ఆరోగ్య సేతు: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్‌లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా?
- బ్రజేశ్ మిశ్ర
- బీబీసీ ప్రతినిధి

కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు క్వారంటీన్లో ఉంచినవారిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. కరోనావైరస్ సోకినవారి కదలికలనూ గమనిస్తోంది. భారత ప్రభుత్వం ‘ఆరోగ్య సేతు’ అనే యాప్‌ను గత వారం ప్రారంభించింది.
ఈ యాప్‌ను ఉపయోగించి జనాలు తమ చుట్టూ ఉన్న కరోనావైరస్ రోగుల గురించి తెలుసుకోవచ్చు. వినియోగదారుల గోప్యతను దృష్టిలో పెట్టుకుని ఈ యాప్‌ను రూపొందించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, గోవా కూడా ఇలా కోవిడ్-19 సంబంధిత సమాచారం అందించే యాప్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి..
ఈ యాప్‌లతో క్వారంటీన్లో ఉన్నవారిపై, కరోనావైరస్ రోగులపై పర్యవేక్షణ పెడుతున్నట్లు చెబుతున్నారు.
కరోనా కవచ్ అనే యాప్‌ను భారత ప్రభుత్వం రూపొందిస్తోందని, కరోనారోగులపై దీని ద్వారా నిఘా పెట్టబోతోందని కూడా వార్తలు వస్తున్నాయి.
టెలికాం సంస్థల సాయంతో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు... కరోనా రోగుల ఫోన్ లొకేషన్, కాల్ హిస్టరీల ఆధారంగా కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నాయి. కాంటాక్ట్ ట్రేసింగ్ అంటే... వారిని కలిసినవారిని గుర్తించడం.
కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన కరోనా వాచ్ అనే మొబైల్ యాప్‌తో కరోనా పాజిటివ్ వ్యక్తుల గత 14 రోజుల కదలికల గురించి సమాచారం తెలుసుకోవచ్చు.
హిమాచల్ ప్రదేశ్ కరోనా ముక్త్ హిమాచల్ అనే యాప్‌ను తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా అలెర్ట్ ట్రేసింగ్ సిస్టమ్‌ను వినియోగిస్తోంది. ఇళ్లలో క్వారంటీన్లో ఉంచిన 25 వేల మందిపై దీని ద్వారా నిఘా పెడుతోంది. వారి మొబైల్ నెంబర్ల ఆధారంగా, కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా చేస్తోంది.
ఒక్క భారత్‌లోనే కాదు, చాలా దేశాల్లో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు.
రాత్రికి రాత్రే చట్టం చేసిన ఇజ్రాయెల్
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు, అది సోకినవారిని కలిసినవారిని గుర్తించేందుకు జనాల మొబైల్ సమాచారాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఇందుకోసం రాత్రికి రాత్రే ఓ తాత్కాలిక చట్టం చేసింది.
చైనా, దక్షిణ కొరియా, అమెరికా, సింగపూర్, హాంకాంగ్ కూడా ఈ తరహా చర్యలు తీసుకుంటున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కొందరు సైబర్ నిపుణులు మాత్రం ఇది జనాల గోప్యతకు విఘాతం కలిగించడమేనని అంటున్నారు. కరోనావైరస్ లాంటి మహమ్మారి ప్రబలుతున్న ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వాలు చేపడుతున్న ఈ చర్యలు ఓ స్థాయి వరకూ సబబుగానే అనిపిస్తున్నా... ఇప్పుడు సేకరిస్తున్న సమాచారాన్ని ఎప్పటివరకూ వినియోగిస్తారు, ఎలా వినియోగిస్తారు అన్న అంశాలపై స్పష్టత లేదని, ప్రజల గోప్యత విషయంలో ఇది ఆందోళన కలిగిస్తోందని వాళ్లు అంటున్నారు.
ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ ద్వారా సమాచారం సేకరించడం ప్రజల గోప్యత హక్కులను హరించడమేనని, సుప్రీం కోర్టు ఆదేశాల ఉల్లంఘన కూడా అవుతుందని సైబర్ చట్టాల నిపుణుడు పవన్ దుగ్గల్ అన్నారు.
