కరోనావైరస్: తెలంగాణ నుంచి ఆంధ్రాకు రావాలంటే నూజివీడులో 14రోజులు క్వారంటైన్ తప్పదు

  • 26 మార్చి 2020
సరిహద్దుల్లో ప్రజలు

హైదరాబాద్, తెలంగాణలోని ఇంతర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తమ స్వస్థలాలకు రావాలంటే ముందుగా నూజివీడులోని ఐఐఐటీలో 14రోజుల క్వారంటైన్ తప్పదని అధికారులు స్పష్టం చేశారు.

ఇరు రాష్ట్రాల సరిహద్దులో భారీ సంఖ్యలో ప్రజలు చేరడంతో వారి సమస్యకు పరిష్కారం సూచించేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నించాయి.

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వారు ఎవరి ప్రాంతాల్లో వారు ఉండాలని అధికారులు సూచించారు. అలా కాకుండా ఏపీలో ప్రవేశించాలంటే 14 రోజులపాటు నూజివీడులో క్వారంటైన్ తప్పదని వెల్లడించారు. దీనికి ఇష్టపడని వారు కొందరు వెనక్కి వెళ్లిపోయారు. అంగీకరించినవారిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు.

హైదరాబాద్‌లో హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగస్తులు నగరంలోని అనేక పోలీస్ స్టేషన్ల బయట బుధవారం క్యూలు కట్టి నిలబడ్డారు. పోలీసుల అనుమతి తీసుకొని సొంత వాహనాలలో తమ ఇళ్లకి వెళ్లేందుకు అర్జీ పెట్టుకోవడానికి పోలీస్ స్టేషన్ల బయట గుమిగుడారు.

లాక్ డౌన్ అమలులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం దాటి సొంత ఇళ్లకు వెళ్లాలనుకునేవారికి పోలీసులు నిరభ్యంతర పత్రాలు జారీ చేస్తున్నారంటూ సమాచారం రావడంతో బుధవారం హైదరాబాద్‌లో ఉన్న విద్యార్థుల్లో కొందరు స్టేషన్ల ముందు క్యూలు కట్టారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల మధ్యలో సరిహద్దులను కూడా మూసివేయడంతో హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు విద్యార్థులు, ఉద్యోగస్తులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు మార్గాలు వెతుక్కుంటున్నారు.

చిత్రం శీర్షిక ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రజలు

ఎస్‌ఆర్ నగర్, పంజాగుట్ట, కేపీహెబీ, మాదాపూర్.. ఇలా అనేక చోట్ల హాస్టళ్లలో ఉంటున్నవారు పోలీస్ స్టేషన్ల దగ్గరకు చేరుకున్నారు. కొన్ని హాస్టళ్లలో బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఉన్నవారు కూడా ఉన్నారు. అయితే హాస్టళ్లలో ఉంటున్న తెలుగు రాష్ట్రాల వారు కొంత మంది గత వారమే తమ ఇళ్లకి వెళ్లిపోవటంతో హాస్టల్స్ నడిపే వారు వాటిని మూసివేస్తామని అక్కడ ఉంటున్న వారికి తెలిపినట్టు సమాచారం. అంతేకాక ఇప్పటి దాకా ఇళ్లకి వెళ్లలేకపోయిన వారు కూడా కొంత మంది ఇప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్లి అర్జీ పెట్టుకుంటున్నారు.

అయితే విజయవాడ వైపు వస్తున్న వాహనాలు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద వందలాదిగా నిలిచిపోయాయి. వేలాది మంది రోడ్డుపై ఉండిపోయారు. చీకటి పడటంతో వారికి ఏం చేయాలో తోచలేదు. గరికపాడు చెక్ పోస్ట్ వద్ద నిలిచిపోయిన హైదరాబాద్ నివాసితులను దగ్గరలోని ఏదైనా కాలేజీలో ఉంచి కరోనా వైరస్ స్క్రీనింగ్ అనంతరం అడ్రస్ మాపింగ్ చేసుకుని ఏపీలోనికి అనుమతించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

"నేనో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. సొంత ఊరు వైజాగ్. మార్చ్ 31 వరకే అనుకున్నా కానీ ఇప్పుడు ఇంకా 21 రోజులు అని తెలిసింది. నేను ఉంటున్న హాస్టల్‌లో చాలా మంది తెలంగాణ వారు తమ ఊళ్లకు వెళ్లిపోయారు. ఇప్పుడు హాస్టల్‌లో కొంత మందిమే ఉన్నాము. బయట నుంచి కూరగాయలు, సరకులు కొనుగోలు చేయటానికి ఇబ్బందిగా ఉందని, హాస్టల్ మూసివేస్తామని యాజమాన్యం చెప్పింది. అందుకని మరో దారి లేక ఇంటికి వెళ్లటానికి పర్మిషన్ కోసం వచ్చాను. నేను, ఇంకో ఇద్దరం కలిసి ఒక కార్‌లో వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్నాం" అని కేపీహెబీ పోలీస్ స్టేషన్ బయట లైన్లో నిలబడిన ఒక వ్యక్తి తెలిపారు.

