కరోనావైరస్: లాక్‌డౌన్‌లో ఉపాధి లేక, ఆహారం అందక ట్రాన్స్‌జెండర్ల ఇబ్బందులు

  • కమలేశ్
  • బీబీసీ ప్రతినిధి
ట్రాన్స్‌జెండర్స్ కోసం పనిచేస్తున్న బసేరా అనే స్వచ్ఛంద సంస్థలో రామ్‌కలీ సభ్యురాలు

"ఇక్కడెక్కడా తిండి దొరకట్లేదు. ఇంట్లో వండుకోవడానికి ఏమీ లేదు. ఎక్కడో శిబిరాల్లో తిండి పెడుతున్నారు. కానీ, ఈ లాక్‌డౌన్‌లో అక్కడికి ఎలా వెళ్లేది?"... నోయిడాలో సెక్క్స్ వర్కర్‌గా పనిచేస్తున్న ట్రాన్స్‌జెండర్ ఆలియా అడిగిన ప్రశ్న ఇది.

ఆమెకు ఇప్పుడు ఆదాయం వచ్చే మార్గమేదీ లేదు. తిండికి, ఇంటి అద్దెకు డబ్బులు లేక దిగులుపడుతున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ సమయంలో దినసరి కూలీలు తల్లడిల్లుతున్నట్లే పొట్టకూటి కోసం ట్రాన్స్‌జెండర్ వర్గం కూడా ఇబ్బందులు పడుతోంది.

“పోలీసులకు మా వృత్తి గురించి తెలుసు. మేం బయటకు వస్తే, దాని కోసమే వస్తున్నామని వాళ్లు అనుకుంటారు. అందుకే మమ్మల్ని అడ్డగిస్తారు. మా ఆదాయం ఆగిపోయింది. అందరం కలిసి, ఎంతో కొంత పోగేసుకుని బతుకుతున్నాం. మా ఇంటి అద్దె రూ.5 వేలు. రాబోయే నెలల్లో మేం ఎలా కట్టాలి?” అని అన్నారు ఆలియా.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

ఫొటో క్యాప్షన్,

సోనమ్

‘కుటుంబాన్ని పోషించుకోవాలి’

సోనమ్‌ది బిహార్. ఇటీవలే ఆమె వాళ్ల ఊరి నుంచి ఇక్కడికి వచ్చారు. టోలా బధాయీగా ఆమె పనిచేస్తున్నారు.

“బిహార్‌లో మా అమ్మ, నాన్న ఉంటారు. లాక్‌డౌన్ మొదలు కాకముందు ఊరి నుంచి వచ్చాను. అక్కడ చాలా ఖర్చులయ్యాయి. ఇక్కడ సంపాదించుకోవచ్చని అనుకున్నా. కానీ, ఇప్పుడు మొత్తం మూసేశారు. ఇంటికి ఏం పంపాలో అర్థం కావట్లేదు. ఏదైనా ఆపదలో అక్కరకు వస్తాయని దాచుకున్న డబ్బులు కొన్ని ఉన్నాయి. లేకపోతే, మాకు ఎవరు సాయం చేస్తారు? కరోనాతో చస్తామో, లేదో గానీ, పని దొరక్క ఇంట్లోనే చచ్చేలా ఉన్నాం" అని సోనమ్ అంటున్నారు.

రేషన్ కార్డు కోసం ఎంత ప్రయత్నించినా, పొందలేకపోయానని ఆమె చెప్పారు.

ఫలితంగా ప్రభుత్వ రేషన్ ఆమెకు అందట్లేదు. స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకుంటూ ఆమె బతుకీడుస్తున్నారు. అప్పు పుట్టని పరిస్థితి వస్తే, ఏమవుతుందోనని ఆమె బాధపడుతున్నారు.

ఫొటో క్యాప్షన్,

రామ్‌కలీ

‘గాలికి వదిలేశారు’

ట్రాన్స్‌జెండర్స్ కోసం పనిచేస్తున్న బసేరా అనే స్వచ్ఛంద సంస్థలో రామ్‌కలీ సభ్యురాలు.

ప్రస్తుత లాక్‌డౌన్‌లో ట్రాన్స్‌జెండర్లు నిరుద్యోగం, ఆకలి బాధలతో అల్లాడుతున్నారని ఆమె చెబుతున్నారు.

“రోజూ సాయం కావాలంటూ నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తాయి. మా వర్గంలో ఉండే వాళ్లలో ఎక్కువ మంది ఏ రోజుకు ఆ రోజు సంపాదనపై ఆధారపడేవారే. ఇప్పుడు ఆదాయం లేకపోవడంతో, అనేక ఇబ్బందులు వస్తున్నాయి. సొంత ఇల్లు ఉండదు. అద్దె కట్టాల్సి ఉంటుంది. కుటుంబం ప్రేమ, ఆసరా లేకపోవడం అన్నింటికన్నా పెద్ద సమస్య. లింగం విషయంలో కుటుంబం నుంచి వేధింపులు ఉంటాయి. సమాజం మా వర్గాన్ని గాలికి వదిలేసింది. కష్టకాలంలో మాకు ఎవరు సాయం చేస్తారు? దినసరి కూలీలు వాళ్ల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. మేం ఎక్కడికి వెళ్లాలి?’’ అని ప్రశ్నించారు రామ్‌కలీ.

