కరోనావైరస్: 'కశ్మీర్‌లో 7 నెలలుగా హైస్పీడ్ ఇంటర్నెట్ లేదు, వైరస్ వార్తలు, జాగ్రత్తలు తెలుసుకునేదెలా?' స్థానికుల ఆందోళన

కశ్మీర్లో జన జీవనం ఇక్కట్లు
ఫొటో క్యాప్షన్,

కశ్మీర్లో జన జీవనం ఇక్కట్లు

"నేను కేంద్ర ప్రభుత్వానికి ఒక్కటే చెప్పదల్చుకుంటున్నాను. మాపై దయ ఉంచి వెంటనే 3జీ, లేదా 4జీ ఇంటర్నెట్‌ను యాక్టివేట్‌ చెయ్యండి. లేదంటే కరోనా గురించి ఇంటర్నెట్ ద్వారా ఎలా తెలుకుంటాం? ప్రస్తుతం వస్తున్న వేగంతో అస్సలు చూసే అవకాశమే లేదు."

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఏడున్నర నెలల గృహ నిర్బంధం తరువాత బయటకి వచ్చి మంగళవారం మొదటి సారిగా మీడియాతో మాట్లాడిన మాటలు ఇవి.

ప్రపంచమంతా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సాయంతో ప్రాణాంతకమైన కరోనావైరస్ గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుకుంటూ ఉంటూ ఉంటే, కశ్మీర్ ప్రజలకు మాత్రం ప్రస్తుతం ఆ సౌకర్యం లేదు.

ఫలితంగా ఇంటర్నెట్‌లో వచ్చే తాజా వీడియో సమాచారం వాళ్లకు ఇప్పుడు ఏ మాత్రం అందుబాటులో లేకుండా పోయింది.

ప్రస్తుతం జమ్మూకశ్మీర్లో అధికారిక లెక్కల ప్రకారం 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా 65 ఏళ్ల వృద్ధుడు మరణించారు.

కశ్మీర్ లోయలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రజల కదలికలపై కఠిమైన ఆక్షలు విధించారు. 2019 ఆగస్టు 5 న కశ్మీర్‌కు అప్పటి వరకు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చినప్పటి నుంచి హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం లేదు.

సుమారు 6 నెలల తర్వాత సుప్రీం కోర్టు జోక్యంతో అక్కడ 2జీ సేవలు ప్రారంభమయ్యాయి.

ఫొటో సోర్స్, getty images

ఫొటో క్యాప్షన్,

జమ్ము-కశ్మీర్లో తక్షణం హైస్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించాలని డిమాండ్

లోస్పీడ్ ఇంటర్నెట్ కశ్మీరీల జీవితాల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇంటర్నెట్ వేగం పూర్తిగా పడిపోవడంతో తాను పని చేసే సంస్థకు ఫోటోలను పంపించడం కూడా కష్టమైపోయిందని స్థానిక ఫోటో జర్నలిస్ట్ ముక్తియార్ అహ్మద్ చెబుతున్నారు.

“ప్రతి రోజు నేను పని చేసే సంస్థకు ఫోటోలను పంపాలి. అవి ఒక్కొక్కటి 3-4 మెగాబైట్స్ ఉంటాయి. కానీ, హైస్పీడ్ ఇంటర్నెట్ లేకపోవడంతో పంపించడం సాధ్యం కావడం లేదు. వీడియోలను పంపే సమయంలోనూ ఇదే సమస్య ఎదురవుతోంది. తక్షణం ప్రభుత్వం హైస్పీడ్ ఇంటర్నెట్‌ను పునరుద్ధరించాలి” అని ముక్తియార్ అన్నారు.

అయితే, ప్రభుత్వం పాత్రికేయుల కోసం ఓ మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేసింది. కానీ, సామాజిక దూరం పాటించాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడకు వెళ్లి పని చేయడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని ఆయన చెప్పారు.

"కరోనావైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన తర్వాత మేం అక్కడకు వెళ్లడం మానేశాం. 8 ఏళ్లుగా పాత్రికేయులు అక్కడ నుంచే పని చేస్తున్నారు. ఆ ప్రాంతమంతా జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది” అని ఆయన అన్నారు.

“ఎవరైనా ప్రమాదాన్ని ఎందుకు కొని తెచ్చుకుంటారు” అని ముక్తియార్ ప్రశ్నించారు.

