు సాధించిపెడతారని నేను కచ్చితంగా చెప్పగలను" అని సింధు వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images

పీవీ సింధు 17ఏళ్ల వయసులోనే సెప్టెంబర్ 2012లో బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లో నిలిచింది. గత నాలుగేళ్లుగా టాప్ 10లో కొనసాగుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా ఆమెపై భారత అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు.

ప్రముఖ క్రీడాకారులు, రచయితలు, జర్నలిస్టులు, ఇన్‌ఫ్లూయెన్సర్ల సమక్షంలో న్యూ దిల్లీలో బీబీసీ అవార్డు ప్రదాన వేడుక జరిగింది.

భారత క్రీడారంగానికి చేసిన సేవలకు, ఎన్నో తరాల క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచినందుకు మాజీ అథ్లెట్ పీటీ ఉషను జీవితసాఫల్య పురస్కారంతో సత్కరించారు.

తన కెరీర్ ఆసాంతం ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్న పీటీ ఉష అంతర్జాతీయ స్థాయిలో 100 పతకాలు, అవార్డులను సాధించారు. భారత ఒలింపిక్ సంఘం కూడా ఆమెను 'ఈ శతాబ్దపు ఉత్తమ క్రీడాకారిణి'గా గుర్తించింది. 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌ మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌ విభాగంలో ఆమె నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకున్నారు. ఆమె సెకనులో వందోవంతు సమయం వెనకబడి కాంస్యపతకం సాధించే అవకాశాన్ని కోల్పోయారు.

మొదటిసారిగా ప్రారంభించిన బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైన ఐదుగురు నామినీల పేర్లను 2020 ఫిబ్రవరిలో వెల్లడించారు.

స్ప్రింటర్ ద్యుతీ చంద్, బాక్సర్ మేరీ కోమ్, రెజ్లర్ వినేష్ ఫోగట్, పారాబ్యాడ్మింటన్ ప్లేయర్ మానసీ జోషి, బ్యాడ్మింటర్ ప్లేయర్ పీవీ సింధు ఈ తుదిజాబితాలో చోటుదక్కించుకున్నారు.

భారత దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులతో కూడిన జ్యూరీ వీరిని ఎంపికచేసింది.

2020 ఫిబ్రవరి 3న ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ ఫిబ్రవరి 24 రాత్రి 11.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ముగిసింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)