ఫొటో క్యాప్షన్,

ఆకాశ్

‘ఉద్యోగం నుంచి తీసేశారు’

దిల్లీకి చెందిన ఆకాశ్ పాలీ తన లింగం మార్చుకుని పురుషుడిగా మారారు. ఆయన ఓ పార్లర్‌లో పనిచేసేవారు. కానీ, కొన్ని రోజుల క్రితం ఆయన ఉద్యోగం పోయింది.

“నేను ట్రాన్స్‌జెండర్ అని తెలిశాక, వాళ్లు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు. లాక్‌డౌన్ విధించడానికి కొన్ని రోజుల ముందు ఇది జరిగింది. నేను వేరే చోటుకు వెళ్లొచ్చేసరికి లాక్‌డౌన్ విధించారు. ఆ సంస్థ నాకు ఇవ్వాల్సిన మిగతా డబ్బులు కూడా ఇవ్వడం లేదు” అని చెప్పారు ఆకాశ్.

‘‘నాకు సంపాదనకు ఇంకో దారి లేదు. పొదుపు చేసుకున్న డబ్బులు, ఇంట్లో వాళ్లు అవసరమంటే ఇచ్చేశా. సాయం చేస్తే, నన్ను వాళ్లు అంగీకరిస్తారని అనుకున్నా. కానీ, అలా జరగలేదు. నన్ను ఒంటరిగా వదిలేశారు. ఇప్పుడు అప్పు తీసుకుని బతుకుతున్నా. ఇంటి యజమాని అద్దె అడుగుతున్నారు’’ అని వివరించారు.

నిరాశ్రయులు ఉండేందుకు దిల్లీ ప్రభుత్వం చాలా స్కూళ్లలో శిబిరాలు ఏర్పాటు చేసింది. వాటిలో తిండికి కూడా ఏర్పాట్లు చేసింది. చాలా మంది నిరాశ్రయులు వాటిలో ఉంటున్నారు.

కానీ, అక్కడికి వెళ్లడం తమకు సులువు కాదని ఆకాశ్ అంటున్నారు.

“కొద్ది రోజుల క్రితం బయటకు వెళ్తే, ఎక్కడికి వెళ్తున్నావంటూ పోలీసులు ఆపారు. ఒకవేళ ఆ శిబిరాలకు వెళ్లినా, పెద్ద లైన్లు ఉంటాయి. జనాలు మమ్మల్నే గుచ్చిగుచ్చి చూస్తారు" అని ఆకాశ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

‘ఏ కార్డులూ లేవు’

తమ వర్గం కాకుండా, బయటివాళ్లలో మిత్రుల సంఖ్య తక్కువ ఉండటం ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య అని రామ్‌కలీ అన్నారు.

అందరూ నిరుద్యోగంతో ఉన్నప్పుడు, ఒకరికొకరు సాయం చేసుకునే అవకాశం ఉండదని అన్నారు. కుటుంబానికి దూరంగా రావడం వల్ల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు కార్డు లాంటివి ట్రాన్స్‌జెండర్లకు ఉండటం లేదని చెప్పారు.

ట్రాన్స్‌జెండర్లలో ఎక్కువ మంది టోలా బధాయి పనిచేస్తుంటారు. ఎవరింట్లోనైనా వేడుకలు జరిగితే, పాటలు, నృత్యాలు చేసేందుకు వెళ్తుంటారు. అలాంటి వేడుకలు జరిగినప్పుడే వాళ్లకు డబ్బులు వస్తాయి.

హైదరాబాద్‌కు చెందిన ఫిజా జాన్ కూడా టోలా బధాయి పనిచేస్తుంటారు. వాళ్ల బృందానికి ఆమె నాయకురాలు. ఇప్పుడు అందరి బతుకులు ఇబ్బందుల్లో ఉన్నాయని ఆమె అంటున్నారు.

‘‘మేమందరం ఖాళీగా ఉన్నాం. తినడానికి, అద్దె కట్టడానికి డబ్బులు లేవు. బియ్యం, గోధుమపిండి ఎవరైనా ఇస్తే, అవసరం ఉన్నవాళ్లకు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు మాకే అవసరం ఏర్పడింది. మాకు సాయం చేస్తామని కొందరు చెబుతుంటారు. కానీ జరిగేదేమీ లేదు’’ అని ఫిజా జాన్ అన్నారు.

"ట్రాన్స్‌జెండర్లకు రేషన్ ఇస్తామని కొన్ని రోజుల క్రితం ఓ రాజకీయ పార్టీ నేత ప్రకటించారు. కానీ ఇంతవరకూ ఆయన చేసిందేమీ లేదు’’ అని రామ్ కలీ అన్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో దాదాపు 49 లక్షల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

2019లో ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం చట్టం కూడా తెచ్చింది. కానీ, ఈ చట్టం విషయంలోనూ ట్రాన్స్‌జెండర్లకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. గుర్తింపును నిర్ణయించుకునే స్వేచ్ఛ, మిగతవారిలాగే గౌరవంగా బతికే అవకాశం, హక్కులను తమకు కల్పించాలని ట్రాన్స్‌జెండర్లు డిమాండ్ చేస్తున్నారు.

వీడియో క్యాప్షన్,

వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)