కరోనావైరస్: విమానయాన ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్న ఇరుగుపొరుగు ప్రజలు

  • 27 మార్చి 2020
ఎయిర్ ఇండియా Image copyright Getty Images

"అన్ని యుద్ధాలు యుద్ధ భూమిలోనే సాగవు. రోజువారీ ఉద్యోగాలు చేస్తూ కూడా కొన్ని యుద్ధాలు గెలవాల్సి ఉంటుంది. మా విధులు మేం నిర్వర్తిస్తుంటే కూడా ఎందుకు మమ్మల్ని శిక్షిస్తారు?" అని ఎయిర్ ఇండియా కేబిన్ క్రూ ఉద్యోగి ప్రశ్నిస్తున్నారు.

ముంబయి హౌసింగ్ సొసైటీలో కొంత మంది సభ్యులు ఎయిర్ ఇండియా ఉద్యోగులతో అనుచితంగా ప్రవర్తించారని వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు.

మార్చ్ 22 అర్ధరాత్రి నుంచి భారతదేశం అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిషేధించింది. సరకు రవాణా, అత్యవసర సేవలని అందించే విమానాల్ని మాత్రమే ప్రస్తుతం అనుమతిస్తోంది. అలాంటి ప్రయాణాలు పూర్తి చేసుకుని వచ్చిన ఉద్యోగులు నిబంధనలను అనుసరించి స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అయితే, ఇలా వచ్చిన కొంత మంది ఉద్యోగులను వారి ఇంటి చుట్టు పక్కల వాళ్లు బహిష్కరిస్తున్నారు.

కొన్ని హౌసింగ్ సొసైటీల సభ్యులు తమ ఉద్యోగుల పట్ల ప్రవర్తిస్తున్న తీరుని ఖండిస్తూ ఎయిర్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. వారు విదేశాలకు వెళ్లి వచ్చారనే నెపంతో ఇరుగుపొరుగువారు కొన్ని చోట్ల పోలీసులను కూడా పిలుస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఆ ప్రకటనలో తెలిపింది.

పౌర విమాన యాన శాఖ మంత్రి హర్దీప్ పూరి ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ఉద్యోగుల నిబద్ధతని కొనియాడుతూ, స్వీయ నిర్బంధంలో ఉన్న ఉద్యోగులకు, వారి కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశిస్తూ ట్వీట్ చేశారు.

కానీ, ఈ మొత్తం వ్యవహారం ఉద్యోగులను విచారానికి గురి చేసింది.

ఏం జరిగింది?

న్యూయార్క్ నుంచి వచ్చిన ఫ్లైట్‌లో ఉన్న ఓ కేబిన్ క్రూ సభ్యురాలు ఇటీవల తనకి జరిగిన అనుభవాన్ని తన సహోద్యోగులతో పంచుకున్నారు.

(ఆమె విన్నపం మేరకు బీబీసీ ఆమె పేరుని గోప్యంగా ఉంచుతోంది.)

ఆమెకి కోవిడ్-19 లక్షణాలు ఏమీ లేనప్పటికీ, ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ చేసిన తర్వాత వైద్య అధికారులు ఆమెని స్వీయ నిర్బంధంలో ఉండమని సలహా ఇచ్చారు. దీంతో, ఆరోజు నుంచి, ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా నవీ ముంబైలో ఉన్న తమ ఫ్లాట్ నుంచి బయటకి రాలేదు.

అయినా సరే, ఆమె స్వచ్చందంగా స్క్రీనింగ్‌కి రాలేదని, ఆమె ప్రయాణ వివరాలు దాచి పెట్టారని బెదిరిస్తూ, ఓ రోజు రాత్రి ఓ పోలీస్ ఆఫీసర్ ఆమెకి ఫోన్ చేశారు. అదే రోజు ఓ పోలీస్ బృందం ఆమె ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన పోలీస్ ఆఫీసర్లు ఆమె దగ్గర అన్ని వివరాలు సేకరించి ఒక సీనియర్ అధికారితో కూడా మాట్లాడించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం ఇవ్వమని సూచించారు.

ఈ వివరాలను ఆమె తన పై అధికారులకు తెలియచేశారు. అయితే, మరో పోలీస్ ఆఫీసర్ ఆమెకి కాల్ చేసి పోలీసులు ఆమె పట్ల ప్రవర్తించిన తీరుకి క్షమాపణ చెప్పారు. దీంతో ఆమె కుటుంబానికి కాస్త ఊరట కలిగింది.

కానీ, ఆ రాత్రంతా ఆమె కుటుంబం భయంతోనే గడిపింది. కరోనావైరస్ వ్యాప్తి సమయంలో జారీ చేసిన ప్రయాణ నిబంధనల ప్రకారం, గత 15 రోజుల్లో సొసైటీలో ఎవరైనా విదేశీ ప్రయాణం చేసి వస్తే, వారి జాబితాని స్థానికి పోలీసులకి అందచేయవలసి ఉంటుంది. అయితే పౌర విమానయాన ఉద్యోగుల గురించి ఇచ్చే సమాచారం పట్ల స్పష్టత లేదు.

