కరోనావైరస్ ప్రభావంతో భారత్‌లో ఎన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది?

  • 24 మార్చి 2020
కరోనావైరస్ మాస్కులు ధరించిన వ్యక్తులు Image copyright Getty Images

కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా 168కి పైగా దేశాలకు విస్తరించింది. 3,78,601కి పైగా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 16,505 దాటింది.

ఇది అంతర్జాతీయ ఆరోగ్య సంక్షోభం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) అంటోంది.

ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు ఉందని ఈ సంస్థ అంచనా వేసింది.

నిరుద్యోగం భారీగా పెరిగే అవకాశం ఉంటుందని, వేతనాలకు కోతలు పెట్టాల్సిన పరిస్థితులు రావచ్చని అంటోంది.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో స్వయం ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ, ప్రస్తుతం కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజల కదిలకలపై ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. సరకు రవాణాకు కూడా అవరోధం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో స్వయం ఉపాధికి కూడా ఇబ్బందులు తప్పడంలేదు.

భారత్‌లో చూస్తే, విమానయానం, రవాణా, హోటళ్లు, రిటైల్... ఇలా అన్ని రంగాలపైనా కరోనావైరస్ ప్రభావం పడింది.

Image copyright Getty Images

రవాణా రంగంపై తీవ్ర ప్రభావం

కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి.

ఈ ఆంక్షల కారణంగా విమానయాన సంస్థలు విమానాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ప్రజలు బిజినెస్ ట్రిప్పులను, విహార యాత్రలను రద్దు చేసుకుంటున్నారు.

ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, గ్రీస్, ఇటలీ, స్పెయిన్, ఐస్‌లాండ్, హంగేరీ, పోలాండ్, ఐర్లాండ్, ఫిన్‌లాండ్, ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, క్రొయేషియా, సైప్రస్, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, నార్వే, నెదర్లాండ్స్, పోర్చుగల్, రొమేనియా సహా విదేశాల నుంచి వచ్చే అన్ని విమానాలను భారత్ నిషేధించింది.

కరోనావైరస్ ప్రభావిత దేశాలకు భారతీయులు వెళ్లవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

Image copyright Getty Images

కుదేలైన ఆతిథ్య రంగం

దాదాపు దేశమంతటా లాక్‌డౌన్ విధించారు. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడింది. దేశవ్యాప్తంగా చాలా రెస్టారెంట్లు మూతపడ్డాయి.

ఈ పరిస్థితుల ప్రభావం అక్కడ పనిచేసే సిబ్బందిపై పడుతోంది.

"కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజలు ప్రయాణాలను విరమించుకోవాలని, రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లొద్దని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. దాంతో దాదాపు ఐదు లక్షల కోట్ల విలువైన హోటల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది" అని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ కన్సల్టింగ్ సీఈవో ఆశిష్ గుప్తా చెప్పారు.

"ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 5.5 కోట్ల మంది టూరిజం పరిశ్రమపై ఆధారపడి ఉన్నారు. వారిలో ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, హోటళ్ళు, టూరిస్టు ట్యాక్సీలు, టూరిస్టు గైడ్లు, చేనేత దుకాణాలు, రెస్టారెంట్లలో పనిచేసేవారు ఉన్నారు. ఈ కరోనా భయం ఇలాగే కొనసాగితే 60 నుంచి 70 శాతం మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది" అని ఆయన అంటున్నారు.

"నెలనెలా వాయిదాలు (ఈఎంఐలు) చెల్లించేవారికి 12 నెలల పాటు డబ్బులు సర్దుబాటు చేసుకునే అవకాశం కల్పించాలి. బ్యాంకుల నుంచి వడ్డీ లేని మూలధనం పొందే అవకాశం కల్పించాలి" అని ఆశిష్ గుప్తా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతున్నారు.

"ఆదాయపు పన్ను వసూలు, జీఎస్టీ, బార్లకు ఎక్సైజ్ పర్మిషన్ ఫీజు, లైసెన్స్ పునరుద్ధరణ ఫీజు లాంటివి 12 నెలలకు వాయిదా వేయాలి. ఉద్యోగం పోగొట్టుకునే వారికి పరిస్థితి మెరుగుపడే వరకు నేరుగా డబ్బు వచ్చేలా ప్రభుత్వం ఒక సహాయ నిధిని ఏర్పాటు చేయాలి. కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చాక ప్రయాణాలపై కొన్నాళ్ల పాటు జీఎస్టీని ఎత్తివేయాలి, తద్వారా ప్రజలు ఎక్కువ ప్రయాణాలు చేయడం ప్రారంభిస్తారు" అని ఆయన అంటున్నారు.

Image copyright Getty Images

విమానయాన రంగం

అప్పటికే ఇబ్బందుల్లో ఉన్న విమానయాన రంగంపై కరోనావైరస్‌తో మూలిగే నక్కపై తాడిపండు పడినట్లు అయ్యింది. ఇండియా సహా దేశంలోని అన్ని విమానయాన సంస్థలకు జనవరి-మార్చి త్రైమాసికంలో 600 మిలియన్ డాలర్ల దాకా నష్టం నమోదవుతుందని సెంటర్ ఫర్ ఏవియేషన్ అంచనా వేసింది.

