ఈ కుర్రాడు రతన్ టాటాకు క్లోజ్ ఫ్రెండ్...

  • 21 మార్చి 2020
శాంతను నాయుడు, రతన్ టాటా Image copyright Shantanu Naidu
చిత్రం శీర్షిక శాంతను నాయుడు, రతన్ టాటా

పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటాకు ఇప్పుడు 82 ఏళ్లు. ఆయన మిత్రులు అనగానే ఆ జాబితాలో పేరు మోసిన వ్యాపారవేత్తలు, ప్రముఖులు, ఇంకెవరెవరో ఉంటారని మనం ఊహించుకుంటాం.

కానీ, ఓ 27 ఏళ్ల కుర్రాడు రతన్ టాటాకు దగ్గరి మిత్రల్లో ఒకడు. ఆ కుర్రాడి పేరు శాంతను నాయుడు.

రతన్ టాటా కొన్ని రోజుల క్రితం ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఖాతా తెరిచారు. దీని వెనుక కూడా శాంతను హస్తం ఉంది.

ఇన్‌స్టా‌గ్రామ్ గురించి, అందులో ఉండే ట్రెండ్స్, హాష్‌ట్యాగ్‌ల గురించి రతన్ టాటాకు శాంతనునే నేర్పించారు.

అందరి స్నేహితుల్లానే హెయిర్‌కట్‌లు చేయించుకోవడం మొదలు సినిమాల వరకూ రతన్, శాంతను కలిసే వెళ్తుంటారు.

తరాల అంతరాలు దాటిన వీరి స్నేహం కాస్త విచిత్రమే. అయితే, తనకది చాలా ప్రత్యేకమని అంటున్నారు శాంతను.

‘‘రతన్ నాకు కఠినంగా వ్యవహరించే బాస్. మంచి మార్గదర్శి. అర్థం చేసుకునే మిత్రుడు’’ అని బీబీసీతో ఆయన చెప్పారు.

Image copyright Shantanu Naidu

ఈ కుర్రాడికి, రతన్ టాటాకు అసలు స్నేహం ఎలా కుదిరింది?

టాటా సంస్థల్లో శాంతను ఐదో తరం ఉద్యోగి. టాటా బ్రాండ్‌తో ఆయన కుటుంబానికి గట్టి అనుబంధం ఉన్నా, ఆ సంస్థకు కీలకమైన వ్యక్తిని తాను కలుస్తానని ఆయన ఎప్పుడూ అనుకోలేదు.

వీధి కుక్కలపై ఉన్న ప్రేమే వీళ్లిద్దరినీ కలిపింది.

పుణెలో ఉన్న ఓ టాటా సంస్థలో శాంతను పనిచేసేవారు.

ఆ సమయంలో ఆయన మోటాపాస్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. వీధి కుక్కుల మెడలకు రాత్రి పూట మెరిసే కాలర్లు వేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఆయన చేస్తున్న ఈ పని గురించి సంస్థ న్యూస్‌లెటర్‌లో ప్రధానంగా వచ్చింది.

శాంతను చర్య నచ్చి, ఆయన్ను ముంబయికి రతన్ టాటా ఆహ్వానించారు.

‘‘వీధి కుక్కలపై ఉన్న ప్రేమ కారణంగానే తొలిసారి శాంతనును నేను కలిశా. కళాశాల కుర్రాళ్లతో కలిసి ఓ బృందాన్ని నడిపిస్తూ, వీధి కుక్కలను అతడు చేరదీశాడు. వాటి ఆలనాపాలనా చూసుకున్నాడు’’ అని బీబీసీతో ఈ-మెయిల్ ద్వారా రతన్ టాటా చెప్పారు.

‘‘మోటోపాస్ పెరుగుతున్న కొద్దీ, మేం మరింత దగ్గరయ్యాం. పని గురించిన ఈ-మెయిళ్ల నుంచి ఒకరి గురించి ఒకరు అడిగే స్థితికి చేరుకున్నాం’’ అని శాంతను చెప్పారు.

అయితే, ఆ తర్వాత అమెరికాలోని ఓ యూనివర్సిటీలో చదువుకునేందుకు శాంతను భారత్‌ను వదిలి వెళ్లాల్సి వచ్చింది.

‘‘రతన్ టాటా రూపంలో నాకో మంచి మిత్రుడు దొరికారు. కానీ, అంతలోనే నేను దేశాన్ని విడిచి వెళ్లాల్సి రావడం బాధగా అనిపించింది’’ అని శాంతను అన్నారు.

అయితే, ఆ తర్వాత శాంతను, రతన్ టాటాల మధ్య అనుబంధం మరింత బలపడింది. రతన్ టాటా చదువుకున్న కార్నెల్ యూనివర్సిటీలోనే శాంతను చేరారు.

