సెన్సెక్స్ పతనం: ఒక్క రోజులో 6.5 లక్షల కోట్ల సంపద ఆవిరైపోవడానికి కారణాలేంటి?

2020 మార్చి 9వ తేదీన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ భవనం వద్ద షేర్లను చూస్తున్న వ్యక్తులు

ఫొటో సోర్స్, Getty Images

భారత స్టాక్ మార్కెట్లను బ్లాక్‌మండే అతలాకుతలం చేసింది. ఒక్క సోమవారం నాడే (మార్చి 9) బీఎస్ఈ సెన్సెక్స్ 1,941 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ కూడా 538 పాయింట్లు నష్టపోయింది.

సోమవారం మధ్యాహ్నం ఒకానొక సమయంలో సెన్సెక్స్ ఏకంగా 2450 పాయింట్లకు పైగా పతనమైనా... తర్వాత కొద్దిగా కొలుకుని 1941 పాయింట్ల నష్టంతో ముగిసింది.

శుక్రవారం సాయంత్రం 37,576 దగ్గర క్లోజ్ అయిన సెన్సెక్స్... రెండు రోజుల విరామం తర్వాత సోమవారం ఉదయం ప్రారంభం అవ్వడమే 36,950 పాయింట్ల దగ్గర మొదలైంది.

ప్రారంభం నుంచే వేగంగా సూచీలు పడిపోతూ వచ్చాయి. మధ్యాహ్నం ఒకానొక సమయంలో సెన్సెక్స్ 35,109 పాయింట్లకు పడిపోయింది. మధ్యాహ్నం కాస్త కోలుకుని 35,635 పాయింట్ల వద్ద ముగిసింది.

2008-09 ఆర్థిక మాంద్యం నాటి పరిస్థితుల్లో కూడా ఒక్క రోజులో ఇంత పతనం ఎప్పుడూ స్టాక్ మార్కెట్లు చవి చూడలేదు. ఈ పతనం వల్ల సోమవారం ఒక్క రోజులోనే 6.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయినట్లు ఎకనమిక్ టైమ్స్ తెలిపింది.

ఇంతలా మార్కెట్ల పతనానికి నాలుగు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. వాటిలో మొదటిది కరోనా వైరస్ (కోవిడ్ 19) ప్రభావం. రెండోది అంతర్జాతీయ చమురు ధరల పతనం, మూడోది దేశీయ ఆర్థిక వ్యవస్థపై యస్ బ్యాంక్ సంక్షోభం వంటి ఘటనల ప్రభావం. నాలుగోది విదేశీ సంస్థాగత పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోవడం.

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచ మార్కెట్లపై కరోనా ఎఫెక్ట్

కరోనా వైరస్ ప్రభావం ప్రపంచం వ్యాప్తంగా అన్ని మార్కెట్ల మీదా ప్రతికూలంగానే ఉంది. ఇప్పటికే చాలా దేశాల స్టాక్ మార్కెట్లు గణనీయంగా పడిపోయాయి.

ఆర్థిక వ్యవస్థ మీద కరోనా ప్రతికూల ప్రభావంతో మదుపరులు తమ పెట్టుబడులను బంగారం మీదకు మళ్లిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వ్యక్తుల సంఖ్య లక్ష దాటడంతో ఇన్వెస్టర్లలో మరింత భయాందోళనలు పెరిగాయి.

ఈ ఒక్క సోమవారమే బ్రిటన్ స్టాక్ మార్కెట్ పదేళ్ల కనిష్టానికి పడిపోయింది. ఒక్కరోజులో 8 శాతానికి పైగా షేర్లు పతనమయ్యాయి.

రెండు రోజుల విరామం తర్వాత మొదలైన అన్ని స్టాక్ మార్కెట్లూ ఇలాగే పతనమయ్యాయి.

భయాలు పెంచిన చమురు ధరల పతనం

తాజాగా ఒపెక్ దేశాలు, రష్యా మధ్య జరిగిన వివాదం కూడా ఈ పతనాలకు ఒక కారణంగా నిలుస్తోందని మార్కెట్ అనలిస్ట్ సతీశ్ మండవ బీబీసీతో అభిప్రాయపడ్డారు.

‘‘కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా టూరిజంతో పాటు అన్ని రంగాలూ నెమ్మదించాయి. ఫలితంగా చమురుకు కూడా డిమాండ్ తగ్గుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో క్రూడ్ సప్లై తగ్గించాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. కానీ, దీనికి రష్యా అంగీకరించలేదు. ఒపెక్‌లో ఎక్కువ భాగం వాటా ఉన్న సౌదీ అరేబియా చమురు సప్లై పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో చమురు ధరలు పదేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఇది కూడా మార్కెట్ల పతనానికి కారణమైంది’’ అని సతీశ్ మండవ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images

దేశీయ సంక్షోభాలు, విదేశీ ఇన్వెస్టర్లు

‘‘కరోనా, క్రూడాయిల్ ఎఫెక్ట్‌లతో పాటు.. దేశీయంగా యస్ బ్యాంక్ వంటి సంక్షోభాలు భారత ఆర్థిక వ్యవస్థ మీద విదేశీ మదుపరులు నమ్మకాన్ని తగ్గిస్తున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని బంగారం మీదకు, బాండ్ల మీదకు మళ్లిస్తున్నారు. ఇది కూడా మార్కెట్ల పతనానికి ఒక కారణమైంది. ఇలా అన్ని కారణాలు కలసి ఇండియన్ మార్కెట్ల మీద ప్రతికూలంగా మారాయి’’ అని సతీశ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)