జ్యోతిరాదిత్య సింధియా: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా... మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం

మధ్య ప్రదేశ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి యువ నేత జ్యోతిరాదిత్య షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. కొద్ది సేపటి క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వచ్చిన వెంటనే తన రాజీనామా లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

కొద్దిసేపటి క్రితం మధ్య ప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గోపాల్ భార్గవ, నరోత్తమ్ మిశ్రా, ఇతర బీజేపీ నేతలు స్పీకర్ నివాసానికి వెళ్లి 19మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల లేఖలను అందచేశారు.

19మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల అసలు లేఖలు తమ వద్ద ఉన్నాయని, వాటిని స్పీకర్‌కు అందచేశామని బీజేపీ నేత భూపేంద్ర సింగ్ మీడియాతో అన్నారు.

ఈ రాత్రికి మరి కొందరు ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించే అవకాశం ఉందని, ఈ మొత్తం సంఖ్య 30 వరకూ ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి కమల్‌నాథ్ వెంటనే రాజీనామా సమర్పించి బలపరీక్షకు సిద్ధం కావాలని ఆయన అన్నారు.

అసెంబ్లీ నిబంధనల ప్రకారం 19మంది ఎమ్మెల్యేల రాజీనామాలపై చర్యలు తీసుకుంటానని సభాపతి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తన నివాసంలో ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారని భోపాల్‌ బీబీసీ ప్రతినిధి షురాయ్ నియాజీ తెలిపారు. కమల్‌నాథ్ రాజీనామా చేయకూడదని, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నం చేయాలని ఈ సమావేశం నిర్ణయించింది.

ఫొటో సోర్స్, DD NEWS

ఫొటో క్యాప్షన్,

బిసాహులాల్ సింగ్

దూరదర్శన్ కథనాల ప్రకారం... దిగ్విజయ్ సింగ్‌కు సన్నిహితుడు, గిరిజన నేత బిసాహులాల్ సింగ్ బీజేపీలో చేరారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.

"కమల్‌నాథ్ ప్రభుత్వం నుంచి ప్రస్తుతం 14-15మందే బయటకు వచ్చారు. త్వరలోనే మరింత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి, బీజేపీలో చేరనున్నారు. చూస్తూనే ఉండండి. ప్రజాసేవ చేయడానికి ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో దానికి అవకాశం లేదు. పార్టీలో నేనో సీనియర్ ఎమ్మెల్యేను, కానీ నన్ను కూడా పట్టించుకోలేదు" అని బిసాహులాల్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, twitter.com/JM_Scindia

ఫొటో క్యాప్షన్,

కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా

అంతకుముందు ఏం జరిగింది?

కొద్ది రోజులుగా మధ్య ప్రదేశ్ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు జరుగుతూ వచ్చాయి. మొదట కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లగా... తాజాగా జ్యోతిరాదిత్య సింధియా సహా ఆరుగురు మంత్రులు, 17 మంది ఎమ్మెల్యేలు బెంగళూరు మకాం మార్చారు.

దీంతో ఖంగుతున్న కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కమల్ నాథ్ అర్ధాంతరంగా తన పర్యటనను ముగించుకొని రాత్రి భోపాల్ చేరుకున్నారు.

దిగ్విజయ్ సింగ్ తదితర సీనియర్ నేతలతో సమాలోచనలు జరిపారు. రాత్రి 10 గంటలకు క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి తాజా పరిణామాలపై చర్చించారు.

అనంతరం ఆ సమావేశానికి హాజరైన 22 మంత్రులు రాజీనామా చేశారు. దీంతో మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణకు మార్గం సుగమం అయ్యింది.

ఫలితంగా అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవులు దక్కే అవకాశం ఉండటంతో పరిస్థితి చక్కబడుతుందని పార్టీ నేతలు భావించారు. సింధియాకు రాజ్య సభ సీటు కానీ, పీసీసీ చీఫ్ పదవి కానీ ఇవ్వవచ్చన్న వార్తలు వినిపించాయి.

అయితే ఈ ఉదయానికి పరిస్థితి మొత్తం మారిపోయింది. దిల్లీ చేరుకున్న జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర హోంమంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

ఆ సమావేశం ముగిసిన కొద్ది సేపటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్ ద్వారా ప్రకటించారు. 18 ఏళ్ల పాటు పార్టీకి విశ్వాసంగా పని చేశానని అయితే , ప్రస్తుతం పార్టీ వీడే సమయం వచ్చిందని లేఖలో పేర్కొ న్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ సింధియా రాజీనామాను వెంటనే ఆమోదిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనను విడుదల చేసింది.

మరోవైపు జ్యోతిరాదిత్య సింధియా అనుచరులైన 14 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసినట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. మొత్తం 14 మంది ఎమ్మెల్యేలలు వారి రాజీనామాలను రెండు ఈ మెయిళ్ల ద్వారా తమకు అందాయని మధ్య ప్రదేశ్ రాజభవన్ వర్గాలు తెలిపినట్టు పీటీఐ పేర్కొంది.

అసెంబ్లీలో ఏపార్టీకి ఎన్ని సీట్లు ?

ప్రస్తుతం మధ్య ప్రదేశ్ అసెంబ్లీలో వివిధ పార్టీల బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ 111

బీజేపీ 107

బీఎస్పీ 2

ఎస్పీ 1

స్వతంత్రులు 4

(ఆధారం: http://mpvidhansabha.nic.in)

రేపు బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం

మార్చి 16 బడ్జెట్ సమావేశాలు, 26న రాజ్య సభ ఎన్నికల నేపద్యంలో తమ పార్టీకి చెందిన 107 మంది ఎమ్మెల్యేలు రేపు జరిగే పార్టీ సమావేశానికి హాజరు కావాలని మధ్య ప్రదేశ్ బీజేపీ ఆదేశించినట్టు పీటీఐ తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)