యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు ప్రియాంక గాంధీ నుంచి పెయింటింగ్ కొన్నారా?

ప్రియాంక గాంధీ, రాణా కపూర్

ఫొటో సోర్స్, Getty Images

యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. మార్చి 11 వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉండనున్నారు.

రాణా కపూర్ కుటుంబ సభ్యుల కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి.

రాణా కపూర్ కూతురు రోష్నీ కపూర్‌ను లండన్ వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. ముంబయి ఎయిర్‌పోర్ట్‌లోనే ఆమెను ఆపేశారు.

ఈ పరిణామాలన్నింటి మధ్య ఇప్పుడు ఈ వ్యవహారానికి రాజకీయ రంగు కూడా పులుముకుంది.

బీజేపీ ఆరోపణలు

మార్చి 8 ఉదయం బీజేపీ ఐటీ సెల్ ఇంచార్జి అమిత్ మాలవీయ్ ఓ ట్వీట్ చేశారు.

‘‘దేశంలో ప్రతి ఆర్థిక నేరానికీ గాంధీల కుటుంబంతోనే లోతైన సంబంధాలు ఉంటున్నాయి. సోనియా గాంధీకి విజయ్ మాల్యా అప్‌గ్రేడెడ్ విమాన టికెట్లు పంపేవారు. మన్మోహన్ సింగ్, చిదంబరంతో ఆయనకు సంబంధాలు ఉండేవి. ఇప్పుడు పరారీలో ఉన్నారు. నీరవ్ మోదీ నగల కలెక్షన్‌ను రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఆయన బ్యాంకును మోసం చేశారు. ప్రియాంక వాద్రా నుంచి రాణా కపూర్ పెయింటింగ్స్ కొన్నట్లు ఇప్పుడు వెల్లడైంది’’ అని అందులో అమిత్ ఆరోపించారు.

ఈ విషయం గురించి ఓ ప్రైవేట్ టీవీ చానెల్ ప్రసారం చేసిన కథనం వీడియో క్లిప్‌ను కూడా ఆయన షేర్ చేశారు.

దీంతో రాణా కపూర్‌కు, ప్రియాంక గాంధీకి మధ్య ఎలాంటి సంబంధాలున్నాయనే అంశంపై చర్చ మొదలైంది.

కాంగ్రెస్ స్పందన

కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఆరోపణలను ఖండించారు.

‘‘ఏ జ్ఞానమూ, సమాచారమూ లేకుండా చేసే ఇలాంటి దిగజరాడు ప్రశ్నలను చెత్త బుట్టలో వేయాలి. వీటికి సమాధానాలు చెప్పకూడదు. కానీ, బహిరంగంగా ఈ ప్రశ్న అడిగారు. మాది బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ. బదులు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది’’ అని అన్నారు.

తాము అడిగిన మూడు ప్రశ్నలకు మాలవీయ్ సమాధానం చెబితే, తాము కూడా బదులు చెబుతామని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

అభిషేక్ సింఘ్వీ అడిగిన ప్రశ్నలు

‘‘మొదటి ప్రశ్న: యస్ బ్యాంక్ లోన్ బుక్ 2014 మార్చిలో రూ.55 వేల కోట్లు ఉంది. 2019 మార్చి వచ్చేసరికి రూ.2.41 లక్షల కోట్లకు ఎలా పెరిగింది? ఐదేళ్లలో దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఎందుకు పెరిగింది? అప్పుడు అమిత్ మాలవీయ్ ఎందుకు ట్వీట్ చేయలేదు?

రెండో ప్రశ్న: ఈ ఐదేళ్లలో లోన్‌బుక్‌లో రెండు ఏళ్లు 100 శాతం వృద్ధి నమోదైంది. అది 2016, 2018లో. అంటే నోట్ల రద్దు తర్వాత. అమిత్ మాలవీయ్, అమిత్ షా, నరేంద్ర మోదీలలో ఎవరి పర్యవేక్షణలో ఇది జరిగింది?

మూడో ప్రశ్న: కేంద్ర హోం మంత్రి, ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి అప్పుడు నిద్ర పోతున్నారా? ఇలా జరుగుతుందని వారు అస్సలు ఊహించలేదా?’’

ఫొటో సోర్స్, Getty Images

ప్రశ్నలకు సమాధానం చెప్పే సంప్రదాయం బీజేపీలో లేదని, అందుకే తామే ముందుగా సమాధానం చెబుతున్నామని అభిషేక్ అన్నారు.

ప్రియాంక గాంధీపై వచ్చిన ఆరోపణల గురించి స్పందిస్తూ, ‘‘అవును. ఎమ్ఎఫ్ హుస్సేన్ రాజీవ్ గాంధీ చిత్రాన్ని వేశారు. దాన్ని గాంధీ కుటుంబం రాణా కపూర్‌కు రూ.2 కోట్లకు విక్రయించింది. ఇదంతా 2010లో జరిగిన వ్యవహారం’’ అని వివరించారు.

రాణా కపూర్ చెక్ రూపంలో ప్రియాంక గాంధీకి ఆ చెల్లింపు చేశారని, ఆ వివరాలను ప్రియాంక ఐటీ రిటర్న్స్‌లోనూ చూపించారని అభిషేక్ చెప్పారు.

ఎమ్ఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ ఒకటి ఇటీవల రూ.13.44 కోట్లకు అమ్ముడుపోయిందన్న విషయాన్ని అభిషేక్ గుర్తుచేశారు. బీజేపీ అసలు విషయం మీద నుంచి దృష్టి మరల్చేందుకే తాజా ఆరోపణలు చేసిందని అన్నారు.

‘‘మోదీ నిర్వహించిన ప్రముఖ అంతర్జాతీయ సదస్సుకు 2020 మార్చి దాకా రాణా కపూర్ ప్రధాన స్పాన్సర్‌గా ఉన్నారు. ఆయన, ఈయన ఒక్కరు కాదంటారా?’’ అని అభిషేక్ సింఘ్వీ బీజేపీని ఎదురుప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)