మరో పాత్రికేయుడు హరాన్ రెషీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

“ప్రొఫెషనల్స్ అంతా హైస్పీడ్ ఇంటర్నెట్ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనావైరస్ విస్తరిస్తున్న ఈసమయంలో ఇంటర్నెట్ వేగం పెరిగితే వాళ్లంతా ఇంటిదగ్గరే ఉంటూ పని చేసుకోవచ్చు. ఫలితంగా సామాజిక దూరాన్ని కూడా పాటించగల్గుతారు” అని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడం వల్ల వైద్య రంగం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఇంటర్నెట్ వేగం తగినంత లేకపోవడం వల్ల తాము తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని దక్షిణ కశ్మీరుకు చెందిన పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ వైద్యుడు బీబీసీకి చెప్పారు.

ఎప్పటికప్పుడు మేం మా ఉన్నతాధికారులకు నివేదికలు పంపాల్సి ఉంటుంది. కానీ వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం వల్ల వాటిని పంపించేందుకు చాలా సమయం పడుతోంది. మా రోజు వారీ పనులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఫోన్‌లో చెప్పారు.

ఫొటో సోర్స్, getty images

ఫొటో క్యాప్షన్,

కశ్మీర్లో హైస్పీడ్ ఇంటర్నెట్ లేక స్తంభించిన జన జీవనం

కరోనావైరస్‌కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తప్పనిసరిగా స్థానిక భాషల్లో ప్రజలకు అందించాల్సినవసరం ఉంది.

అలాగే, తాజా సమాచారానికి సంబంధించిన వీడియోలు కూడా వాళ్లకు అందుబాటులో ఉండాలని కశ్మీర్ వైద్యుల సంఘం అధినేత నిసార్ ఉల్ హసన్ బీబీసీతో చెప్పారు.

ఇక విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులది అదే పరిస్థితి.

4జీ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంటే మా విద్యార్థులకు అవసరమైన ఆన్ లైన్లో మేం పంపించవచ్చు.

కానీ, ఇప్పుడు ఆ సౌకర్యం లేకపోవడంతో అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫ్రోబెల్ హైస్కూల్ ప్రిన్సిపాల్ అర్షిద్ బాబా బీబీసీకి చెప్పారు.

“ఏడు నెలల తర్వాత మేం తిరిగి తరగతుల్ని ప్రారంభించాం. ఆ ఏడు నెలలు ఇంటర్నెట్ లేకుండానే గడిపాం. కనీసం ఇప్పుడైనా మాకు హైస్పీడ్ ఇంటర్నెట్ ఉంటే ఎంతో కొంత సాయంగా ఉండేది. ఇప్పుడు ఇంటర్నెట్ ఉన్నప్పటికీ పరిస్థితి అలాగే ఉంది" అని ఆయన అన్నారు.

హైస్పీడ్ ఇంటర్నెట్ లేకపోవడం వల్ల తమ చెయ్యాల్సిన ప్రాజెక్టులు, ల్యాబ్ వర్క్స్ ని పూర్తి చేయలేకపోతున్నామని శ్రీనగర్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న సయ్యద్ ఫర్కన్ చెప్పారు.

గత 8 నెలలుగా హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం డిమాండ్ చేస్తున్నామని అయినా ఫలితం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అటు బీజేపీ సహా ఇతర రాజకీయ పార్టీలు కూడా తక్షణం హైస్పీడ్ ఇంటర్నెట్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాయి.

“హైస్పీడ్ ఇంటర్నెట్ లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్య రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రజలకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉండటం చాలా ముఖ్యం. ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలి. బహుశా ఒకట్రెండు రోజుల్లో ఆ పని చేస్తారనని నేను ఆశిస్తున్నాను” అని కశ్మీర్‌కు చెందిన బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ బీబీసీకి చెప్పారు.

మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా కూడా ప్రధాని నరేంద్ర మోదీకి ఈ విషయమై ఓ లేఖ కూడా రాశారు.

మార్చి 26న జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో హైస్పీడ్ ఇంటర్నెట్ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది.

అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా జమ్మూకశ్మీర్ పరిధిలో వెంటనే హైస్పీడ్ ఇంటర్నెట్‌ను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తోంది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)