ముంబయిలో వెటర్నరీ ఆసుపత్రి నిర్మించాలన్నది రతన్ టాటా కల. కొన్ని రోజుల అనంతరం శాంతను ఈ ప్రాజెక్టు కోసం పనిచేయడం ప్రారంభించారు. ఈ ఏడాది చివర్లో ఈ ఆసుపత్రి భవన నిర్మాణం మొదలుకానుంది.

శాంతను గ్రాడ్యుయేషన్‌ డేకు రతన్ టాటా స్వయంగా హాజరయ్యారు.

‘‘ఏదో మాట్లాడుతూ నా గ్రాడ్యుయేషన్ డే గురించి ఆయనకు చెప్పా. ఆ రోజు వచ్చే సరికి ఆయన అక్కడున్నారు’’ అని శాంతను చెప్పారు.

Image copyright Shantanu Naidu

భారత్ తిరిగివచ్చాక రతన్ టాటా దగ్గర బిజినెస్ అసిస్టెంట్‌ ఉద్యోగంలో శాంతను చేరారు.

‘‘అంతా ఒక్క నిమిషంలో మారిపోయింది. నా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు’’ అని శాంతను అన్నారు.

‘‘శాంతనులోని వినూత్నత, దయాగుణం నాకు ఇష్టం. ఈ పోటీ ప్రపంచంలో అలాంటి లక్షణాలు అంతగా కనిపించవు’’ అని రతన్ టాటా అన్నారు.

బిజినెస్ అసిస్టెంట్‌గా రోజూ ఏం చేయాల్సి ఉంటుందని అడిగితే... ‘‘సమావేశాల్లో నోట్స్ రాసుకుంటా. రతన్ టాటా రాగానే ఆయనకు ఆ రోజు విషయాల గురించి క్లుప్తంగా చెప్తా. ఆ రోజు తన ప్రణాళిక ఏంటో ఆయన చెబుతారు. ఒక్కో పని చేస్తూ పోతాం. ఆయన చాలా ఫోకస్డ్‌గా ఉండే మనిషి. విరామాలు తీసుకోకుండా పని చేస్తూనే ఉంటారు’’ అని శాంతను బదులిచ్చారు.

అందరు స్నేహితుల్లానే వీళ్లిద్దరూ సరదాగా చాలా సమయం కలిసి గడుపుతుంటారు.

తమ ఇద్దరికీ ‘ద అదర్ గైస్’, ‘ద లోన్ రేంజర్’ లాంటి యాక్షన్ కామెడీ సినిమాలు ఇష్టమని చెబుతున్నారు శాంతను. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే ‘ఫౌడా‌’ అనే టీవీ సిరీస్‌ను రతన్ టాటా వదలకుండా ఏకబిగిన చూసేస్తుంటారని వివరించారు.

శాంతను చేపట్టిన మోటాపాస్ ప్రాజెక్టు ఇప్పుడు నాలుగు దేశాలకు విస్తరించింది. ఇంకా పెరుగుతోంది.

‘‘నాకేదైనా కష్టంగా అనిపిస్తే, నేను మొదట ఫోన్ చేసేది ఆయనకే. నా కోసం ఆయన ఎప్పుడూ ఉన్నారు. నేను కూడా ఆయనకు అలాగే ఉండాలనుకుంటున్నా’’ అని శాంతను అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

‘కరోనావైరస్ మీద నేను ఎలా పోరాడుతున్నానంటే...’ - హైదరాబాద్‌ పేషెంట్ నంబర్ 16 స్వీయ అనుభవం

కరోనా లాక్‌డౌన్: ‘చావు తప్పదనుకుంటే మా ఊళ్లోనే చనిపోతాం’

కరోనా లాక్‌డౌన్: నరేంద్ర మోదీ మన్‌కీ బాత్.. ‘ఆరోగ్యమే మహాభాగ్యం.. ఇది యుద్ధం లాంటి పరిస్థితి’

కరోనా వైరస్: ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా కరోనా సోకిందని కనిపెట్టడం ఎలా

కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్‌ను అందించిన భారత శాస్త్రవేత్త ఈమే.. కిట్ ఇచ్చిన గంటకే బిడ్డకు జన్మనిచ్చిన మీనల్

కరోనావైరస్: ట్విటర్‌లో #ShameOnBCCI ట్రెండింగ్, ఎందుకు

ఆంథొనీ ఫాచీ: ఆరుగురు అమెరికా అధ్యక్షులకు సలహాలు ఇచ్చిన వైద్యుడు.. ఒకప్పుడు ఎయిడ్స్‌‌తో, ఇప్పుడు కరోనాతో యుద్ధానికి దిగిన సైనికుడు

PMCARESకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విరాళం రూ.25 కోట్లు

కరోనావైరస్ మీద యుద్ధంలో ముందు నిలిచి పోరాడుతున్న యోధులు ఎవరు.. వారు ఏమంటున్నారు