ఇతర అనుభవాలు

ఈ వ్యవహారం కేవలం విమాన ప్రయాణం చేసి వచ్చిన ఉద్యోగులకు, హౌసింగ్ సొసైటీలకు మాత్రమే పరిమితం కాదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్లతో ఎయిర్ పోర్టులలో పనిచేసే గ్రౌండ్ లెవెల్ ఉద్యోగులు కూడా తమ విధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిల్లీలో తమ ఇళ్లలో స్వీయ నిర్బంధంలో ఉన్న కొంత మంది ఇళ్ల ముందు స్థానిక అధికారులు "వీళ్లు నిర్బంధంలో ఉన్నారు" అనే పోస్టర్లను పెట్టారు. ఈ రకంగా కూడా స్థానికుల నుంచి వివక్ష ఎదుర్కొంటున్నట్లు కొంత మంది విమానయాన ఉద్యోగులు వీడియోలు విడుదల చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో గురించి కోల్‌కతాలోని ఓ ఫ్లైట్ అటెండెంట్ తన భావాలను పంచుకున్నారు.

"మాకు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. మీకన్నా మేం చాలా సురక్షితంగా ఉన్నాం. మేం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మేం వైరస్ సోకిన ప్రాంతాల్లో వారికి దగ్గరగా ఉన్నప్పటికీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాకు తెలుసు. ఒకవేళ నాకు వైరస్ సోకిందని అనిపిస్తే నేను ముందు నా విధులను పక్కనపెట్టి హాస్పిటల్‌కు వెళ్తాను. ఆ పరిస్థితుల్లో నా శరీరం కూడా పని చేయడానికి సహకరించదు. నాకు కరోనా సోకిందని దయచేసి అసత్యాలు, అపోహలు ప్రచారం చేయకండి" అని విజ్ఞప్తి చేశారు.

ఈ వీడియో వైరల్ అయిన వెంటనే తమ ఉద్యోగుల భద్రత, రక్షణ కోసం అన్ని అవసరమైన జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్నట్లు తెలుపుతూ ఇండిగో సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ వైరల్ వీడియోను పోస్ట్ చేసిన వారిని పట్టుకునేందుకు కోల్‌కతా పోలీసులు విచారణ చేపట్టారు.

Image copyright Getty Images

ఫ్లైట్ క్రూ పాటించాల్సిన నిబంధనలు ఏమిటి?

మహమ్మారి వ్యాప్తి సమయంలో అంతర్జాతీయ విమానాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు పాటించాల్సిన నియమ నిబంధనలను ఎయిర్ ఇండియా విడుదల చేసింది.

వైరస్ వ్యాప్తి నమోదైన ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చిన ఉద్యోగులు హాస్పిటల్లో స్క్రీనింగ్‌కి వెళ్లి, ఇంట్లోనే స్వీయ నిర్బంధానికి వెళ్లాలి.

ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల భద్రత పట్ల యాజమాన్యం తగిన చర్యలు తీసుకుంటుంది.

ప్రయాణికుల్లో ఎవరైనా కోవిడ్-19 బారిన పడ్డారనే అనుమానం ఉంటే ఉద్యోగులు రక్షణ సూట్లను ధరించాలి.

"ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడాన్ని మా విధిగా భావిస్తాం. ఇతర దేశాల్లో చిక్కుకున్న వారిని తిరిగి దేశానికి తీసుకురావడంలో మేం ప్రధాన పాత్ర పోషించాం. అటువంటి పనులు చేయడానికి, శిక్షణ పొందిన సిబ్బందిని తగిన జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. మేం నిబంధనలన్నింటిని కచ్చితంగా పాటించాలి" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పైలట్ చెప్పారు.

ఎయిర్ ఇండియా సంస్థ గత కొన్ని నెలలుగా నష్టాల్లో కూరుకుని ఉంది. అయినప్పటికీ ఈ సమయంలో చొరవ తీసుకుని వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని తిరిగి దేశానికి తీసుకుని రావడానికి సహకరించింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

చేతులో డబ్బులు అయిపోతున్నాయి... ఏం చెయ్యాలో ఎలా గడపాలో తెలియడం లేదు – బ్రిటన్‌లో తెలుగు విద్యార్థుల గోడు

డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ ఉన్నవారికే మద్యం: ఆత్మహత్యల నేపథ్యంలో కేరళ సర్కారు ఆదేశాలు

కరోనా లాక్‌డౌన్: దిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న 200 మందిలో చాలా మందికి కోవిడ్ లక్షణాలు

కరోనావైరస్: టోక్యో ఒలింపిక్స్ 2021లోనే... తేదీలు ఖరారు

కరోనావైరస్:‌ వేలం వెర్రిగా సాగిన టాయిలెట్ రోల్స్ కొనుగోళ్ళ వెనుక అసలు కథేంటి?

కరోనావైరస్: దిల్లీలో వలస కార్మికులు ఇంత భారీ సంఖ్యలో పోగవ్వడానికి బాధ్యులు ఎవరు?

కరోనా లాక్‌డౌన్ కుటుంబ సంబంధాల ప్రాధాన్యాన్ని గుర్తు చేసిందా?

క‌రోనావైర‌స్: రొయ్యల సాగుదారుల చిక్కులేంటి.. లాక్ డౌన్‌తో న‌ష్టం ఎంత‌

కరోనావైరస్: సరకులు కొనుక్కోవడానికి ఏది సురక్షిత మార్గం? సూపర్‌ మార్కెట్‌కు వెళ్ళడమా... ఆన్‌లైన్లో ఆర్డర్ చేయడమా?