పంక్చర్ షాపు నడుపుతున్న బామ్మ

"టాటా సుమో, బుల్లెట్, స్కూటీలు సహా ఏ వాహనానికి పంక్చరైనా రిపేర్ చేసేస్తా" అంటున్నారు మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా తిల్వానీ గ్రామానికి చెందిన మహిళ బాబీతాయి అవాలే.

కుటుంబ పోషణ కోసం ఆమె అనేక ఏళ్లుగా టైర్ల పంక్షర్ షాపు నడుపుతున్నారు.

"1969లో వివాహమైన తర్వాత ఈ ఊరికొచ్చాను. బతుకుదెరువు కోసం ఈ పని చేయడం ప్రారంభించాను. మా కుటుంబంలో ఆరుగురం ఉండేవాళ్లం. కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. దాంతో, నేను ఈ పని నేర్చుకున్నాను" అని బాబీతాయి చెప్పారు.

"నాలుగో తరగతి వరకే చదువుకున్నాను. పిల్లల పోషణ బాధ్యత అంతా నామీదే ఉండేది. నా భర్త విపరీతంగా తాగేవారు. అలాంటి పరిస్థితుల్లోనూ నా పిల్లలను చదివించాను.

అప్పట్లో మాకు కంప్రెసర్ యంత్రం ఉండేది కాదు. వాహనాలకు గాలి కొట్టేందుకు చేతిపంపు వాడేవాళ్లం. మా నాన్న నాకొక గేదెను బహుమతిగా ఇచ్చారు. దానిని అమ్మేసి కంప్రెసర్ కొనుక్కొచ్చాను. ఆ తర్వాత నా పని సులువైంది.

ట్రక్కుల టైర్లకు పంక్చరైనా బాగు చేస్తాను. నా ఫొటో ఒకసారి క్యాలెండర్‌లో ప్రచురితమైంది. ఆ తర్వాత నన్ను చూసేందుకు చాలామంది వచ్చారు. కొందరు నన్ను ఆదర్శ మహిళ అంటే, మరికొందరు పంక్చర్‌వాలి అని పిలుస్తారు. ఈ షాపుపై వచ్చే ఆదాయంతోనే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను" అని ఆమె వివరించారు.

తనకు చేతనైంత కాలం ఈ పని చేస్తూనే ఉంటానని బాబీతాయి అంటున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)