అత్యవసర పరిస్థితిలో తమ స్వస్థలానికి వెళ్లాలనుకుంటున్న వారిని కేసు బై కేసు పరిగణనలోకి తీసుకొని మాత్రమే అనుమతి ఇస్తున్నామని పోలీసులు తెలిపారు. కానీ దీన్ని ఆసరాగా తీసుకొని హాస్టళ్లలో ఉండని వారు కూడా లైన్ కట్టడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

హాస్టల్స్ మూసివేస్తామన్న యాజమాన్యంపై కఠిన చర్యలు తప్పవని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. జీహెచ్ఎంసీ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో హాస్టల్ ఓనర్లతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

అయితే కొంత మంది నిజంగానే తప్పని పరిస్థితిలో వెనక్కి వెళ్లే ప్రయత్నంలో ఉంటే మరి కొంత మంది ఇక్కడ ఉండి ఏం చేస్తాం, స్వస్థలానికి వెళ్తే మేలు అన్న ఆలోచనతో ప్రవర్తిస్తున్నారు.

ఇలా బయలుదేరి కోదాడ వరకు చేరుకొని ఇరుక్కుపోయిన నారాయణ తన సమస్య బీబీసీ తెలుగుతో చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్న తాను, హైదరాబాద్‌లో బ్యాచిలర్‌గా ఒక గదిలో ఉంటున్నట్టు తెలిపారు.

"ఇప్పుడు పని ఉంటే మేం అక్కడే హైదరాబాద్‌లో ఉండి ఏదో కష్ట పడొచ్చు. కానీ అన్నీ మూసి వేశారు. నేను ఉంటున్న రూమ్‌లో వంట చేసుకునే ఏర్పాటు లేదు. ఇప్పటికిప్పుడు కొనుక్కుందామన్నా దుకాణాలు లేవు. మరి నేనెలా ఉండేది? అందుకే మా ఊరు వెళ్దామని బయల్దేరా. బుధవారం ఉదయమే బయల్దేరి తొమ్మిదింటికి ఇక్కడకు చేరుకున్నాను. ఇప్పుడు రాత్రి తొమ్మిదైంది. అయినా మా పరిస్థితి ఏంటో తెలియట్లేదు" అని నారాయణ తెలిపారు.

తెలంగాణ పోలీసులు నుంచి అనుమతి పత్రాలతో వచ్చినా అంగీకరించబోమని ఏపీ పోలీసులు తెలిపారు.

హైదరాబాద్‌లో హాస్టళ్లు, మెస్‌ల మూసివేత, ఏపీ విద్యార్థుల అగచాట్ల అంశాపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడారు. హాస్టళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారని, వారికి రవాణా ఇబ్బందులు వస్తాయని మంత్రి బొత్స వివరించారు. ఈ సమయంలో ఒక చోట నుంచి ఇంకో చోటకు కదలడం కూడా శ్రేయస్కరం కాదని కేటీఆర్‌ దృష్టికి మంత్రి తీసుకువెళ్లినట్లు సమాచారం.

ఇదే అంశంపై తెలంగాణ సీఎస్‌ సోమేశ్ కుమార్‌తో ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని కూడా మాట్లాడారు.

దీనిపై కేటీఆర్ స్పందించారు.

హైదరాబాద్‌లోని హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ సెంటర్ల యాజమాన్యాలు ఎవరినీ ఖాళీ చేయించవద్దని, అనవసరమైన ఆందోళనకు కారణం కావద్దని కేటీఆర్ కోరారు. ఈ అంశంపై దృష్టి సారించాలని, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా వాటిని నిర్వహించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లను ఇప్పటికే కోరినట్లు తెలిపారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ విద్యార్థులు, ప్రైవేటు సంస్థల్లో ఉన్నవారు ఎక్కడివారు అక్కడే ఉండాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న సమయంలో బయటకు రావొద్దని విజ్ఞప్తి చేస్తోంది. ఏపీలోని తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఎక్కడివారు అక్కడే ఉండాలని కోరింది.

ఎవరికైనా లాక్ డౌన్ వల్ల ఏమైనా సమస్యలుంటే 1902కు కాల్‌చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

‘కరోనావైరస్ మీద నేను ఎలా పోరాడుతున్నానంటే...’ - హైదరాబాద్‌ పేషెంట్ నంబర్ 16 స్వీయ అనుభవం

కరోనా లాక్‌డౌన్: ‘చావు తప్పదనుకుంటే మా ఊళ్లోనే చనిపోతాం’

కరోనా లాక్‌డౌన్: నరేంద్ర మోదీ మన్‌కీ బాత్.. ‘ఆరోగ్యమే మహాభాగ్యం.. ఇది యుద్ధం లాంటి పరిస్థితి’

కరోనా వైరస్: ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా కరోనా సోకిందని కనిపెట్టడం ఎలా

కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్‌ను అందించిన భారత శాస్త్రవేత్త ఈమే.. కిట్ ఇచ్చిన గంటకే బిడ్డకు జన్మనిచ్చిన మీనల్

కరోనావైరస్: ట్విటర్‌లో #ShameOnBCCI ట్రెండింగ్, ఎందుకు

ఆంథొనీ ఫాచీ: ఆరుగురు అమెరికా అధ్యక్షులకు సలహాలు ఇచ్చిన వైద్యుడు.. ఒకప్పుడు ఎయిడ్స్‌‌తో, ఇప్పుడు కరోనాతో యుద్ధానికి దిగిన సైనికుడు

PMCARESకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విరాళం రూ.25 కోట్లు

కరోనావైరస్ మీద యుద్ధంలో ముందు నిలిచి పోరాడుతున్న యోధులు ఎవరు.. వారు ఏమంటున్నారు