కరోనావైరస్ ప్రభావం: జలుబు, దగ్గు ఉంటే తిరుమలకు రావద్దన్న టీటీడీ - ప్రెస్ రివ్యూ

కరోనావైరస్

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్,

కరోనావైరస్: శ్రీవారి దర్శనానికి ఆంక్షలు

శ్రీవారి భక్తులకు ఇప్పుడు కరోనావైరస్ కష్టాలను తీసుకొచ్చిందంటూ నమస్తే తెలంగాణ ఒక వార్తను ప్రచురించింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇప్పటికే మాస్కులను ధరించి దర్శనం చేసుకుంటున్న భక్తులకు... తాజాగా టీటీడీ సరికొత్త ఆంక్షలు విధించింది.

వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జలుబు, దగ్గుతో బాధపడుతున్న భక్తులు తిరుమల రావద్దని సలహా ఇచ్చింది.

కరోనావైరస్ విస్తరిస్తున్న దృష్ట్యా వైరస్ లక్షణాలున్న వ్యక్తులు ఎవరైనా వస్తే దర్శనం కల్పించకుండానే వెనక్కి పంపాలని టీటీడీ అధికారులు తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

అలాంటి లక్షణాలతో ఎవ్వరైనా కనిపిస్తే వెంటనే వారిని స్విమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.

అలాగే స్వామి దర్శనానికి వచ్చే భక్తులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తమ వెంట మాస్కులు, శానిటైజర్లు తెచ్చుకోవాలని సూచించినట్టు నమస్తే తెలంగాణ ఈ కథనంలో వివరించింది.

ఫొటో క్యాప్షన్,

తెలంగాణలో కోలుకుంటున్న కరోనావైరస్ బాధితుడు.

తెలంగాణలో కోలుకుంటున్న కరోనావైరస్ తొలి బాధితుడు

తెలంగాణలో వెలుగు చూసిన తొలి కరోనావైరస్ కేసులో బాధిత యువకుని తాజా శాంపిల్స్‌ నెగిటివ్ వచ్చినట్టు ఆంధ్రజ్యోతి తెలిపింది.

మరోసారి నిర్ధరణ నిమిత్తం అతని నమునాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్టు తెలుస్తోందని పేర్కొంది.

దుబాయ్ వెళ్లి వచ్చిన అనంతరం కరోనావైరస్ బారిన పడ్డ యువకుడు ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు.

ఆయన ఆరోగ్య పరిస్థితిపై మొదటి మూడు రోజులు వైద్యులు ఆందోళన చెందినప్పటికీ ఇప్డ్పుడు ఇక ఎలాంటి ఇబ్బంది లేదన్న నిర్ధరణకు వచ్చినట్టు చెప్పింది.

ప్రస్తుతం బాధితునికి జ్వరం తగ్గిందని, బీపీ అదుపులోకి వచ్చిందని, తాజాగా న్యూమోనియా కూడా తగ్గుముఖం పట్టిందని వైద్యులు తెలిపినట్టు ఈ కథనంలో చెప్పుకొచ్చింది.

పూణె ల్యాబ్‌ నుంచి వచ్చే రిపోర్టుల్లో నెగిటివ్ అని తేలితే బాధితుణ్ణి ఇంటికి పంపిస్తారు.

అయితే ఇంటికి పంపినా 14 రోజుల పాటు ఐసోలేషన్ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తారని ఈ కథనంలో ఆంధ్రజ్యోతి స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, TWITTER.COM/ANDHRAPRADESHCM

ఫొటో క్యాప్షన్,

ముఖేశ్ అంబానీ కోరారు. జగన్మోహర్ రెడ్డి ఇచ్చారు

వైసీపీ నుంచే రాజ్యసభకు పరిమళ్ నత్వానీ

వైసీపీ నుంచే రాజ్యసభకు పరిమళ్ నత్వానీ అంటూ ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలకుగాను మూడింటిని సొంత పార్టీ నాయకులకు కేటాయించింది వైసీపీ.

మిగిలిన ఒక్క స్థానాన్ని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ స్వయంగా ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సంస్థ కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు నత్వానికి ఆంధ్రప్రదేశ్ నుంచి అవకాశం కల్పించాలని కోరడంతో ఆయనకు కేటాయించింది.

తొలి రెండు స్థానాలను ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణలకు ఇవ్వగా. మూడో స్థానాన్ని వైసీపీకి మొదటి నుంచి అన్ని విధాలుగా అండగా ఉంటూ మొన్న లోక్ సభ ఎన్నికల్లో సీటు వదులుకున్న అయోధ్య రామిరెడ్డికి ఇస్తున్నట్టు పార్టీ వెల్లడించింది.

నాల్గో స్థానాన్ని పరిమళ్ నత్వానికి ఇస్తున్నట్టు తెలిపింది.

నత్వాని వైసీపీ అభ్యర్థే అవుతారని ఆయనకు రాజ్యసభ సీటు కేటాయించే విషయంలో బీజేపీ నుంచి తమకు ఎలాంటి ఒత్తిడి లేదని ఆ పార్టీ నేతలు తెలిపినట్టు ఈనాడు ఈ కథనంలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కమల్‌నాధ్‌ సర్కారుకు సింధియా కష్టాలు

మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ సర్కారుకు సింధియా చిచ్చు

మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయంటూ సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇవి.

రాజ్యసభ ఎన్నికల సమయంలో మధ్యప్రదేశ్‌లోని అధికార పార్టీ కాంగ్రెస్‌లో విభేదాలు బయటపడ్డాయి.

పార్టీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా, ఆరుగురు మంత్రులు సహా 17 మంది ఎమ్మెల్యేలు సోమవారం బెంగళూరుకు మకాం మార్చారు.

కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ సమయంలో తమ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.

అంతలోనే మళ్లీ ఆ ఎమ్మెల్యేలు వచ్చి ప్రభుత్వానికి మద్దతు పలకడంతో కథ సుఖాంతమైందనే అంతా భావించారు.

కానీ, గంటల వ్యవధిలోనే సింధియా కమల్ నాథ్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు.

దీంతో అప్పటికప్పుడు తన దిల్లీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని భోపాల్ వచ్చారు సీఎం కమల్ నాథ్.

దిగ్విజయ్ సింగ్ తదితర సీనియర్ నేతలతో మంతనాలు జరిపారు. రాత్రి 10 గంటలకు క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి తాజా పరిణామాలపై చర్చించారు.

అనంతరం ఆ సమావేశానికి హాజరైన 22 మంత్రులు రాజీనామా చేశారు. దీంతో మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణకు మార్గం సుగమం అయ్యింది.

ఫలితంగా అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవులు దక్కే అవకాశం ఉంది. అటు బెంగళూరులో ఉన్న సింధియా వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తిరిగి వస్తారని కమల్ నాథ్ శిబిరం చెబుతోంది.

మరోవైపు సింధియాను శాంతింపజేసేందుకు పీసీసీ చీఫ్ పదవిని కానీ రాజ్య సభ సీటుగానీ ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నట్లు సాక్షి తన కథనంలో వివరించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)