‘‘ప్రజల ఆరోగ్యం కోసమే ఇదంతా చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పవచ్చు. కమ్యునిటీ ట్రాన్స్‌మిషన్‌ను అరికట్టాలంటే కాంటాక్ట్ ట్రేసింగ్ చెయ్యాల్సిందే. అయితే, ఇదంతా ముగిసి, పరిస్థితి కుదటపడిన తర్వాత ఆ సమాచారాన్ని నాశనం చేస్తామని ప్రభుత్వాలు హామీ ఇవ్వడం లేదు. ఈ సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశాలున్నాయి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం కరోనావైరస్ భయంతో గోప్యత అంశాన్ని ఎవరూ లేవనెత్తడం లేదని దుగ్గల్ అన్నారు. ఈ కారణంతో భారత్ సహా వివిధ దేశాల్లో పాలకుల చేతుల్లోకి... భవిష్యత్తులో ప్రజలకు వ్యతిరేకంగా ఉపయోగించగలిగే అవకాశం ఉన్న శక్తి వచ్చిందని అభిప్రాయపడ్డారు.
‘‘ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను గమనిస్తే, ఒక కొత్త వరల్డ్ సైబర్ ఆర్డర్ ఏర్పడుతోంది. ప్రభుత్వాలు తమ శక్తులను మరింతగా పెంచుకుంటున్నాయి. మహమ్మారిని చూపించి, ప్రజల హక్కులను హరించేందుకు లైసెన్స్ పొందుతున్నాయి. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక, వాళ్ల సమాచారం దుర్వినియోగం అయ్యే ముప్పు గురించి జనాలకు తెలుస్తుంది’’ అని దుగ్గల్ అన్నారు.
దీని గురించి జనాలు అవగాహన పెంచుకోవాలని... కరోనావైరస్ ముప్పు దూరమైన తర్వాత గోప్యతను, డిజిటల్ స్వేచ్ఛను కాపాడుకునేందుకు న్యాయవ్యవస్థలను ఆశ్రయించాల్సి రావొచ్చని అన్నారు.
ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అపార్ గుప్తా కూడా ఈ వాదనతో ఏకీభవిస్తున్నారు.
ఏ చట్టమూ అనుమతించకుండానే ప్రభుత్వం సమాచారం సేకరిస్తోందని... దాన్ని ఎప్పటివరకూ, ఎలా ఉపయోగించుకుంటుందో తెలియదని అన్నారు.
ఫొటో సోర్స్, REUTERS
పరిస్థితి కుదటపడిన తర్వాత ఆ సమాచారాన్ని నాశనం చేస్తామని ప్రభుత్వాలు హామీ ఇవ్వడం లేదు
ఆధార్ కార్డుతో జరిగినట్లే...
ఇదివరకు ఆధార్ కార్డు అంశంలోనూ సుదీర్ఘంగా వాదోపవాదాలు నడిచాయి. విషయం సుప్రీం కోర్టుకు కూడా వెళ్లింది.
ఆధార్ కార్డు సమాచారం లీక్ అయ్యి, వేల మంది వ్యక్తిగత సమాచారం బయటకు వచ్చిన ఉదంతాలనూ మనం చూశాం. అలాంటి సమాచారం వాటిని దుర్వినియోగం చేసుకునే వారి చేతుల్లోకి చేరితే తీవ్ర పరిణామాలు ఉంటాయి.
రేషన్, ప్రభుత్వ రాయితీల పంపిణీలో అవినీతిని నిర్మూలించే లక్ష్యంతో ఆధార్ కార్డును తీసుకువచ్చారు.
కానీ, ఆ తర్వాత ఆధార్ కార్డును పాన్ కార్డు, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసి, పన్ను ఎగవేతలను, అక్రమ నగదు బదలాయింపులను గుర్తించేందుకు ఉపయోగిస్తున్నామని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది. మొబైల్ నెంబర్ పొందేందుకూ ఆధార్‌ను తప్పనిసరి చేసింది.
ఆధార్ కార్డును అన్నింటితో అనుసంధానం చేసి, నిఘా వ్యవస్థగా మార్చినట్లుగానే... కరోనావైరస్ యాప్‌లతో సేకరించిన సమాచారాన్ని భవిష్యత్తులో ఎప్పటివరకైనా, ఎలానైనా ఉపయోగించుకునే ముప్పు ఉందని అపార్ గుప్తా అంటున్నారు.
‘‘ప్రతి గంటకూ సెల్ఫీలు తీసుకుని పంపాలని కర్ణాటక ప్రభుత్వం వ్యక్తులను ఆదేశించింది. ఇది గోప్యత హక్కును కాలరాయడమే. నిజంగా ఇలాంటి యాప్ అవసరమా? దేనికేదైనా చట్టం ఉందా అన్నది పెద్ద ప్రశ్న’’ అని అపార్ గుప్తా వ్యాఖ్యానించారు.
చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఈ యాప్‌లను తెచ్చాయి. కానీ, వాటి వినియోగంపై ఎలాంటి గడువూ నిర్ణయించలేదు.
‘‘కర్ణాటక ప్రబుత్వం యాప్ ప్రైవసీ లింక్‌ను తెరిస్తే, భూ రికార్డుల విభాగం వెబ్సైట్ వస్తోంది. గోప్యత విధానాన్నే నిర్ణయించలేదు. జనాల నుంచి ఏయే సమాచారం తీసుకుంటారు? ఎప్పటివరకూ తీసుకుంటారు? ఏమీ వెల్లడించడం లేదు. ప్రభుత్వం ఈ సమాచారాన్ని ఎవరికి ఇస్తుంది? దాన్ని పరిశీలించేది ఎవరు? ఇవన్నీ పెద్ద ప్రశ్నలే. తర్వాత పెద్ద సమస్యలు రావొచ్చు’’ అని అపార్ గుప్తా అన్నారు.
ఫొటో సోర్స్, REUTERS
సమాచారం వాటిని దుర్వినియోగం చేసుకునే వారి చేతుల్లోకి చేరితే తీవ్ర పరిణామాలు ఉంటాయి
ఆరోగ్య సేతు గోప్యత విధానం ఏంటి...
కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం... కరోనాపై పోరాటంలో దేశ ప్రజలను ఏకం చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూపొందిన యాప్ ఇది. వైరస్ సోకకుండా ప్రజలు జాగ్రత్తపడేందుకు ఈ యాప్‌ను రూపొందించారు.
దీన్ని వినియోగిస్తున్న వ్యక్తి ఇతరులతో కలిసి ఎంతవరకూ ఉన్నారో బ్లూటూత్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికతల సాయంతో ఈ యాప్ లెక్కగడుతుంది.
మీరు ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే, మీ చుట్టూ ఉన్నవారిలో ఎవరి వద్ద ఈ యాప్ ఉందో అది వెతుకుతుంది. ఎవరైనా కరోనావైరస్ సోకిన వ్యక్తి మీకు సమీపంలో నివసిస్తున్నారా అన్న విషయం చెబుతుంది. జీపీఎస్ ద్వారా మీరు ఆ ఆ వ్యక్తిని ఎప్పుడైనా కలిశారా అన్న విషయం కూడా కనిపెట్టి చెప్పే ప్రయత్నం చేస్తుంది.
ఈ యాప్ 11 భాషల్లో అందుబాటులో ఉంది.
పేరు, మొబైల్ నెంబర్, లింగం, వృత్తి, ప్రయాణాల వివరాలు, ధూమపాన అలవాటు ఉందో, లేదో లాంటి వివరాలను యాప్ వినియోగదారులను అడుగుతుందని ప్రభుత్వ ప్రకటనలో తెలిపింది.
యాప్‌లో ఉన్న సమాచారాన్ని వినియోగించుకుని భారత ప్రభుత్వం కరోనావైరస్ సంబంధిత డేటాబేస్ తయారు చేస్తుంది. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దీన్ని ఉపయోగించుకుంటుంది.
సమాచారమంతా క్లౌడ్ స్టోరేజీలో ఉంటుంది. కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించిన సూచనలు వినియోగదారులకు వస్తుంటాయి.
కరోనావైరస్ మహమ్మారి నియంత్రణకు తప్ప మరే కారణానికీ ఇందులోని సమాచారాన్ని వినియోగించరు. ఎవరైనా వినియోగదారుడు యాప్ అన్ఇన్స్టాల్ చేస్తే, 30 రోజులకు క్లౌడ్ స్టోరేజీ నుంచి వారి సమాచారం డిలీట్ అయిపోతుంది.
- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ఇండొనేసియాలో క్షణం క్షణం... భయం భయం
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- కరోనావైరస్: పరీక్షలు ఎలా చేస్తారు? ఎందుకు ఎక్కువ సంఖ్యలో చేయలేకపోతున్నాం?
- కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం
- తెలంగాణ లాక్డౌన్: గర్భిణులు, ఇతర రోగులు పడుతున్న ఇబ్బందులు ఇవీ..
- కరోనావైరస్: 'లాక్డౌన్లో హింసించే భర్తతో చిక్కుకుపోయాను'
- కరోనావైరస్: రుచి, వాసన సామర్థ్యాలు తగ్గడం ఇన్ఫెక్షన్ సోకడానికి సూచన కావొచ్చు - పరిశోధకులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)