ఇండిగో ఎయిర్‌లైన్స్ తన సీనియర్ ఉద్యోగుల జీతాలను తగ్గిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఇండిగో సీఈఓ రోనోజోయ్ దత్తా స్వయంగా తన వేతనంలో 25 శాతం కోత విధించుకున్నారు. సీనియర్ ఉపాధ్యక్షుడు తన వేతనాన్ని 20 శాతం తగ్గించుకున్నారు. ఉపాధ్యక్షుడితో పాటు కాక్‌పిట్ సిబ్బంది జీతాలను 15 శాతం తగ్గించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

సంస్థ ఖాతాలో నగదు ఖాళీ కాకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంటుందని దత్తా చెప్పారు.

విమానయాన రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే, నగదు లేక దేశంలోని చాలా విమానయాన సంస్థలు మే లేదా జూన్ నుంచి కార్యకలాపాలను నిలిపివేయాల్సి రావచ్చు అని సెంటర్ ఫర్ ఏవియేషన్ హెచ్చరించింది.

గోఎయిర్ తన విదేశీ పైలట్లతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసింది. అంతర్జాతీయ సర్వీసులను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రొటేషనల్ ప్రకారం, సిబ్బందికి వేతనం లేని సెలవులు ఇస్తున్నామని తెలిపింది.

Image copyright Getty Images

ప్రధాని పిలుపు

అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకారం, ఉద్యోగాలు కోల్పోవడం వల్ల కొన్ని వర్గాలపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అది సమాజంలో ఆర్థిక అంతరాన్ని మరింత పెంచుతుంది. వారిలో తక్కువ ఉద్యోగ భద్రత, తక్కువ వేతనం ఉన్న ఉద్యోగులు ఉంటారు.

ఈ భయాలను పరిగణనలోకి తీసుకుని గురువారం ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రజలకు విజ్జప్తి చేశారు.

"ఈ సంక్షోభ సమయంలో, వ్యాపార, అధిక ఆదాయ వర్గాల ప్రజలను అభ్యర్థిస్తున్నాను... వీలైతే, మీరు ఎవరి నుంచి సేవలను కోరుకుంటున్నారో వారి ఆర్థిక ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలి. రాబోయే కొద్ది రోజుల్లో వారు కార్యాలయాలకు లేదా మీ ఇళ్లకు రాకపోవచ్చు - అలాంటి సందర్భాల్లో వారి జీతాలను తగ్గించకండి. దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వారు కూడా కుటుంబాలను పోషించుకోవాలి, కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాలని గుర్తుంచుకోండి" అని ప్రధాని పిలుపునిచ్చారు.

ఉద్యోగాలు తగ్గిపోతే, ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడం కూడా కష్టమవుతుంది. దాంతో వస్తు, సేవల వినియోగం తగ్గుతుంది. అది వ్యాపారాలపై ప్రత్యక్ష ప్రభావం చూపదు, కానీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది.

కరోనావైరస్ సంక్షోభం ప్రపంచ జీడీపీని తీవ్రంగా దెబ్బతీస్తుందని అమెరికన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ అంటోంది. శుక్రవారం, ఫిచ్ రేటింగ్స్ 2020-2021 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను 5.6 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గించింది.

Image copyright Getty Images

పెట్టుబడులు, ఎగుమతులు

కరోనావైరస్ వ్యాప్తి పెట్టుబడులు, ఎగుమతులను ప్రభావితం చేస్తుందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.

2008-09 ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో మాదిరిగా అంతర్జాతీయ స్థాయిలో విధానాలు రూపొందిస్తే, ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం ప్రభావాన్ని తగ్గించవచ్చని అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొంది.

సామాజిక భద్రత పెంచడం, స్వల్పకాలిక ఉపాధి కల్పించడం, పెయిడ్ లీవులు, ఇతర రాయితీలు సహా అనేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆ సంస్థ తెలిపింది. అలాగే, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక చేయూత, పన్ను ఉపశమనం కల్పించాలని సూచిస్తోంది. కొన్ని రంగాలకు ఆర్థిక సహాయం అందించాలని కూడా సూచించింది.

కరోనావైరస్ మహమ్మారి ప్రభావంతో తలెత్తే ఆర్థిక సవాళ్లను పరిగణనలోకి తీసుకుని, కేంద్ర ఆర్థిక మంత్రి నాయకత్వంలో కోవిడ్-19 ఆర్థిక ప్రతిస్పందన టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం చెప్పారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనా లాక్‌డౌన్: తూర్పు గోదావరి జిల్లాలో 150 మందితో ప్రార్థనలు చేయించిన పాస్టర్.. అరెస్ట్ చేసిన పోలీసులు

కరోనావైరస్: కోవిడ్-19 మహమ్మారి కొనసాగుతున్నప్పటికీ ఎవరెస్ట్ ఎక్కుతున్న చైనా పర్వతారోహకులు

కరోనావైరస్‌: కోవిడ్-19తో మరణించిన ముస్లిం శవాన్ని దహనం చేయడంపై శ్రీలంకలో వివాదం

కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా

కరోనావైరస్: యూరప్‌లోని వృద్ధాశ్రమాల్లో మృత్యు ఘోష, వందలాది మంది వృద్ధులు మృతి

కరోనా వైరస్‌: ఒక డాక్టర్ భార్యగా నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే..

కరోనావైరస్: తీవ్ర సంక్షోభం దిశగా పాకిస్తాన్.. ఈ కల్లోలాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తట్టుకోగలదా

కరోనావైరస్: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్‌లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా

కరోనావైరస్: ఇండొనేసియాలో క్షణం క్షణం... భయం భయం