కరోనావైరస్: ఇటలీలో విజృంభించిన ఇన్ఫెక్షన్... దేశమంతటా అత్యవసర పరిస్థితి

ఇటలీలో మాస్క్ ధరించిన పర్యటకుడు

ఫొటో సోర్స్, EPA

కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు చేపడుతున్న అత్యవసర చర్యలను దేశమంతటికీ విస్తరించింది ఇటలీ. సమావేశాలు, ప్రయాణాల మీద ఆంక్షలు ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాలకూ వర్తించేలా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ప్రజలు ఇంట్లోనే ఉండాలని, తప్పనిసరి ప్రయాణాలు ఉంటే అనుమతి తీసుకోవాలని దేశ ప్రధాని జుసెప్పె కాంటె సోమవారం ప్రకటించారు.

సులువుగా వ్యాధి బారిన పడే అవకాశం ఉన్న వారిని ఆదుకునేందుకు రక్షణ చర్యలు చేపడుతున్నామని, ఇక ఏమాత్రం జాప్యం చేయడానికి వీలు లేదని ఆయన అన్నారు.

సోమవారం నాడు ఇటలీలో కరోనావైరస్ మృతుల సంఖ్య 366 నుంచి 463కు చేరుకుంది. చైనా తరువాత కరోనావైరస్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న దేశం ఇటలీయే.

అధికారిక లెక్కల ప్రకారం ఆదివారం తరువాత రెండు రోజుల వ్యవధిలో ఈ ఇన్ఫెక్షన్ 24 శాతం పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images

కాంటే ఏమన్నారు?

ప్రజలు అంతా ఇంటిపట్టునే ఉండడం ఉత్తమమని కాంటే అన్నారు. "ఇన్ఫెక్షన్ పెరుగుతోంది. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. మొత్తం ఇటలీ దేశమంతా రక్షిత ప్రదేశంగా మారింది" అని కాంటే అన్నారు.

"ఇటలీ క్షేమం కోసం మనమంతా కొన్నింటిని వదలుకోవడానికి సిద్ధపడాలి. మనం సత్వరమే స్పందించాలి. ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు నేను కఠినమైన ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్ణయించాను" అని ప్రధాని కాంటే చెప్పారు.

అంతకుముందు 'లా రిపబ్లికా' అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన, "నాకు అప్పట్లో విన్‌స్టల్ చర్చిల్ చేసిన ప్రసంగాలు గుర్తుకు వస్తున్నాయి. ఇది మనకు అత్యంత సంక్షుభిత సమయం. చీకటి ఘడియ. అయితే, మనం దీన్ని జయిస్తాం" అని అన్నారు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

రోమ్ నగరంలోని రెబిబియా జైలు వద్ద ఆందోళన చేస్తున్న ఖైదీల బంధువులు

ఆంక్షలు ఏమిటి?

ప్రజలు ఇంటికే పరిమితం కావాలి. విందులు, వినోదాల పేరుతో గుమికూడవద్దు. నైట్ లైఫ్‌కు సెలవు చెప్పాలి. అలాగే, ఫుట్ బాల్ పోటీలు వంటి ఏ క్రీడా కార్యక్రమాలకూ అనుమతి లేదు. ఏప్రిల్ 3 వరకు దేశవ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను మూసివేస్తారు. విమాన ప్రయాణాలు చేయాల్సి వచ్చిన వారు వివరణ ఇచ్చుకుని అనుమతి తీసుకోవాలి. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రతలను కొలిచే వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల నౌకలను కూడా చాలా చోట్ల తీరానికి రానివ్వకుండా నిరోధించారు.

ప్రజలు ఎలా స్పందిస్తున్నారు?

వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తీసుకునే చర్యల్లో భాగంగా అధికారులు సోమవారం నాడు జైళ్ళలో సందర్శనలను కూడా రద్దు చేశారు. కొన్ని జైళ్ళలో జరిగిన ఘర్షణల్లో మొత్తం ఏడుగురు ఖైదీలు చనిపోయారు.

ఇటలీ ఉత్తర ప్రాంత నగరమైన మాడెనాలోని సాంట్ ఆనా జైలులో ఇద్దరు వ్యక్తులు డ్రగ్ ఓవర్ డోస్ మూలంగా చనిపోయారు. వాళ్ళు హెరాయిన్‌కు ప్రత్యామ్నాయంగా మెథాడోన్ కోసం జైలు ఆస్పత్రి మీద దాడి చేశారు.

మిలాన్‌లోని సాన్ విటోరి జైలులోని ఖైదీలు ఒక సెల్ బ్లాక్‌కు నిప్పంటించారని అధికారులు చెప్పారు. ఖైదీలు జైలు గోడలు ఎక్కి బ్యానర్లు ప్రదర్శించారు.

ఇక ఫోగియా నగరంలోని జైలులో దాదాపు డజన్ ఖైదీలు జైలు తలుపుల్ని తోసుకుని పారిపోయారు. వారిలో చాలా మందిని వెంటనే పట్టుకున్నప్పటికీ తొమ్మిది మంది జాడ ఇప్పటికీ తెలియలేదని అన్సా అనే వార్తా సంస్థ తెలిపింది.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

కరోనావైరస్ ఆంక్షలపై మాడెనా జైలులోని ఖైదీల బంధువుల ఆందోళనలో ఆరుగురికి పైగా చనిపోయారు

మిగతా దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి?

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇన్ఫెక్షన్ సోకిన వారి సంఖ్య 1,11,000కు చేరుకుంది. ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడి 3,890 మంది మరణించారు.

తమ దేశానికి వచ్చే వారు ఎవరైనా 14 రోజుల పాటు స్వచ్చంద నిర్బంధ వైద్య శిబిరంలో (క్వారెంటైన్) ఉండాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు.

ఇరాన్‌లో ఈ ఇన్పెక్షన్‌తో గత 24 గంటలలో 43 మంది చనిపోయారు. మొత్తంగా ఈ దేశంలో 237 మంది మరణించారు. 7,161 మందికి ఇన్ఫెక్షన్ సోకింది. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. వాస్తవం మరింత తీవ్రంగా ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కరోనావైరస్ వల్ల అత్యధిక మరణాలు సంభవించిన చైనాలో వైరస్ వ్యాప్తి చాలా వరకు అదుపులోకి వచ్చింది. ఆదివారం నాడు 40 కేసులు నమోదైతే, ఆ సంఖ్య సోమవారం నాడు 19కి పరిమితమైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)